Monday, December 16, 2019

Telugu Murli 17/12/2019

18-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మాయ చాలా శక్తివంతమైనది, దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము బ్రహ్మను ఒప్పుకోము, మాకు నేరుగా శివబాబాతోనే సంబంధము అని ఎప్పుడూ అనుకోరాదు ''

ప్రశ్న :- ఎటువంటి పిల్లల పై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది?
జవాబు :- ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో (ప్రాక్టికల్‌) ఉంచి, తర్వాత ఇతరులకు చెప్తారో, వారి పై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది. జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేకమందికి సేవ చేయాలి, అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది. స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే వారి మాటలు ఎవరు వింటారు? వారు పండితుని వలె అయిపోతారు.

ఓంశాంతి. తండ్రి పిల్లలను అడుగుతున్నారు, పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు - మేము పరమపిత పరమాత్ముని సన్ముఖంలో ఉన్నామని, బాబాకు తన స్వంత రథము లేదని నిశ్చయముంది కదా? ఈ భృకుటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఇతని భృకుటి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇతని శరీరాన్ని అప్పు(లోను)గా తీసుకున్నాను. ఆత్మ భృకుటి మధ్యలో కూర్చుంటుంది. కనుక తండ్రి కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు. బ్రహ్మ కూడా ఉన్నాడు, శివబాబా కూడా ఉన్నారు. ఈ బ్రహ్మ లేకుంటే శివబాబా కూడా ఉండరు. కొంతమంది మేము శివబాబానే స్మృతి చేస్తాము, బ్రహ్మను చెయ్యము అని అంటారు. అయితే శివబాబా ఎలా మాట్లాడ్తారు? శివబాబా పైన ఉన్నారని భావిస్తూ, సదా స్మృతి చేస్తూనే వచ్చాము. ఇప్పుడు పిల్లలైన మీ అందరికి - ''ఇక్కడ మేము తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని తెలుసు.'' శివబాబా పైన ఉన్నారని భావించరు. భక్తిమార్గములో చెప్పినట్లు శివబాబా పైన ఉన్నారని వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడ్తుంది అని అనుకోరు. ఈ విషయాలు బాగా అర్థము చేసుకునేవి. తండ్రి జ్ఞానసాగరులు, నాలెడ్జ్‌ఫుల్‌ అని మీకు తెలుసు. అయితే జ్ఞానము ఎలా వినిపిస్తారు? బ్రహ్మ శరీరము ద్వారా వినిపిస్తారు. కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు. కాని శివబాబా అంటున్నారు - నేను ఈ నోటి ద్వారానే ''నన్ను స్మృతి చేయండి'' అని మీకు చెప్తున్నాను. ఇది అర్థము చేసుకునే విషయము కదా. బ్రహ్మ కూడా స్వయంగా, శివబాబాను స్మృతి చేయమని చెప్తున్నారు. నన్ను స్మృతి చేయమని ఇతడు ఎక్కడ చెప్పాడు? ఇతని ద్వారానే నన్ను స్మృతి చేయండని శివబాబా చెప్తున్నారు. ఈ మంత్రమును ఇతని నోటి ద్వారా మీకు ఇస్తున్నాను. బ్రహ్మ లేకుంటే నేను మంత్రమునెలా ఇస్తాను? బ్రహ్మ లేకుంటే మీరు శివబాబాతో ఎలా కలుస్తారు? నా వద్ద ఎలా కూర్చుంటారు? మంచి-మంచి మహారథులకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మాయ నా నుండి వారి ముఖమును ప్రక్కకు తిప్పేస్తుంది. మేము బ్రహ్మను ఒప్పుకోము, గౌరవించము అని అంటారు. అప్పుడు వారి గతి ఏమవుతుంది? మాయ ఎంత శక్తిశాలి అంటే ఒక్కసారిగా ముఖమును తిప్పేస్తుంది. ఇప్పుడు మీ ముఖము శివబాబా మళ్లీ చక్క(ఎదురు)గా చేశారు. మీరు నా సన్ముఖములో కూర్చుని ఉన్నారు. మరి బ్రహ్మదేమీ లేదనే వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. ''ఓ గాడ్‌ఫాదర్‌'' (పరమపిత పరమాత్మ) అని మానవులు పిలుస్తారు. అయితే గాడ్‌ఫాదర్‌ వింటారా? ''ఓ ముక్తిదాతా! రండి'' (ఓ లిబరేటర్‌ ఆవో.......) అని పిలుస్తారు. అక్కడ నుండే ముక్తినిస్తారా? కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారినే మర్చిపోతే, విస్మరిస్తే వారిని ఏమనాలి? మాయకు ఎంత బలముందంటే, నెంబరువన్‌ పైసకు కొరగానివారిగా చేస్తుంది. ఇటువంటివారు కూడా కొన్ని సేవాకేంద్రాలలో ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని తండ్రి చెప్తున్నారు. బాబా వినిపించిన జ్ఞానమును ఇతరులకు వినిపిస్తూ కూడా ఉంటారు. కానీ పండితుని వలె(చెప్పింది ఆచరించరు). బాబా పండితుని కథను వినిపిస్తారు కదా,............... ఇప్పుడు మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరమును దాటి క్షీర సాగరములోకి వెళ్తారు కదా. భక్తిమార్గములో అనేక కథలు తయారు చేశారు. పండితుడు ఇతరులకు రామ నామము జపిస్తూ నది దాటమని చెప్తాడు. కానీ స్వయం దాటుకోలేక మునిగిపోయాడు(నష్టఖాతాలో ఉండిపోయాడు). స్వయం వికారాలకు వశమౌతూ, ఇతరులకు నిర్వికారులుగా అవ్వమని చెప్తూ ఉంటారు, అటువంటివారి ప్రభావమేముంటుంది? ఇక్కడ కూడా చెప్పేవారికంటే వినేవారు తీవ్రంగా ముందుకెళ్తారు. ఎవరైతే అనేకమందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు. పండితుడు అసత్యమని తెలిస్తే, అతనిని ఎవరు ప్రేమిస్తారు? ప్రాక్టికల్‌గా బాబాను స్మృతి చేసేవారినే ప్రేమిస్తారు. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - యుద్ధ సన్నాహాలు పూర్తి అవ్వనంత వరకు కర్మాతీత అవస్థ తయారవ్వదు. ఒకవైపు యుద్ధము కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, మరోవైపు కర్మాతీత స్థితి వస్తుంది. బాబాతో సంపూర్ణ సంబంధముంటుంది, యుద్ధము పూర్తి అవుతుంది. బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచము పరివర్తన అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచము ఇంకా 40 వేల సంవత్సరాలు ఉంటుందని వారు భావిస్తారు. వినాశనము చాలా సమీపంలో ఉందని మీరు భావిస్తారు. మీరు తక్కువమంది(మైనారిటీ) ఉన్నారు. వారు ఎక్కువ మంది(మెజారిటీ) ఉన్నారు. అందువలన మీరు చెప్పేది ఎవరు అంగీకరిస్తారు? మీ సంఖ్య ఎక్కువైనప్పుడు మీ యోగబలము ద్వారా ఇతరులు ఆకర్షింపబడి వస్తారు. మీలోని వికారాల తుప్పు ఎంతగా తొలగిపోతుందో అంత బలము చేకూరుతూ వస్తుంది. తండ్రి అన్నీ తెలిసినవారని కాదు, కాని అందరి స్థితులు వారికి తెలుసు. తండ్రి పిల్లల స్థితిని తెలుసుకోలేరా? వారికి అంతా తెలుసు. ఇప్పుడింకా కర్మాతీత స్థితి రాలేదు. చాలా కఠినమైన పెద్ద తప్పులు కూడా జరిగే అవకాశముంది, మహారథుల ద్వారా కూడా జరుగుతాయి. సంభాషణలు, నడవడికలు మొదలైనవన్నీ ప్రసిద్ధమవుతాయి. ఇప్పుడింకా దైవీ నడవడికలు అలవరుచుకోవాలి. దేవతలు సర్వ గుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. కాని మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు. అత్తపత్తి ఆకు(ముట్టితే ముని, లజ్జావతి) వలె ముడుచుకొనిపోతారు. 5 మెట్లు ఉన్నాయి కదా. దేహాభిమానము వలన పై నుండి ఒక్కసారిగా క్రింద పడిపోతారు. క్రిందపడుతూనే చనిపోతారు. ఈ రోజులలో స్వయాన్ని చంపుకునేందుకు ఎన్నెన్నో ఉపాయాలు చేస్తున్నారు. 20 అంతస్థుల భవనము పై నుండి క్రిందకు దూకి ఒక్కసారిగా మరణిస్తున్నారు. ఆసుపత్రిలో చేరి దు:ఖపడకుండా చనిపోతున్నారు. కొంతమంది స్వయాన్ని కాల్చుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా రక్షిస్తే ఎంత బాధను, దు:ఖమును అనుభవిస్తారు! కాలిపోతే ఆత్మ వెళ్ళిపోతుందని శరీరాన్ని హత్య(జీవఘాతము) చేసుకుంటారు. జీవఘాతము చేసుకుంటే దు:ఖము నుండి విడుదల అవుతామని భావిస్తారు. ఆవేశమొస్తూనే ఇలా చేసేసుకుంటారు. చాలామంది ఆసుపత్రులలో ఎంతో దు:ఖమును అనుభవిస్తారు! వీరి దు:ఖము దూరము కాదు దీనికంటే వీరికేదైనా మాత్ర ఇస్తే సమాప్తమైపోతారని డాక్టర్లు భావిస్తారు, అయితే అటువంటి మాత్రలు ఇవ్వడం మహాపాపమని వారు భావిస్తారు. ఈ బాధ భరించడము కంటే శరీరము వదిలేయడము మంచిదని ఆత్మ స్వయంగా చెప్తుంది. ఇప్పుడు శరీరాన్ని వదిలించేదెవరు? ఇది అపారమైన దు:ఖాల ప్రపంచము. అక్కడ అపారమైన సుఖముంటుంది.

మనమిప్పుడు దు:ఖధామము నుండి సుఖధామానికి వాపసు(రిటర్న్‌) వెళ్తామని, అలా వెళ్లేందుకు వారిని స్మృతి చేయాలని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ప్రపంచము పరివర్తన అవ్వాల్సినపుడు సంగమ యుగములో వస్తారు. పిల్లలైన మిమ్ములను సర్వ దు:ఖాల నుండి విడిపించి నూతన పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. పావన ప్రపంచములో కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, పతితులుగా ఉన్నారు. అందుకే ''ఓ పతితపావనా!.......'' అని పిలుస్తారు. కానీ ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మమ్ములను ఇంటికి తీసుకెళ్ళమని మహాకాలుని పిలుస్తున్నామని భావించరు. బాబా తప్పకుండా వస్తారు. అందరూ చనిపోతేనే కదా శాంతి ఏర్పడ్తుంది. శాంతి-శాంతి అంటూ ఉంటారు. శాంతి అయితే శాంతిధామములో ఉంటుంది. కాని ఈ ప్రపంచములో ఇంతమంది మనుష్యులు ఉంటే శాంతి ఎలా ఏర్పడ్తుంది? సత్యయుగములో అయితే సుఖ-శాంతులుండేవి. ఇప్పుడు కలియుగములో అనేక ధర్మాలున్నాయి. అవి ఎప్పుడైతే సమాప్తమై ఒకే ఒక ధర్మ స్థాపన జరుగుతుందో అప్పుడు సుఖ-శాంతులు ఏర్పడ్తాయి. హాహాకారాల తర్వాత మళ్లీ జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. పోను పోను మృత్యుబజారు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎలా చనిపోతారో, ఎలా బాంబులతో కూడా అగ్ని తగుల్కొంటుందో చూస్తారు. పోను పోను అవన్నీ చూసి చాలామంది వినాశనము తప్పకుండా జరుగుతుందని అంటారు.

ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైన మీకు తెలుసు. వినాశనమేమో తప్పకుండా జరుగుతుంది, ఆ తండ్రి ఒకే ధర్మమును స్థాపన చేయిస్తారు. రాజయోగము కూడా నేర్పిస్తున్నారు. మిగిలిన అనేక ధర్మాలు సమాప్తమైపోతాయి. గీతలో ఇదంతా ఏమీ చూపించలేదు. మరి ఆ గీత చదివినందున ఫలితమేమి కలిగింది? ప్రళయము జరిగిపోయినట్లు చూపిస్తారు. భలే జలమయమవుతుంది కానీ పూర్తి ప్రపంచము జలమయమవ్వదు. భారతదేశము అవినాశి, పవిత్రమైన ఖండము. అందులో కూడా ఆబు పర్వతము అన్నింటికంటే పవిత్రమైన తీర్థ స్థానము. అక్కడే తండ్రి వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. దిల్‌వాడా మందిరము ఎంతో మంచి జ్ఞాపక చిహ్నము. చాలా అర్థ సహితంగా ఉంది. కాని ఎవరు కట్టించారో, వారికి ఈ విషయాలు తెలియవు. అయినా వారు చాలా తెలివిగలవారు కదా. ద్వాపర యుగములో తప్పకుండా చాలా తెలివిగలవారు ఉంటారు. కలియుగములో అయితే తమోప్రధానంగా ఉన్నారు. అన్ని మందిరాలలో ఇది చాలా ఉన్నతమైనది. ఇందులో మీరు కూర్చుని ఉన్నారు. మేము చైతన్యులమని మీరు తెలుసుకున్నారు. అది మన జడ స్మృతిచిహ్నమే. ఇంకా కొంత సమయము వరకు ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారవుతూ ఉంటాయి. ఆ తర్వాత అవి పడిపోయే సమయము వస్తుంది. మందిరాలు మొదలైనవన్నీ పాడై పడిపోతాయో అప్పుడు హోల్‌సేల్‌గా మృత్యువు జరుగుతుంది. మహాభారీ మహాభారత యుద్ధమని గాయనము చేయబడింది కదా, అందులో అందరూ సమాప్తమైపోతారు. తండ్రి ఈ సంగమ యుగములోనే వస్తారని కూడా మీరు అర్థం చేసుకున్నారు. తండ్రికి రథము కావాలి కదా. ఆత్మ శరీరములో ప్రవేశించినప్పుడే అది చైతన్యమై కదులుతుంది. ఆత్మ శరీరాన్ని వదుల్తూనే శరీరము జడమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. మీరు లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి. కనుక అటువంటి గుణాలు కూడా ఉండాలి కదా. పిల్లలైన మీకు ఈ ఆట గురించి తెలుసు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారయింది! ఈ ఆట రహస్యమంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి జ్ఞానపూర్ణులు, బీజ స్వరూపులు కదా. ఆ తండ్రే వచ్చి కల్పవృక్ష జ్ఞానమంతా ఇస్తున్నారు. ఈ వృక్షములో ఏమేం జరుగుతుందో, ఇందులో మీరు ఎలాంటి పాత్రను ఎంత కాలము అభినయించారో, అంతా అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పము దైవీరాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యము. మంచి-మంచి పిల్లలలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి తన సమానము టీచరుగా చేస్తున్నారు. టీచర్లు కూడా నంబరువారుగా ఉంటారు. కొంతమంది టీచర్లుగా తయారైన తర్వాత దిగజారిపోతారు. అనేకమందికి నేర్పించి స్వయం సమాప్తమైపోతారు. చిన్న-చిన్న పిల్లలలో రకరకాల సంస్కారాలుంటాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ కూడా సరిగ్గా జ్ఞానము అర్థము చేసుకోనివారు, నడవడికలు సరి చేసుకోలేనివారు అనేకమందికి దు:ఖమునిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. ఇది కూడా శాస్త్రాలలో చూపించారు - అసురులు వచ్చి రహస్యంగా కూర్చొనేవారు, వెలుపలికి వెళ్ళి ద్రోహులుగా అయి ఎంతో విసిగించారు. విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉన్నతాతి ఉన్నతులైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఎంతో మంది విఘ్నరూపులుగా అవుతారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరు సుఖ-శాంతుల స్తంభాలు, మీరు చాలా రాయల్‌గా ఉంటారు. మీ కంటే రాయల్‌గా ఉండేవారు ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు. కనుక మీరు అనంతమైన తండ్రి పిల్లలు కదా. ఎంతో మధురంగా వ్యవహరించాలి. ఎవ్వరికీ దు:ఖమును ఇవ్వరాదు. లేకుంటే చివరి సమయములో వారే గుర్తుకు వస్తారు. శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పిల్లలకు సూక్ష్మవతనములో బ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అందువలన మీరు కూడా అలా సూక్ష్మవతనవాసులుగా అవ్వండి. మూగి సైగలు(మూవీ, భావనల భాషను) అభ్యసించండి. చాలా తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఇలా పురుషార్థము చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభాలుగా అవుతారు. మీకు నేర్పించేవారు తండ్రి, మీరు మళ్లీ ఇతరులకు నేర్పించాలి. భక్తిమార్గము శబ్ధమార్గము(టాకీ), ఇప్పుడు మీరు సైలెన్స్‌(శాంతి)గా అవ్వాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చాలా రాయల్‌(శ్రేష్ఠము)గా, మధురంగా వ్యవహరించాలి. శాంతి, సుఖములిచ్చే స్తంభాలుగా (టవర్లగా) అయ్యేందుకు చాలా తక్కువగా, మధురంగా మాట్లాడాలి. సైగల భాషను(మూవీ) అభ్యసించాలి. శబ్ధములోకి రాకూడదు.
2. స్వయంలో దైవీ నడవడికలను అలవరుచుకోవాలి. లజ్జావతి ఆకు(ముట్టితే ముని లేక అత్తిపత్తి ఆకు)గా అవ్వరాదు. యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి. నిర్వికారులుగా అయి, నిర్వికారులుగా చేసే సేవ చేయాలి.

వరదానము :- '' కర్మ మరియు సంబంధము రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉండే బాప్‌సమాన్‌ కర్మాతీత్‌ భవ ''
అందరిని ముక్తులుగా చేయడమే పిల్లలైన మీరు చేయాల్సిన సేవ. కనుక ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోకండి. ఎప్పుడైతే హద్దు 'నాది-నాది' నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు. ఏ పిల్లలైతే లౌకిక, అలౌకిక కర్మ మరియు సంబంధము రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానం కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కనుక ఎంతవరకు కర్మ బంధనాల నుండి అతీతంగా అయ్యాను, వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వడం నుండి ముక్తంగా అయ్యాను, ఎప్పుడూ వెనుకటి స్వభావ సంస్కారాలు వశీభూతులుగా చేసుకోవడం లేదు కదా? అని చెక్‌ చేసుకోండి.

స్లోగన్‌ :- '' సమానంగా, సంపూర్ణంగా అవ్వాలంటే, స్నేహ సాగరంలో ఇమిడిపోండి ''

No comments:

Post a Comment