Wednesday, February 5, 2020

Telugu Murli 05/02/2020

05-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు(పాస్‌ విత్‌ ఆనర్‌) అవ్వాలంటే, బుద్ధి యోగము కొద్దిగా కూడా ఎటూ వెళ్లరాదు, ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి. దేహాన్ని స్మృతి చేయువారు ఉన్నత పదవిని పొందలేరు ''

ప్రశ్న :- అన్నిటికంటే ఉన్నతమైన గమ్యము ఏది ?
జవాబు :- ఆత్మ జీవించి ఉండగానే మరణించి ఒక్క తండ్రి సంతానంగా అవ్వాలి, ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు, దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి - ఇదే అన్నిటికంటే శ్రేష్ఠమైన గమ్యము. నిరంతరము '' ఆత్మాభిమాని '' స్థితి ఉండాలి - ఇదే గొప్ప గమ్యము. దీని ద్వారానే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.

పాట :- మీరు ప్రేమ సాగరులు,............. ( తూ ప్యార్‌ కా సాగర్‌,...........)  
ఓంశాంతి. ఇప్పుడు ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరమని ఉండాలి. ప్ర్రేమ కొరకు చెంబులుండవు. అనగా ప్రేమాభిషేకము ఉండదు. గంగా జలము మొదలైన వాటి కొరకు చెంబులు ఉంటాయి. అనగా గంగా జలముతో అభిషేకము ఉంటుంది. ఇది భక్తి మార్గములోని మహిమ. ఇది తప్పు, జ్ఞానసాగరులు అని అనడం సరియైనది. తండ్రి మొట్టమొదట జ్ఞాన సాగరులు. పిల్లలలో కొద్దిగా జ్ఞానమున్నా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు ఈ సమయంలో మనము చైతన్య దిల్‌వాడా మందిరము వలె ఉన్నామని మీకు తెలుసు. అది జడ దిల్‌వాడా మందిరము. ఇది చైతన్య దిల్‌వాడా మందిరము. ఇది కూడా అద్భుతమే కదా. ఎక్కడ జడ స్మృతి చిహ్నముందో, అక్కడే మీరు చైతన్యములో వచ్చి కూర్చున్నారు. కానీ మనుష్యులకిది అర్థము కాదు. కానీ పోను పోను ఇది గాడ్‌ఫాదర్‌లీ యూనివర్సిటీ, ఇక్కడ భగవంతుడే చదువు నేర్పిస్తారని తెలుసుకుంటారు. దీని కంటే పెద్ద యూనివర్సిటీ ఏదీ లేదని, ఇదే చైతన్యమైన దిల్‌వాడా మందిరమని కూడా తెలుసుకుంటారు. ఈ దిల్‌వాడా మందిరము మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నము. పై కప్పులో సూర్యవంశము - చంద్ర వంశాలు చిత్రీకరింపబడి ఉన్నాయి, క్రింద ఆదిదేవుడు, ఆదిదేవి, వారి పిల్లలు కూర్చొని ఉన్నారు. వీరి పేరు బ్రహ్మ, వీరి పుత్రిక సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ ఉంటే గోప - గోపికలు కూడా తప్పకుండా ఉంటారు కదా. అవన్నీ జడ చిత్రాలే. ఎవరు గతిoచి వెళ్లిపోయారో, వారి చిత్రాలే తయారయ్యాయి. ఎవరైనా మరణిస్తే, వెంటనే వారి చిత్రాలను తయారుచేస్తారు. కానీ వారి హోదా, జీవితచరిత్రను గురించి తెలియదు. వారి వృత్తి(కర్తవ్యము) గురించి వ్రాయకుంటే, ఆ చిత్రము ఎందుకూ పనికి రాదు. ఫలానావారు వ్రాసినందున ఈ కర్తవ్యము నిర్వహించారని తెలుస్తుంది. ఇప్పుడు ఏ దేవతల మందిరాలున్నాయో, వారి కర్తవ్యాల గురించి, జీవితచరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతాతి ఉన్నతుడైన శివబాబాను గూర్చి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవితచరిత్రలు తెలుసు. ఎవరెవరు ఉండి వెళ్లిపోయారో, ముఖ్యంగా ఎవరిని పూజిస్తారో వారి గురించి మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రి కూడా జరుపుకుంటున్నారు కనుక తప్పకుండా వారి అవతరణ జరిగిందని అర్థమవుతుంది. కానీ ఎప్పుడు జరిగిందో, వారు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నాడు. ఆదిదేవుడు, ఆదిదేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఎందుకంటే ఇది వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది! 100 భుజాలు, 1000 భుజాలు గలవాడని బ్రహ్మకే చెప్తారు. విష్ణువుకు, శంకరునికి ఇన్ని భుజాలని చెప్పరు. బ్రహ్మకు ఉన్నాయని ఎందుకు అంటారు? ఈ వంశమంతా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన వారే కదా. ఇది భుజాల మాట కాదు. వేల భుజాల మాట కాదు. వేల భుజాల బ్రహ్మ అని వారంటారు కానీ వారికి అర్థము తెలియదు. ఇప్పుడు మీరు బ్రహ్మకు ఎన్ని భుజాలో ప్రాక్టికల్‌గా చూడండి. ఇవి బేహద్‌ భుజాలు. ప్రజాపిత బ్రహ్మను అందరూ ఒప్పుకుంటారు కాని వారి కర్తవ్యము గురించి తెలుసుకోలేరు. ఆత్మకు భుజాలు ఉండవు. భుజాలు శరీరానికి ఉంటాయి. ఇన్ని కోట్లమంది సోదరులున్నారు. వారందరివి కలిసి ఎన్ని భుజాలవుతాయి? కానీ ఎప్పుడైనా ముందు పూర్తి జ్ఞానాన్ని అర్థము చేసుకున్న తర్వాతనే ఈ విషయాలు అర్థం చేయించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఒక్కటే, బాబా చెప్తారు - నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రికి జ్ఞానసాగరుడనే మహిమ కూడా ఉంది. ఎన్ని పాయింట్లు అర్థం చేయిస్తారు. ఇన్ని పాయింట్లు జ్ఞాపకముండవు. సారము బుద్ధిలో ఉండిపోతుంది. చివరికి 'మన్మనాభవ' అనే సారము మిగిలిపోతుంది.

జ్ఞానసాగరులు అని కృష్ణుని అనరు. వారు రచన, రచయిత ఒక్క తండ్రి మాత్రమే. అందరికీ వారసత్వమునిచ్చేది తండ్రి, వారే ఆత్మలను ఇంటికి తీసుకెళ్తారు. తండ్రి మరియు ఇతర ఆత్మల ఇల్లు శాంతిధామము. విష్ణుపురమును తండ్రి ఇల్లు అని అనరు. బాబా మరియు ఆత్మల మధురమైన ఇల్లే శాంతిధామము. ఇల్లు మూలవతనము, ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలే ధారణ చేస్తారు. ఇంత విస్తారమైన జ్ఞానము ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇన్ని పేజీలు కూడా వ్రాయలేరు. ఈ మురళీలనంతా ప్రోగు చేస్తూ పోతే ఈ హాలంతా నిండిపోతుంది. ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలుంటాయి. పరీక్ష పాస్‌ అవుతూనే సారము బుద్ధిలో కూర్చుంటుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్‌ చేయగానే, దాని వలన ఒక్క జన్మకు అల్పకాల సుఖము లభిస్తుంది. అది వినాశి సంపాదన. మీకు ఈ తండ్రి అవినాశి సంపాదన భవిష్యత్తు కొరకు చేయిస్తున్నారు. మిగిలిన గురువులు, మఠాధిపతులు వినాశి సంపాదనను చేయిస్తారు. వినాశనం దగ్గరవుతున్న కొలది, వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. ప్రపంచంలో సంపాదన పెరుగుతూ ఉందని అంటారు, కానీ సంపాదన పెరగడం లేదు. అదంతా సమాప్తమవ్వనున్నది. పూర్వము రాజుల సంపాదన బాగా ఉండేది. ఇప్పుడు వారు కూడా లేరు. మీ సంపాదన చాలా సమయము నడుస్తుంది. ఇది తయారుచేయబడిన డ్రామా అని మీకు తెలుసు, ఇది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మేము మా బంధు-మిత్రులకు మొదలైనవారికి అర్థం చేయిస్తామని కొందరంటారు, కానీ అది కూడా అల్పకాలమే కదా. మీలో కూడా ధారణ అయ్యేవారు నంబరువారుగా ఉన్నారు. కొంతమంది కొంచెము కూడా అర్థము చేయించలేరు. కొంతమంది మా బంధు-మిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని అంటారు. అది కూడా అల్పకాలానికే కదా. ప్రదర్శనీలు మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించరు? - ఎందుకంటే పూర్తిగా ధారణ చేస్తూ ఉండరు. మాకే అంతా తెలుసు అని భావించండి. సర్వీసు చేయు అభిరుచి ఉంటే బాగా అర్థము చేయించే వారి ద్వారా వినాలి. బాబా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తే పురుషార్థము చేయాలి కదా. కాని అదృష్టములో లేకుంటే శ్రీమతమును కూడా గౌరవించరు, పదవి భ్రష్ఠమవుతుంది. డ్రామా ప్లాను అనుసారము రాజధాని స్థాపనవుతూ ఉంది. అందులో అన్ని ప్రకారాల వారు కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అయ్యేవారు ఉన్నారు, కొందరు సామాన్యులుగా ఉన్నారు. బాబా చెప్తున్నారు - నేను మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరములో రాజుల చిత్రాలున్నాయి కదా. ఎవరు పూజ్యులుగా అవుతారో వారే మళ్లీ పూజారులుగా అవుతారు. రాజా-రాణుల పదవి గొప్పది కదా. వామమార్గములోకి వచ్చినప్పుడు కూడా రాజులుగా లేక మంచి షాహుకార్లుగా ఉంటారు. జగన్నాథ మందిరములో అందరికి కిరీటాలు చూపించారు. ప్రజలకు కిరీటముండదు. కిరీటధారి రాజులను కూడా వికారాలలో చూపించారు. వారికి కూడా సుఖ-సంపత్తులు చాలా ఉంటాయి. సంపద తక్కువ-ఎక్కువ ఉంటుంది కదా. వజ్రాల మహళ్లకు, వెండి మహళ్లకు వ్యత్యాసముంటుంది కదా. కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మంచి పురుషార్థము చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. రాజులకు చాలా సుఖముంటుంది. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడ ఎలా అందరికీ దుఃఖము, జబ్బులు ఉన్నాయో అలా అక్కడ అందరికీ సుఖమే సుఖముంటుంది. అయినా పదవులు నంబరువారుగా ఉంటాయి. తండ్రి సదా చెప్తూనే ఉంటారు - పురుషార్థము చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. పురుషార్థము ద్వారా, డ్రామానుసారము వీరి సద్గతి ఈ విధంగా ఇంతమాత్రమే జరుగుతుందని అర్థము చేసుకోబడ్తుంది.

మీ సద్గతి కొరకు శ్రీమతానుసారము నడుచుకోవాలి. టీచరు మతానుసారము విద్యార్థి నడుచుకోలేదంటే దేనికీ పనికిరాడు. అందరూ నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. మేము ఇది చేయలేదంటే ఇంకేమి నేర్చుకుంటారు. నేర్చుకుని తెలివైనవారిగా అవ్వాలి, వీరు బాగా అర్థం చేయిస్తారని అందరూ అనాలి, కానీ ఆత్మ జీవిస్తూ ఉండి, మరణించి ఒక్క తండ్రివారిగా అవ్వాలి, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. దేహాభిమానము పూర్తిగా వదిలిపోవడమే ఉన్నతమైన గమ్యము. అంతా మర్చిపోవాలి. పూర్తి ఆత్మాభిమాని స్థితి తయారవ్వాలి - ఇదే శ్రేష్ఠమైన గమ్యము. అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి, ఇక్కడకు వచ్చి శరీరాలను ధరిస్తాయి. ఇప్పుడిక్కడ దేహములో ఉంటున్నా స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఇది చాలా పెద్ద కష్టము. స్వయాన్ని ఆత్మగా భావించి కర్మాతీత స్థితిలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది కదా - ఒక పాత పొరను(కుబుసాన్ని) వదిలి కొత్త దానిని ధారణ చేస్తుంది కదా. కావున మీరు దేహాభిమానాన్ని ఎంతగా తొలగించుకోవాలి! మూలవతనములో మీరు ఆత్మాభిమానులుగానే ఉంటారు. ఇక్కడ దేహములో ఉంటున్నా స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానము అంతమైపోవాలి. ఎంత పెద్ద పరీక్ష. అందుకే భగవంతుడే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహ సంబంధాలన్నీ వదిలి నాకు చెందినవారిగా అవ్వండి, స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించండని ఇతరులెవ్వరూ చెప్పరు. ఏ వస్తువు పైనా అభిమానముండరాదు. మాయ పరస్పరములో దేహాభిమానములో బంధిస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు - 'ఈ సాకారుని(బ్రహ్మను) కూడా స్మృతి చేయకండి.' బాబా చెప్తున్నారు - మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ చాలా మంచి-మంచి పిల్లలను కూడా నామ-రూపాలలో వ్రేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడమంటే భూతాలను స్మృతి చేయడమే కదా. ఒక్క శివబాబానే స్మృతి చేయండని చెప్తెే మీరు పంచ భూతాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహము పై అస్సలు ఆకర్షణ(లగవ్‌) ఉండరాదు. బ్రాహ్మణి ద్వారా కూడా నేర్చుకోవాలి కానీ వారి నామ-రూపాలలో చిక్కుకోరాదు. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అనేకమంది పిల్లలు బాబా వద్దకు చార్టును పంపుతారు కానీ బాబా దానిని నమ్మరు. కొందరు మేము శివబాబాను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయమని అంటారు, కాని బాబా చెప్తున్నారు - ఒక్క పైసా అంత స్మృతి కూడా చేయడం లేదు. స్మృతియే కష్టతరమైనది, ఎక్కడెక్కడో చిక్కుకుంటారు. దేహధారులను స్మృతి చేయడమంటే 5 భూతాలను స్మృతి చేయడం, దీనిని భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. మీరిక్కడ ఒక్క శివాబాబానే స్మృతి చేయాలి. పూజించే విషయమే లేదు. భక్తికి నామ-రూపాలే అదృశ్యమైపోతాయి. బొమ్మలను(విగ్రహాలను) ఎందుకు స్మృతి చేయాలి? అవి కూడా మట్టితో తయారైనవే కదా. తండ్రి చెప్తున్నారు - ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇప్పుడు మిమ్ములను మళ్లీ పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరి శరీరమును స్మృతి చేయరాదు. ఆత్మ పావనమైపోతే దానికి శరీరము కూడా పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడీ శరీరము పావనమైనది కాదు. ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమో అయినప్పుడు శరీరము కూడా అలాంటిదే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనమవుతూ పోతుంది కాని శరీరము ఇప్పుడే పావనంగా అవ్వదు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఈ పాయింట్లు ఎవరైతే బాగా అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయిస్తారో వారి బుద్ధిలోనే ఈ పాయింట్లు కూర్చుంటాయి. సతోప్రధానంగా అవ్వాల్సింది ఆత్మ. తండ్రిని స్మృతి చేయడమే చాలా కష్టము. కొందరికి కొద్దిగా కూడా గుర్తు ఉండదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు బుద్ధియోగము కొద్దిగా కూడా బయటకు పోరాదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కాని పిల్లల బుద్ధియోగము తిరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువమందిని మీ సమానంగా చేస్తారో అంత ఉన్నతపదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడూ ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇక్కడ గౌరవపూర్వకంగా(పాస్‌ విత్‌ ఆనర్‌గా) ఉత్తీర్ణులవ్వాలి. కష్టపడకుండా ఈ(లక్ష్మీనారాయణుల) పదవి ఎలా లభిస్తుంది! దేహాన్ని స్మృతి చేయువారు ఏ పురుషార్థమూ చేయలేరు. తండ్రి చెప్తున్నారు - పురుషార్థము చేసేవారిని అనుసరించాలి. ఇతను కూడా పురుషార్థియే కదా.

ఇది చాలా విచిత్రమైన జ్ఞానము. ప్రపంచములో ఈ జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పరివర్తన అవుతుందో, ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమే. మీరు రాజ్యమును ఎలా ప్రాప్తి చేసుకుంటారు! యుద్ధము, జగడాలు మొదలైనవేవీ లేవు. ఇది కేవలం జ్ఞాన-యోగాల విషయము మాత్రమే. మనము ఎవ్వరితోనూ యుద్ధము చేయము, మనము ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి. ఆత్మ పతితమయ్యే కొలది శరీరము కూడా పతితమైన దానినే తీసుకుంటూ పోతుంది. మళ్లీ ఆత్మ పావనంగా అయి వెళ్లాలి, ఇది చాలా కష్టము. బాబా ఎవరెవరు ఎంత పురుషార్థము చేస్తున్నారో తెలుసుకోగలరు! ఇది శివబాబా భండారము. శివబాబా భండారములో మీరు సేవ చేస్తున్నారు. సర్వీసు చేయలేదంటే చాలా చిన్న పదవిని కూడా పొందలేరు. సేవ చేసేందుకే తండ్రి వద్దకు వచ్చారు, సర్వీసే చేయలేదంటే ఏ పదవి లభిస్తుంది! ఈ రాజధాని(స్వర్గము) స్థాపనవుతూ ఉంది, ఇందులో నౌకర్లు, చాకర్లు మొదలైనవారు కూడా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుని పై విజయము పొందుతారు. ఇది తప్ప ఇంకే యుద్ధమూ లేదు. ఇదంతా అర్థము చేయించబడ్తుంది, ఇవి ఎంత గుప్తమైన విషయాలు! యోగబలముతో విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు. మనము మన శాంతిధామములో ఉండేవారమని మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇంటి స్మృతే ఉంది. ఇక్కడకు మనము పాత్రను అభినయించేందుకు వచ్చాము, తర్వాత మన ఇంటికి వెళ్తాము. ఆత్మ ఎలా వెళ్తుందో కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. డ్రామా ప్లాను అనుసారము ఆత్మలు రానే రావాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ దేహధారి పైనా ఆకర్షణ, ప్రేమ(లగావ్‌) ఉంచుకోరాదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడము వంటిదే, కావున ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోరాదు. మీ దేహమును కూడా మర్చిపోవాలి.
2. భవిష్యత్తు కొరకు అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. వివేకవంతులుగా అయి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిని అర్థము చేసుకొని ఇతరులకు వినిపించాలి.

వరదానము :- '' సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారంతో మొదటి నంబరు తీసుకునే దిలారాం పసంద్‌ భవ ''
హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం(దిల్‌) గలవారే ఇష్టము. ప్రాపంచిక (లౌకిక) బుద్ధి లేకున్నా సత్యమైన, స్వచ్ఛమైన మనసు ఉంటే మొదటి నంబరు తీసుకుంటారు. ఎందుకంటే బుద్ధినైతే తండ్రి ఎంత పెద్దదిస్తారంటే ఆ బుద్ధి ద్వారా రచయితను తెలుసుకున్నందున రచన ఆది-మధ్య-అంత్యముల జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కనుక సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారముతోనే నంబరు తయారవుతుంది. సేవ ఆధారముతో కాదు. సత్యమైన హృదయంతో చేసిన సేవల ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది. బుద్ధివంతులు పేరు సంపాదిస్తారు, హృదయం (మనసు) గలవారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు.

స్లోగన్‌ :- '' సర్వుల పట్ల శుభచింతన, శుభకామనలు ఉండడమే సత్యమైన పరోపకారము ''

No comments:

Post a Comment