06-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీ వద్ద '' మన్మనాభవ, మధ్యాజీభవ '' అను తీక్షణమైన, శక్తివంతమైన బాణాలున్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయ పై విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు ''
ప్రశ్న :- పిల్లలకు తండ్రి సహయోగము ఏ ఆధారముతో లభిస్తుంది? పిల్లలు తండ్రికి ధన్యవాదాలు ఏ రూపములో తెలియజేస్తారు?
జవాబు :- పిల్లలు తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి వారికి సహయోగము లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి, మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి, శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే తండ్రి సహాయము చేస్తూ ఉంటారు. బాబా మీరు పరంధామము నుండి వచ్చి మమ్ములను పతితులు నుండి పావనంగా చేస్తున్నారు, మీ ద్వారా మాకు చాలా సుఖము లభిస్తుంది అని పిల్లలు తండ్రికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రీతి కారణంగా ఆనందబాష్పాలు కూడా వచ్చేస్తాయి.
ఓంశాంతి. పిల్లలకు తల్లిదండ్రులు అందరికన్నా ప్రియమైనవారు, తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైనవారు. ఇప్పుడు తండ్రిని త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను ఇలా ఎవ్వరూ అనరు. ఈ మహిమ ఏమో తప్పకుండా ఉంది. కానీ ఈ మహిమ ఎవరిదో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లైతే అక్కడకు వెళ్ళి ఉండేవారు. అంతేకాక చాలామందిని తీసుకెళ్ళేవారు. కానీ డ్రామానే ఇలా ఉంది. ఎప్పుడైతే నాటకము పూర్తి అవుతుందో అప్పుడే వస్తారు. మొదట టాకీ(మాట్లాడే) నాటకాలుండేవి. ఎప్పుడు నాటకము పూర్తి అవుతుందో అప్పుడు పాత్రధారులందరూ వేదిక పై నిల్చుకునేవారు. ఇది కూడా అనంతమైన పెద్ద నాటకము. ఇది కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి. సత్యయగము, త్రేతా, ద్వాపర, కలియుగము. ఇది పూర్తి సృష్టి చక్రము. మూలవతనము, సూక్ష్మ వతనాలలో చక్రము తిరగదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది.
ఏక్ ఓంకార్ సత్ నామ్............. అని మహిమ కూడా చేస్తారు, ఇది ఎవరి మహిమ? భలే గురు గ్రంధములో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురునానక్ వాచ,............... ఏక్ ఓంకార్ ఈ మహిమ ఆ ఒక్క నిరాకార పరమాత్మునిదే. కానీ వీరు పరమాత్ముని మహిమను మరచి గురునానక్‌ను మహిమ చేయనారంభించారు. సద్గురువు కూడా గురునానకే అని భావిస్తారు. వాస్తవానికి పూర్తి సృష్టిలో ఏ ఏ మహిమలున్నాయో అవన్నీ ఒక్కరివే. వేరెవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి బ్రహ్మలో ఒకవేళ శివబాబా ప్రవేశము చేయనట్లయితే ఇతను గవ్వ సమానంగానే ఉండేవాడు. ఇప్పుడు పరమపిత పరమాత్ముని ద్వారా గవ్వ సమానమైన మీరు వజ్ర సమానంగా తయారవుతున్నారు. ఇప్పుడిది పతిత ప్రపంచము, బ్రహ్మ రాత్రి. పతిత ప్రపంచములో తండ్రి వచ్చినప్పుడు ఎవరైతే వారిని గుర్తిస్తారో, వారు తండ్రికి బలిహారి అవుతారు. ఈ రోజుల్లోని పిల్లలు కూడా అల్లరివారిగా ఉన్నారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానమైపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు. పవిత్రంగా ఉండేవారు. భారతదేశానికి సహయోగము చేసేవారు. భారతదేశములో ఒకవేళ పవిత్రత లేనట్లైయితే కామచితి పై భస్మమై ఉండేది. సత్యయుగములో కామ ఖడ్గముండదు. ఈ కలియుగములో అందరూ కామచితి అను ముళ్ల పై కూర్చొని ఉన్నారు. సత్యయుగములో ఇలా అనరు. అక్కడ ఈ విషముండదు. అమృతాన్ని వదలి విషాన్ని ఎందుకు తినాలి అని అంటారు కదా. వికారులనే పతితులని అంటారు. వర్తమాన సమయములో మనుష్యులు 10-12 మందిని కంటూ ఉంటారు. ఏ నియమమూ లేదు. సత్యయుగములో బిడ్డ జన్మించేందుకు ముందే సాక్షాత్కారమవుతుంది. శరీరము వదిలేందుకు ముందు కూడా నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా జన్మిస్తానని సాక్షాత్కారమవుతుంది. ఒకే పుత్రుడు జన్మిస్తాడు. ఎక్కువ మంది జన్మించరు. నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి తప్పకుండా జరగాలి కాని అక్కడ వికారాలు ఉండవు. అక్కడ సంతానోత్పత్తి ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నిస్తారు. అక్కడ యోగబలము ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి, యోగబలము ద్వారానే మేము సృష్టి పై రాజ్యాన్ని పొందుకుంటామని చెప్పండి. బాహుబలము ద్వారా విశ్వరాజ్యము లభించదు.
బాబా అర్థం చేయిస్తున్నారు - ఒకవేళ క్రైస్తవులు పరస్పరములో కలిసిపోతే పూర్తి సృష్టి రాజ్యాన్ని తీసుకోగలరు. కాని పరస్పరము కలవరు. చట్టము ఒప్పుకోదు. కనుక రెండు పిల్లులు పరస్పరము జగడము చేసుకున్నప్పుడు పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది. కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు. ఇది సృష్టి రూపి వెన్న.
అనంతమైన తండ్రి చెప్తున్నారు - ఈ యోగబల యుద్ధమే శాస్త్ర్రాలలో మహిమ చేయబడింది. బాహుబల యుద్ధము కాదు. వారు శాస్త్ర్రాలలో హింసాత్మక యుద్ధమును చూపించారు. దానితో మనకు ఏ సంబంధమూ లేదు. కౌరవ పాండవ యుద్ధము లేనే లేదు. ఈ అనేక ధర్మాలు 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఉండేవి. వారు పరస్పరము కొట్లాడుకొని వినాశనమయ్యారు. పాండవులు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది యోగబలము. దీని ద్వారా విశ్వ రాజ్యము లభిస్తుంది. మాయాజీత్‌లు - జగత్‌జీతులుగా అవుతారు. సత్యయుగములో మాయా రావణుడు ఉండడు. అక్కడ రావణుని బొమ్మను తయారు చేసి తగులబెట్టరు. చిత్ర్రాలు ఎలా ఎలా తయారు చేస్తారు. అలాంటి రాక్షసులు లేక అసురులు ఎవరూ ఉండరు. 5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషునివి అని కూడా తెలియదు. వాటిని కలిపి 10 తలల రావణుని తయారు చేస్తారు. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. మనుష్యులు ఈ సాధారణమైన విషయాన్ని కూడా అర్థము చేసుకోరు. పెద్ద రావణుని బొమ్మను చేసి తగులబెట్త్తారు. అతిప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రికి పిల్లలు సదా నంబరువారుగా ప్రీతి పాత్రులు. కొందరు అతిప్రియమైన వారు కూడా ఉన్నారు, కొందరు తక్కువ ప్రియమైనవారు కూడా ఉన్నారు. ఎంత అపురూపమైన పిల్లలుగా ఉంటారో అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరు సర్వీసులో తత్పరులై ఉంటారో, దయా హృదయులుగా ఉంటారో వారు ప్రియంగా అనిపిస్తారు. భగవంతుడా నా పై దయ చూపండి, నా పై కృప చూపండి అని భక్తి మార్గములో దయను కోరుకుంటారు కదా. కానీ డ్రామాను గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే చాలా తమోప్రధానంగా అవుతారో అప్పుడు బాబా వచ్చే కార్యక్రమము ఉంటుంది. అలాగని ఈశ్వరుడు ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా రాగలడని కాదు. ఒకవేళ అలాంటి శక్తి ఉంటే మరి ఇన్ని నిందలు ఎందుకు లభించాయి? వనవాసము ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. కృష్ణునికి తిట్లు లభించవు. భగవంతుడు ఇది చేయలేరా! అని అంటారు. కాని వినాశనము తప్పకుండా జరగాల్సిందే. మరి రక్షించే మాటే లేదు. అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. స్థాపన, వినాశనము చేయిస్తారు కనుక తప్పకుండా భగవంతుడే అయి ఉంటారు కదా. పరమపిత పరమాత్మ స్థాపన చేస్తారు, దేనిని? గీతా భగవానుడు ఎవరు? అను ముఖ్యమైన విషయాన్ని మీరు ప్రశ్నించండి. పూర్తి ప్రపంచము ఈ విషయములో తికమకపడి ఉంది. వారేమో మనిషి పేరు వేసేశారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మమును భగవంతుడు తప్ప ఎవ్వరూ స్థాపన చేయలేరు. మరి మీరు కృష్ణుని గీతా భగవంతుడని ఎలా చెప్పగలరు! వినాశనము, స్థాపన చేయించడం ఎవరి కర్తవ్యము? గీతా భగవంతుని మరచి గీతనే ఖండన చేశారు. ఇది అతి పెద్ద తప్పు. జగన్నాథపురిలో దేవతల చాలా అసభ్య చిత్రాలను తయారు చేశారు. అసభ్య చిత్రాలను ఉంచడాన్ని ప్రభుత్వము కూడా నిరాకరించింది. కనుక దీని పై అర్థము చేయించాలి. ఈ మందిరాల విషయములో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు.
పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞా పత్రాలను వ్రాశారో చూడండి. రక్తముతో కూడా వ్రాస్తారు. కృష్ణునికి రక్తము వచ్చినప్పుడు ద్రౌపది తన చీరను చింపి కట్టు కట్టిందని ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమయే కదా. మీకు శివబాబా పై ప్రేమ ఉంది. ఇతనికి(బ్రహ్మకు) రక్తము రావచ్చు, ఇతనికి దు:ఖము కలుగవచ్చు, కాని శివబాబాకు ఎప్పుడూ దు:ఖము కలగదు ఎందుకంటే వారికి తన శరీరమే లేదు. కృష్ణునికి ఒకవేళ ఏమైనా అయితే దు:ఖము కలుగుతుంది కదా. మరి అతనిని పరమాత్మ అని ఎలా అనగలరు. బాబా చెప్తారు - నేను సుఖ-దు:ఖాలకు అతీతమైనవాడిని. అవును, నేను వచ్చి పిల్లలను సదా సుఖీలుగా చేస్తాను. సదా శివ అని మహిమ చేయబడింది. సదా శివ, సదా సుఖాన్నిచ్చేవారు చెప్తున్నారు - నా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా! ఎవరైతే స్వంత పిల్లలుగా ఉంటారో, జ్ఞాన ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా, జ్ఞానులుగా ఉంటారో వారే నాకు ప్రియమైనవారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులకళంకితులుగా కూడా ఉంటారు. చాలా మురికిగా తయారవుతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఆశ్చర్యకరంగా పిల్లలుగా అవుతారు, వింటారు, వర్ణిస్తారు, మళ్లీ వదిలి వెళ్ళిపోతారు..... అందుకే నిశ్చయపత్రము వ్రాయించబడ్తుంది. అప్పుడు దానిని వారికి ఇవ్వడం జరుగుతుంది. రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు. రక్తముతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజులలో ప్రమాణము కూడా చేయిస్తారు కానీ అది అసత్య ప్రమాణము. ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని భావించడం అంటే ఇతడు కూడా ఈశ్వరుడు, నేను కూడా ఈశ్వరుడనే, ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాస్తవానికి హాజరుగా ఎదురుగా తెలుసుకున్నారని తండ్రి చెప్తున్నారు. బాబా ఈ కన్నుల రూపి కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరము అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారులు. ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా. నేను ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. ఎదురుగా హాజరై ఉన్నారు. ఆత్మ తప్పకుండా అవయవాల ద్వారానే పని చేయిస్తుంది కదా. నేను వచ్చాను కనుక తప్పకుండా వినిపిస్తాను కదా. అవయవాలను ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా బాడుగ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
పిల్లలైన మీరు ఈ సమయములో నరకాన్ని స్వర్గముగా చేసేవారు. మీరు ప్రకాశాన్నిచ్చేవారు, మేల్కొలిపేవారు. మిగిలినవారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. మాతలైన మీరు మేల్కొల్పుతారు, స్వర్గానికి అధికారులుగా చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలదే. అందుకే వందేమాతరమ్ అని అంటారు. భీష్మపితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణము వేశారు. మన్మనాభవ, మధ్యాజీభవ అనే బాణాలు ఎంత సహజమైనవి. ఈ బాణాల ద్వారానే మీరు మాయ పై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క బాబా స్మృతిలో, ఒక్కరి శ్రీమతానుసారమే నడవాలి. తండ్రి మీకు ఎంతటి శ్రేష్ఠ కర్మ నేర్పుతున్నారంటే 21 జన్మలకు మీ కర్మలు పాడయ్యే అవకాశమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేకసార్లు మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. రాజ్యాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. బ్రాహ్మణులైన మీరే హీరో-హీరోయిన్‌ల పాత్రను అభినయిస్తారు. డ్రామాలో మీది సర్వ శ్రేష్ఠమైన పాత్ర. కనుక అలా శ్రేష్ఠంగా తయారు చేసే తండ్రి పై చాలా ప్రేమ ఉండాలి. బాబా మీరు అద్భుతము చేస్తారు. మేమే నారాయణునిగా ఉండేవారమని మా మనస్సులో కానీ, చిత్తములో కాని మేము అనుకోలేదు. బాబా చెప్తున్నారు - మీరే నారాయణ లేక లక్ష్మి, దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అసురులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పురుషార్థము చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో, సాక్షాత్కారమవుతూ ఉంటుంది.
రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పించారు. సత్యమైన సహజ రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్పించగలరు. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడమే మీ కర్తవ్యము. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కల్పక్రితము వలె కోటిలో కొందరు మాత్రమే అర్థము చేసుకుంటారు. పూర్తి ప్రపంచములో మహామూర్ఖులను చూడాలన్నా ఇక్కడే చూడండి అని బాబా అర్థం చేయించారు. ఎవరి ద్వారా 21 జన్మలకు ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని కూడా వదిలేస్తారు. అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని సంతానంగా అయ్యారు. తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా అవుతారు. ఇప్పుడు ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామము నుండి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు కనుక వారికి ఎంతగా ధన్యవాదాలు తెలపాలి! భక్తిమార్గములో కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. దు:ఖములో ధన్యవాదాలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖము లభిస్తుంది. కనుక బాబా పై చాలా ప్రేమ ఉండాలి. మనము తండ్రితో ప్రేమగా మాట్లాడ్తే ఎందుకు వినరు? సంబంధము ఉంది కదా. రాత్రి పూట లేచి బాబాతో మాట్లాడాలి. ఈ బాబా తన అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేను చాలా స్మృతి చేస్తాను, తండ్రి స్మృతిలో ఆనందబాష్పాలు కూడా వస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారు చేశారు - 'తతత్వమ్'. మీరు కూడా అలా అవుతారు. యోగములో ఉండువారికి బాబా సహయోగము కూడా చేస్తారు. కళ్ళు తమకు తామే తెరచుకుంటాయి. మంచము కదులుతుంది. బాబా చాలా మందిని మేల్కొల్పుతారు. అనంతమైన తండ్రి ఎంత దయ చూపిస్తారు! మీరిక్కడకు ఎందుకు వచ్చారు? ''బాబా, భవిష్యత్తులో శ్రీ నారాయణుని వరించే శిక్షణ పొందేందుకు వచ్చాము లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్ష పాస్ అవుతున్నాము'' అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన పాఠశాల, ఎంత అద్భుతమైన విషయాలు! ఇది అతి పెద్ద విశ్వవిద్యాలయము. కాని ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని పేరు పెట్టనివ్వరు. ఏదో ఒక రోజు తప్పకుండా అంగీకరిస్తారు. వస్తూ ఉంటారు ఎంత పెద్ద విశ్వవిద్యాలయమని అంటారు. బాబా తమ నయనాల పై కూర్చోబెట్టుకొని మిమ్ములను చదివిస్తున్నారు. మిమ్ములను స్వర్గానికి చేరుస్తానని చెప్తున్నారు. మరి అలాంటి తండ్రితో ఎన్ని మాటలు మాట్లాడాలి. మళ్లీ బాబా చాలా సహాయము చేస్తారు. ఎవరి గొంతులు మూసుకుపోయాయో, వాటి తాళాలు తెరుస్తారు. రాత్రి స్మృతి చేయడం వలన చాలా మజా కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు - అమృతవేళలో నేనెలా మాట్లాడ్తానో నా అనుభవము తెలిపాను.
బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - అప్రమత్తంగా ఉండాలి. కులాన్ని కళంకితము చేయరాదు. 5 వికారాలను దానమిచ్చి మళ్లీ వాపస్ తీసుకోరాదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాబాకు ప్రియమైనవారిగా అయ్యేందుకు దయాహృదయులుగా అయి సర్వీసులో తత్పరులై ఉండాలి. స్వంత పిల్లలుగా, ఆజ్ఞాకారులుగా అయి సత్యమైన యోగులుగా, జ్ఞానులుగా అవ్వాలి.
2. అమృతవేళలో లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి. తండ్రికి ధన్యవాదాలు తెలపాలి. తండ్రి సహయోగాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.
వరదానము :- '' పాత దేహము మరియు పాత ప్రపంచంలోని సర్వ ఆకర్షణల నుండి సదా సహజంగా దూరంగా ఉండే రాజఋషి భవ ''
రాజఋషి అనగా ఒకవైపు సర్వ ప్రాప్తుల అధికార నశా, రెండవ వైపు అనంత వైరాగ్యపు అలౌకిక నషా గలవారు. వర్తమాన సమయంలో ఈ రెండిటి అభ్యాసాన్ని పెంచుకుంటూ నడవండి. వైరాగ్యమంటే అన్నీ వదిలేయడం, అన్నిటికి దూరంగా ఉండడం కాదు. అన్ని ప్రాప్తులున్నా హద్దు ఆకర్షణలు మనసు బుద్ధిని ఆకర్షించరాదు. సంకల్పంలో కూడా అధీనత ఉండరాదు. దీనినే రాజఋషి అనగా బేహద్ వైరాగ్యము అని అంటారు. ఈ పాత దేహము, పాత దేహ ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల భావము, ఈ ఆకర్షణలన్నిటి నుండి సదా సహజంగా దూరంగా ఉండేవారు.
స్లోగన్ :- '' సైన్సు సాధనాలను ఉపయోగించండి కాని మీ జీవితానికి ఆధారంగా చేసుకోకండి ''
No comments:
Post a Comment