Friday, February 14, 2020

Telugu Murli 14/02/2020

14-02-20

'' మధురమైన పిల్లలారా - ఆత్మలైన మీ స్వధర్మము శాంతి. మీ దేశము శాంతిధామము, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, అందువలన మీరు శాంతి కావాలని వేడుకోరాదు ''
ప్రశ్న:- మీ యోగబలము చేయు అద్భుతమేది ?
జవాబు:- యోగబలము ద్వారా మీరు మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా చేస్తారు. మీరు చాలా కొద్దిమంది పిల్లలే యోగబలము ద్వారా ఈ మొత్తము కలియుగ పర్వతాన్ని తొలగించి, బంగారు పర్వతాన్ని (స్వర్గము-సత్యయుగము) స్థాపన చేస్తారు. పంచ తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి, మంచి ఫలితమునిస్తాయి. సతోప్రధాన తత్వాల వలన ఈ శరీరాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అచ్చటి ఫలాలు(పండ్లు) కూడా చాలా పెద్ద-పెద్దవిగా, చాలా రుచిగా ఉంటాయి.
ఓంశాంతి. ఓంశాంతి అన్న వెంటనే చాలా ఖుషీ(సంతోషము) కలగాలి. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ శాంతి స్వరూపము, దాని స్వధర్మమే శాంతి. శాంతి మీ కంఠహారమని సన్యాసులు కూడా ఉదహరిస్తారు. శాంతిని వెలుపల ఎక్కడ వెతుకుతారు? ఆత్మ స్వతహాగా శాంతి స్వరూపము ఈ శరీరములో పాత్ర చేసేందుకు రావలసి వస్తుంది. ఆత్మ సదా శాంతిగా ఉంటే కర్మలెలా చేస్తుంది? కర్మలైతే చేసే తీరాలి. శాంతిధామములో ఆత్మలు శాంతిగా ఉంటాయి. అక్కడ శరీరాలు ఉండనే ఉండవు. సన్యాసులు మొదలైనవారు స్వయాన్ని ఆత్మలమని, శాంతిధామములో ఉండేవారమని భావించరు. శాంతిధామము మన స్వదేశమని పిల్లలకు అర్థము చేయించబడింది. తర్వాత మనము సుఖధామములోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. ఆ తర్వాత దుఃఖధామములో రావణ రాజ్యముంటుంది. ఇది 84 జన్మల కథ. భగవానువాచ - అర్జునా! నీకు నీ జన్మల గురించి తెలియదు. ఒక్క అర్జునునికే అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఒక్కరిది గ్యారంటీగా తీసుకోవచ్చు. ఈ రాధా-కృష్ణులదైతే గ్యారంటీ కదా. కనుక వీరిదే తీసుకుంటారు. ఇది తండ్రికి కూడా తెలుసు, పిల్లలకు కూడా తెలుసు, అందరూ పిల్లలే, అందరూ 84 జన్మలు తీసుకోరు. కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది చివర్లో వస్తారు. కాని వీరేమో(రాధా-కృష్ణులు) తప్పనిసరిగా 84 జన్మలు తీసుకుంటారు. పిల్లలారా! అని వీరికి చెప్తారు. అందువలన ఇతను అర్జునుడు కదా. రథములో కూర్చొని ఉన్నాడు కదా. ఎలా జన్మిస్తామో పిల్లలు కూడా అర్థము చేసుకోగలరు. సర్వీసే చేయకుంటే సత్యయుగ నూతన ప్రపంచములో మొదటెలా వస్తారు? వీరి అదృష్టము ఎక్కడ ఉంది? చివర్లో జన్మించేవారికి ఇల్లు పాతదవుతూ పోతుంది కదా. నేను ఇతని విషయమే చెప్తున్నాను. మీకు కూడా ఇతను తప్పకుండా వస్తాడని తెలుసు. మమ్మా, బాబా 84 జన్మలు తీసుకుంటారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. కుమార్కా, జనక్ మొదలైన మహారథులు 84 జన్మలు తీసుకుంటారు. సర్వీసు చేయనివారు కొన్ని జన్మల తర్వాత వస్తారు. మనము పాస్ అవ్వలేమని, వెనుక వస్తామని అర్థం చేసుకుంటారు. పాఠశాలలో పరుగు పందెములో, లక్ష్యము వరకు పరుగెత్తి వాపసు వస్తారు కదా. అందరూ ఒకే విధంగా ఉండరు. పందెములో కొద్దిగా పాతిక ఇంచి తేడా వచ్చినా ప్లస్లోకి వచ్చేస్తారు. ఇది కూడా ఒక గుర్రపు పందెము(అశ్వ రేస్). అశ్వమనగా గుర్రము. రథమును కూడా గుర్రమని అంటారు. పోతే దక్ష ప్రజాపిత యజ్ఞము చేసి, అందులో గుర్రాన్ని స్వాహా చేశాడని అంటారు. ఈ విషయాలేవీ లేవు. దక్ష ప్రజాపిత లేడు, ఏ యజ్ఞమూ రచించలేదు. పుస్తకాలలో, భక్తిమార్గపు కట్టుకథలు అనేకమున్నాయి. వాటి పేరే కథలు. చాలా కథలు వింటారు. మీరైతే ఈ చదువు చదువుకుంటారు. చదువును కథ అని అనరు. పాఠశాలలో చదువుకుంటారు. ఈ చదువు ద్వారా మాకు ఫలానా ఉద్యోగము లభిస్తుందని లక్ష్యముంటుంది. ఏదో ఒకటి లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదే మీరు చేయవలసిన శ్రమ. తండ్రిని స్మృతి చేయడం వల్లనే వికర్మలు వినాశనమవుతాయి. ముఖ్యంగా స్మృతి చేయాల్సి ఉంటుంది. తపనతో స్మృతి చేయాలి. అంతేగాని నేను శివబాబా సంతానాన్ని కదా? ఎందుకు స్మృతి చేయాలని అనుకోరాదు. స్వయాన్ని విద్యార్థిగా భావించి స్మృతి చేయాలి. ఆత్మలైన మనలను శివబాబా చదివిస్తున్నారనేది కూడా మర్చిపోతారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలిపిన టీచరు ఒక్క శివబాబా మాత్రమే. ఇది కూడా గుర్తుండదు. ప్రతి ఒక్కరు స్వయాన్ని - ఎంత సమయము తండ్రి స్మృతి నిలబడ్తుంది? అని ప్రశ్నించుకోవాలి. ఎక్కువ సమయము బాహ్యముఖతలోనే పోతుంది. ముఖ్యమైనది ఈ స్మృతి ఒక్కటే. ఈ భారతదేశ యోగానికి చాలా మహిమ ఉంది. కాని యోగము నేర్పించిందెవరో ఎవ్వరికీ తెలియదు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఇప్పుడు కృష్ణుని స్మృతి చేసినందున ఒక్క పాపము కూడా తొలగిపోదు. ఎందుకంటే అతను దేహధారి. పంచ తత్వాలతో తయారైనవాడు. అతడిని స్మృతి చేయడమనగా మట్టిని స్మృతి చేయడం లేక పంచ తత్వాలను స్మృతి చేయడం. శివబాబా ఏమో అశరీరి. అందువలన వారు అశరీరులుగా అయి తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తారు.

ఓ పతితపావనా! అని కూడా అంటారు. పతితపావనులు వీరే కదా. గీతా భగవానుడు ఎవరు? అని యుక్తిగా అడగాలి. సృష్టికర్త అయిన భగవంతుడు ఒక్కరే ఉంటారు కదా. మనుష్యులు స్వయాన్ని భగవంతుడని అనిపించుకున్నా మీరంతా నా పిల్లలు అని ఎప్పుడూ అనడు. తతత్వమ్ అని లేక ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేనూ భగవంతుడనే, నీవూ భగవంతుడవే అని అంటారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. రాయిలో కూడా నీవున్నావని అంటారు. మీరంతా నా పిల్లలు అని అనలేరు. ఈ మాట ఒక్క తండ్రి మాత్రమే అంటారు. వారు నా ప్రియమైన ఆత్మిక పిల్లలారా! అని అంటున్నారు. ఈ విధంగా వేరెవ్వరూ అనలేరు. ముస్లింలను, నా ప్రియమైన పిల్లలారా! అని ఎవరైనా అంటే చెంపదెబ్బ వేస్తారు. ఈ మాట ఆ పారలౌకిక తండ్రి మాత్రమే అనగలడు. ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. 84 జన్మల సోపానాల(మెట్ల) రహస్యము నిరాకార తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. వారి అసలు పేరు శివుడు. మనుష్యులు అనేక పేర్లు పెట్టేశారు. అనేక భాషలున్నాయి. అందువలన వారి వారి భాషలలో పేర్లు పెట్టారు. బొంబాయిలో బబుల్నాథుడు అని పేరు పెట్టారు. కాని అర్థము కొంచెము కూడా తెలియదు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయువాడని మీకు తెలుసు. భారతదేశములో శివబాబాకు వేల కొలది పేర్లున్నాయి. అర్థము కొంచెం కూడా తెలియదు. తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థము చేయిస్తున్నారు. అందులో కూడా ఎక్కువగా మాతలను ముందుంచుతారు. ఈ రోజులలో స్త్రీలకు కూడా గౌరవముంది ఎందుకంటే తండ్రి వచ్చారు కదా. తండ్రి మాతలను గొప్పగా మహిమ చేస్తారు - మీరు శివశక్తి సైన్యము. మీకు మాత్రమే శివబాబాను గురించి తెలుసు. సత్యమైనవారు ఒక్కరే. సత్యమైన నావ కదులుతుంది కాని మునగదు అని మహిమ కూడా చేస్తారు. అందువలన మీరు సత్యమైనవారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అసత్య నావలన్నీ మునిగి సమాప్తమైపోతాయి. ఇక్కడ మీరెవ్వరూ రాజ్యపాలన చేయరు. తర్వాత జన్మలో సత్యయుగములో వచ్చి రాజ్యపాలన చేస్తారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇవి మీకు మాత్రమే తెలుసు ఈ బాబా లభించకపోతే మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకున్నారు.

ఇతడు యుధిష్ఠరుడు. పిల్లలను యుద్ధ మైదానములో నిలబెట్టేవాడు. ఇది అహింస. అహింసక యుద్ధము. మానవులు ఒకరినొకరు చంపుకోవడాన్ని హింస అని అంటారు. కాని మొట్టమొదటి ముఖ్యమైన హింస కామ వికారము. అందుకే కామము మహాశత్రువని అంటారు. దీని పైనే విజయం పొందాలి. ముఖ్యమైనది కామ వికారము. పతితులనగా వికారులు. పతితులైనవారిని, వికారాలకు వశమైన వారిని పతితులని అంటారు. క్రోధములో వచ్చువారిని వికారులని అనరు. క్రోధిని క్రోధి, లోభిని లోభి అని అంటారు. దేవతలను నిర్వికారులని అంటారు. దేవతలు నిర్లోభులు, నిర్మోహులు, నిర్వికారులు వారు ఎప్పుడూ వికారాలకు వశము కారు. వికారాలు లేకుంటే పిల్లలెలా కలుగుతారు? అని మిమ్ములను అడుగుతారు. వారిని నిర్వికారులని అంగీకరిస్తారు కదా. అది నిర్వికారి ప్రపంచము. ద్వాపర-కలియుగాలు వికారి ప్రపంచము. స్వయాన్ని వికారులమని, దేవతలను నిర్వికారులని అంటారు కదా. మనము కూడా వికారులుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు వీరి వలె నిర్వికారులుగా అవుతున్నాము. ఈ లక్ష్మీనారాయణులు కూడా స్మృతిబలము ద్వారా ఈ పదవి పొందుకున్నారు. ఇప్పుడు మళ్లీ పొందుతున్నారు. మనమే దేవీదేవతలుగా ఉండేవారము. మనమే కల్పక్రితము ఇటువంటి రాజ్యము పొందుకున్నాము. దానిని పోగొట్టుకొని, మళ్లీ ఇప్పుడు పొందుతున్నాము. బుద్ధిలో ఈ చింతన ఉండినా, ఖుషీగా ఉంటారు. కాని మాయ ఈ స్మృతిని మరపింపజేస్తుంది. మీరు స్థిరమైన స్మృతిలో ఉండలేరని బాబాకు తెలుసు. పిల్లలైన మీరు చలింపక, స్మృతి చేస్తూ ఉంటే, త్వరగా కర్మాతీత స్థితిని పొంది ఆత్మ వాపసు వెళ్లిపోతుంది. కాని అలా లేదు. మొదటి నెంబరులో ఇతడు వెళ్తాడు. ఆ తర్వాత శివబాబా పెళ్లి ఊరేగింపు. వివాహములో మాతలు మట్టికుండలో జ్యోతులు వెలిగించుకొని వెళ్తారు కదా. వరుడైన శివబాబా సదా వెలిగే జ్యోతి అని చెప్పేందుకు ఇది గుర్తు. శివబాబా మన ప్రియుడు సదా వెలిగే జ్యోతి. మన జ్యోతులన్నీ వెలిగింపబడ్డాయి. ఈ విషయాన్ని భక్తిమార్గములో అలా చూపించారు. మీరు యోగబలము ద్వారా మీ జ్యోతిని మీరే వెలిగించుకుంటారు. యోగము ద్వారా మీరు పవితంగా అవుతారు. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. చదువును ఆదాయానికి ఆధారమని అంటారు కదా(జుసబషa్ఱశీఅ Iర ుష్ట్రవ ూశీబతీషవ ూట Iఅషశీఎవ). యోగబలముతో మీరు ముఖ్యంగా భారతదేశాన్ని, విశ్వమంతటినీ పవిత్రంగా చేస్తారు. ఇందులో కన్యలు చాలా మంచి సహాయకారులుగా అవ్వగలరు. సేవ చేసి ఉన్నత పదవి పొందాలి. జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. తక్కువగా కాదు. తల్లిదండ్రులను అనుసరించండి అనే గాయనముంది. మదర్-ఫాదర్ను చూడండి. అనన్యమైన సోదరీ-సోదరులను చూడండి.

పిల్లలైన మీరు ఎగ్జిబిషన్లో కూడా మీకు ఇద్దరు తండ్రులని అర్థం చేయించవచ్చు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. వీరిలో పెద్దవారు ఎవరు? తప్పకుండా బేహద్ తండ్రే పెద్దవారు కదా. వారసత్వము వారి ద్వారా లభించాలి. ఇప్పుడు వారసత్వమునిస్తున్నారు. విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. భగవానువాచ - మీకు రాజయోగమును నేర్పిస్తున్నాను, తర్వాత జన్మలో మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి కల్ప-కల్పము భారతదేశంలో వచ్చి భారతదేశాన్ని చాలా ధనవంతముగా చేస్తారు. ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఇక్కడ 21 జన్మలకు వజ్ర సమానంగా అవుతారు. ఈ చదువుకు, ఆ చదువుకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఇక్కడ తండ్రి, టీచరు, సద్గురువు అన్నీ ఒక్కరే. వారే తండ్రి వారసత్వమును, టీచరు వారసత్వమును, సద్గురువు వారసత్వమును అన్నీ ఇచ్చేస్తారు. దేహ సహితంగా అందరినీ మర్చిపోమని తండ్రి చెప్తున్నారు. మీరు మరణిస్తే, మీ కొరకు ప్రపంచము మరణిస్తుంది(ఆప్ ముయే మర్ గయీ దునియా). తండ్రికి మీరు దత్తు పిల్లలు. ఇక మీరు ఎవరిని స్మృతి చేయాలి? ఇతరులను చూస్తున్నా చూడనట్లుండాలి. పాత్ర కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్లి మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు రావాలని బుద్ధిలో ఉంది. ఇది బుద్ధిలో ఉండినా, చాలా ఖుషీగా ఉంటారు. పిల్లలు దేహాభిమానాన్ని వదిలేయాలి. ఈ పాత వస్తువును ఇక్కడనే వదిలి ఇప్పుడు వాపసు వెళ్ళాలి. నాటకము పూర్తి అవుతుంది. పాత సృష్టికి అగ్ని తగుల్కుంటూ ఉంది. గ్రుడ్డివారి సంతానము గ్రుడ్డివారై అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. నిదురించే మనిషిని చూపించారని మనుష్యులనుకుంటారు. కాని ఇది అజ్ఞాన నిద్ర. ఈ నిద్ర నుండి మీరు మేల్కొలుపుతున్నారు. జ్ఞానమనగా పగలు. దానిని సత్యయుగమని అంటారు. అజ్ఞానమనగా రాత్రి అంటే కలియుగము. ఇవన్నీ చాలా అర్థము చేసుకునే విషయాలు. కన్యలు వివాహము చేసుకుంటే మాత-పితలు, అత్తగారు-మామగారు మొదలైన వారంతా గుర్తుకొస్తారు. వారందరినీ మర్చిపోవాల్సి వస్తుంది. అలాగే కొందరు యుగల్ సన్యాసులను చూపిస్తారు - మేము యుగల్గా(స్త్రీ-పురుషులుగా) ఉండినా ఎప్పుడూ వికారాల వశమవ్వమని అంటారు. జ్ఞాన ఖడ్గము మా ఇద్దరి మధ్య ఉంటుంది. పవిత్రంగా ఉండమని తండ్రి ఆజ్ఞ. చూడండి, రమేష్ - ఉష ఉన్నారు కదా, ఎప్పుడూ పతితులుగా అవ్వలేదు. పతితులైతే 21 జన్మల రాజ్య పదవిని పోగొట్టుకుంటామనే భయముంది. దివాలా తీస్తారు. కొంతమంది ఇలా ఉంటూ ఫెయిల్ అవుతారు. గాంధర్వ వివాహమనే పేరు ఉంది కదా. పవిత్రంగా ఉండడం వలన చాలా ఉన్నతమైన పదవి లభిస్తుందని మీకు తెలుసు. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వాలి. యోగబలము ద్వారా కర్మేంద్రియాలు కూడా అదుపులోకి వచ్చేస్తాయి. యోగబలము ద్వారా మీరు మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రంగా చేస్తారు. మీరు కొంతమందే అయినా, పిల్లలైన మీరు యోగబలముతో కలియుగ పర్వతాన్ని ఎత్తేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు. ఇది మనుష్యులకు అర్థం కాదు. వారు గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, తండ్రే వచ్చి ప్రపంచమంతటినీ బంగారు ప్రపంచంగా తయారు చేస్తారు. అలాగని హిమాలయ పర్వతాలు బంగారు పర్వాతాలుగా అయిపోతాయని కాదు. అక్కడ బంగారు గనులు నిండుగా ఉంటాయి. 5 తత్వాలు సతోప్రధానంగా ఉంటాయి. అక్కడ ప్రకృతి చాలా మంచి ఫలాలనిస్తుంది. సతోప్రధానమైన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అచ్చటి ఫలాలు కూడా చాలా పెద్దవిగా, చాలా మధురంగా రుచిగా ఉంటాయి. దాని పేరే స్వర్గము. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికారాలు వదిలిపోతాయి. దేహాభిమానము వస్తే, వికారాల చేష్టలు మొదలవుతాయి. యోగులెప్పుడూ వికారాలకు వశమవ్వరు. జ్ఞాన బలముండినా, యోగులుగా అవ్వకుంటే క్రింద పడిపోతారు. పురుషార్థము గొప్పదా? ప్రాలబ్ధము గొప్పదా? అని అడుగుతారు కదా? పురుషార్థము గొప్పదని అంటారు. అదే విధంగా జ్ఞాన-యోగాలలో గొప్పది యోగమని అంటారు. యోగము ద్వారానే పతితుల నుండి పావనంగా అవుతారు. బేహద్ తండ్రి ద్వారా చదువుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీరంటారు. మనుష్యుల ద్వారా చదువుకుంటే ఏం లభిస్తుంది? నెలకు ఎంత సంపాదిస్తారు? మీరు ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేస్తారు. ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువైనది. అక్కడ ధనమును లెక్కించరు. లెక్కలేనంత ధనముంటుంది. అందరికీ వారి వారి భూములు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు మీకు రాజయోగమును నేర్పిస్తానని తండ్రి అంటున్నారు. ఇది మీ లక్ష్యము. పురుషార్థము చేసి ఉన్నతంగా అవ్వాలి. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ప్రాలబ్ధమెలా పొందారు? వీరి ప్రాలబ్ధమును తెలుసుకుంటే ఇంకేం కావాలి? ఇప్పుడు కల్పానికి ఒక్కసారి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని మీకు తెలుసు. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. అందువలన పిల్లలకు సేవ చేయాలనే ఉత్సాహముండాలి. ఎవరికో ఒకరికి దారి చూపకుండా భోజనమే చేయరాదు. ఇంత ఉల్లాస - ఉత్సాహాలుంటే ఉన్నత పదవి పొందగలరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-1. ఈశ్వరీయ సేవ చేసి మీ జీవితాన్ని 21 జన్మలకు వజ్ర సమానంగా చేసుకోవాలి. తల్లి-తండ్రిని, అనన్య సోదరీ-సోదరులనే అనుసరించాలి.

2. కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు దేహ సహితం అందరినీ మర్చిపోవాలి. మీ స్మృతిని స్థిరంగా చలించకుండా చేసుకోవాలి. దేవతల వలె నిర్లోభులుగా, నిర్మోహులుగా, నిర్వికారులుగా అవ్వాలి.

వరదానము:- '' సర్వ గుణ సంపన్నంగా అవ్వడంతో పాటు ఏదో ఒక విశేషతలో ప్రభావశాలి భవ ''ఎలాగైతే డాక్టర్లకు జనరల్గా వచ్చే వ్యాధుల గురించిన జ్ఞానము ఉండనే ఉంటుంది. ఈ జ్ఞానముతో పాటు ఏదో ఒక విషయంలో విశేషమైన జ్ఞానము కలిగి ప్రసిద్ధి చెందుతారు. అలా పిల్లలైన మీరు సర్వ గుణ సంపన్నంగా అవ్వనే అవ్వాలి. అయినా ఒక విశేషతను విశేష రూపంలో అనుభవంలోకి తెస్తూ, దానిని సేవలో ఉపయోగిస్తూ ముందుకు సాగుతూ వెళ్లండి. ఎలాగైతే సరస్వతిని విద్యా దేవి, లక్ష్మిని ధన దేవి అని పూజిస్తారో అలా మీలో సర్వ గుణాలు, సర్వ శక్తులు ఉన్నా ఒక విశేషతలో విశేషంగా రిసర్చి చేసి స్వయాన్ని ప్రభావశాలిగా చేసుకోండి.
స్లోగన్:- '' వికారాలనే సర్పాలను సహజ యోగమనే శయ్యగా చేసుకుంటే, సదా నిశ్చింతగా ఉంటారు. ''

No comments:

Post a Comment