Tuesday, December 10, 2019

Telugu Murli 11/12/2019

11-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ పురుషోత్తమ సంగమ యుగము ట్రాన్స్‌ఫర్‌(బదలీ) అవ్వాల్సిన యుగము, మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి ''

ప్రశ్న :- తండ్రితో పాటు ఎటువంటి పిల్లల మహిమ కూడా గాయనము చేయబడ్తుంది ?
జవాబు :- ఎవరైతే టీచరుగా అయి అనేకమంది కళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అవుతారో, వారి మహిమ కూడా తండ్రితో పాటు మహిమ చేయబడ్తుంది. చేసి చేయించే బాబా, పిల్లల ద్వారా అనేకాత్మల కళ్యాణము చేయిస్తారు. అందువలన పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా, ఫలానివారు మా పై దయ చూపించారు, ఎంతో నీచంగా ఉండే మేము ఎంతో గొప్పగా తయారయ్యాము! అని చెప్తారు. టీచరుగా అవ్వకుంటే ఆశీర్వాదాలు లభించవు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. అర్థము కూడా చేయిస్తారు మళ్లీ అడుగుతారు కూడా. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. భలే ఎవరైనా సర్వవ్యాపి అని చెప్పినా, మొదట తండ్రి పరిచయాన్ని తెలుసుకోవాలి కదా - తండ్రి ఎవరు? అని తెలుసుకొని తండ్రి నివాసమెక్కడుంది? అని తెలియచేయాలి. తండ్రి ఎవరో తెలియనే తెలియకుంటే వారి నివాస స్థానమెలా తెలుస్తుంది? ఆయన నామ-రూపాల నుండి భిన్నమైనవారని చెప్తారు అనగా లేనే లేరు. ఎవరు లేనే లేరో వారి నివాస స్థానము గురించి ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు పిల్లలైన మీకు ఇదంతా తెలుసు. తండ్రి మొట్టమొదట తన పరిచయమునిచ్చారు. తర్వాత ఉండే స్థానము గురించి అర్థం చేయించబడ్తుంది. తండ్రి చెప్తున్నారు - నేను ఈ రథము ద్వారా పరిచయమిచ్చేందుకు వచ్చాను. నేను అందరికీ తండ్రిని. పరమపిత అని పిలువబడ్తున్నాను. ఆత్మను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రికే నామ-రూప-దేశ-కాలాలు లేకుంటే పిల్లలకెలా ఉంటాయి? ఆ తండ్రే నామ-రూపాల నుండి భిన్నమైనవారైతే పిల్లలెక్కడ నుండి వస్తారు? పిల్లలుంటే తండ్రి తప్పకుండా ఉండనే ఉన్నారని అర్థము. కావున ఆయన నామ-రూపాలకు అతీతుడు కాడని ఋజువవుతుంది. పిల్లలకు కూడా నామ-రూపాలున్నాయి. భలే ఎంత సూక్ష్మంగా ఉన్నా నామ-రూపాలున్నాయి. ఆకాశము సూక్ష్మమైనదైనా, దాని పేరు ఆకాశమని ఉంది కదా? ధృవాలు ఎంత సూక్ష్మమో, తండ్రి కూడా అంత సూక్ష్మమైనవారు. పిల్లలు తండ్రిని అద్భుతమైన నక్షత్రమని వర్ణిస్తారు. ఇతనిలో ప్రవేశిస్తారు. ఇతనిని ఆత్మ అని అంటారు. తండ్రేమో పరంధామములో ఉంటారు. అది వారుండే స్థానము. దృష్టి పైకి పోతుంది కదా. వ్రేలిని పైకి చూపిస్తూ స్మృతి చేస్తారు. స్మృతి చేస్తున్నారంటే వారు తప్పకుండా ఉంటారు. పరమపిత పరమాత్మ అని అంటారు కదా. అయినా నామ-రూపాలు లేనివారు అనడం అజ్ఞానమని అంటారు. తండ్రిని తెలుసుకోవడం జ్ఞానము. ఇంతకుముందు మనము అజ్ఞానులమని మీకు తెలుసు. తండ్రి ఎవరో, మనమెవరో మనకు తెలిసేది కాదు. స్వయం గురించి కూడా తెలియదు. ఇప్పుడు మనము శరీరాలు కాదు, ఆత్మలమని తెలుసుకున్నాము. ఆత్మ అవినాశి అని అంటారు అనగా అది ఏదో ఒక వస్తువే కదా. అవినాశి అనేది పేరు కాదు. అవినాశి అనగా వినాశనము కానిది. కావున తప్పనిసరిగా ఏదో ఒక వస్తువు ఉందని అర్థము. పిల్లలకు బాగా అర్థము చేయించారు, మధురాతి మధురమైన పిల్లలారా - పిల్లలారా, పిల్లలారా! అని ఎవరిని అంటున్నారో వారు అవినాశి ఆత్మలు. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి తన పరిచయాన్నిచ్చే నాటకము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. నేను కూడా పాత్రను అభినయిస్తాను. నేనెలా పాత్ర చేస్తున్నానో మీ బుద్ధిలో ఉంది. పాతది అనగా పతిత ఆత్మను క్రొత్తదిగా, పావనంగా చేస్తున్నారు. అప్పుడు సత్యయుగములో మీ శరీరాలు కూడా పావనంగా పుష్పము వలె ఉంటాయి. ఇదంతా బుద్ధిలో ఉంది కదా.

ఇప్పుడు మీరు బాబా-బాబా అని పిలుస్తున్నారు, ఈ పాత్ర జరుగుతోంది కదా. పిల్లలైన మనలను శాంతిధామములోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని ఆత్మ చెప్తుంది. శాంతిధామము తర్వాత సుఖధామము ఉంటుంది. శాంతిధామము తర్వాత దుఃఖధామముండదు. నూతన ప్రపంచములో సుఖముంటుందనే చెప్పబడ్తుంది. ఈ దేవీ దేవతలు చైతన్యమై ఎవరైనా మీ నివాసమెక్కడ అని వారిని అడిగితే, మేము స్వర్గములో ఉండేవారమని చెప్తారు. కాని ఈ జడమూర్తులు(విగ్రహాలు) చెప్పలేవు. ఇప్పుడు మీరు - మేము వాస్తవంగా స్వర్గములో దేవీదేవతలుగా ఉండేవారము. 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు ఈ సంగమ యుగములోకి వచ్చామని చెప్పగలరు. ఇది ట్రాన్స్‌ఫర్‌(బదలీ) అయ్యే పురుషోత్తమ సంగమ యుగము. మనము చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము, మనము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత సతోప్రధానంగా అవుతామని పిల్లలకు తెలుసు. సతోప్రధానంగా కూడా నంబరువారుగానే ఉంటారు. ఇదంతా ఆత్మకు లభించిన పాత్ర. మనిషికి పాత్ర లభించిందని అనరు. నేను ఆత్మను, నాకు పాత్ర లభించింది. నేను ఆత్మను, 84 జన్మలు తీసుకుంటాను. మనము ఆత్మలము, వారసులము. వారసులనగా సదా పురుషులే, స్త్రీలు కారు. అందువలన ఆత్మలైన మనమంతా పురుషులమని మీకు పక్కాగా తెలుసు. అందరికీ అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. హద్దులోని లౌకిక తండ్రి ద్వారా కేవలం పుత్రులకే వారసత్వము లభిస్తుంది. ఆడపిల్లలకు లభించదు. ఆత్మ సదా స్త్రీగానే జన్మించదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఆత్మలు కొన్నిసార్లు పురుషుని శరీరాలు, కొన్నిసార్లు స్త్రీ శరీరాలు తీసుకుంటారు. ఈ సమయములో మీరందరు పురుషులు. ఆత్మలందరికి ఒక్క తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. అందరూ నా పిల్లలే. అందరి తండ్రి ఒక్కరే. తండ్రి కూడా చెప్తున్నారు - ఓ పిల్లలారా! - ఆత్మలైన మీరంతా పురుషులే. నా ఆత్మిక పిల్లలు పాత్రను అభినయించేందుకు స్త్రీలు - పురుషులు ఇరువురూ కావాలి. అప్పుడే మానవ సృష్టి వృద్ధి అవుతుంది. ఈ విషయాలను మీరు తప్ప ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. మనమంతా సోదరులమే అని అంటారు. కానీ అసలైన అర్థమెవ్వరికీ తెలియదు.

బాబా అనేక పర్యాయాలు మీ నుండి వారసత్వము తీసుకున్నామని ఇప్పుడు మీరంటారు. ఆత్మకు ఇది పక్కా అయిపోతుంది. ఆత్మలు, ''ఓ బాబా! దయ చూపండి'' ఇప్పుడు మీరు రండి, మేమంతా మీ పిల్లలమవుతాము. దేహ సహితముగా దేహ సంబంధాలన్నీ వదిలి ఆత్మలమైన మేము మిమ్ములనే స్మృతి చేస్తాము అని తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. తండ్రి నుండి మనమెలా వారసత్వము పొందుకుంటున్నామో ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనము ఈ దేవతలుగా ఎలా అవుతామో ఇవన్నీ తెలుసుకోవాలి కదా. స్వర్గ వారసత్వము ఎవరి నుండి లభిస్తుందో ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. తండ్రి స్వర్గవాసి కాదు, కాని పిల్లలను స్వర్గవాసులుగా చేస్తారు. ఆయన మాత్రము నరకములోనే వస్తారు. మీరు తండ్రిని పిలిచేది కూడా తమోప్రధానమైన నరకములో ఉన్నప్పుడు మాత్రమే. ఇది తమోప్రధాన ప్రపంచము కదా. సతోప్రధాన ప్రపంచము 5 వేల సంవత్సరాల క్రితము ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఈ విషయాలను, ఈ చదువును ఇప్పుడు మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఇది మానవుల నుండి దేవతలుగా అయ్యే చదువు. మానవులను దేవతలుగా తయారు చేయువారి మహిమను వర్ణించలేము(మనుష్య్‌ సే దేవతా కియే కరత్‌ నాలాగీ వార్‌,...........) పుత్రుడవుతూనే వారసునిగా అవుతాడు. తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరంతా నా పిల్లలే. మీకు వారసత్వమునిస్తాను. మీరంతా సోదరులు. మూలవతనము లేక నిర్వాణధామములో ఉంటారు. దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఈ సూర్య-చంద్రుల కంటే దూరంగా అత్యంత మధురమైన శాంతియుతమైన మీ ఇల్లు ఉంది. కానీ అక్కడే కూర్చుండిపోరాదు. అచ్చట కూర్చుని ఏమి చేస్తారు? అక్కడ మీ స్థితి జడ వస్తువు వలె ఉంటుంది. ఆత్మ పాత్ర చేసినప్పుడు మాత్రమే చైతన్యమని అంటారు. చైతన్యమే కాని పాత్రను చేయకుంటే జడమవుతుంది కదా. మీరిక్కడ నిలబడి చేతులు, కాళ్ళు కదపకుండా ఉంటే జడము వలె ఉంటారు. అక్కడ స్వాభావిక శాంతి ఉంటుంది. ఆత్మలు జడము వలె ఉంటాయి. ఏ పాత్ర చేయవు. పాత్ర చేసినప్పుడే శోభిస్తుంది. శాంతిధామములో ఏ శోభ ఉంటుంది? ఆత్మ సుఖ-దుఃఖాల నుండి అతీతంగా ఉంటుంది. పాత్రనే చేయకుంటే అక్కడ ఉన్నందున లాభమేముంది? మొట్టమొదట సుఖ పాత్ర చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఇక్కడకు రాకముందు నుండే పాత్ర లభించి ఉంది. మాకు మోక్షము కావాలని కొంతమంది అంటారు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిందని అంటారు అనగా ఆత్మ లేనే లేనట్లు అంటారు. పాత్ర ఏదీ లేకుంటే జడము వలె ఉంటుంది. చైతన్యమైనా జడములే పడి ఉంటే లాభమేముంది? అందరూ పాత్ర చేసే తీరాలి. హీరో-హీరోయిన్ల పాత్ర ముఖ్యమైనదని అంటారు. పిల్లలైన మీకు హీరో-హీరోయిన్లనే బిరుదు లభిస్తుంది. ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది, మొదట సుఖప్రదమైన రాజ్యము చేస్తుంది. తర్వాత రావణుని దుఃఖప్రదమైన రాజ్యములోకి పోతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - అందరికీ ఈ సందేశమివ్వండి. టీచరై ఇతరులకు చెప్పండి. టీచరుగా అవ్వకుంటే పదవి తగ్గిపోతుంది. టీచరుగా అవ్వకుంటే ఎవరికైనా ఆశీర్వాదాలెలా లభిస్తాయి? ఎవరికైనా ధనము ఇస్తే వారికి సంతోషము కలుగుతుంది కదా. బి.కెలు మా పై దయ చూపించారని అనుకుంటారు. ఎంతో నీచంగా ఉన్న మమ్ములను ఎంతో ఉన్నతంగా చేస్తారని అనుకుంటారు. నిజానికి ఒక్క తండ్రిని మాత్రమే మీరు మహిమ చేస్తారు - వాహ్‌ బాబా! మీరు, ఈ పిల్లల ద్వారా మాకెంతో కళ్యాణము చేస్తున్నారు. ఎవరో ఒకరి ద్వారా జరుగుతుంది కదా. తండ్రి చేసి చేయించేవారు. మీ ద్వారా చేయిస్తారు. మీ కళ్యాణము జరిగినందున, ఇతరులకు నాటు వేస్తారు. ఎవరెంత సేవ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. రాజులుగా అవ్వాలంటే ప్రజలను తయారు చేసుకోవాలి. మంచి నెంబరులో వచ్చేవారు కూడా రాజులుగా అవుతారు. మాల తయారవుతుంది కదా. మాలలో నా నంబరు ఎంత ఉంటుంది ? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ముఖ్యమైనవారు నవరత్నాలు కదా. మధ్యలో ఉండే వజ్రము, రత్నాలుగా తయారుచేయు బాబా వజ్రాన్ని మధ్యలో ఉంచుతారు. మాలకు పై భాగములో పుష్పము కూడా ఉంటుంది కదా. ముఖ్యమైన పూసలుగా ఎవరు అవుతారో, వంశములో ఎవరు వస్తారో చివర్లో మీకు తెలుస్తుంది. చివర్లో అన్ని సాక్షాత్కారాలు మీకు తప్పకుండా అవుతాయి. శిక్షలు ఎలా అనుభవిస్తారో చూస్తారు. ప్రారంభములో మీరు సూక్ష్మవతనములో దివ్యదృష్టితో చూశారు. ఇది కూడా గుప్తమే. ఆత్మలు శిక్షలెక్కడ అనుభవిస్తాయో కూడా చూస్తారు. ఇది కూడా డ్రామాలో పాత్రగా ఉంది. గర్భ జైలులో శిక్షలు అనుభవిస్తారు. గర్భజైలులో యమధర్మరాజును చూచి, ఇక బయటకు తీయమని ప్రాధేయపడ్తారు. జబ్బులు మొదలైన కష్టాలు కూడా, కర్మల లెక్కాచారమే కదా. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. తండ్రి తెలిపించేది తప్పక సత్యమే(రైటే) కదా. ఇప్పుడు మీరు ధర్మయుక్తము(రైటియస్‌)గా అవుతున్నారు. తండ్రి నుండి చాలా శక్తిని తీసుకున్నవారిని ధర్మపరులు అని అంటారు.

మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. ఎంత గొప్ప శక్తి ఉంటుంది అక్కడ హంగామా(గలాటాల) మాటే లేదు. శక్తి తక్కువగా ఉంటే ఎన్నో గలాటాలు జరుగుతాయి. పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థమనుసారముగా అర్ధకల్పానికి శక్తి లభిస్తుంది. ఒకే విధమైన శక్తి గాని, ఒకే విధమైన పదవి గాని లభించదు. ఇది కూడా ముందే నిర్ణయించబడి ఉంది. డ్రామాలో అనాదిగా నిర్ణయించబడింది. కొంతమంది చివర్లో వస్తారు. 1-2 జన్మలు మాత్రమే తీసుకొని శరీరాన్ని వదిలేస్తారు. దీపావళిలో దోమలెలా రాత్రి జన్మించి ఉదయానికంతా చనిపోతాయో అలా త్వరగా మరణిస్తారు. ఆ దోమలెన్నో లెక్కపెట్టలేము. కాని మనుష్యులను లెక్కిస్తారు. మొదట వచ్చే ఆత్మలు దీర్ఘాయువు కలిగి ఉంటాయి. పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి - మనము దీర్ఘాయువు గలవారిగా అవుతాము. మీరు పూర్తి పాత్రను అభినయిస్తారు. మీరు పూర్తి పాత్రనెలా చేస్తారో తండ్రి మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. చదువు అనుసారము పాత్రను అభినయించేందుకు వస్తారు. క్రొత్త ప్రపంచానికి వెళ్లేందుకే ఈ చదువు అనేకమార్లు మిమ్ములను చదివిస్తానని తండ్రి చెప్తున్నారు. చదువు అవినాశిగా అవుతుంది. అర్ధకల్పము మీకు ప్రాలబ్ధము లభిస్తుంది. ఆ వినాశి చదువు ద్వారా సుఖము కూడా అల్పకాలము కొరకే లభిస్తుంది. ఇప్పుడెవరైతే బ్యారిష్టరుగా అవుతారో వారు కల్పము తర్వాత కూడా బ్యారిష్టరుగానే అవుతారు. ఇప్పుడున్న పాత్రనే, కల్ప-కల్పము అదే పాత్రను అభినయిస్తారు. ఎలాంటి తేడా ఉండదు. ప్రతి ఒక్కరు వారి-వారి పాత్ర అభినయిస్తూనే ఉంటారు. ఇదంతా ముందే తయారైన డ్రామా. పురుషార్థము గొప్పదా? ప్రాలబ్ధము గొప్పదా? అని అడుగుతారు. పురుషార్థము చేయకుంటే ప్రాలబ్ధము లభించదు. ప్రపంచమంతటా ఏ ఏ కర్మలు జరుగుతున్నాయో అవన్నీ తయారైన డ్రామానే. ఆది నుండి అంత్యము వరకు మొదటనే ఆత్మలో నిర్ణయించబడి ఉంది. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. వజ్రముగానూ అవుతుంది, గవ్వగానూ అవుతుంది. ఈ విషయాలన్నీ మీరిప్పుడు మాత్రమే వింటున్నారు. పాఠశాలలో పాస్‌ అవ్వకుంటే బుద్ధిహీనులని అంటారు, ధారణ జరగదు. దీనిని వెరైటి వృక్షమని అంటారు. వెరైటి పోలికలు. ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని తండ్రి మాత్రమే విశదీకరిస్తున్నారు. కల్పవృక్షము గురించి కూడా అర్థం చేయిస్తారు. మర్రిచెట్టు ఉదాహరణ కూడా దీని కొరకే. దానికి చాలా శాఖోపశాఖలుంటాయి. ఆత్మలు అవినాశి అని, శరీరము వినాశి అని పిల్లలకు తెలుసు. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శరీరాలు మారిపోతూ ఉంటాయి. ఆత్మలేమో అవే, ఆత్మనే భిన్న-భిన్న శరీరాలు ధరించి పాత్ర చేస్తుంది. ఇది క్రొత్త విషయము కదా. పిల్లలైన మీకు కూడా, ఇప్పుడే ఈ జ్ఞానము లభించింది. కల్పక్రితము కూడా ఇలాగే అర్థము చేసుకున్నారు. తండ్రి వచ్చేది భారతదేశములోనే, మీరు అందరికీ సందేశమును ఇస్తూ ఉంటారు. సందేశము లభించకుండా ఎవ్వరూ ఉండరు. సందేశాన్ని వినడం అందరికీ ఒక హక్కు. తర్వాత తండ్రి నుండి వారసత్వము కూడా తీసుకుంటారు. కొంచెమైనా వింటారు కదా. అందరూ తండ్రికి పిల్లలే కదా. నేను ఆత్మలైన మీకు తండ్రినని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా ద్వారా ఈ రచన సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నందున మీరు ఈ పదవిని పొందుతారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. తండ్రే ఏమో అందరికి సద్గతినిస్తారు. ' ఓహో బాబా మీ లీల! ' అని అంటారు. కాని ఏ లీల? ఎలాంటి లీల. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసే లీల. అది తెలియాలి కదా. తెలుసుకునేది మానవులే కదా. ఆ తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రి జ్ఞానసాగరులు. మిమ్ములను కూడా జ్ఞాన సంపన్నులుగా చేస్తారు. మీరు నెంబరువారుగా అవుతారు. స్కాలర్‌షిప్‌ తీసుకునేవారిని జ్ఞాన సంపన్నులు అని అంటారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సదా ఈ స్మృతిలో ఉండాలి - ''ఆత్మలైన మేమంతా పురుషులము'', తండ్రి నుండి సంపూర్ణ వారసత్వము తీసుకోవాలి. మానవుల నుండి దేవతలయ్యే చదువును చదవాలి, చదివించాలి.
2. ప్రపంచములో జరిగే పాత్ర అంతా ముందే తయారైన డ్రామా. ఇందులో పురుషార్థము, ప్రాలబ్ధము రెండూ నిర్ణయించబడి ఉన్నాయి. పురుషార్థము చేయకుంటే ప్రాలబ్ధము లభించదు. ఈ విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి.

వరదానము :- '' పవిత్రత యొక్క లోతును తెలుసుకొని సుఖ-శాంతి సంపన్నంగా అయ్యే మహాన్‌ ఆత్మా భవ ''
పవిత్రతా శక్తికి గల గొప్పతనాన్ని(మహానతను) తెలుసుకొని ఇప్పటి నుండే పవిత్రమైన అనగా పూజ్య దేవాత్మలుగా అవ్వండి, చివర్లో అవుతామని అనుకోకండి. చాలా సమయం నుండి జమ చేసుకున్న ఈ శక్తి అంతిమ సమయంలో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయిపోయామని...... భావిస్తారు. కాని పవిత్రత జనని. సంకల్పంలో, వృత్తిలో, వాయుమండలంలో, వాచాలో, సంపర్కంలో సుఖ-శాంతుల జననిగా అయ్యేవారినే మహాన్‌ ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :- '' ఉన్నతమైన స్థితిలో స్థితమై ఆత్మలందరికి దయా దృష్టినివ్వండి, వైబ్రేషన్లు వ్యాపింపజేయండి ''

No comments:

Post a Comment