Thursday, February 27, 2020

Telugu Murli 27/02/2020

27-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు దైవీ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. కనుక మీ ద్వారా ఏ ఆసురీ కర్మలు జరగరాదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి.''

ప్రశ్న:- దేహాభిమానములోకి వచ్చుట వలన జరిగే మొట్టమొదటి పాపము ఏది ?
జవాబు:- దేహాభిమానముంటే తండ్రి స్మృతికి బదులు దేహధారుల స్మృతి వస్తుంది. దృష్టి చెడిపోతుంది. చెడు ఆలోచనలు(సంకల్పాలు) వస్తాయి. ఇది చాలా పెద్ద పాపము. మాయ దాడి చేస్తోందని అర్థం చేసుకోవాలి. వెంటనే జాగరూకులుగా అవ్వాలి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఆత్మిక తండ్రి ఎక్కడ నుండి వచ్చారు? ఆత్మల ప్రపంచము నుండి. దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని కూడా అంటారు. ఇది గీతలోని విషయము. ఈ జ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది? అని మిమ్ములను అడుగుతారు. ఇది అదే గీతా జ్ఞానమని, ఇప్పుడు గీతా పాత్ర నడుస్తూ ఉందని, తండ్రి చదివిస్తున్నారని చెప్పండి. భగవానువాచ కదా. భగవంతుడైతే ఒక్కరే. వారు శాంతిసాగరులు, శాంతిధామ నివాసులు. మనము కూడా అక్కడే ఉండేవారము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది పతిత ప్రపంచము, పాపాత్మల తమోప్రధాన ప్రపంచము. ఆత్మలమైన మనమంతా ఈ సమయములో తమోప్రధానంగా ఉన్నామని కూడా మీకు తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగి సతోప్రధానము నుండి ఇప్పుడు తమోప్రధానములోకి వచ్చాము. ఇది పాత ప్రపంచము లేక కలియుగ ప్రపంచము కదా. ఈ పేర్లన్నీ ఈ సమయములోనివే. పాత ప్రపంచము తర్వాత మళ్లీ కొత్త ప్రపంచము వస్తుంది. ప్రపంచము ఎప్పుడు పరివర్తన కావలసి ఉండినదో అప్పుడు మహాభారత యుద్ధము జరిగిందని, అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారని కూడా భారతవాసులకు తెలుసు. కేవలం తప్పు ఎక్కడ జరిగింది? ఒకటేమో - కల్పము ఆయువును మర్చిపోయారు, రెండవది - గీతా భగవంతుని కూడా మర్చిపోయారు. కృష్ణుని గాడ్ఫాదర్ అని అనలేము. ఆత్మ గాడ్ఫాదర్ అని అంటుంది. అందువలన వారు నిరాకారులు. నిరాకార తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుడను. నన్ను మీరు ఓ పతితపావనా! అని కూడా పిలుస్తారు. కృష్ణుడు దేహధారి కదా. నాకైతే ఏ దేహమూ లేదు. నేను నిరాకారుడను. మనుష్యుల తండ్రిని కాదు, ఆత్మల తండ్రిని. ఇది పక్కా చేసుకోవాలి. క్షణ-క్షణము ఆత్మలైన మనము ఈ తండ్రి(బ్రహ్మ) ద్వారా వారసత్వము తీసుకుంటాము. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినవి. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక బాబా, బాబా అని అంటూనే ఉండాలి. బాబాను చాలా స్మృతి చేయాలి. కల్పమంతా దేహధారి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు ఆత్మల తండ్రి వచ్చారు. మానవ సృష్టి నుండి సర్వ ఆత్మలను వాపసు తీసుకెళ్తారు. ఎందుకంటే రావణరాజ్యములో మనుష్యులందరూ దుర్గతిలో ఉన్నారు. కనుక ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇది రావణరాజ్యమని కూడా మనుష్యులెవ్వరికీ తెలియదు. రావణుని అర్థమే తెలియదు. కేవలం దశరా పండుగను ఆచరించే ఒక ఆచారము మాత్రము ఏర్పడింది. మీలో కూడా ఎవ్వరికీ అర్థము తెలిసేది కాదు. ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు జ్ఞానము లభించింది. ఒకవేళ ఇతరులకు అర్థం చేయించలేకుంటే స్వయం అర్థము చేసుకోలేదని భావించాలి. తండ్రిలో సృష్టి చక్ర జ్ఞానముంది. మనము వారి పిల్లలము కనుక మనలో కూడా ఈ జ్ఞానముండాలి.

ఇది మీ గీతా పాఠశాల. దీని లక్ష్యమేది? ఈ లక్ష్మినారాయణులుగా అవ్వడం. ఇది రాజయోగము కదా. ఇది నరుని నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అయ్యే జ్ఞానము. వారు కూర్చుని కథలు వినిపిస్తారు. ఇక్కడైతే మనము చదువుకుంటాము. మనకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కల్పములోని సంగమ యుగములో నేర్పిస్తారు. తండ్రి చెప్తారు - నేను పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చాను. క్రొత్త ప్రపంచములో వీరి రాజ్యముండేది. పాత ప్రపంచములో ఆ రాజ్యము లేదు. మళ్లీ తప్పకుండా వస్తుంది. చక్రమునైతే తెలుసుకున్నారు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. ఇప్పుడు దైవీ ధర్మము లేనే లేదు. దైవీ ధర్మము భ్రష్ఠమైపోయింది. దైవీ కర్మలు కూడా భ్రష్ఠమైపోయాయి. ఇప్పుడు మళ్లీ మీకు శ్రేష్ఠమైన దైవీ ధర్మము, శ్రేష్ఠ కర్మలు బాబా నేర్పిస్తున్నారు. కనుక మా ద్వారా ఏ ఆసురీ కర్మలు జరగడం లేదు కదా? మాయ కారణంగా చెడు సంకల్పాలేవీ రావడం లేదు కదా? చెడు దృష్టి లేదు కదా? అని స్వయం పై గమనముంచుకోవాలి. ఎవరికైనా చెడు దృష్టి ఉండడం లేక చెడు ఆలోచనలు రావడం గమనిస్తే వారిని వెంటనే హెచ్చరించాలి. వారితో మీరు కలిసిపోరాదు. మీలో మాయ ప్రవేశించిన కారణంగా ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయని వారిని హెచ్చరించాలి. యోగములో కూర్చున్నప్పుడు తండ్రి స్మృతికి బదులు ఎవరి దేహము వైపైనా ఆలోచనలు వెళ్తే మాయతో యుద్ధము జరుగుతోందని, నేను పాపము చేస్తున్నానని అర్థం చేసుకోవాలి. దీని కొరకు చాలా శుద్ధమైన, పవిత్రమైన బుద్ధి అవసరము. ఎగతాళి(వేళాకోళము) వలన కూడా చాలా నష్టము సంభవిస్తుంది కనుక మీ నోటి ద్వారా సదా శుద్ధ మాటలే వెలువడాలి. చెడు మాటలు వెలువడరాదు. వేళాకోళము మొదలైనవి కూడా చేయరాదు. తమాషాకు అన్నాను......... అని కూడా అనరాదు. అది కూడా నష్టకారకంగా అయిపోతుంది. వికారీ వాసనలు ఉండు విధంగా తమాషాలు కూడా చేసుకోరాదు. చాలా హెచ్చరికగా ఉండాలి. దిగంబరుల ఆలోచనలు వికారాల వైపుకు వెళ్లవని మీరు భావిస్తారు. వారు వేరుగానే ఉంటారు. కాని యోగము ద్వారా తప్ప కర్మేంద్రియాల చంచలత ఎప్పుడూ తొలగదు. కామ శత్రువు ఎటువంటిదంటే, యోగము సరిగ్గా లేకుంటే ఎవరినైనా చూసినప్పుడు చంచలత తప్పకుండా వస్తుంది. మిమ్ములను మీరు పరీక్ష చేసుకోవలసి ఉంటుంది. సదా తండ్రి స్మృతిలోనే ఉంటే ఇలాంటి జబ్బులేవీ ఉండవు. యోగములో ఉండడం వలన ఈ జబ్బులు రావు. సత్యయుగములో ఎలాంటి మురికి ఉండదు. చంచలమయ్యేందుకు అక్కడ రావణుని చంచలతయే ఉండదు, అక్కడ యోగి జీవితముంటుంది. ఇక్కడ కూడా స్థితి చాలా పక్కాగా ఉండాలి. యోగబలము ద్వారా ఈ జబ్బులన్నీ సమాప్తమైపోతాయి. కాని ఇందులో చాలా శ్రమ ఉంది. రాజ్యము తీసుకోవడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). పురుషార్థమైతే చేయాలి కదా. భాగ్యములో ఏముంటే అది లభిస్తుందని భావించరాదు. ధారణే చెయ్యకుంటే పనికిరాని పదవికి అనగా చాలా చిన్నపదవికి యోగ్యులుగా అవుతారు. పాఠ్యాంశాలు చాలా ఉంటాయి కదా. కొందరు డ్రాయింగులో, కొందరు ఆటలలో మంచి మార్కులు తీసుకుంటారు. అవి సాధారణ పాఠ్యాంశాలు. అలాగే ఇక్కడ కూడా అటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఏదో ఒక పదవి లభిస్తుంది కాని సామ్రాజ్యము లభించదు. సర్వీసు చేస్తే సామ్రాజ్యము లభిస్తుంది. దాని కొరకు చాలా శ్రమ చేయాలి. ఎలాగైతే అందరికీ ఆహారము జీర్ణము ఎలా అవ్వదో అలా చాలామంది బుద్ధిలో కూర్చోదు. వారికి ఉన్నత పదవి పొందే ధైర్యముండదు. దీనిని కూడా అనారోగ్యమని అంటారు కదా. మీరు ఏ విషయము చూస్తున్నా చూడనట్లు ఉండండి. ఆత్మిక తండ్రి స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపించాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. మీరు దారి తెలుసుకున్నారు. మహారథులుగా ఎవరుంటారో వారి బుద్ధిలో రచయిత - రచనల జ్ఞానము, ముక్తి - జీవన్ముక్తుల జ్ఞానము తిరుగుతూ ఉంటుంది. మహారథి పిల్లల స్థితిలో కూడా రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంటుంది. కొన్ని చోట్ల కొంతమంది చాలా ధనవంతులుగా అవుతారు, కొంతమంది చాలా పేదవారుగా అవుతారు. రాజ్య పదవిలో వ్యత్యాసముంటుంది కదా. కాని అక్కడ రావణుడు లేనందున దు:ఖముండదు. కాని సంపదలో అయితే వ్యత్యాసముంటుంది. సంపద వలన సుఖము లభిస్తుంది.

ఎంతగా యోగములో ఉంటారో, అంత ఆరోగ్యము చాలా బాగుంటుంది. కష్టపడాలి. చాలామంది నడవడికలు అజ్ఞాని మనుష్యుల వలె ఉంటాయి. అటువంటివారు ఎవ్వరికీ కళ్యాణము చెయ్యలేరు. పరీక్షలు జరిగినప్పుడు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారో తెలుస్తుంది. ఆ సమయంలో అయ్యో! అయ్యో! అని బాధపడవలసి వస్తుంది. బాప్(తండ్రి), దాదా(అన్న) ఇరువురు ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కళ్యాణము చేసేందుకే తండ్రి వచ్చారు. స్వయానికి కూడా కళ్యాణము చేసుకోవాలి, ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. మీరు వచ్చి పతితులైన మాకు పావనులయ్యే మార్గాన్ని తెలపండి అని తండ్రిని పిలిచారు. కనుక తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహాభిమానము వదిలి నన్ను స్మృతి చేయండి. ఇది ఎంత సహజమైన ఔషధము. మేము కేవలం ఒక్క భగవంతుడైన తండ్రిని మాత్రమే అంగీకరిస్తాము అని ఇతరులకు చెప్పండి. వారు చెప్తున్నారు - పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలిచినందున నేను రావలసి వస్తుంది. బ్రహ్మ నుండి మీకు ఏమీ లభించదు. అతను అన్న మాత్రమే, తండ్రి కాదు. తండ్రి నుండి అయితే వారసత్వము లభిస్తుంది. బ్రహ్మ నుండి వారసత్వము లభించదు. నిరాకార తండ్రి ఇతని ద్వారా ఆత్మలైన మనలను దత్తు తీసుకొని చదివిస్తారు. ఇతనిని కూడా చదివిస్తారు. బ్రహ్మ నుండి లభించేది ఏమీ లేదు. వారసత్వము ఇతని ద్వారా తండ్రి నుండే లభిస్తుంది. ఇచ్చేవారు వారొక్కరే. మహిమ వారికే ఉంది. సర్వుల సద్గతిదాత వారే. ఈ బ్రహ్మ పూజ్యుని నుండి మళ్లీ పూజారిగా అవుతాడు. సత్యయుగములో ఉండేవాడు, తర్వాత మళ్లీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు పతితమయ్యాడు. మళ్లీ పూజ్యునిగా, పావనంగా అవుతున్నాడు. మనము తండ్రి ద్వారా వింటాము. మనుష్యుల ద్వారా వినడం లేదు. మనుష్యులది భక్తిమార్గము. ఇది ఆత్మిక జ్ఞానమార్గము. జ్ఞానము కేవలం ఒక్క జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. శాస్త్రాలు మొదలైనవి చదవడము - ఇవన్నీ భక్తి మార్గములోని సాంప్రదాయాలు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞాన నదులైన మనము జ్ఞానసాగరము నుండి వెలువడిన వారము. అక్కడ ఉండేది నీటి సాగరము, నీటి నదులు. పిల్లలకు ఈ విషయాలన్నీ గుర్తుండాలి. అంతర్ముఖులుగా అయి బుద్ధిని నడిపించాలి. స్వయాన్ని సరిజేసుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ నోటి నుండి ఏవైనా చెడు మాటలు వెలువడినా లేక చెడు దృష్టి కలిగినా వెంటనే మా నోటి నుండి చెడు మాటలు ఎందుకు వచ్చాయి? మాకు చెడు దృష్టి ఎందుకు కలిగింది? అని స్వయానికి చీవాట్లు పెట్టుకోవాలి. తమకు తామే చెంపదెబ్బలు కూడా వేసుకోవాలి, క్షణ-క్షణము హెచ్చరించుకోవాలి. అప్పుడే ఉన్నతపదవి పొందగలరు. నోటి ద్వారా కటు వచనాలు వెలువడరాదు. తండ్రి అయితే అన్ని రకాలైన శిక్షణలను ఇవ్వవలసి ఉంటుంది. ఎవరినైనా పిచ్చివాడు అనడం కూడా చెడు వచనమే.

మనుష్యులు ఎవరి గురించి అయినా ఏది తోస్తే అది అంటూ ఉంటారు. ఎవరిని మహిమ చేస్తున్నామో కకూడా తెలియదు. పతితపావనుడైన ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాలి. వారు తప్ప వేరెవ్వరూ లేరు. బ్రహ్మ-విష్ణు-శంకరులను కూడా పతితపావనులని అనరు. వారు ఎవ్వరినీ పావనంగా చెయ్యరు. పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పావన సృష్టి అంటేనే నూతన ప్రపంచము. అది ఇప్పుడు లేనే లేదు. పవిత్రత స్వర్గములో మాత్రమే ఉంటుంది. పవిత్రతా సాగరులు కూడా ఉన్నారు. ఇదంతా రావణ రాజ్యమే. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. నోటి ద్వారా ఎలాంటి రాళ్లు లేక చెడు వచనాలు వెలువడరాదు. చాలా ప్రీతిగా నడుచుకోవాలి. చెడు దృష్టి కూడా చాలా నష్టపరుస్తుంది. చాలా శ్రమ అవసరము. ఆత్మాభిమానము అవినాశి అభిమానము. దేహమైతే వినాశి. ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు కూడా ఎవరో తండ్రి తప్పకుండా ఉంటారు కదా. అందరూ సోదరులే(భాయి-భాయి) అని కూడా అంటారు. మరి అందరిలో పరమాత్ముడైన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు? అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు? ఇంత మాత్రము తెలివి కూడా లేదు! సర్వుల తండ్రి ఒక్కరే. వారి నుండే వారసత్వము లభిస్తుంది. వారి పేరు శివుడు. శివరాత్రి కూడా జరుపుకుంటారు, రుద్ర రాత్రి లేక కృష్ణ రాత్రి అని అనరు. మనుష్యులు కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇవన్నీ వారి రూపాలే, వారి లీలే, అంతా వారిదే అని అంటారు.

అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది కనుక ఆ తండ్రి శ్రీమతమును అనుసరించాలని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తారు. కూలీలకు(లేబర్) కూడా శిక్షణ ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా కొంత కళ్యాణము జరుగుతుంది. కాని స్వయం మీరే స్మృతి చేయలేకుంటే ఇతరులకు స్మృతి ఎలా ఇప్పించగలరు? రావణుడు పూర్తి పతితులుగా తయారు చేస్తాడు మళ్లీ తండ్రి వచ్చి స్వర్గంగా చేస్తారు. ఆశ్చర్యము కదా. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మినారాయణులు ఎంత శ్రేష్ఠమైన దేవతల నుండి మళ్లీ ఎంత పతితులుగా అవుతారు! అందుకే బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని మహిమ చేయబడింది. శివాలయాలలో మీరు చాలా సర్వీసు చేయవచ్చు. తండ్రి చెప్తున్నారు - గడప, గడప వెతకడం వదిలేసి మీరు తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. ఈ జ్ఞానమే శాంతి కలిగించేది. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు సతోప్రధానులుగా అవుతారు. ఈ మంత్రమునే అందరికీ ఇస్తూ ఉండండి. పక్కా అయినంత వరకు ఎవరి వద్దా ధనము తీసుకోకండి. అందరికీ ఇలా చెప్పండి - మీరు పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు మీ చేతితో భోంచేస్తాము, మీ వద్ద ఏమైనా తీసుకుంటాము. భారతదేశములో మందిరాలైతే అనేకం ఉన్నాయి(అందులో సేవ చేయండి). విదేశీయులు మొదలైనవారు ఎవరు వచ్చినా తండ్రిని స్మృతి చేయండి అను సందేశాన్ని ఇవ్వవచ్చు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడు కూడా వికారాల వాసన ఉండే వేళాకోళము చేయరాదు. నోటి నుండి కటువచనాలు వెలువడకుండా స్వయం పై చాలా గమనము ఉంచుకోవాలి.
2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసము చేయాలి. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. చెడు దృష్టి ఉంచుకోరాదు. చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే శిక్ష విధించుకోవాలి.

వరదానము:- '' గౌరవం అడుక్కునే బదులు గౌరవం ఇచ్చే సదా నిష్కామ యోగీ భవ ''
మీకు ఎవరైనా గౌరవమిచ్చినా, ఇవ్వకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు వారిని మధురమైన సోదరునిగా, మధురమైన సోదరిగా అంగీకరించి సదా స్వమానంలో ఉండి, స్నేహయుక్త దృష్టితో, స్నేహ వృత్తితో ఆత్మిక గౌరవమిస్తూ ఉండండి. వీరు నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తానని అనుకోవడం కూడా రాయల్ భికారితనము. ఇది వదిలి మీరు నిష్కామ యోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహమనే వర్షము ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీ ముందు ఎవరైనా రాళ్లు వేసినా మీరు వారికి రత్నాలనివ్వండి. ఎందుకంటే మీరు రత్నాగరుడైన తండ్రి పిల్లలు.

స్లోగన్:- '' విశ్వ నవ నిర్మాణము చేసేందుకు రెండు మాటలు గుర్తుంచుకోండి - నిమిత్తం మరియు నిర్మానం (నిరహంకారత) ''

No comments:

Post a Comment