12-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతిలో ఉండే అభ్యాసము చేస్తే సదా హర్షితముఖులుగా, వికసించి ఉంటారు. తండ్రి సహయోగము లభిస్తూ ఉంటుంది, ఎప్పుడూ వాడిపోరు ''
ప్రశ్న :- పిల్లలైన మీరు ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నషాలో గడపాలి ?
జవాబు :- ఈ చదువు ద్వారా మేము రాకుమారి - రాకుమారులుగా అవుతామనే నషా సదా ఉండాలి. ఈ జీవితాన్ని నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ జ్ఞాన నృత్యము చేస్తూ గడపాలి. సదా వారసులై పుష్పాలయ్యే పురుషార్థము చేస్తూ ఉండండి. ఇది రాకుమారి, రాకుమారులుగా తయారయ్యే కళాశాల(కాలేజి). ఇక్కడ చదవాలి, చదివించాలి కూడా. ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, అప్పుడే రాజులుగా అవ్వగలరు. తండ్రి అయితే చదివే ఉన్నారు, వారు చదవవలసిన అవసరము లేదు.
పాట :- బాల్యపు రోజులను మర్చిపోరాదు,............ (బచ్‌పన ్ కే దిన్ భులా న దేనా,...........)
ఓంశాంతి. ఈ పాట ముఖ్యంగా పిల్లల కొరకు. సినిమా పాట అయినా కొన్ని పాటలు మీ కొరకే ఉన్నాయి. ఎవరైతే సొంత పిల్లలుగా ఉంటారో, వారు పాట వింటున్న సమయములో దాని అర్థాన్ని మనస్సులో తీసుకోవలసి ఉంటుంది. '' నా ముద్దు పిల్లలారా! '' అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు పిల్లలుగా అయ్యారు. ఎప్పుడు పిల్లలుగా అవుతారో, అప్పుడు తండ్రి ఇచ్చే వారసత్వము కూడా స్మృతిలో ఉంటుంది. పిల్లలుగానే అవ్వకుంటే స్మృతి చేయవలసి ఉంటుంది. మేము భవిష్యత్తులో బాబా ఆస్తి తీసుకుంటామని పిల్లలకు స్మృతి ఉంటుంది. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. మనము భవిష్యత్తులో రాకుమారి, రాకుమారులుగా అవుతాము. మనము వారి సంతానము. మిగిలిన బంధు-మిత్రులు మొదలైన వారిని మర్చిపోవాల్సి వస్తుంది. ఒక్కరు తప్ప వేరెవ్వరూ గుర్తు రాకూడదు. దేహము కూడా గుర్తు రాకూడదు. దేహాభిమానాన్ని వదిలి దేహి-అభిమానులుగా అవ్వాలి. దేహాభిమానములోకి రావడం వలన అనేక ప్రకారాలైన సంకల్ప - వికల్పాలు తలక్రిందులుగా పడేస్తాయి. స్మృతి చేసే అభ్యాసము చేస్తూ ఉంటే సదా హర్షితంగా, వికసించిన పుష్పాల వలె ఉంటారు. స్మృతిని మర్చిపోవడం వలన పుష్పము వాడిపోతుంది. పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు. పిల్లలుగా అవ్వలేదంటే తండ్రి ఏ విషయములో సహాయం చేస్తారు? ఎందుకంటే వారే తల్లి-తండ్రి, తర్వాత రావణ మాయ. రావణుని ద్వారా క్రిందకు దిగజారే సహయోగము లభిస్తుంది. చిన్ననాటి రోజులను మర్చిపోకండి,................ పూర్తి ఈ పాట అంతా పిల్లలైన మీ కొరకే తయారు చేయబడింది. తండ్రిని స్మృతి చేయాలి, స్మృతి చేయకుంటే నేడు నవ్వుతూ, రేవు మళ్లీ ఏడుస్తూ ఉంటారు. స్మృతి చేయడం వలన సదా హర్షితముఖులుగా ఉంటారు. ఒక్క గీతా శాస్త్రములోని కొన్ని కొన్ని అక్షరాలు సరిగ్గా ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధ మైదానములో మరణించినట్లైతే స్వర్గానికి వెళ్తారని వ్రాశారు. కానీ ఇందులో హింసా యుద్ధము మాటే లేదు. పిల్లలైన మీరు తండ్రి నుండి శక్తి తీసుకుని మాయ పై విజయము పొందాలి. కనుక తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. వారు స్థూలమైన ఆయుధాలు మొదలైన వాటిని చూపిస్తారు. జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణము అను శబ్ధాలను విన్నందున స్థూల రూపంలో ఆయుధాలను ఇచ్చారు. వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇన్ని భుజాలు మొదలైనవి ఎవ్వరికీ ఉండవు. కనుక ఇది యుద్ధ మైదానము. యోగములో ఉండి శక్తిని పొంది వికారాల పై విజయము పొందాలి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వము గుర్తుకు వస్తుంది. వారసులే ఆస్తి తీసుకుంటారు. వారసులుగానే అవ్వలేదంటే ప్రజలుగా అవుతారు. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. తండ్రి తప్ప ఈ జ్ఞానము వేరెవ్వరూ ఇవ్వలేరు.
తండ్రి చెప్తున్నారు - నేను ఈ సాధారణ తనువును ఆధారంగా తీసుకొని రావలసి వస్తుంది. ప్రకృతి ఆధారము తీసుకోకుండా పిలలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాను? ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మరేమీ సంభాషణ జరగదు. మళ్లీ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేసి, బిడ్డ కొద్దిగా పెద్ద వాడైనప్పుడు వెలుపలికి వచ్చిన తర్వాత బుద్ధి వికసిస్తుంది. చిన్న పిల్లలంటేనే పవిత్రంగా ఉంటారు, వారిలో వికారాలు ఉండవు. సన్యాసులు మెట్లు ఎక్కి మళ్లీ క్రిందకు దిగుతారు. తమ జీవితాన్ని అర్థము చేసుకోగలరు. పిల్లలు పవిత్రమైనవారు. అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమైనవారని మహిమ చేయబడ్తుంది. ఈ శరీరాన్ని వదిలి మేము రాకుమార-రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు. ఇంతకు ముందు కూడా మేము అయ్యాము, మళ్లీ ఇప్పుడు కూడా అవుతాము. ఇలాంటి ఆలోచనలు విద్యార్థులకు ఉంటాయి. అది కూడా ఎవరు పిల్లలుగా ఉంటారో, విశ్వాస పాత్రులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటూ శ్రీమతానుసారముగా నడుస్తారో వారి బుద్ధిలో ఉంటాయి. లేకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. టీచరు అయితే చదివి ఉన్నవారే. అలాగని వారు మొదట చదువుకొని తర్వాత చదివిస్తారని కాదు. టీచరు అయితే చదివే ఉన్నారు. టీచరు అంటేనే చదివినవారు. వారిని జ్ఞానసాగరులని అంటారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. వారు తండ్రి అని మొదట నిశ్చయం అవ్వాలి. ఒకవేళ ఎవరి భాగ్యములోనైనా లేకుంటే మనస్సులో సందేహ చింతన నడుస్తూనే ఉంటుంది. తెలియనే తెలియదు. ఎపుడైతే మీరు తండ్రి ఒడిలోకి వస్తారో అప్పుడు ఈ వికారాల రోగము ఇంకా ఎక్కువగా బయటకు వస్తుంది అని తండ్రి చెప్తున్నారు. అనారోగ్యము ఉప్పొంగుతుందని వైద్యులు కూడా చెప్తారు. తండ్రి కూడా చెప్తున్నారు - మీరు నా పిల్లలుగా అయినప్పుడు దేహాభిమానము మరియు కామ, క్రోధాల అనారోగ్యము ఎక్కువవుతుంది. లేకుంటే పరీక్ష ఎలా జరుగుతుంది? ఎక్కడైనా తికమకపడితే అడుగుతూ ఉండండి. ఎప్పుడైతే మీరు శక్తిశాలురుగా అవుతారో అప్పుడు మాయ బాగా క్రింద పడేస్తుంది. మీరు బాక్సింగులో(మల్లయుద్ధములో) ఉన్నారు. పిల్లలుగానే అవ్వకుంటే బాక్సింగు మాటే ఉండదు. వారు తమ సంకల్ప-వికల్పాలలోనే మునలు వేస్తూ ఉంటారు, ఎవరి సహయోగము లభించదు. మమ్మా - బాబా అని చెప్తున్నప్పుడు బాబాకు సంతానంగా అవ్వవలసి ఉంటుంది, తర్వాత వీరు మా ఆత్మిక తండ్రి అని మనస్సులో పక్కా అవుతుంది. పోతే ఇది యుద్ధ మైదానము, ఈ తుఫానులో నిలబడగలమా, లేదా? అని భయపడరాదు. ఇటువంటి వారిని బలహీనులని అంటారు. ఇందులో పులి వలె అవ్వాలి. పురుషార్థము కొరకు మంచి మతాన్ని తీసుకోవాలి. తండ్రిని అడగాలి. చాలా మంది పిల్లలు తమ స్థితిని వ్రాసి పంపుతారు. సర్టిఫికెటు తండ్రియే ఇవ్వాలి. ఇతని నుండి దాచగలరు, కానీ శివబాబా నుండి దాచలేరు. చాలామంది దాచేందుకు ప్రయత్నిస్తారు కానీ వారి వద్ద ఏమీ దాగి ఉండలేదు. మంచికి ఫలము మంచిగా, చెడుకు ఫలము చెడుగా ఉంటుంది. సత్య, త్రేతా యుగాలలో అయితే అంతా చాలా మంచిగానే ఉంటుంది. మంచి - చెడు, పాప - పుణ్యాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ దాన-పుణ్యాలు కూడా చేయబడవు. ప్రాలబ్ధము ఉంటుంది. ఇక్కడ మనము పూర్తి సమర్పణ అవుతాము. కనుక బాబా 21 జన్మలకు రిటర్న్(ప్రతిఫలమును) ఇస్తారు. తండ్రిని అనుసరించాలి. ఒకవేళ ఉల్టా పనులు చేసినట్లయితే తండ్రికి చెడ్డ పేరు తెచ్చినవారిగా అవుతారు కనుక శిక్షణ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందరూ జ్ఞానులు, యోగులుగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మలమైన మనలను బాబా చదివించారు, మళ్లీ మనము దానిని వర్షించాలి. సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన గీతను వినిపించాలి. వేరే శాస్త్రాల మాటే లేదు. ముఖ్యమైనది గీతాశాస్త్రము. మిగిలినవన్నీ దాని పిల్లలు. వాటి ద్వారా ఎవ్వరికీ కళ్యాణము జరగదు. నన్ను ఎవ్వరూ కలవలేరు. నేనే వచ్చి మళ్లీ సహజ జ్ఞానము, సహజ యోగాలను నేర్పిస్తాను. సర్వ శాస్త్రాల మాత శిరోమణి గీత. ఈ సత్యమైన గీత ద్వారా వారసత్వము ఇస్తారు. కృష్ణునికి కూడా గీత ద్వారా ఆస్తి లభించింది. గీత తండ్రి అయిన రచయిత ఎవరో వారే కూర్చొని వారసత్వమునిస్తారు. పోతే గీతా శాస్త్ర్రము నుండి వారసత్వము లభించదు. రచయిత ఒక్కరే. మిగిలినవారంతా వారి రచన. మొదటి నంబరు శాస్త్రము గీత. తర్వాత వచ్చే శాస్త్రాల ద్వారా కూడా వారసత్వము లభించదు. సన్ముఖములోనే ఆస్తి లభిస్తుంది. ముక్తి వారసత్వముగా అందరికీ లభిస్తుంది. అందరూ వాపస్ వెళ్ళాలి. కానీ స్వర్గ వారసత్వము చదువు ద్వారా లభిస్తుంది. ఎవరు ఎంత బాగా చదువుతారో అంత పొందుతారు. తండ్రి సన్ముఖములో చదివిస్తారు. చదివించేది ఎవరో నిశ్చయము అవ్వనంతవరకు ఏం అర్థం చేసుకుంటారు? ఏ ప్రాప్తి చేసుకోగలరు? అయినా తండ్రి ద్వారా వింటూనే ఉంటే ఈ జ్ఞానము వినాశనమవ్వదు. ఎంత సుఖము లభిస్తుందో అంత సుఖము ఇతరులకు కూడా ఇస్తారు. ప్రజలను తయారు చేసినట్లయితే వారు స్వయంగా రాజులుగా అవుతారు.
మనది విద్యార్థి జీవితము. నవ్వుతూ, ఆడుతూ జ్ఞాన నృత్యము చేస్తూ మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. మనము రాకుమారులుగా అవ్వాలని విద్యార్థులకు తెలుసు కనుక ఖుషీ పాదరస మట్టము పెరుగుతుంది. ఇది రాకుమారి-రాకుమారుల కాలేజి. అక్కడ రాకుమారి, రాకుమారులకు వేరే వేరే కళాశాలలు ఉంటాయి. విమానాలలో వెళ్తారు. అక్కడ విమానాలు కూడా పూర్తి రక్షణ కవచముగా(ఫుల్ ప్రూఫ్)గా ఉంటాయి, ఎప్పుడూ విరిగిపోవు. ఎప్పుడూ ఏ విధమైన ఆక్సిడెంట్లు(ప్రమాదాలు) జరగవు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. ఒకటి - తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని జోడించాలి. రెండవది - ఎవరెవరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు? అని బాబాకు సమాచారమంతా ఇవ్వాలి. తండ్రితో పూర్తి సంబంధాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. మళ్లీ టీచరు కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు. వారసులుగా అయి పుష్పాలుగా అయ్యే పురుషార్థము ఎవరు చేస్తారు? ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు తర్వాత ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడు పుష్పాలుగా అవుతారు. లేకుంటే మొగ్గలు మొగ్గలుగానే ఉండిపోతారు అనగా ప్రజలలోకి వస్తారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పదవి పొందుతారు. ఒకరు పరిగెత్తుతుంటే మేము వారి తోక పట్టుకొని పోతాము అని అనుకోకండి. భారతవాసులు అలాగే అనుకుంటారు. కానీ తోక పట్టుకునే మాటే లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఎవరు పురుషార్థము చేస్తారో వారికి 21 జన్మలకు ప్రాలబ్ధము తయారవుతుంది. వృద్ధులుగా అయితే తప్పకుండా అవుతారు. కాని అక్కడ అకాల మృత్యువులు ఉండవు. ఎంత గొప్ప పదవి. వీరి భాగ్యము తెరవబడింది, వారసులుగా అయ్యారు అని తండ్రి అర్థము చేసుకుంటారు. ఇప్పుడు పురుషార్థులు, బాబా ఈ ఈ విఘ్నాలు వస్తున్నాయి, ఇలా అవుతూ ఉంది అని రిపోర్టు కూడా చేస్తారు. ప్రతి ఒక్కరు తమ లెక్కాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వేరే సత్సంగాలలో ఇంత శ్రమ ఉండదు. బాబా అయితే చిన్న-చిన్న పిల్లలను కూడా సందేశీలుగా తయారు చేస్తారు. యుద్ధములో సందేశము తీసుకొని వెళ్ళువారు కూడా కావాలి కదా. ఇది యుద్ధ మైదానము. ఇక్కడ మీరు సన్ముఖములో వింటే చాలా బాగుందనిపిస్తుంది. మనసుకు ఖుషీ కలుగుతుంది. వెలుపలికి వెళ్లి ఇతర కొంగల సాంగత్యము లభిస్తే సంతోషము ఎగిరిపోతుంది. అక్కడ మాయ ధూళి ఉంటుంది కదా. కనుక పక్కాగా అవ్వవలసి ఉంటుంది.
బాబా ఎంతో ప్రేమగా చదివిస్తారు, ఎన్నో సౌకర్యాలను కలుగచేస్తారు. బాగుంది - బాగుంది అని చెప్పి తర్వాత మాయమైపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. అరుదుగా కొద్దిమంది మాత్రమే నిలబడగలరు. ఇక్కడ జ్ఞాన నషా అవసరము. మద్యపానము(సారాయి) నషా కూడా ఉంటుంది కదా. ఎవరైనా దివాలా తీసి సారాయి త్రాగి ఉంటే నషా కారణంగా నేను రాజాధి రాజునని అనుకుంటాడు. ఇక్కడ మీకు ప్రతి రోజు జ్ఞానామృతము లభిస్తుంది. ధారణ చేసేందుకు రోజురోజుకు మీ బుద్ధి తాళము తెరిచే పాయింట్లు లభిస్తూ ఉంటాయి. కనుక మురళీ ఎలాగైనా చదవాలి. గీతను రోజూ చదువుతారు కదా అలా ఇక్కడ కూడా రోజూ తండ్రి ద్వారా పాఠము చదవాలి. నా ఉన్నతి జరగడము లేదు, కారణమేమి? అని అడగాలి. వచ్చి తెలుసుకోవాలి. వారు మా తండ్రి అని ఎవరికైతే పూర్తి నిశ్చయముంటుందో వారే వస్తారు. నిశ్చయబుద్ధిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నానని కాదు, నిశ్చయము ఒక్కటే ఉంటుంది, అందులో శాతము ఉండదు. తండ్రి ఒక్కరే, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఇక్కడ వేల మంది చదువుతారు అయినా నిశ్చయము ఎలా కలుగుతుంది? అని అంటే వారిని దౌర్భాగ్యులు అని చెప్పవలసి ఉంటుంది. తండ్రిని గుర్తించి, ఒప్పుకునేవారే అదృష్టవంతులు. ఎవరైనా రాజు నా దత్తు సంతానంగా అవ్వమని అడిగితే వారి ఒడిలోకి వెళ్ళినప్పుడే నిశ్చయమవుతుంది కదా. నిశ్చయము ఎలా కలుగుతుంది అని అనరు. ఇది రాజయోగము. తండ్రి స్వర్గానికి రచయిత కనుక స్వర్గాధిపతులుగా చేస్తారు. నిశ్చయము కలగకుంటే నీ భాగ్యములో లేదు అని అర్థము. దానికి ఎవరు ఏం చేయగలరు? ఒప్పుకోనట్లయితే పురుషార్థము ఎలా చేయగలరు? వారు కుంటుతూనే నడుస్తారు. బేహద్ తండ్రి నుండి భారతీయులకు కల్ప-కల్పము స్వర్గ వారసత్వము లభిస్తుంది. దేవతలు స్వర్గములోనే ఉంటారు. కలియుగములో రాజ్యము ఉండదు. ప్రజల పై ప్రజల రాజ్యముంటుంది. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తండ్రి తప్ప మరెవ్వరు చేయగలరు? భాగ్యములో లేకుంటే అర్థము చేసుకోలేరు. ఇవి చాలా సహజంగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఈ లక్ష్మీనారాయణులు రాజ్య పదవి ప్రాలబ్ధాన్ని ఎప్పుడు పొందారు? తప్పకుండా వారు ముందు జన్మల కర్మల ఫలితంగా పొందారు. లక్ష్మీ నారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు, ఇప్పుడిది నరకము. కనుక తండ్రి తప్ప మరెవ్వరూ అలాంటి శ్రేష్ఠ కర్మ లేక రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు అందరిదీ అంతిమ జన్మ. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ద్వాపర యుగములో రాజయోగాన్ని నేర్పించలేరు. ద్వాపరము తర్వాత సత్యయుగము రాదు. ఇక్కడ చాలా బాగా అర్థము చేసుకొని వెళ్తారు. వెలుపలికి వెళ్ళగానే ఖాళీ అయిపోతారు. పనికి రానిది డబ్బాలో మిగిలిపోతుంది. రత్నాలు ఖాళీ అయిపోతాయి. జ్ఞానము వింటూ వింటూ మళ్లీ వికారాలలోకి వెళ్ళినట్లయితే సమాప్తమైపోతారు. బుద్ధి నుండి జ్ఞానరత్నాలు వెళ్ళిపోతాయి. బాబా! మేము శ్రమ చేస్తూ చేస్తూ మళ్లీ ఈ రోజు పడిపోయాము......... అని చాలామంది వ్రాస్తారు. పడిపోయారు అంటే స్వయానికి మరియు కులానికి కళంకము తెచ్చారు, భాగ్యానికి అడ్డు గీత వేసుకున్నారు. ఇంటిలో కూడా పిల్లలు ఒకవేళ అలాంటి అకర్తవ్యాలను చేసినట్లయితే ఇలాంటి కొడుకు మరణించినా బాగుంటుందని అంటారు. కులకళంకితులుగా అవ్వకండి, ఒకవేళ వికారాలను దానమిచ్చి మళ్లీ వాపస్ తీసుకుంటే పద భ్రష్ఠులుగా అవుతారని బేహద్ తండ్రి చెప్తున్నారు. పురుషార్థము చేయాలి, విజయము పొందాలి. దెబ్బ తగిలినట్లయితే మళ్లీ లేచి నిలబడండి. క్షణ క్షణము దెబ్బ తింటూ ఉంటే ఓడిపోయి మూర్ఛితులైపోతారు. తండ్రి చాలా విషయాలు అర్థము చేయిస్తారు కానీ కొద్ది మంది మాత్రమే నిలబడ్తారు. మాయ చాలా తీవ్రమైనది. పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి మళ్లీ పడిపోతే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. పవిత్రత ద్వారానే నావ ఒడ్డుకు చేరుతుంది. పవిత్రత ఉన్నప్పుడు భారతదేశములోని నక్షత్రాలు వెలుగుతూ ఉండేవి. ఇప్పుడు గాఢాంధకారముంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ యుద్ధ మైదానములో మాయకు భయపడరాదు. పురుషార్థము కొరకు తండ్రి ద్వారా మంచి మతాన్ని తీసుకోవాలి. విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా అయి శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి.
2. ఆత్మిక నషాలో ఉండేందుకు జ్ఞానామృతాన్ని రోజూ సేవించాలి. మురళీ రోజూ చదవాలి. భాగ్యశాలురుగా అవ్వాలంటే తండ్రిలో ఎప్పుడూ సంశయము రాకూడదు.
వరదానము :- '' శాంతి శక్తి సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా చేసే ఆత్మిక శస్త్రధారి భవ ''
శాంతి శక్తికి సాధనము - శుభ సంకల్పాలు, శుభ భావనలు మరియు నయనాల భాష. ఎలాగైతే నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని లేక రచన పరిచయాన్ని ఇస్తారో, అలా శాంతిశక్తి ఆధారంతో నయనాల భాష ద్వారా, కనుల ద్వారా తండ్రిని అనుభవం చేయించగలరు. స్థూల సేవా సాధనాల కంటే సైలెన్స్ శక్తి ఎక్కువ శ్రేష్ఠమైనది. ఆత్మిక సైన్యానికి ఇదే విశేషమైన శస్త్రము - ఈ శస్త్రము ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాన్ని శాంతిగా చేయగలరు.
స్లోగన్ :- '' నిర్విఘ్నంగా ఉండి, నిర్విఘ్నంగా చేయడమే సత్యమైన సేవకు ఋజువు ''
No comments:
Post a Comment