Saturday, February 22, 2020

Telugu Murli 23/02/2020

23-02-2020 ప్రాత:మురళిఓంశాంతి'బాప్దాదా' 27-11-1985

'' పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను మరపింపజేసేందుకు ఉపాయము ''
బాప్దాదా నిశ్చయబుద్ధి గల పిల్లలందరి నిశ్చయముతో కూడిన ప్రత్యక్ష జీవన స్వరూపాన్ని చూస్తున్నారు. నిశ్చయబుద్ధి గలవారి విశేషతలను అందరూ విన్నారు. అటువంటి విశేషతలతో సంపన్నమైన నిశ్చయం గల విజయీ రత్నాలు ఈ బ్రాహ్మణ జీవితంలో లేక పురుషోత్తమ సంగమయుగ జీవితంలో సదా నిశ్చయమనుసారంగా ఆ నషాలో ఉంటారు. ఆత్మిక నషా నిశ్చయానికి దర్పణం వంటిది. నిశ్చయం కేవలం బుద్ధిలో స్మృతి వరకే కాదు, ప్రతి అడుగులో, ఆత్మిక నషా రూపంలో, కర్మ ద్వారా ప్రత్యక్ష రూపంలో స్వయానికి కూడా అనుభవమవుతుంది, అలాగే ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఎందుకంటే ఇది జ్ఞానము మరియు యోగాలతో నిండిన జీవితము. ఇది కేవలం వినడం, వినిపించడం వరకు కాదు, జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకునేది. జీవితంలో స్మృతి అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు అన్నీ వచ్చేస్తాయి. నిశ్చయబుద్ధి అనగా నషాతో కూడుకున్న జీవితము. అటువంటి ఆత్మిక నషా గల ఆత్మల ప్రతి సంకల్పము, సదా నషాతో సంపన్నంగా ఉంటుంది. సంకల్పాలు, మాటలు, కర్మలు ఈ మూడింటి ద్వారా నిశ్చయము యొక్క నషా అనుభవమవుతుంది. నషా ఎలా ఉంటుందో అలా సంతోషము యొక్క మెరుపు ముఖము ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షమవుతుంది. నిశ్చయానికి గుర్తు నషా, నషాకు గుర్తు సంతోషము. నషా ఎన్ని రకాలుగా ఉంటుంది? దీని విస్తారము చాలా పెద్దది. కాని సార రూపంలో ఒకటేమో అశరీరి ఆత్మిక స్వరూప నషా. దీని విస్తారము గురించి తెలుసా? అందరూ ఆత్మలే కాని, ఎప్పుడైతే 'నేను ఎటువంటి ఆత్మను' అన్నది స్మృతిలో ఉంచుకుంటారో అప్పుడు ఆ ఆత్మిక నషా అనుభవమవుతుంది. దీని విస్తారాన్ని మరింతగా పరస్పరం చర్చించి వెలికి తీయండి లేక స్వయమే మననం చేయండి.

ఇంకొక నషా యొక్క విశేష రూపము - సంగమ యుగములోని అలౌకిక జీవితము. ఈ జీవితములో కూడా ఎటువంటి జీవితముంది. దీని విస్తారాన్ని గురించి కూడా ఆలోచించండి. కావున ఒకటేమో ఆత్మిక స్వరూపముతో నిండిన నషా. రెండవది అలౌకిక జీవితము యొక్క నషా. మూడవది ఫరిస్తా తనపు నషా. ఫరిస్తా అని ఎవరిని అంటారో దాని విస్తారాన్ని కూడా ఆలోచించండి. నాల్గవది భవిష్యత్తును గురించిన నషా. ఈ నాలుగు రకాల అలౌకిక నషాలలో ఏ ఒక్క నషా జీవితంలో ఉన్నా స్వతహాగానే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. నిశ్చయం కూడా ఉంది కాని సంతోషము లేదు. అందుకు కారణమేమి? నషా లేదు. నషా సహజంగానే పాత ప్రపంచాన్ని, పాత సంస్కారాలను మరపింపజేస్తుంది. ఈ పురుషార్థి జీవితంలో విశేషంగా ఈ రెండు విషయాలే విఘ్నరూపంగా అవుతాయి. పాత ప్రపంచమైనా కావచ్చు లేక పాత సంస్కారాలైనా కావచ్చు. ప్రపంచమన్నప్పుడు అందులో దేహ సంబంధాలు, దేహ పదార్థాలు రెండూ వచ్చేస్తాయి. వాటితో పాటు ప్రపంచం కంటే పాత సంస్కారాలు ఎక్కువగా విఘ్నరూపాలుగా అవుతాయి. ప్రపంచాన్ని మర్చిపోతారు కాని సంస్కారాలను మర్చిపోరు. కనుక సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు సాధనం ఈ నాలుగు నషాలలో ఏదో ఒక నషా సాకార స్వరూపంలో ఉండాలి. కేవలం సంకల్ప స్వరూపంలో కాదు, సాకార స్వరూపంలో ఉండడం ద్వారా ఎప్పుడూ విఘ్న రూపంగా అవ్వరు. ఇప్పటి వరకు సంస్కారాలు పరివర్తన అవ్వనందుకు కారణం ఇదే. ఈ నషాలను సంకల్ప రూపంలో అనగా జ్ఞానం రూపంలో బుద్ధి వరకు ధారణ చేశారు. కావున ఎప్పుడైనా కొంతమంది పాత సంస్కారము ప్రత్యక్షమవుతుంది, అప్పుడు 'నాకు అన్నీ అర్థం అవుతాయి' అన్న భాషను వాడ్తారు. మారాలి అని కూడా భావిస్తారు. కాని అది కేవలం అర్థం చేసుకునేంత వరకు కాదు, కర్మ అనగా జీవితం వరకు ఉండాలి. జీవితం ద్వారా పరివర్తన అనుభవంలోకి రావాలి. దీనినే సాకార స్వరూపంలోకి రావడం అని అంటారు. ఇప్పుడు బుద్ధి వరకు పాయింట్ల రూపం వరకు ఆలోచించడం మరియు వర్ణన చేయడం వరకు ఉంది కాని ప్రతి కర్మలో, సంపర్కంలో పరివర్తన కనిపించాలి. దీనినే సాకార రూపంలో అలౌకిక నషా అని అంటారు. ఇప్పుడిక ప్రతి నషాను మీ జీవితంలోకి తీసుకు రండి. ఎవరైనా మీ మస్తకం వైపు చూసినట్లయితే మస్తకం ద్వారా ఆత్మిక నషా యొక్క వృత్తి అనుభవమవ్వాలి. ఎవరైనా వర్ణన చేసినా, చేయకున్నా వృత్తి, వాయుమండలాన్ని వైబ్రేషన్లను వ్యాపింపజేస్తుంది. మీ వృత్తి ఇతరులకు కూడా సంతోషంతో కూడిన వాయుమండలంలో, సంతోషపు వైబ్రేషన్లను అనుభవం చేయించాలి. దీనినే నషాలో స్థితులవ్వడమని అంటారు. అలాగే దృష్టి ద్వారా, ముఖము నుండి మందహాసము ద్వారా, నోటి మాటల ద్వారా ఆత్మిక నషా యొక్క సాకార రూపము అనుభవమవ్వాలి. అప్పుడే నషాలో ఉండే నిశ్చయ బుద్ధి గల విజయీ రత్నాలని పిలవబడ్తారు. ఇందులో గుప్తంగా ఉండరాదు. కొంతమంది మేము గుప్తంగా ఉన్నామని అంటూ చతురత కూడా చూపిస్తారు. సూర్యుని ఎప్పుడూ ఎవ్వరూ దాచలేరు అన్న నానుడి ఉంది కదా! ఎంత దట్టమైన మేఘాలు అడ్డు వచ్చినా సూర్యుడు ఎప్పుడూ తన ప్రకాశాన్ని వదలజాలడు. సూర్యుడు తప్పుకుంటాడా లేక మేఘాలు తప్పుకుంటాయా? మేఘాలు వస్తాయి, తొలగిపోతాయి. కాని సూర్యుడు తన ప్రకాశ స్వరూపంలో స్థిరమై ఉంటాడు. కావున ఆత్మిక నషా గలవారు కూడా ఆత్మిక ప్రకాశము నుండి దాగి ఉండజాలరు. వారి ఆత్మిక నషా యొక్క ప్రకాశము ప్రత్యక్ష రూపంలో తప్పకుండా అనుభవమవుతుంది. వారి వైబ్రేషన్లు స్వతహాగానే ఇతరులను ఆకర్షిస్తాయి. ఆత్మిక నషాలో ఉండేవారి వైబ్రేషన్లు స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఛత్రఛాయగా పని చేస్తాయి. కావున ఇప్పడు ఏం చేయాలి? సాకారంలోకి రండి. జ్ఞానం లెక్కలో నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. కాని జ్ఞానాన్ని సాకార జీవితంలోకి తీసుకురావడం ద్వారా నాలెడ్జ్ఫుల్గా అవ్వడంతో పాటు సఫలతా సంపన్నులు(సక్సెస్ఫుల్)గా, ఆనంద స్వరూపులుగా(బ్లిస్ఫుల్) అనుభవం చేస్తారు. మంచిది. సక్సెస్ఫుల్ మరియు బ్లిస్ఫుల్ అంటే ఏమిటో ఇంకోసారి వినిపిస్తాము.

ఈ రోజు ఆత్మిక నషా అనే విషయాన్ని వినిపిస్తున్నారు. అందరికీ నషా అనుభవమవ్వాలి. ఈ నాలుగు నషాలలో ఒక నషాను భిన్న-భిన్న రూపాలలో ఉపయోగించండి. ఎంతగా ఈ నషాను జీవితంలో అనుభవం చేసుకుంటారో అంతగా సదా అన్ని చింతల నుండి అతీతంగా నిశ్చింత మహారాజులుగా అవుతారు. అందరూ మిమ్ములను నిశ్చింత మహారాజు రూపంలో చూస్తారు. కావున ఇప్పుడు విస్తారంలోకి తేవాలి లేక అభ్యాసంలోకి తీసుకు రావాలి. ఎక్కడ సంతోషముంటుందో అక్కడ మాయ యొక్క ఏ యుక్తులు నడవజాలవు. నిశ్చింత మహారాజుల రాజ్యంలోకి మాయ రాజాలదు. అది వస్తుంది, మీరు తరిమేస్తారు, మళ్లీ వస్తుంది, మళ్లీ తరిమేస్తారు. ఒకసారి దైహిక రూపంలో వస్తుంది. దీనినే మాయ ఒకసారి ఏనుగు రూపంలో వస్తే, మరొకసారి పిల్లిగా అయి వస్తుంది. మరొకసారి ఎలుకలా అయి వస్తుందని అంటారు. ఒకసారి ఎలుకను తీస్తే, ఇంకొకసారి పిల్లిని తీయవలసి వస్తుంది. ఇలా తరిమేయడంలోనే సమయము గడిచిపోతూ ఉంటుంది. కావున సదా ఆత్మిక నషాలో ఉండండి. మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ఎందుకంటే మీ ద్వారానే తండ్రి ప్రత్యక్షమవ్వాలి. మంచిది.

సదా స్వయం ద్వారా సర్వశక్తివంతుని ప్రత్యక్షం చేసేవారికి, సదా తమ సాకార జీవితమనే దర్పణం ద్వారా ఆత్మిక నషా యొక్క విశేషతను ప్రత్యక్షం చేసేవారికి, సదా నిశ్చింత మహారాజుగా అయి మాయకు వీడ్కోలు చెప్పేవారికి, సదా జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, ఇటువంటి నషాలో ఉండే నిశ్చయ బుద్ధిగలవారికి, సదా సంతోషంలో ఎగిరేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, విశేష ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవాధారి(టీచర్) అక్కయ్యలతో :- సేవాధారులు అనగా తమ శక్తుల ద్వారా ఇతరులను కూడా శక్తిశాలిగా చేసేవారు. ఇదే సేవాధారుల వాస్తవిక విశేషత. బలహీనులలో బలము(శక్తి) నింపేందుకు నిమిత్తంగా అవ్వడమే సత్యమైన సేవ. ఇటువంటి సేవ చేసే పాత్ర లభించడం కూడా హీరో పాత్రయే! కావున హీరో పాత్రధారులు ఎంత నషాలో ఉంటున్నారు? సేవ చేసే పాత్ర ద్వారా ఎంతగా మీ నెంబరును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అంతగా తీసుకెళ్లగలరు. ఎందుకంటే సేవ ముందుకు వెళ్లే సాధనము. సేవలో బిజీగా ఉండడం వలన స్వతహాగానే అన్ని విషయాల నుండి దూరమవుతారు. ప్రతి సేవాస్థానము ఒక స్టేజ్, ఆ స్టేజ్ పైన ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయిస్తోంది. సాధనాలైతే ఎన్నో ఉన్నాయి కాని సాధనాలలో శక్తి ఉండాలి. ఒకవేళ శక్తి లేకుండా సాధనాలను వినియోగించినట్లయితే సేవలో రిజల్టు ఏదైతే వెలువడాలో అది వెలువడదు. పూర్వం వీరులు సదా తమ శస్త్రాలను దేవతల ముందు అర్పణ చేసి అందులో శక్తిని నింపుకొని ఆ తర్వాత ఉపయోగించేవారు. కావున మీరందరు కూడా ఏ సాధనమునైనా ఉపయోగించే ముందు అదే విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు మీరు ఏ సాధనాలనైతే కార్యంలో ఉపయోగిస్తారో వాటి ద్వారా కొంత సమయం వరకు జనులు ఆకర్షితులవుతారు. కాని సదాకాలికంగా ప్రభావితులవ్వరు. ఎందుకంటే ఇంతమంది శక్తిశాలి ఆత్మలెవరైతే శక్తి ద్వారా పరివర్తన చేసి చూపించారో వారు నెంబరువారిగా ఉన్నారు. సేవనైతే అందరూ చేస్తున్నారు. అందరి పేర్లు టీచర్లే. సేవాధారులైనా లేక టీచర్లు అయినా సేవలో తేడా ఏముంది? ప్రోగ్రామ్ను కూడా ఒక్కటే తయారు చేస్తారు. ప్లాను కూడా ఒకేలా చేస్తారు. ఆచార వ్యవహారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అయినా సఫలతలో తేడా వచ్చేస్తుంది. అందుకు కారణమేది? శక్తి లోపము. కావున సాధనాలలో శక్తిని నింపండి. ఎలాగైతే ఖడ్గంలో ఒకవేళ పదును లేకపోతే ఖడ్గము ఖడ్గములా పనిచేయదో అలా సాధనాలు ఖడ్గము వంటివి. వాటిలో శక్తి రూపీ పదును కావాలి. దానిని ఎంతగా మీలో నింపుకుంటూ ఉంటారో అంతగా సేవలో స్వతహాగానే సఫలత లభిస్తుంది. కావున శక్తిశాలి సేవాధారులుగా అవ్వండి. సదా విధి ద్వారా వృద్ధిని ప్రాప్తించుకోవడం ఇది కూడా పెద్ద విషయమేమీ కాదు. కానీ శక్తిశాలి ఆత్మలు వృద్ధిని పొందాలి. దీని కోసం విశేష అటెన్షన్ ఉంచండి. క్వాలిటీని తయారు చేయండి. క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. క్వాలిటీ పైన ధ్యానముంచండి. క్వాలిటీ ద్వారానే నెంబరు లభిస్తుంది, కాని క్వాంటిటీ ద్వారా కాదు. క్వాలిటీ గలవారు ఒక్కరైనా100 మంది క్వాంటిటీతో సమానము.

కుమారులతో :- కుమారులు ఏ అద్భుతం చేస్తున్నారు? విధ్వంసం చేసేవారైతే కాదు కదా! అద్భుతం చేసేందుకు శక్తిశాలిగా అవ్వండి, శక్తిశాలిగా తయారు చెయ్యండి. శక్తిశాలిగా అయ్యేందుకు సదా మీ 'మాస్టర్ సర్వశక్తివాన్' టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మాయ నుండి ముక్తి కలుగుతుంది. ఎంతగా స్వయం పైన అటెన్షన్ ఉంటుందో అంతగా సేవ పై కూడా అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ స్వయం పట్ల అటెన్షన్ లేకుంటే సేవలో శక్తి నిండదు. కావున సదా స్వయాన్ని సఫలతా స్వరూపులుగా చేసుకునేందుకు శక్తిశాలి అభ్యాసముతో సాధనాలను తయారు చేయాలి. సదా అభివృద్ధి జరుగుతూ ఉండే ఏదైనా ప్రోగ్రామ్ను విశేషంగా తయారుచేయండి. మొదట స్వ ఉన్నతికి కార్యక్రమాన్ని తయారు చేయండి. ఆ తర్వాత సేవ సహజంగా జరుగుతుంది, అంతేకాక సఫలత కూడా లభిస్తుంది. కుమార్ జీవితము భాగ్యవంతమైన జీవితము. ఎందుకంటే మీరు అనేక బంధనాల నుండి రక్షింపబడ్డారు. లేకపోతే గృహస్థ జీవితంలో ఎన్ని బంధనాలున్నాయి! కావున ఇటువంటి భాగ్యవంతులుగా అయ్యే ఆత్మలు ఎప్పుడూ తమ భాగ్యాన్ని మర్చిపోవడం లేదు కదా! సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా భావిస్తూ ఇతరుల భాగ్యరేఖను కూడా మీరు దిద్దాలి. ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో వారు స్వతహాగానే ఎగిరేకళ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే కుమార్ మరియు కుమారీ జీవితము బాప్దాదాకు ప్రియంగా అనిపిస్తుంది. గృహస్థ జీవితము బంధనయుక్తమైనది, కుమార జీవితము బంధనముక్తమైనది. కావున నిర్బంధన ఆత్మలుగా అయి ఇతరులను కూడా నిర్బంధనులుగా తయారుచేయండి. కుమార్ అనగా సదా సేవ మరియు స్మృతుల బ్యాలెన్సును ఉంచేవారు. బ్యాలెన్సు ఉన్నట్లయితే సదా ఎగిరేకళలో ఉంటారు. ఎవరికైతే బ్యాలెన్సు ఉండడం తెలుసో వారు ఎప్పుడూ ఏ పరిస్థితిలోను క్రిందకి, పైకి అవ్వజాలరు.

అధర్ కుమారులతో :- అందరూ తమ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సేవ చేసేవారే కదా! అన్నిటి కంటే చాలా పెద్ద ప్రత్యక్ష ప్రమాణం మీ అందరి జీవితంలోని పరివర్తన. వినేవారిని, వినిపించేవారినైతే ఎందరినో చూశారు. ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవడం లేదు. కావున సదా ఎప్పుడు ఏ కర్మ చేసినా '' ఏ కర్మను మేము చేస్తున్నామో అందులో ఎటువంటి పరివర్తన ఉండాలంటే దాన్ని చూసి ఇతరులు పరివర్తన చెందాలి '' అనే లక్ష్యముంచుకోండి. దీని ద్వారా స్వయమూ సంతుష్టంగా(తృప్తిగా) మరియు సంతోషంగా ఉంటారు, అలాగే ఇతరుల కళ్యాణము కూడా చేస్తారు. కావున ప్రతి కర్మను సేవార్థము చెయ్యండి. నా ప్రతి కర్మ సేవార్థమే అన్న స్మృతి ఉన్నట్లయితే స్వతహాగానే శ్రేష్ఠ కర్మలే చేస్తారు. స్వ పరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయాలని గుర్తుంచుకోండి. ఈ సేవ సహజమే కాక శ్రేష్ఠమైనది కూడా. ఇది నోటి ద్వారా ప్రసంగించడమే కాక జీవితం ద్వారా కూడా ప్రసంగించడమవుతుంది. ఇటువంటి వారినే సేవాధారులని అంటారు. సదా తమ దృష్టి ద్వారా ఇతరుల దృష్టిని మార్చే సేవాధారులు. దృష్టి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగా అనేమందిని పరివర్తన చేయగలరు. సదా దృష్టి మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరుల సేవ చేసేందుకు నిమిత్తులుగా అవ్వండి.

2. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు! ఇది సదా స్మృతిలో ఉంచుకుంటున్నారా! ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ పాత సంస్కారాలు ఉత్పన్నమవ్వవు. దీనికి తోడు భవిష్యత్తులో ఎలా అవ్వనున్నారో కూడా గుర్తుంచుకుంటే వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉన్న కారణంగా సంతోషము ఉంటుంది, సంతోషంగా ఉండడం ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉంటారు. వర్తమాన మరియు భవిష్య ప్రపంచం శ్రేష్ఠంగా ఉంటే ఆ శ్రేష్ఠత ముందు దు:ఖమయమైన ప్రపంచమేదైతే ఉందో అది గుర్తుకు రాదు. సదా మీ ఈ అనంతమైన పరివారాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉండండి. ఇటువంటి భాగ్యవంతమైన పరివారము లభిస్తుందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా? కాని సాకారంలో అన్నీ చూస్తున్నారు, అనుభవం చేస్తున్నారు. ఇటువంటి పరివారము, ఐకమత్యంతో ఉన్న పరివారము, ఎంతో పెద్ద పరివారము ఇది మొత్తం కల్పంలో ఇప్పుడే ఉంటుంది. సత్యయుగంలో కూడా చిన్న పరివారమే ఉంటుంది. కావున బాప్దాదాను, పరివారమును చూసి సంతోషము కలుగుతుంది కదా! ఈ పరివారము ప్రియంగా అనిపిస్తుంది కదా? ఎందుకంటే ఇక్కడ స్వార్థ భావము లేదు. ఎవరైతే ఇటువంటి పరివారానికి చెందినవారిగా అవుతారో వారు భవిష్యత్తులో కూడా పరస్పరం సమీపంలోకి వస్తారు. సదా ఈ ఈశ్వరీయ పరివారము యొక్క విశేషతలను చూస్తూ ముందుకు వెళుతూ ఉండండి.

కుమారీలతో :- కుమారీలందరు స్వయాన్ని విశ్వకళ్యాణకారులుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారా? ఈ స్మృతి సదా సమర్థంగా తయారు చేస్తుంది. కుమారీ జీవితము సమర్థ జీవితము. కుమారీలు స్వయం సమర్థులుగా అయ్యి ఇతరులను కూడా సమర్థంగా చేసేవారు. వ్యర్థానికి సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేవారు. కుమారీ జీవితము యొక్క భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. సంగమ యుగములో కుమారీలుగా అయ్యారు, ఇది కూడా ఎంతో పెద్ద భాగ్యము. కుమారీలు తమ జీవితం ద్వారా ఇతరుల జీవితాలను తయారు చేయువారు అంతేకాక బాబా తోడుగా ఉండేవారు. సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుని ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేసేవారు. సదా శ్రేష్ఠమైన ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండరాదు. ఇటువంటి నషాలో ప్రతి అడుగు ముందుకు వేసేవారు. కావున మీరు ఇటువంటి కూమారీలే కదా!

ప్రశ్న :- ఏ విశేషత లేక గుణము ద్వారా అందరికి ప్రియంగా అవ్వగలరు?

జవాబు :- అతీతంగా మరియు ప్రియంగా ఉండే గుణము లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఏదైతే ఉందో ఆ విశేషత ద్వారా అందరికి ప్రియంగా అవ్వగలరు. ప్రేమ భావము ద్వారా అందరి మనసులోని ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఈ విశేషత ద్వారా సఫలను పొందగలరు.

వరదానము:- '' సర్వ సమస్యలకు వీడ్కోలునిచ్చే సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూప భవ ''
ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో అప్పుడే సమాధాన స్వరూప ఆత్మల మాల తయారవుతుంది. సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యతనపు ఆటగా అనుభవమవుతాయి, అనగా సమాప్తమైపోతాయి. ఎలాగైతే బ్రహ్మబాబా ముందు ఎవరైనా పుత్రుడు సమస్యను తీసుకు వచ్చినప్పుడు, సమస్య గురించిన విషయాలు చెప్పేందుకు ధైర్యము కూడా ఉండేది కాదో, ఆ విషయాలనే మర్చిపోయేవారో అలా పిల్లలైన మీరు సమాధాన స్వరూపులుగా అయినట్లయితే అర్ధకల్పము వరకు సమస్యల వీడ్కోలు సమారోహం జరుగుతుంది. విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన.

స్లోగన్:- ''ఎవరైతే సదా జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో, వారు మాయ ఆకర్షణల నుండి రక్షింపబడ్తారు.''

No comments:

Post a Comment