Tuesday, February 11, 2020

Telugu Murli 11/02/2020

11-02-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు పాత వస్త్రాలను(శరీరాలను) వదిలి ఇంటికి వెళ్ళి మళ్లీ నూతన వస్త్ర్రాలు నూతన ప్రపంచములో తీసుకుంటామని మీకు అపారమైన సంతోషముండాలి ''

ప్రశ్న:- డ్రామాలోని ఏ రహస్యాన్ని అతిసూక్ష్మంగా అర్థము చేసుకోవాలి ?
జవాబు:- ఈ డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. టిక్ - టిక్ అని జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఎవరు నటిస్తున్నారో అదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ పునరావృతమవుతుంది, ఇది చాలా సూక్ష్మంగా అర్థము చేసుకోవలసిన రహస్యము. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థము చేసుకోరో, వారు డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తాములే అని అంటారు. వారు ఉన్నత పదవిని పొందలేరు.

ఓంశాంతి. పిల్లలకు తమ తండ్రి పరిచయము లభించింది. ఇప్పుడు మళ్లీ తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి, పావనంగా అవ్వాలి. ఓ పతితపాననా! మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని కూడా అంటారు. ఎందుకంటే 'మాది పతితబుద్ధి' అని వారికి తెలుసు. ఇది పతిత ఇనుప యుగపు ప్రపంచమని బుద్ధికి కూడా తెలుసు. నూతన ప్రపంచాన్ని సతోప్రధానమని, పాత ప్రపంచాన్ని తమోప్రధానమని అంటారు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి లభించారు. భక్తులకు భగవంతుడు లభించారు. భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తికి ఫలితమునిస్తాడని అంటారు కూడా. ఎందుకంటే శ్రమ చేస్తారు కనుక ఫలితము కూడా అడుగుతారు. భక్తులు ఏ శ్రమ చేస్తారో మీకు తెలుసు. మీరు అర్ధకల్పము భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తింటూ అలసిపోయారు. భక్తిలో చాలా శ్రమ చేశారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. లాభము కొరకు శ్రమ చేస్తారు. భగవంతుడు వచ్చి భక్తి ఫలమివ్వాలని భావిస్తారు అనగా ఫలములనిచ్చేవాడు భగవంతుడే కదా. భక్తిలో దు:ఖమున్నందున భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. అందుకే మీరు వచ్చి మా దు:ఖమును హరించమని, పావనంగా చేయమని చెప్తారు.

ఇప్పుడిది రావణ రాజ్యమని ఎవ్వరికీ తెలియదు. పతితంగా చేసింది రావణుడే. రామ రాజ్యము కావాలని కూడా అంటారు. కాని అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడిది రావణ రాజ్యమని ఆత్మకు లోలోపల తెలుసు. ఇది భక్తిమార్గము. భక్తులు చాలా నాట్యాలు, తమాషాలు చేస్తారు. వారికి ఖుషీ కూడా ఉంటుంది, మళ్లీ ఏడుస్తారు కూడా. భగవంతుని ప్రేమలో కన్నీరు కారుస్తారు. కాని భగవంతుడంటే ఎవరో తెలియదు. ఎవరి ప్రేమలో కన్నీరు వస్తుందో వారిని గురించి తెలుసుకోవాలి కదా. చిత్రాల(బొమ్మల) నుండి అయితే ఏమీ లభించదు. అయితే చాలా భక్తి చేస్తే సాక్షాత్కారమవుతుంది. వారికదే గొప్ప సంతోషము. భగవంతుడు స్వయంగా వచ్చి తమ పరిచయమిస్తారు. 'నేను ఎవరో, ఎలా ఉన్నానో ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు'. మీలో కూడా ఎవరైతే బాబా అని ఎవరంటున్నారో వారిలో కూడా కొంతమంది మాత్రమే పక్కాగా ఉన్నారు. కొంతమంది కచ్ఛా(అపరిపక్వము, పచ్చిపచ్చి)గానే ఉన్నారు. దేహాభిమానము తెగిపోవడమే కష్టమనిపిస్తుంది. దేహీ - అభిమానులుగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి అంటున్నారు - మీరు ఆత్మలు, మీరు 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఆత్మకు మూడవ నేత్రము లభించింది. ఆత్మ అర్థం చేసుకుంటూ ఉంది. పిల్లలైన మీకు ఈ సృష్టి చక్ర జ్ఞానమంతటినీ తండ్రి ఇస్తున్నారు. తండ్రి జ్ఞాన సాగరులైనందున పిల్లలకు కూడా జ్ఞానమిస్తారు. 84 జన్మలు తీసుకునేది మీరేనా అని ఎవరైనా అడిగితే మాలో కొంతమంది 84 జన్మలు, కొంతమంది 82 జన్మలు తీసుకుంటారు, చాలామంది 84 జన్మలు తీసుకుంటారని చెప్పండి. ప్రారంభంలో వచ్చేవారికి 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే బాగా చదువుకొని ఉన్నతపదవి పొందుతారో వారు త్వరగా వస్తారు. మాలలో దగ్గరగా కూర్చబడ్తారు. కొత్త ఇల్లు కడ్తూ ఉంటే, త్వరగా పూర్తి అయితే క్రొత్త ఇంట్లో కూర్చుంటామని ఉంటుంది కదా. ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి క్రొత్తవి ధరించాలని పిల్లలకు కూడా సంతోషముండాలి. నాటకములో నటులు ఇంకో గంట-అరగంట ఉండగానే పూర్తి అవుతూనే ఇంటికి పోతామని గడియారం చూస్తూ ఉంటారు. ఇక వాపస్ ఇంటికి పోతామని భావిస్తారు. ఆ సమయము రానే వస్తుంది. ఇంటికి పోనే పోతారు. పిల్లలైన మీది బేహద్ గడియారము. కర్మాతీత అవస్థ పొందుకుంటే ఇక్కడ ఉండమని మీకు తెలుసు. కర్మాతీతులుగా అయ్యేందుకు కూడా స్మృతిలో ఉండాల్సి వస్తుంది. ఇది పెద్ద శ్ర్రమ. మీరు నూతన ప్రపంచములోకి వెళ్తారు. మళ్లీ ఒక్కొక్క జన్మ తీసుకునే కొలది కళలు తగ్గుతూ వస్తాయి. నూతన ఇంటిలో 6 నెలలుంటే గోడల పై ఏవో కొన్ని మచ్చలు ఏర్పడ్తాయి కదా. కొద్దిగా తేడా వస్తుంది. అక్కడ నూతన ప్రపంచములో కూడా కొంతమంది మొదట్లోనే వస్తారు. కొంతమంది కొంచెం ఆలస్యంగా వస్తారు. మొదట వచ్చేవారిని సతోప్రధానమని అంటారు. నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. ఈ డ్రామా చక్రము పేను వలె నడుస్తూ ఉంటుంది. టిక్ - టిక్ అంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో అది చక్రములో తిరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రి అనుభవముతో వినిపిస్తున్నారు.

ఈ చదువు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇది తయారైన(రెడీమేడ్/=వaసవవీaసవ) డ్రామా. ఈ చక్రము గురించి ఎవ్వరికీ తెలియదు. దాని సృష్టికర్త, డైరెక్టరు(ణఱతీవష్శీతీ), ముఖ్యపాత్రధారి(వీaఱఅ ూష్శీతీ) ఎవరు అనేది కొద్దిగా కూడా తెలియదు. మనము 84 జన్మలు పూర్తి చేసుకున్నామని, వాపస్ వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా ఆత్మలము, దేహీ-అభిమానులుగా అయితే అపారమైన ఖుషీ ఉంటుంది. అది హద్దులోని నాటకము, ఇది బేహద్ నాటకము. బాబా ఆత్మలమైన మనలను చదివిస్తున్నారు. ఫలానా సమయంలో ఫలానా జరుగుతుందని బాబా తెలుపరు. బాబాను ఎవరైనా, ఏమైనా అడిగితే డ్రామాలో ఏది తెలపాలో అదే తెలుపుతాను. డ్రామానుసారము ఏ జవాబు దొరకాల్సి ఉందో అది లభించింది. అంతే, దాని ప్రకారము నడుచుకోవాలి. డ్రామాలో లేనిది తండ్రి ఏమీ చేయలేరు. డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తామని చాలామంది పిల్లలు అంటారు. అటువంటివారు ఎప్పుడూ ఉన్నతపదవి పొందలేరు. మీరు పురుషార్థము చేయాలని బాబా అంటున్నారు. డ్రామా మీతో కల్పక్రితము వలె పురుషార్థము చేయిస్తుంది. కొంతమంది డ్రామాను ఉపయోగించుకొని నిలబడిపోతారు. డ్రామాలో ఉంటే చేస్తాములే అని అంటారు. వారి భాగ్యములో లేదని అర్థము చేసుకోవాలి. మనము ఆత్మలము పాత్ర చేసేందుకు వచ్చామని మీకు స్మృతి కలిగింది. ఆత్మ కూడా అవినాశియే, పాత్ర కూడా అవినాశియే. 84 జన్మల పాత్ర ఆత్మలో నిశ్చయింపబడింది. మళ్లీ అదే పాత్ర చేస్తారు. దీనిని ప్రాకృతికము అని అంటారు. ప్రకృతిలో జరుగుదానిని ఇంకా ఏమని వివరించాలి. ముఖ్యమైన విషయము - తప్పనిసరిగా పవిత్రమవ్వాలి. ఇదే చింత ఉండాలి - కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. మీరు ఒక్క ప్రియుని ప్రేయసులు కదా. ఒకే ప్రియుని ప్రేయసులంతా స్మృతి చేస్తారు. ఆ ప్రియుడు అంటున్నాడు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. నేను మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. మీరు నన్ను పతితపావనులని అంటారు. మళ్లీ నన్ను మర్చిపోయి, గంగను పతితపావని అని ఎందుకు అంటారు? ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు కాబట్టి అవన్నీ వదిలేశారు. ఆ తండ్రే పతితపావనులని మీరు అర్థము చేసుకున్నారు. ఇప్పుడు కృష్ణుని పతితపావనునిగా భావించి ఎప్పుడూ స్మృతి చేయరు. కానీ భగవంతుడెలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగములో ఉన్న కృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధరిస్తూ ధరిస్తూ ఇప్పుడు తమోప్రధానమై పోయింది, ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవుతుంది - శాస్త్రాలలో ఈ తప్పు వ్రాసేశారు. ఈ తప్పు జరిగినప్పుడే నేనే వచ్చి తప్పు లేకుండా చేస్తాను కదా. ఈ తప్పులు కూడా డ్రామాలో ఉన్నాయి, మళ్లీ జరుగుతాయి. ఇవి మీకు అర్థం చేయించాను - శివభగవానువాచ - భగవంతుడని ఆ శివుడినే అంటారు. భగవంతుడు ఒక్కడే. భక్తులందరికీ ఫలమునిచ్చేది ఒకే ఒక భగవంతుడు. వారిని ఎవ్వరూ తెలుసుకోలేరు. '' ఓ గాడ్ ఫాదర్ '' అని ఆత్మ అంటుంది. లౌకిక తండ్రి ఇక్కడ ఉన్నా ఆ తండ్రిని స్మృతి చేస్తారు. అందువలన ఆత్మకు ఇద్దరు తండ్రులున్నారు. భక్తి మార్గములో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ ఉండనే ఉంది. ఆత్మలన్నింటికి తమ తమ పాత్రలు లభించాయి. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్ర చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ ఆ తండ్రే అర్థం చేయిస్తారు. మనము ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని కూడా అంటారు. ఇది ఒక నాటక రంగము. అందులో ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవన్నీ దీపాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను మనుష్యులు దేవతలని అంటారు. ఎందుకంటే వీరు చాలా మంచి పని చేస్తారు. ప్రకాశమునిస్తాయి. ఎవ్వరికీ కష్టము కలిగించరు. అందరికీ సుఖమునిస్తారు. చాలా పనులు చేస్తారు. అందువలన వీటిని దేవతలని అంటారు. మంచి పనులు చేయువారిని, దేవతలని అంటారు కదా. వీరు దేవతల వలె ఉన్నారని అంటారు. వాస్తవానికి దేవతలైతే సత్యయుగములో ఉండేవారు. వారంతా సుఖమునిచ్చేవారు. అందరి పై ప్రీతి ఉంటుంది. అందుకే వారిని దేవతలతో పోల్చడం జరిగింది. దేవతల గుణగానము కూడా చేస్తారు. వారి ముందుకెళ్లి మేము నిర్గుణులము, మాలో ఏ గుణమూ లేదు, దయ చూపించండి, మీకు దయ కలుగుతూ ఉంటుందని పాట పాడుతూ ఉంటారు. దయ కలిగింది కాబట్టే నేను మళ్లీ మిమ్ములను గుణవంతులుగా చేసేందుకు వచ్చానని తండ్రి అంటున్నారు. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు మళ్లీ పూజ్యులుగా అవ్వండి. హమ్ సో(మేమే) అర్థము కూడా మీకు అర్థం చేయించాను. ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని మనుష్యులంటారు. కాని ఇది తప్పు అని తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు, తర్వాత దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. ఆత్మ మొదట సతోప్రధానంగా ఉండేది. సతో, రజో, తమో గుణాలలోకి వస్తుంది. ఈ జ్ఞానము కల్ప-కల్పము బాబా సంగమ యుగములో వచ్చి మనకు ఇస్తారని మీకు తెలుసు. భారతదేశము స్వర్గముగా ఉండేది. అక్కడ చాలా కొద్దిమంది మాత్రమే మనుష్యులు ఉండేవారు. ఇప్పుడిది కలియుగము. అన్ని ధర్మాలు వచ్చేశాయి. సత్యయుగములో ఏ ఇతర ధర్మమూ లేదు. అక్కడ ఒకే ఒక ధర్మముంటుంది. మిగిలిన ఆత్మలన్నీ వెళ్లిపోతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము చాలా సమీపంగా ఉందని మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవరు వచ్చినా ఇది అనంతమైన గడియారమని చెప్పండి. తండ్రి దివ్య దృష్టినిచ్చి ఈ గడియారాన్ని తయారు చేయించారు. ఆ గడియారాన్ని మాటిమాటికి మీరెలా చూస్తారో అలా ఇప్పుడు ఈ బేహద్ గడియారము గుర్తుకొస్తుంది. తండ్రి బ్రహ్మ ద్వారా ఒకే ధర్మమును స్థాపిస్తారు. శంకరుని ద్వారా ఆసురీ ప్రపంచాన్ని వినాశనము చేయిస్తారు. చక్రము తిరగడం తప్పనిసరి అని బుద్ధి కూడా చెప్తుంది. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. ఇప్పుడు మనుష్యులు కూడా చాలామంది ఉన్నారు. ఉపద్రవాలు కూడా చాలా సంభవిస్తూ ఉంటాయి. ముసలాలు(మిస్సైల్స్) కూడా అవే. శాస్త్రాలలో అయితే చాలా కథలు తయారు చేసేశారు. తండ్రి వచ్చి వేదశాస్త్రాల సారము అర్థం చేయిస్తారు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. ఈ బ్రాహ్మణ ధర్మము అయిదవది. ఇది అన్నింటికంటే శ్రేష్ఠమైనది చాలా చిన్న ధర్మము. యుజ్ఞమును సంభాళన చేయువారు బ్రాహ్మణులు. ఇది జ్ఞాన యజ్ఞము. ఉపద్రవాలను నిర్మూలించేందుకు యజ్ఞాలు రచిస్తారు. ఈ యుద్ధము మొదలైనవి జరగరాదని వారు అనుకుంటారు. అరే! యుద్ధము జరగకుంటే సత్యయుగమెలా వస్తుంది? ఇంతమంది మనుష్యులంతా ఎక్కడికెళ్తారు? ఆత్మలమైన మనందరినీ తీసుకెళ్తే శరీరాలను తప్పకుండా ఇక్కడ వదలాల్సి వస్తుంది. ఓ బాబా! మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయమని మీరు పిలుస్తారు కూడా.

తండ్రి అంటున్నారు - నేను పాత ప్రపంచాన్ని తప్పకుండా వినాశనము చేయించాల్సి ఉంటుంది. పావన ప్రపంచమంటే సత్యయుగము. అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను. అందరూ మృత్యువును పిలుస్తారు కదా. కాలులకే కాలుని పిలుస్తున్నామని వారికి తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడిందని తండ్రి అంటున్నారు. ఆత్మలను ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి శాంతిధామానికి తీసుకెళ్తాను. ఇది మంచిదే కదా. మీరు ముక్తికి వెళ్లి మళ్లీ జీవన్ముక్తిలోకి రావాలి తర్వాత జీవన బంధనములోకి వస్తారు. ఇంతమంది సత్యయుగములోకి రారు. నంబరువారుగా వస్తారు. అందుకే అందరూ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. చివరిలో వచ్చేవారి పాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట వారు తప్పకుండా సుఖమును పొందుతారు. మీ పాత్ర అందరికంటే శ్రేష్ఠమైనది. మీరు చాలా సుఖము పొందుతారు. ధర్మ స్థాపకులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. ఎవ్వరికీ ముక్తినివ్వలేరు. తండ్రి భారతదేశములో వచ్చి అందరికీ జ్ఞానమునిస్తారు, అందరికీ పతితపావనులు వారొక్కరే. అందరికీ ముక్తినిస్తారు. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ సద్గతినిచ్చేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. శాంతిధామానికి గానీ, సుఖధామానికి గానీ తీసుకెళ్లలేరు. అందరినీ సుఖధామానికి, శాంతిధామానికి తీసుకెళ్లేవారు తండ్రి ఒక్కరే. వారు దు:ఖము నుండి విడిపించి సుఖమునిస్తారు. తీర్థ స్థానాలు కూడా వారివే. మనుష్యులు అర్థము చేసుకోరు. వాస్తవానికి సత్యమైన తీర్థ స్థానము ఆ తండ్రి ఒక్కరిదే. మహిమ కూడా వారొక్కరిదే. '' ఓ ముక్తిదాతా! రండి '' అని అందరూ వారినే పిలుస్తారు. భారతదేశమే సత్యమైన తీర్థ స్థానము. ఆ తండ్రి ఇక్కడకే వచ్చి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. అందుకే మీరు భక్తిమార్గములో వారికి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. వజ్ర వైఢూర్యాల మందిరాలను నిర్మిస్తారు. సోమనాథ మందిరము ఎంతో సుందరంగా తయారుచేస్తారు. ఇప్పుడు బాబా ఎక్కడ కూర్చొని ఉన్నారో చూడండి. పతిత శరీరములో, పతిత ప్రపంచములో ఉన్నారు. వారిని మీరు మాత్రమే గుర్తించారు. మీరు బాబాకు సహాయకారులుగా అవుతారు. ఇతరులకు దారి చూపేందుకు ఎవరైతే సహాయము చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది నియమము. శ్రమ చేయమని తండ్రి చెప్తున్నారు. తండ్రిని, వారసత్వమును స్మృతి చేయమని అందరికీ దారిని తెలపండి. 84 జన్మల చక్రము మీ ముందే ఉంది. ఇది అంధుల ముందు దర్పణము వంటిది కదా. ఈ డ్రామా ఉన్నదున్నట్లు పునరావృతం అవుతుంది. అయినా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా మందిరాన్ని దోచుకుంటే ఏదైనా చేస్తానని అనుకోరాదు. డ్రామాలో దోచుకునే తీరాలి. మళ్లీ దోచుకొని తీసుకెళ్తారు. పతితుల నుండి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేను వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తాను. డ్రామాలో వినాశనము కూడా నిర్ణయమై ఉంది. కనుక మళ్లీ జరుగుతుంది. వినాశనమైపోవాలని నేనేమీ గాలి ఊదను. ఈ ముసలాలు(మిసైల్స్) మొదలైనవి తయారయ్యే ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర అందరికంటే గొప్పది. సృష్టిని పరివర్తన చేయడం, పతితులను పావనంగా చేయడం నా పాత్ర. ఇప్పుడు సమర్థులు ఎవరు? నేనా లేక డ్రామానా? రావణుడు కూడా డ్రామానుసారము వచ్చే తీరాలి. నాలో ఉండే జ్ఞానము నేనే వచ్చి ఇస్తాను, మీరు శివబాబా సైన్యము. రావణుని పై విజయము పొందుతారు. సెంటర్లు తెరుస్తూ ఉండమని తండ్రి చెప్తున్నారు. నేను చదివించేందుకు వస్తాను. నేను మీ వద్ద ఏమీ తీసుకోను. మీ వద్ద గల ధనాన్ని ఇందులో సఫలము చేయండి. అలాగని ఉన్నదంతా సమాప్తము చేసుకొని ఆకలితో మరణించమని చెప్పను. మీరు ఎవ్వరూ ఆకలితో మరణించరు. ఈ బాబా సర్వస్వమూ ఇచ్చేశారు, మరి ఆకలితో మరణిస్తాడా? మీరు ఆకలితో మరణిస్తారా? శివబాబా భండారముంది. ఈ రోజులలో ప్రపంచములో అయితే ఎందరో మనుష్యులు ఆకలితో మరణిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వము పూర్తిగా తీసుకునే పురుషార్థము చేయాలి. ఇది ఆత్మిక ప్రకృతి వైద్యశాల. చాలా సాధారణ విషయము. కేవలం నోటితో చెప్తున్నారు - ''మన్మనాభవ''. ఆత్మకు పట్టిన వ్యాధిని బాగు చేస్తారు. అందుకే వారిని అవినాశి సర్జన్ అని కూడా అంటారు. చాలా మంచిగా ఆపరేషన్ చేయడం నేర్పిస్తారు. నన్ను స్మృతి చేస్తే మీ దు:ఖములన్నీ దూరమైపోతాయి. చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ ముళ్ల అడవిలో ఉంటూ మేము పుష్పాలతోటకు వెళ్తున్నామని భావించండి, ఇంటికి పోతున్నాము. ఈ విధంగా ఒకరికొకరు స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి. అల్లాను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి(బే) లభిస్తుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉన్నత పదవిని పొందేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. అంధులకు దారి చూపించాలి. బేహద్ గడియారాన్ని సదా గుర్తుంచుకోవాలి.
2. యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్య - సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. మీ వద్ద ధనము మొదలైన దానిని సఫలము చేసుకొని తండ్రి నుండి సంపూర్ణ వారసత్వము తీసుకోవాలి.

వరదానము:- '' స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతి చేసుకునే సత్యమైన సేవాధారి భవ ''
స్వ ఉన్నతి, సేవలో ఉన్నతికి విశేషమైన ఆధారము. స్వ ఉన్నతి తక్కువగా ఉంటే సేవ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం ఎవరికైనా నోటి ద్వారా పరిచయమివ్వడం సేవ కాదు. ప్రతి కర్మ ద్వారా శ్రేష్ఠ కర్మలు చేసేందుకు ప్రేరణనివ్వడం కూడా సేవయే. ఎవరైతే మనసా, వాచా, కర్మణా సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ఠ భాగ్యము అనుభవమవుతుంది. ఎంత సేవ చేస్తారో అంత స్వయం కూడా ముందుకు వెళ్తారు. తమ శ్రేష్ఠ కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు.

స్లోగన్:- '' సమీపానికి వచ్చేందుకు ఆలోచించడం, మాట్లాడడం, చేయడం అన్నీ సమానం చేసుకోండి ''

No comments:

Post a Comment