30-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పూర్తి ఆధారమంతా స్మృతి పైనే ఉంది, స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు, ఈ స్మృతిలోనే మాయతో యుద్ధము నడుస్తుంది ''
ప్రశ్న :- ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము ఎక్కువగా విచార సాగర మథనము చేసేందుకు యోగ్యమైనది?
జవాబు :- ఈ డ్రామాలో ఒక్క పాత్ర రెండు సార్లు అభినయించబడదని మీకు తెలుసు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా, అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది. సత్యయుగము నుండి ఇప్పటివరకు రోజులు ఎలా పరివర్తిన అవుతాయో మీరు ఆలోచిస్తారు. కర్తవ్యాలన్నీ పరివర్తనైపోతాయి. ఆత్మలో 5 వేల సంవత్సరాల కర్మల రికార్డు(పాత్ర) నిండి ఉంది. ఇది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికీ తోచదు.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖమును, పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగమ యుగము కదా. మళ్లీ నూతన ప్రపంచమైన సత్యయుగములో వీరి వంశావళిలో వస్తామని మీరు ఫీల్ చేస్తారు. దానిని సుఖధామమని అంటారు. అక్కడి కొరకే మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. కూర్చుంటూనే ఇటువంటి ఆలోచనలు రావాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు రేపు మేము ఇలా అవుతామని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము విష్ణు రాజ్యములోకి వస్తామని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. వేరేవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండవు. ఇది సాధారణ సత్సంగము కాదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అయినా సత్యమైన తండ్రి అయిన శివబాబా సాంగత్యములో కూర్చుని ఉన్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే ఈ రచన ఆదిమధ్యాంతాలు తెలుసు. వారే ఈ జ్ఞానమును ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినట్లు తెలుపుతారు. మేము ఈ శరీరాన్ని పరివర్తన చేసుకుని దైవీ శరీరాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చామని ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి ఉంటుంది కదా. ఇది మా తమోప్రధానమైన పాత శరీరము, దీనిని పరివర్తన చేసుకొని ఇలాంటి శరీరాన్ని తీసుకోవాలని ఆత్మ చెప్తుంది. ఎంత సహజమైన లక్ష్యము! చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైనవారుగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. మమ్ములను సర్వ శ్రేష్ఠులైన భగవంతుడు చదివిస్తున్నారు. కనుక తప్పకుండా దేవీ దేవతలుగా చేస్తారని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ఉండేదే నూతన ప్రపంచము కొరకు. వేరెవ్వరికీ నూతన ప్రపంచము గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. దేవీదేవతలు కూడా నెంబరువారుగా ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా ఉండలేరు ఎందుకంటే అది రాజధాని కదా. ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆత్మలమైన మనము ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్ల్లైతే పావనంగా, సతోప్రధానంగా అవుతారని బాబా స్వయంగా చెప్తారు. ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది. పిల్లలూ! నన్ను ఎంతసేపు స్మృతి చేస్తారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతి యాత్రలోనే మాయతో యుద్ధము జరుగుతుంది. మీకు యుద్ధము కూడా తెలుసు. ఇది యాత్ర కాదు, యుద్ధము వంటిది. ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానములో మాయ తుఫానులు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు. ''బాబా, మేము మిమ్ములను స్మృతి చేస్తాము కాని మాయ తుఫాను మమ్ములను క్రింద పడేస్తుంది'' అని పిల్లలు చెప్తారు. దేహాభిమానము నంబర్‌వన్ తుఫాను. తర్వాత కామము, క్రొధము, లోభము, మోహముల తుఫాను. బాబా మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాము, ఏ విఘ్నము రాకూడదని అనుకుంటాము, కాని తుఫాను వచ్చేస్తుంది అని పిల్లలు చెప్తారు. నేడు క్రోధము, మరొకసారి లోభముల తుఫాను వచ్చిందని చెప్తారు. బాబా ఈ రోజు మా స్థితి చాలా బాగుంది, పూర్తి రోజంతా ఏ తుఫానూ రాలేదు,.......... చాలా సంతోషంగా ఉన్నాను. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేశాను. స్నేహముతో ఆనందబాష్పాలు కూడా వచ్చాయి. తండ్రి స్మృతి ద్వారానే చాలా మధురంగా అవుతారు.
మనము మాయ చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మనుష్యులైతే లక్షల సంవత్సరాలని చెప్తారు లేక పరంపర అని చెప్తారు. మేము తిరిగి ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. విచిత్రమైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రము అని నిరాకారునికే చెప్పబడుతుంది. నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? నేను ఎలా ఈ శరీరములో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను. అయినా ఈ ఒక్క తనువులోనే వస్తారా! అని మనుష్యులు తికమకపడ్తారు. కాని డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది. కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ మాటలను మీరే అర్థము చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మనే చదువుతుంది, ఆత్మనే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది. ఆత్మ అవినాశి, కేవలం శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను, 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానము ఎవరు తీసుకుంటారు? ఆత్మలమైన మనము. ఆత్మలైన మీరే జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మూలవతనానికి, సూక్ష్మవతనానికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుష్యులకు తెలియదు. మనుష్యులు స్వయాన్ని శరీరమని భావించి ఉల్టాగా వ్రేలాడుతున్నారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపమని గాయనముంది. పరమాత్మకు అందరికంటే ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికే ఎంత మహిమ ఉంది! వారే దు:ఖహర్త - సుఖకర్త. దోమలు మొదలైన వాటిని దు:ఖహర్త - సుఖకర్త జ్ఞానసాగరులు అని మహిమ చేయరు. ఇది తండ్రి మహిమ. పిల్లలైన మీరు కూడా మాస్టర్ దు:ఖహర్త - సుఖకర్తలు. పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానము ఉండేది కాదు. పసివారి(బేబి) బుద్ధి వలె ఉండేది. పసిపిల్లలలో జ్ఞానము ఉండదు, ఎలాంటి అవగుణాలు కూడా ఉండవు, కనుకనే వారిని మహాత్ములని అంటారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఎంత పసిపిల్లలుగా ఉంటారో అంత నంబరువన్ పుష్పాలు. పూర్తి కర్మాతీత స్థితి లాంటిది. వారికి కర్మ-అకర్మ- వికర్మల గురించి ఏమీ తెలియదు కనుక వారు పుష్పాలు. ఎలాగైతే తండ్రి అందరినీ ఆకర్షిస్తారో అలాగే వారు కూడా అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే అందరినీ ఆకర్షించి సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు కాని కొందరు ముళ్ళుగానే మిగిలిపోతారు. పంచ వికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. మొదటి నంబరు ముల్లు దేహాభిమానము. దీని ద్వారా ఇతర ముళ్ళు జన్మిస్తాయి. ముళ్ళ అడవి చాలా దు:ఖాన్నిస్తుంది. రకరకాలైన ముళ్లు అడవిలో ఉంటాయి కదా. కనుక దీనిని దు:ఖధామమని అంటారు. కొత్త ప్రపంచములో ముళ్ళు ఉండవు. అందువలన దానిని సుఖధామమని అంటారు. శివబాబా పుష్పాల తోటను తయారు చేస్తారు, రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. కనుక రావణుని ముళ్ళ పొదలతో కాలుస్తారు, తండ్రి పై పుష్పాలను సమర్పిస్తారు. ఈ విషయాలు తండ్రికి తెలుసు, పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు.
డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు అభినయింపబడదని పిల్లలైన మీకు తెలుసు. పూర్తి విశ్వములో ఏ పాత్ర అభినయించబడ్తుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మీరు ఆలోచించండి. పూర్తి పాత్రనే పరివర్తనైపోతుంది. 5 వేల సంవత్సరాల కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ప్రతి ఆత్మలో తమ-తమ పాత్ర నిండి ఉంటుంది. ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధికీ తోచదు. ఈ డ్రామా యొక్క భూత, భవిష్య, వర్తమానాల గురించి మీకు తెలుసు. ఇది పాఠశాల కదా. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తున్నారు. తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని, ఈ చదువు ద్వారానే మనము విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నారా? భక్తిమార్గములోని పుస్తకాలే వేరు. దానిని చదువు అని ఎప్పుడూ అనరు. జ్ఞానము లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది? తండ్రి జ్ఞానము లేకుండా ఎలా వచ్చి సద్గతినివ్వగలరు? సద్గతిలో మీరు ఉన్నప్పుడు భక్తి చేస్తారా? లేదు, అక్కడ అపారమైన సుఖము ఉంటుంది, మరి భక్తి దేనికొరకు చేయాలి? ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది. పూర్తి జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ ఉండదు. ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మము వారు అని అంటారు. ఆత్మ ధర్మమేమిటి? ఆత్మ బిందువు వలె ఉంటుంది. అది శాంతి స్వరూపము, శాంతిధామములో ఉంటుంది.
పిల్లలందరికీ తండ్రి పైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారు. వారు మళ్లీ తమ వాస్తవిక ధర్మములోకి వచ్చేస్తారు. ఎవరెవరు దేవీదేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో, ఆ ఆకులన్నీ మళ్లీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి. మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి. ఈ విషయాలలోనే అందరూ తికమకపడి ఉన్నారు. ఇప్పుడు మనలను చదివిస్తున్నవారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. కృష్ణుడు దేహధారి, బ్రహ్మాబాబాను కూడా దాదా అని అంటారు. మీరంతా పరస్పరము సోదరులు కదా. మిగిలింది పదవుల విషయము. సోదరుల శరీరము ఒక రకంగా, సోదరి శరీరము మరొక రకంగా ఉంటుంది. ఆత్మ మాత్రము ఒక చిన్న నక్షత్రము. పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రములోనే ఉంది. ఈ నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు. ఈ నక్షత్రము పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి. మీ నక్షత్రాల ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. శరీరములు చిన్నవిగా, పెద్దవిగా ఉంటాయి. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకు శరీరములో ఉంటుందో అప్పటివరకే చేయగలదు. ఇంటిలో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? లేదు. అక్కడ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురూ ఎప్పుడు శరీరములో ఉంటారో అప్పుడే ఆత్మ-పరమాత్మల మేళా అని చెప్పబడ్తుంది. గాయనము కూడా ఉంది - ''ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము దూరంగా ఉన్నారు,..........'' ఎంత కాలము దూరంగా ఉన్నారు? ఎంత సమయము దూరంగా ఉన్నారు? జ్ఞాపకము వస్తోందా? ఒక్కొక్క క్షణము గడుస్తూ 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. తిరిగి ఒకటవ నెంబరు నుండి ప్రారంభము చేయాలి, ఖచ్ఛితమైన లెక్క ఉంది. ఇప్పుడు మిమ్ములను ఇతడు ఎప్పుడు జన్మ తీసుకున్నారు? అని ప్రశ్నిస్తే ఖచ్ఛితంగా చెప్పగలరు. శ్రీ కృష్ణుడే మొదటి నంబరులో జన్మ తీసుకుంటాడు. శివునికి సంబంధించిన తిథి, తారీఖులు(నిమిషములు, క్షణాలు) తెలుసుకోలేరు. కృష్ణుని తిథి, తారీఖులు, నిమిషాలు, క్షణాలు తీయవచ్చు. మనుష్యుల గడియారాలలో తేడా రావచ్చు. శివబాబా అవతరణలో కొద్దిగా కూడా వ్యత్యాసము రాదు. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. సాక్షాత్కారమైనప్పుడు వచ్చారని కూడా కాదు. అందాజుగా చెప్పవచ్చు. నిమిషాల - సెకండ్ల లెక్క చెప్పలేము. వారిది అలౌకిక అవతరణ. వారు బేహద్ రాత్రి సమయములోనే వస్తారు. ఇతరుల అవతరణ మొదలైన వాటిని గురించి తెలుస్తుంది. ఆత్మ శరీరములో ప్రవేశిస్తుంది. చిన్న శరీరాన్ని ధరిస్తుంది. తర్వాత శరీరము నిదానంగా పెద్దదవుతూ పోతుంది. శరీరముతో పాటు ఆత్మ వెలుపలికి వస్తుంది. ఈ విషయాలన్నీ విచార సాగర మథనము చేసి తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. ఎంతమంది మనుష్యులున్నారు, ఒకరిదున్నట్లు మరొకరిది ఉండదు. ఎంత పెద్ద నాటక రంగము! పెద్ద హాలులో అనంతమైన నాటము నడుస్తూ ఉన్నట్లుంది.
పిల్లలైన మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. తండ్రి స్థాపించే నూతన సృష్టిలో శ్రేష్ఠ పదవిని తీసుకునేందుకు వస్తున్నారు. మిగిలిన ఈ పాత ప్రపంచము వినాశమవుతుంది. బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. తర్వాత బాబా పాలన కూడా చేయాలి. తప్పకుండా ఈ శరీరాన్ని వదిలి సత్యయుగములో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు. దానికి ముందే ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి. విశ్వానికి నిప్పు అంటుకుంటుంది. చివరికి భారతదేశము మాత్రమే మిగిలి, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశములో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది. వినాశనము తర్వాత శిక్షలు తినరాదని మీరు కష్టపడ్తున్నారు. వికర్మలు వినాశనమవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు, పదవి కూడా లభించదు. మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివబాబా వద్దకు వెళ్తున్నామని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడు కాదు, తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రి పై ప్రేమ కూడా ఉంటుంది. బాబా చెప్తున్నారు - పిల్లలారా, మీరు ఎవ్వరినీ ప్రేమించకండి, ఇతర సాంగత్యాల పై ప్రేమ వదిలి ఒక్కరితోనే జోడించండి. ప్రేయసి - ప్రియులుంటారు కదా. ఇది కూడా అలాగే. 108 మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు, వారిలో కూడా 8 మంది సత్య-సత్యంగా అవుతారు. 8 మణుల మాల కూడా ఉంటుంది కదా. 9 రత్నాల గాయనము జరుగుతుంది. 8 మణులు, 9వ వారు బాబా. అష్టదేవతలు ముఖ్యమైనవారు, త్రేతా యుగము చివరివరకు 16,108 రాజకుమారి-రాజకుమారుల పరివారము తయారవుతుంది. బాబా అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. మేము సృష్టికి యజమానులుగా అవుతున్నామని మీకు నషా ఉంది. బాబాతో ఇలాంటి వ్యాపారము చేయాలి. ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. ఇటువంటి వ్యాపారస్థులు ఎక్కడున్నారు! అలాగని అందరూ వ్యాపారులు కారు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని ఉమంగ- ఉత్సాహం ఉండాలి. బాబా పైన ఉన్నవారు. కాని ఈ విషయం ప్రపంచము వారికి తెలియదు. వారు చివర్లో వస్తారని చెప్తారు. ఇప్పుడిదే కలియుగ అంతిమ సమయము. అదే గీత, మహాభారతము యొక్క సమయము. అదే యాదవులు మిస్సైల్స్ (ముసలము)ను తయారు చేస్తున్నారు. అదే కౌరవ రాజ్యము అదే పాండవులైన మీరు ఉన్నారు.
పిల్లలైన మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చునే మీ సంపాదన చేసుకుంటున్నారు. భగవంతుడు ఇంట్లోనే లభించారు. కనుక మీ సంపాదన చేసుకోండి అని బాబా చెప్తారు. ఈ వజ్ర తుల్యమైన జన్మ అత్యంత అమూల్యమైనదని గాయనము చేయబడింది. ఇప్పుడు గవ్వల కొరకు ఇలాంటి జీవితాన్ని కోల్పోరాదు. ఇప్పుడు మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని రామరాజ్యంగా చేస్తున్నారు. మీకు శివుని నుండి శక్తి లభిస్తున్నది. వర్తమాన సమయంలో చాలామందికి అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. బాబా బుద్ధికి వేసిన తాళాన్ని తెరుస్తారు. మాయ బుద్ధికి తాళాన్ని వేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశము లభించింది. అబలలకు శక్తినిచ్చేవారు ఆ బాబా. ఇదే జ్ఞానామృతము. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతమని అనరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముల్లును భస్మము చేయాలి.
2. ఈ వజ్ర తుల్యమైన జన్మలో అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు. ఒక్క బాబా పై సత్యమైన ప్రీతినుంచి ఒక్కరి సాంగత్యములోనే ఉండాలి.
వరదానము :- '' పాత స్వభావ - సంస్కారాల బరువును సమాప్తము చేసి డబల్‌లైట్‌గా ఉండే ఫరిస్తా భవ ''
తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మొత్తం బరువంతా తండ్రికి ఇచ్చేయండి. పాత స్వభావ - సంస్కారాల బరువు కొద్దిగా మిగిలి ఉన్నా అది పై నుండి క్రిందకు తీసుకొస్తుంది. ఎగిరేకళను అనుభవం చేయనివ్వదు. అందువలన బాప్‌దాదా మీ బరువంతా నాకిచ్చేయండని అంటారు. అది రావణుని ఆస్తి మీ వద్ద ఉంచుకుంటే దు:ఖమే పొందుకుంటారు. ఫరిస్తా అనగా కొంచెం కూడా రావణుని ఆస్తి ఉండరాదు. పాత ఖాతాలన్నీ భస్మము చేయండి. అప్పుడు డబల్‌లైట్ ఫరిస్తాలని అంటారు.
స్లోగన్ :- '' నిర్భయంగా, హర్షితముఖులుగా ఉండి బేహద్ ఆటను చూస్తే ఆందోళన చెందరు ''
No comments:
Post a Comment