10-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - సర్వ శక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం వలన శక్తి లభిస్తుంది, స్మృతి ద్వారానే ఆత్మ రూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సతోప్రధానంగా అవుతుంది ''
ప్రశ్న :- సంగమ యుగములో పిల్లలైన మీరు ఏ పురుషార్థము చేయడం వలన దాని ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది ?
జవాబు :- సంగమ యుగములో మనము శీతలంగా అయ్యే పురుషార్థము చేస్తాము. శీతలము అనగా పవిత్రంగా అవ్వడం వలన మనము దేవతలుగా అవుతాము. ఎంతవరకు శీతలంగా అవ్వమో అంతవరకు దేవతలుగా కూడా అవ్వలేము. సంగమ యుగములో శీతలా దేవీలై అందరి పై చల్లని జ్ఞాన ఝల్లులు కురిపించి అందరినీ శీతలముగా చేయాలి. అందరి వేడిని ఆర్పి చల్లార్చాలి. స్వయం కూడా శీతలంగా అవ్వాలి, ఇతరులను కూడా శీతలంగా చేయాలి.
ఓంశాంతి. మొట్టమొదట పిల్లలైన మనమంతా పరస్పరములో సోదరులమని శివబాబా మన అందరి తండ్రి అనే ఒక్క మాటను అర్థము చేసుకోవాలి. వారిని సర్వ శక్తివంతుడని అంటారు. మీలో కూడా సర్వశక్తులు ఉండేవి. మీరు పూర్తి విశ్వం పై రాజ్యము చేసేవారు. భారతదేశములో ఈ దేవీ దేవతల రాజ్యముండేది. మీరే పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు. మీ కులము లేక వంశములో అందరూ నిర్వికారులుగా ఉండేవారు. ఎవరు నిర్వికారులుగా ఉండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్లీ మీరే నిర్వికారులుగా అవుతున్నారు. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకుంటున్నారు. ఆత్మనే 84 జన్మల పాత్ర అభినయిస్తుందని తండ్రి అర్థం చేయించారు. ఆత్మలో సతోప్రధాన శక్తి ఉండేది, అది రోజురోజుకు తగ్గిపోతూ వస్తుంది. సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యే తీరాలి. ఉదాహరణానికి బ్యాటరీ శక్తి తగ్గుతూ పోతే మోటరు ఆగిపోతుంది. బ్యాటరీ డిస్‌ఛార్జ్ అయిపోతుంది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిస్‌చార్జ్ అవ్వదు. ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఎవరైనా మరణించినట్లయితే దీపాన్ని వెలిగించి దీపము ఆరిపోరాదని అందులో నెయ్యి వేస్తూనే ఉంటారు. ఆత్మలో సంపూర్ణ శక్తి ఉండేదని, అది ఇప్పుడు లేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు మళ్లీ సర్వశక్తివంతులైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించి శక్తిని నింపుకుంటారు. ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. శక్తి పూర్తిగా సమాప్తమైతే శరీరమే ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది. సత్యయుగములో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యి ఉంటుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు అనగా బ్యాటరీ తగ్గిపోతూ వస్తుంది. కలియుగాంత సమయానికి ఆత్మలో శక్తి కొద్దిగా మాత్రమే మిగిలి ఉంటుంది. శక్తి దివాలా అయినట్లవుతుంది. తండ్రిని స్మృతి చేయడం వలన ఆత్మ మళ్లీ నిండుగా అవుతుంది. కనుక ఇప్పుడు ఒక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు సర్వ శ్రేష్ఠమైనవారు. మిగిలిన వారంతా వారి రచన. రచన నుండి రచనకు హద్దులోని ఆస్తి లభిస్తుంది. సృష్టికర్త బేహద్ తండ్రి ఒక్కరే. మిగిలినవారంతా హద్దులోని వారు. బేహద్ తండ్రిని స్మృతి చేయడం వలన అనంతమైన ఆస్తి లభిస్తుంది. బాబా మన కొరకు స్వర్గాన్ని, నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలు మనస్సులో అర్థము చేసుకోవాలి. డ్రామా ప్లాను అనుసారము స్వర్గ స్థాపన జరుగుతోంది. ఇందులో పిల్లలైన మీరే వచ్చి రాజ్యము చేస్తారు. నేను సదా పవిత్రుడను. నేనెప్పుడూ గర్భము నుండి జన్మ తీసుకోను. దేవీదేవతల వలె కూడా జన్మించను. కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు ఇతనికి 60 సంవత్సరాల వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు ఇతని తనువులో ప్రవేశిస్తాను. ఇతనే మళ్లీ నెంబర్‌వన్ తమోప్రధానము నుండి నంబర్‌వన్ సతోప్రధానంగా అవుతారు. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు. తర్వాత బ్రహ్మ-విష్ణు-శంకరులు సూక్ష్మవతన వాసులు. ఈ బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎక్కడ నుండి వచ్చారు? వీరు కేవలం సాక్షాత్కారమౌతారు. సూక్ష్మవతనము మధ్యలో ఉంది కదా. అక్కడ స్థూల శరీరమే ఉండదు. సూక్ష్మ శరీరము కేవలం దివ్యదృష్టి ద్వారా కనిపిస్తుంది. బ్రహ్మ శ్వేతవస్త్రధారి. ఆ విష్ణువు వజ్రవైఢూర్యాలతో అలంకరింపబడినవారు. శంకరుని మెడలో సర్పము మొదలైన వాటిని చూపిస్తారు. ఇలాంటి శంకరులు మొదలైనవారు ఎవ్వరూ ఉండరు. అమరనాథ్‌లో శంకరుడు పార్వతికి అమరకథను వినిపించినట్లు చూపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో మనుష్య సృష్టి లేనే లేదు. మరి కథను అక్కడ ఎలా వినిపిస్తారు? పోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారమవుతుంది. ఎవరైతే పూర్తి పవిత్రంగా ఉంటారో వారికి సాక్షాత్కారమవుతుంది. వీరే మళ్లీ సత్యయుగంలోకి వెళ్ళి స్వర్గాధికారులుగా అవుతారు. వీరు మళ్లీ ఈ రాజ్యభాగ్యాన్ని ఎలా పొందుకున్నారో బుద్ధిలోకి రావాలి. యుద్ధము మొదలైనవి ఏవీ జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది. తండ్రికి శరీరము పై మమకారము ఉండేందుకు వారికి స్వంత శరీరమే లేదు. తండ్రి చెప్తారు - స్వల్ప సమయము కొరకు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. లేకుంటే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి? నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపాన్ని. నా వద్ద మాత్రమే ఈ వృక్ష జ్ఞానము ఉంది. ఈ సృష్టి ఆయువు ఎంత? ఉత్పత్తి, పాలన, వినాశనములు ఎలా జరుగుతాయి? మనుష్యులకు ఏమీ తెలియదు. వారు హద్దులోని చదువును చదువుతారు. తండ్రి బేహద్ చదువు చదివించి పిల్లలను విశ్వాధికారులుగా చేస్తారు.
దేహధారి మనుష్యులను భగవంతుడని ఎప్పుడూ అనరు. వీరికి(బ్రహ్మ, విష్ణు, శంకరులకు) కూడా తమ సూక్ష్మ దేహముంది. కనుక వీరిని కూడా భగవంతుడని అనరు. ఈ శరీరము, ఈ దాదా ఆత్మ యొక్క సింహాసనము. అకాల సింహాసనము కదా. ఇప్పుడిది అకాలమూర్తి అయిన తండ్రి సింహాసనము. అమృత్‌సర్‌లో కూడా అకాల సింహాసనముంది. అక్కడకు వెళ్లిన గొప్ప గొప్పవారు ఆ అకాల సింహాసనము పై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది సర్వాత్మల అకాల సింహాసనము. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలుంటాయి అందుకే ఇది కర్మల ఫలమని చెప్తారు. సర్వాత్మల తండ్రి ఒక్కరే. బాబా ఏ శాస్త్రాలను చదివి అర్థం చేయించడం లేదు. ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైనవాటిలో లేవు. అందుకే వీరు శాస్త్రాలను ఒప్పుకోరు అని జనులు కోపగించుకుంటారు. సాధు సత్పురుషులు మొదలైనవారు గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు. మరి పావనముగా అయ్యారా? వాపస్ అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. తేనెటీగల గుంపు వలె లేక దోమల గుంపు వలె అంతిమములో అందరూ వెళ్తారు. తేనెటీగలలో కూడా రాణి ఉంటుంది, దాని వెనుకే అన్నీ వెళ్తాయి. తండ్రి వెళ్లినప్పుడు కూడా వారి వెనుక ఆత్మలందరూ వెళ్తారు. మూలవతనములో కూడా ఆత్మలంతా గుంపుగా ఉంటాయి. ఇక్కడ మనుష్యులందరి గుంపు ఉంటుంది. కనుక ఈ గుంపు కూడా ఒక రోజు పరుగు తీయాల్సిందే. తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. శివుని ఊరేగింపు మహిమ చేయబడింది. అబ్బాయిలు అనండి లేక అమ్మాయిలు అనండి, తండ్రి వచ్చి పిల్లలందరికీ స్మృతియాత్రను నేర్పిస్తారు. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ వాపస్ ఇంటికి వెళ్లలేదు. ఎప్పుడు పవిత్రమవుతుందో అప్పుడు మొదట శాంతిధామానికి వెళ్తుంది తర్వాత అక్కడ నుండి నెమ్మది నెమ్మదిగా ఆత్మలు వస్తూ ఉంటాయి. వృద్ధి జరుగుతూ ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా. అందరూ ఒకేసారి రారు. వృక్షము నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది కదా. మొట్టమొదట తండ్రి స్థాపన చేసిన ఆదిసనాతన దేవీదేవతా ధర్మముంటుంది. ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఉన్నాడు కదా. ప్రజలలో కూడా సోదరీ-సోదరులుగా అవుతారు. బ్రహ్మకుమార-కుమారీలుగా ఇక్కడ అనేకమంది అవుతారు. నిశ్చయబుద్ధి ఉన్న కారణంగానే అనేకమంది మార్కులు తీసుకుంటారు. మీలో కూడా ఎవరు పక్కాగా ఉంటారో వారు అక్కడ మొదట వస్తారు, కచ్ఛాగా ఉన్నవారు చివరిలోనే వస్తారు. మూలవతనములో ఆత్మలన్నీ ఉంటాయి. తర్వాత క్రిందికి వచ్చినప్పుడు వృద్ధి చెందుతూ పోతుంది. శరీరము లేకుండా ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది? ఇది పాత్రధారుల ప్రపంచము. ఇది 4 యుగాలలో తిరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మనమే దేవతలుగా ఉండేవారము. తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతాము. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగము. బాబా ఎప్పుడు వస్తారో అప్పుడే ఈ యుగము తయారవుతుంది. ఇప్పుడు ఈ బేహద్ జ్ఞానము బేహద్ తండ్రి మాత్రమే ఇస్తారు. శివబాబాకు తన శారీరిక పేరేదీ లేదు. ఈ శరీరము ఈ దాదాది. బాబా కొద్ది సమయానికి అప్పుగా తీసుకున్నారు. బాబా చెప్తారు - మీతో మాట్లాడేందుకు నాకు నోరు కావాలి కదా. నోరు లేకుంటే తండ్రి పిల్లలతో మాట్లాడను కూడా మాట్లాడలేరు. అనంతమైన జ్ఞానము కూడా ఈ నోటి ద్వారానే వినిపిస్తాను. అందుకే దీనిని గోముఖము అని కూడా అంటారు. పర్వతముల పై నుండి నీరు ఎక్కడైనా వెలువడగలదు. ఇక్కడ గోముఖాన్ని తయారు చేశారు. దాని నుండి నీరు వస్తుంది. ఆ నీటిని గంగాజలంగా భావించి తాగుతారు. ఆ నీటికి ఎంత మహత్వాన్నిచ్చారు. ఈ ప్రపంచములో అంతా అసత్యమే ఉంది. సత్యము ఒక్క బాబా మాత్రమే వినిపిస్తారు. ఆ అసత్యపు మనుష్యులు ఈ తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని అసత్యమని అనుకుంటారు. భారతదేశములో సత్యయుగమున్నప్పుడు దీనిని సత్య ఖండమని అనేవారు. మళ్లీ భారతదేశమే పాతదిగా అవుతుంది. అప్పుడు ప్రతి మాట, ప్రతి వస్తువు అసత్యంగా అవుతుంది. ఎంత వ్యత్యాసమైపోయింది! తండ్రి చెప్తారు - నా పిల్లలందరు కామచితి పై కూర్చుని భికారులైపోయారు. తండ్రి పిల్లలకు చెప్తారు - మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా. జ్ఞాపకము వచ్చిందా? పిల్లలకే అర్థం చేయిస్తారు. పూర్తి ప్రపంచానికంతా అర్థం చేయించరు. పిల్లలే బాబాను తెలుసుకుంటారు. ప్రపంచానికి ఈ విషయాలేం తెలుసు!
కామము అన్నింటికంటే పెద్ద ముల్లు. దీని పేరే పతిత ప్రపంచము. సత్యయుగము 100 శాతము పవిత్ర ప్రపంచము. మనుష్యులే పవిత్ర దేవతల ముందుకు వెెళ్లి నమస్కరిస్తారు. చాలా మంది భక్తులు శాఖాహారులుగా ఉంటారు. అయితే వికారాలలోకి వెళ్ళరని కాదు. ఇలా చాలా మంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు. బాల్యము నుండి ఎప్పుడూ ఛీ-ఛీ ఆహారము మొదలైనవి తినరు. సన్యాసులు కూడా నిర్వికారులవ్వండి అని చెప్తారు. ఇంటిని సన్యసిస్తారు. మళ్లీ రెండవ జన్మలో కూడా ఎవరైనా గృహస్థుల వద్ద జన్మ తీసుకొని మరలా ఇంటిని వదలి అడవికి వెళ్లిపోతారు. కానీ పతితుల నుండి పావనంగా అవ్వగలరా? లేదు. పతితపావనులైన తండ్రి శ్రీమతము లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. భక్తి దిగేకళ మార్గము, మరి పావనంగా ఎలా అవ్వగలరు? పావనంగా అయితే ఇంటికి వెళ్తారు, స్వర్గములోకి వస్తారు. సత్యయుగ దేవీదేవతలు ఎప్పుడైనా ఇల్లు-వాకిలి వదిలేస్తారా? వారిది హద్దు సన్యాసము, మీది బేహద్ సన్యాసము. పూర్తి ప్రపంచము, బంధు-మిత్రులు మొదలైనవాటన్నిటి సన్యాసము. మీ కొరకు ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. మీ బుద్ధి స్వర్గము వైపు ఉంది, మనుష్యులు నరకములోనే వ్రేలాడుతున్నారు. పిల్లలైన మీరు బాబా స్మృతిలో వ్రేలాడుతున్నారు.
మిమ్ములను శీతల దేవీలుగా తయారు చేసేందుకు జ్ఞానచితి పై కూర్చోబెట్టడం జరుగుతుంది. శీతలతకు వ్యతిరేక శబ్ధము వేడిమి. మీ పేరే శీతలాదేవీలు. ఒక్కరే ఉండరు కదా. భారతదేశాన్ని శీతలంగా చేసినవారు తప్పకుండా చాలామంది ఉంటారు. ఈ సమయంలో అందరూ కామచితి పై కాలిపోతున్నారు. మీ పేరు ఇక్కడ శీతలాదేవీలు. మీరు శీతలంగా చేసేవారు, చల్లటి జల్లులు కురిపించే దేవీలు. జల్లు కురిపించేందుకు వెళ్తారు కదా? ఈ జ్ఞాన జల్లులు ఆత్మ పై చల్లడం జరుగుతుంది. ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన శీతలంగా అవుతుంది. ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా కామచితి పై కూర్చుని నల్లగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు కలశము లభించింది, కలశము ద్వారా మీరు స్వయం శీతలంగా అయి ఇతరులను కూడా శీతలంగా చేస్తారు. ఇతను కూడా శీతలంగా అయ్యాడు కదా. ఇరువురూ కలిసి ఉన్నారు. ఇంటిని వదిలే విషయమేదీ లేదు. కానీ గోశాల తయారై ఉంటుంది కనుక తప్పకుండా కొందరు ఇంటిని వదిలి ఉంటారు. ఎందుకు? జ్ఞానచితి పై కూర్చుని శీతలంగా అయ్యేందుకు. ఎప్పుడు మీరు ఇక్కడ శీతలంగా అవుతారో అప్పుడే మీరు దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు మీ బుద్ధియోగము పాత ఇంటివైపు వెళ్ళరాదు. బాబా జతలో బుద్ధి యోగముండాలి. ఎందుకంటే మీరంతా తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి. బాబా చెప్తున్నారు - మధురమైన పిల్లలారా, నేను మార్గదర్శకుడనై మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇది శివశక్తి పాండవ సేన. మీరు శివుని నుండి శక్తిని తీసుకునేేవారు, వారు సర్వశక్తివంతులు. పరమాత్మ మరణించిన వారిని బ్రతికించగలరని మనుష్యులు భావిస్తారు. కాని తండ్రి చెప్తున్నారు - ముద్దు పిల్లలారా! - ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి అనాది పాత్ర లభించింది. నేను కూడా సృష్టికర్తను, దర్శకుడను, ముఖ్యపాత్రధారిని. డ్రామాలోని పాత్రను మనము కొద్దిగా కూడా మార్చలేము. ప్రతి ఆకు కూడా పరమాత్ముని ఆజ్ఞానుసారంగా కదుల్తుందని మనుష్యులు అనుకుంటారు కానీ పరమాత్మ స్వయంగా చెప్తున్నారు - నేను కూడా డ్రామాకు అధీనుడను. ఈ బంధములో బంధింపబడి ఉన్నాను. నా ఆజ్ఞతో ఆకులు కదుల్తాయని కాదు. సర్వవ్యాపి జ్ఞానము భారతీయులను పూర్తిగా భికారులుగా చేసేసింది. తండ్రి ఇచ్చిన జ్ఞానముతో భారతదేశము మళ్లీ శిరోమకుటంగా తయారవుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సూర్యవంశములో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయబుద్ధి గలవారై ఫుల్ మార్కులు తీసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. బేహద్ జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి.
2. జ్ఞానచితి పై కూర్చుని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి, జ్ఞాన-యోగాలతో కామాగ్నిని సమాప్తము చేసుకోవాలి, బుద్ధియోగము సదా ఒక్క బాబా వైపే తగుల్కొని ఉండాలి.
వరదానము :- '' చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న అవినాశి భాగ్య సితారాగా (నక్షత్రంగా) అయ్యే సిద్ధి స్వరూప భవ ''
ఈ రోజుల్లో అల్పకాల సిద్ధి చూపించేవారు ఎవరైతే పై నుండి చివర్లో వచ్చిన కారణంగా సతోప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రతా ఫల స్వరూపంగా అల్పకాల చమత్కారాన్ని చూపిస్తారు. కాని ఆ సిద్ధి సదాకాలము ఉండదు. ఎందుకంటే కొంత సమయంలోనే సతో, రజో, తమో మూడు స్టేజీలను దాటుకుంటారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు. మీరు చమత్కారము చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయువారు. ప్రకాశిస్తున్న అవినాశి భాగ్య సితారాలుగా తయారు చేయువారు. అందువలన అందరూ మీ వద్దకే సహాయము తీసుకునేందుకు వస్తారు.
స్లోగన్ :- '' వాయుమండలం బేహద్ వైరాగ్యవృత్తి గలదిగా ఉంటే, సహయోగులు సహజంగా యోగులుగా అవుతారు ''
No comments:
Post a Comment