Friday, December 27, 2019

Telugu Murli 28/12/2019

28-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది. అందువలన బాగా చదువుకుంటూ ఉండండి, లింక్‌ (సంబంధము) ఎప్పుడూ తెగిపోరాదు ''

ప్రశ్న :- వినాశ కాలములో విపరీత బుద్ధి ఉన్నవారికి మీరు మాట్లాడే ఏ మాటలకు నవ్వు వస్తుంది?
జవాబు :- ఇప్పుడు వినాశ కాలము సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వు వస్తుంది. తండ్రి ఇక్కడే కూర్చుండిపోరని మీకు తెలుసు. పావనంగా చేయడమే తండ్రి కర్తవ్యము. పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచము వినాశమవుతుంది, క్రొత్తది వస్తుంది. ఈ యుద్ధము వినాశనము కొరకే. మీరు దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ ఛీ-ఛీ సృష్టిలోకి రాజాలరు(రారు).

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేము చాలా తెలివిహీనులుగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. మాయా రావణుడు తెలివిహీనులుగా చేశాడు. నూతన సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందే అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది - బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము. ఎందుకంటే చేసి చేయించేవారు ఆ తండ్రే కదా. చేసేవారు, చేయించేవారు ఒక్కరే. మొదట ఎవరి పేరు వస్తుంది? ఎవరు చేస్తారో వారి పేరు మొదట వస్తుంది, ఎవరి ద్వారా చేయిస్తారో వారి పేరు తర్వాత వస్తుంది. చేసి చేయించేవారని అంటారు కదా. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. మన నూతన ప్రపంచాన్ని మనమే స్థాపన చేసుకుంటున్నాము, దాని పేరే దేవీ దేవతల ప్రపంచము. సత్యయుగములో మాత్రమే దేవీ దేవతలుంటారు. దేవీ దేవతలని ఇతరులను అనరు. అక్కడ మనుష్యులు ఉండరు. అక్కడ ఒకే ఒక దేవీ దేవతా ధర్మముంటుంది, ఇతర ధర్మాలేవీ ఉండవు. మనమే దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. అందుకు గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లామ్‌, బౌద్ధ, క్రైస్తవ మతాల వారందరికీ వారి వారి గుర్తులున్నాయి. మన రాజ్యము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు దేవీదేవతా ధర్మము తప్ప మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. గీతలో మంచి మంచి పదాలున్నాయి, కానీ వాటిని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు - వినాశ కాలములో విపరీత బుద్ధి, వినాశ కాలములో ప్రీతి బుద్ధి, వినాశనమేమో ఇప్పుడే జరుగుతుంది. తండ్రి వచ్చేదే సంగమ యుగములో, అప్పుడే పరివర్తన జరుగుతుంది. తండ్రి పిల్లలైన మీకు అందుకు బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలియే కాక చాకలి మరియు గొప్ప వ్యాపారి కూడా. తండ్రితో చాలా తక్కువమంది వ్యాపారము చేస్తారు. ఈ వ్యాపారములో అపారమైన లాభముంది. చదువులో చాలా లాభముంటుంది. చదువే సంపాదనకు మూలము అనే మహిమ ఉంది. ఆ సంపాదన కూడా జన్మ- జన్మలకు. అటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా, చాలా సహజంగా చదివిస్తున్నారు. కేవలం ఒక వారము అర్థము చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లండి, మీ వద్దకు మురళి వస్తూనే ఉంటుంది, అప్పుడు లింకు ఎప్పుడూ తెగిపోకుండా ఉంటుంది. ఇది పరమాత్మతో ఆత్మల లింకు. గీతలో కూడా వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహావాక్యము ఉంది. ఇప్పుడు మనుష్యులు ఒకరినొకరు చంపుకుంటున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న క్రోధము లేక వికారాలు మరెవ్వరిలోనూ లేవు. ద్రౌపది ధీనంగా పిలిచింది,................ (ద్రౌపది నే పుకారా,.......) అనే గాయనము కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరందరూ ద్రౌపదులే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, ఇప్పుడు వికారాలలోకి వెళ్లకండి. నేను మిమ్ములను స్వర్గములోకి తీసుకెళ్తాను, మీరు కేవలం నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు వినాశ కాలము కదా - ఎవ్వరి మాటా కూడా వినరు, కొట్లాడుతూనే ఉంటారు. శాంతిగా ఉండమని అనేమంది చెప్తున్నా శాంతిగా ఉండరు, పిల్లలను మొదలైన వారినందరినీ వదిలి, యుద్ధానికి వెళ్తారు. ఎంతోమంది మనుష్యులు చనిపోతున్నారు. మనిషికి ఏ మాత్రము విలువ లేదు. విలువ, మహిమ కేవలం ఒక్క దేవీ దేవతలకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. వాస్తవానికి మీకు దేవతల కంటే ఎక్కువ మహిమ ఉంది. మిమ్ములను ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత గొప్ప చదువు! చదివేవారు అనేక జన్మల అంత్యములో చాలా తమోప్రధానంగా ఉన్నారు. నేను సదా సతోప్రధానముగానే ఉంటాను.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను మీకు అతివిధేయత గల సేవకునిగా వచ్చాను. మనము ఎంత ఛీ - ఛీగా అయ్యామో ఆలోచించండి. ఆ తండ్రి మనలను వాహ్‌ వాహ్‌గా(భేషుగ్గా) తయారు చేస్తున్నారు. భగవంతుడు కూర్చొని మానవులను చదివించి చాలా ఉన్నతంగా చేస్తున్నారు. తండ్రే స్వయంగా చెప్తున్నారు - నేను అనేక జన్మల అంత్యములో మిమ్ములందరినీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మిమ్ములను చదివిస్తున్నాను. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను స్వర్గవాసులుగా చేశాను కాని మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? ఎవరు చేశారు? వినాశ కాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతిబుద్ధి విజయంతి అనే మహిమ కూడా ఉంది. ఎంతెంత ప్రీతి బుద్ధి కలిగి స్మృతి చేస్తారో, అంత మీకే లాభము. ఇది యుద్ధ మైదానము కదా. గీతలో ఏ యుద్ధము గురించి తెలిపించారో ఎవ్వరికీ తెలియదు. వారేమో కౌరవుల-పాండవుల యుద్ధంగా చూపించారు. కౌరవ సంప్రదాయము, పాండవ సంప్రదాయము రెండూ ఉన్నాయి. కాని యుద్ధము లేనే లేదు. పాండవులనగా తండ్రిని తెలుసుకున్నవారు, బాబాతో ప్రీతిబుద్ధి గలవారు. తండ్రితో విపరీతబుద్ధిగల వారిని కౌరవులని అంటారు. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన మంచి-మంచి విషయాలు.

ఇప్పుడు సంగమ యుగము. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధి ద్వారా పని తీసుకోవాలి. ప్రపంచము ఎంతో విశాలమైనది. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారు. వృక్షము చిన్నదిగా ఉంటుంది కదా! ఆ వృక్షము తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ మానవ సృష్టి రూపీ తలక్రిందుల వృక్షము ఎలా ఉందో ఎవ్వరూ అర్థము చేసుకోరు. దీనిని కల్పవృక్షమని అంటారు. జ్ఞానము కూడా కావాలి కదా! ఇతర వృక్షాల జ్ఞానము చాలా చాలా సులభము. వాటిని గురించి వెంటనే చెప్తారు. అదే విధంగా ఈ వృక్ష జ్ఞానము కూడా చాలా సహజము, అయితే ఇది మానవ వృక్షము. మనుష్యులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు. భగవంతుడు సృష్టికర్త అని కూడా అంటారు. కనుక ఆయన చైతన్యము కదా. తండ్రి సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులు. వారిలో ఏ జ్ఞానము ఉందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి బీజరూపులు, చైతన్యమైనవారు. వారి ద్వారానే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మానవులకు తమ వృక్షము గురించి తెలియదు, ఇతర వృక్షాల గురించి అయితే బాగా తెలుసు. వృక్షము యొక్క బీజము చైతన్యమైతే తెలిపేది కదా. కాని అది జడ బీజము. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే రచయిత - రచనల రహస్యము తెలుసు. వీరు సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులు. చైతన్యములో అయితే మాట్లాడగలరు కదా! మానవ శరీరము అన్నింటికంటే అమూల్యమని గాయనము చేయబడింది. దాని విలువ కట్టలేరు - తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు.

మీరు రూపబసంత్‌లు(జ్ఞానులు, యోగులు). తండ్రి జ్ఞానసాగరులు. వారి ద్వారా మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాల ద్వారా, ఆ రత్నాలు కూడా మీకు లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీనారాయణుల వద్ద ఎన్ని రత్నాలున్నాయో చూడండి. వజ్ర వైడూర్యాల భవనాలలో నివసిస్తారు. దాని పేరే స్వర్గము. దానికి మీరు యజమానులుగా అవుతారు. ఎవరైనా పేదలకు పెద్ద లాటరీ లభిస్తే, పిచ్చివారైపోతారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు - మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే మాయ ఎంతో ఆటంకపరుస్తుంది. మీకు పోను పోను తెలుస్తుంది - మాయ ఎంతో మంచి-మంచి పిల్లలను కూడా మింగేస్తుంది. ఒక్కసారిగా తినేస్తుంది. మీరు సర్పము కప్పనెలా పట్టుకుంటుందో చూశారా? ఏనుగును మొసలి పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. సర్పము కప్పనంతా ఒక్కసారిగా మింగేస్తుంది. మాయ కూడా అంతే. బ్రతికి ఉండగానే పిల్లలను పట్టుకొని ఒక్కసారిగా అంతమొందిస్తుంది. వారు మళ్లీ తండ్రి పేరు ఎత్తకుండా మింగేస్తుంది. మీలో యోగబల శక్తి చాలా తక్కువగా ఉంది. ఆధారమంతా యోగబలము పైనే ఉంది. సర్పము కప్పను మింగినట్లు పిల్లలైన మీరు మొత్తం చక్రవర్తి పదవిని మింగేస్తారు. విశ్వచక్రవర్తి పదవినంతా మీరు ఒక్క సకెండులో తీసేసుకుంటారు. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఏ ఆయుధమూ అవసరము లేదు. ఆ తండ్రి జ్ఞాన-యోగాలనే అస్త్రశస్త్ర్రాలను ఇస్తారు, కాని వారు స్థూల ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు.

పిల్లలైన మీరిప్పుడు చెప్తున్నారు - ఎలా ఉండేవారము ఎలా అయ్యి ఉండినాము! ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి - మనము ఈ విధంగా(లక్ష్మీనారాయణులు) ఉండేవారము. భలే మనుష్యులుగానే ఉన్నాము కానీ మంచి గుణాలు, చెడు గుణాలు ఉంటాయి కదా. దేవతలలో దైవీ గుణాలుంటాయి. అందువలన వారిని మీరు సర్వ గుణసంపన్నులు,......... అని మహిమ చేస్తూ ఉంటారు. మేము నిర్గుణులము మాలో ఏ గుణాలూ లేవు అని పాడ్తారు. ఈ సమయంలో ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది అనగా ఒక్క దైవీ గుణము కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి గురించే తెలియదు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు సంగమ యుగములో వినాశనము జరిగి తీరాలి. పాత ప్రపంచము వినాశనమై నూతన ప్రపంచము స్థాపన అవుతుంది. దీనినే వినాశ కాలమని అంటారు. ఇది అంతిమ వినాశనము తర్వాత అర్ధకల్పము ఎలాంటి యుద్ధాలు మొదలైనవేవీ ఉండనే ఉండవు. మానవులకు దీనిని గురించి ఏ మాత్రమూ తెలియదు. వినాశ కాలములో విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు. కనుక పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది కదా! ఈ పాత ప్రపంచములో ఎన్ని ఆపదలు జరుగుతున్నాయి. మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయంలో ఉన్న స్థితిని తెలిపిస్త్తున్నారు. చాలా వ్యత్యాసముంది కదా. ఈ రోజు భారతదేశము ఏ స్థితిలో ఉంది, రేపు ఎలా అవుతుంది? ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు? మొదట నూతన ప్రపంచము ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడ మాహళ్లలో ఎన్ని వజ్ర వైడూర్యాలు మొదలైనవి ఉంటాయి! భక్తిమార్గములో కూడా మీ మందిరాలు తక్కువ విలువైనవిగా ఉండవు. ఒక్క సోమనాథ మందిరమే కాదు. ఇతరులు కూడా నిర్మిస్తారు. ఒక్క సోమనాథ మందిరము నుండే ఎంతో దోచుకున్నారు! (సోమనాథ మందిరములోని వజ్ర వైడూర్యాలను, సంపదను మోహమ్మద్‌ గజనీ 17 సార్లు, 17 వేల ఒంటెల పై ఉంచుకొని దోచుకుపోయాడు) తమ జ్ఞాపక చిహ్నాలను మళ్లీ కూర్చుని తయారుచేశారు. కనుక గోడలలో రాళ్లు మొదలైనవి అమరుస్తారు. ఈ రాళ్లకేం విలువ ఉంటుంది. చిన్న వజ్రానికి కూడా ఎంత విలువ ఉంది! బాబా రత్నాల వ్యాపారి కదా. గురిగింజంత రత్నము కూడా 90 రూపాయలు. ఇప్పుడదే రత్నము ధర వేల రూపాయలుంటుంది. అది కూడా దొరకదు, విలువ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు విదేశాలలో చాలా ధన-సంపదలున్నాయి. అలా ఉన్నా సత్యయుగముతో పోలిస్తే అది లెక్కలోకి రాదు.

తండ్రి చెప్తున్నారు - వినాశకాలే విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు - వినాశనము సమీపంగా ఉందంటే వారు నవ్వుతారు. తండ్రి అంటున్నారు - నేను ఎంత కాలము ఇక్కడ ఉండాలి. నాకేమైనా ఇక్కడ మజా ఉందా? నేను సుఖమూ అనుభవించను, దు:ఖమూ అనుభవించను. పావనంగా చేయడమే నా కర్తవ్యము. మీరు ఇలా ఉండేవారు(లక్ష్మీనారాయణులు), ఇప్పుడిలా అయిపోయారు. నేను మళ్లీ మిమ్ములను ఇంత ఉన్నతంగా చేస్తాను. మనము మళ్లీ అలా తయారయ్యే వారమని మీకు తెలుసు. మనము దైవీ కుటుంబానికి చెందినవారమని, రాజ్యపదవి ఉండేదని, దానిని ఇలా పోగొట్టుకున్నామని ఇప్పుడు మీకు తెలిసింది. ఆ తర్వాత ఇతరులు వస్తూ వచ్చారు. ఇప్పుడీ చక్రము పూర్తి అవుతుంది. లక్షల సంవత్సరాల మాటే లేదని ఇప్పుడు మీకు తెలుసు. వినాశనము కొరకే ఈ యుద్ధము. అక్కడ చాలా సుఖంగా మరణిస్తారు. ఏ కష్టమూ ఉండదు. ఆసుపత్రులు మొదలైనవేవీ ఉండవు కూర్చుని సేవ చేసేదెవరు? ఏడ్చేదెవరు? అక్కడ ఈ పద్ధతులే ఉండవు. వారి మృత్యువు చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ దు:ఖపడి మరణిస్తారు. ఎందుకంటే మీరు చాలా సుఖపడ్డారు. కావున దు:ఖము కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. తర్వాత ఈ యుద్ధము శాంతిస్తుందని వారు భావిస్తారు. కాని శాంతి ఏర్పడదు. ఎలుకకు ప్రాణ సంకటము, పిల్లికి చెలగాటము,..........(మిరూఆ మౌత్‌ మలూకా షికార్‌,......) మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ ఛీ-ఛీ సృష్టిలోకి మీరు రారు. గీతలో కూడా భగవానువాచ ఉంది - వినాశనముతో పాటు స్థాపన కూడా చూడు. అర్జునునికి సాక్షాత్కారమయింది కదా. ఫలానావారు ఫలానాగా అవుతారని అంత్యములో సాక్షాత్కారాలవుతాయి. అప్పుడు రోధిస్తారు, చాలా పశ్చాత్తాపపడ్తారు, శిక్షలను అనుభవిస్తారు. తల వ్రాతను అనుభవిస్తారు. కాని ఏం చేయగలరు? ఇది 21 జన్మల లాటరీ స్మృతి అయితే వస్తుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా, ఎవ్వరికీ శిక్షలు పడవు. ట్రిబ్యునల్‌(న్యాయసభ) కూర్చుంటుంది కదా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయంలో జ్ఞాన రత్నాలను ధారణ చేసి రూపబసంత్‌లుగా(జ్ఞానులు, యోగులుగా) అవ్వాలి. జ్ఞాన రత్నాల ద్వారా విశ్వచక్రవర్తి పదవి అనే లాటరీని తీసుకోవాలి.
2. ఈ వినాశకాలంలో తండ్రి పై ప్రీతి కలిగి, ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడే లేక తలవ్రాతను అనుభవించే కర్మలేవీ చేయరాదు.

వరదానము :- '' నిర్లక్ష్యము లేక అటెన్షన్‌లో ఉన్నాననే అభిమానం వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థీ భవ ''
చాలామంది పిల్లలు ధైర్యంగా ఉండేందుకు బదులు నిర్లక్ష్యం కారణంగా మేము సదా పాత్రులుగానే ఉన్నామని అభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి మాకు సహాయం చేయకుంటే ఇంకెవరికి చేస్తారు! అనే అభిమానం కారణంగా ధైర్యము చేసే విధిని మర్చిపోతారు. చాలామందిలో స్వయం పై అటెన్షన్‌ ఇచ్చే అభిమానం కూడా ఉంటుంది. ఈ అభిమానం సహాయము నుండి వంచితులుగా చేస్తుంది. మేము చాలా యోగం చేశాము, జ్ఞాని, యోగి ఆత్మలుగా అయిపోయాము, సేవకు రాజధానిగా అయిపోయాము.............. ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యము ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' నెగటివ్‌, వేస్ట్‌ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో, వాటిని పరివర్తన చేసి విశ్వకళ్యాణ కార్యంలో ఉపయోగించండి. ''

No comments:

Post a Comment