Sunday, November 17, 2019

Telugu Murli 18/11/2019

18-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - హద్దు ప్రపంచములోని పనికిరాని వ్యర్థ విషయాలలో మీ టైమ్‌ వేస్ట్‌ చేసుకోవద్దు, బుద్ధిలో సదా రాయల్‌ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ''

ప్రశ్న :- ఏ పిల్లలు తండ్రి ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకు రాగలరు ?
జవాబు :- ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తమను ప్రదర్శించుకోరో, ఆత్మిక నశాలో ఉంటారో, వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకు రాగలరు. మీకు ఎప్పుడూ మిథ్యా అహంకారం రాకూడదు. లోలోపల చాలా శుభ్రంగా ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి, ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఉప్పునీరు అనగా ఉప్పుదనపు సంస్కారము ఉండరాదు, అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్‌ అమలులోకి వస్తుంది.

ఓంశాంతి. పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు, శ్రీమతానుసారంగా మేము మా ఫరిస్తాన్‌ స్థాపన చేస్తున్నామని పిల్లలకు గర్వం(నశా) ఉంది. మురికి(వ్యర్థము) మొదలైన పనికిరాని వ్యర్థ విషయాలన్నీ తొలగించి వేయాలి. అనంతమైన తండ్రిని చూస్తూనే ఉల్లాసంలోకి వచ్చేయాలి. మీరు ఎంతెంత స్మృతియాత్రలో ఉంటారో అంత ఇంప్రువ్‌మెంట్‌(మెరుగుదల) వస్తూ ఉంటుంది. తండ్రి చెప్తారు - పిల్లల కొరకు ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటి ఉండాలి. మీది వరల్డ్‌ స్పిరిచ్యుయల్‌ యూనివర్సిటి. మరి ఈ యూనివర్సిటి ఎక్కడుంది? ముఖ్యంగా యూనివర్సిటి స్థాపన చేయబడ్తుంది. దానితో పాటు పెద్ద రాయల్‌ హాస్టల్‌ ఉండాలి. మీ ఆలోచనలు ఎంత రాయల్‌గా ఉండాలి! తండ్రికైతే రాత్రింబవళ్లు ఇదే ఆలోచన ఉంటుంది - ఈ చదువుతో విశ్వానికి అధిపతులుగా అయ్యే పిల్లలను ఎలా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్‌ చేయించాలి? అసలు మీ ఆత్మ శుద్ధంగా, సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎంతో సతోప్రధానంగా, సుందరంగా ఉండేది. రాజసం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది! హద్దు ప్రపంచంలోని వ్యర్థమైన విషయాలలో మీ సమయం చాలా వేస్ట్‌ అవుతుంది. విద్యార్థులైన మీలో వ్యర్థమైన ఆలోచనలు ఉండరాదు. కమిటీలు మొదలైనవి చాలా మంచి మంచివి తయారు చేస్తారు కానీ యోగబలం లేదు. మేము ఇది చేస్తాము, ఇది చేస్తాము అంటూ బడాయి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. మాయ కూడా నేను వీరి ముక్కు-చెవులు పట్టుకుంటానని అంటుంది. తండ్రి పై ప్రేమే లేదు. నరుడు కోరుకునేది ఒకటైతే,..... అని అంటారు కదా! కనుక మాయ కూడా ఏదీ చెయ్యనివ్వదు. మాయ చాలా మోసకారి, చెవులు కొరికేస్తుంది. పిల్లలను తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారు! ఇది-ఇది చెయ్యండి అని డైరెక్షన్‌ ఇస్తారు. బాబా గొప్ప రాయల్‌-రాయల్‌ పిల్లలను పంపిస్తారు. కొందరు బాబా మేము ట్రైనింగ్‌ ఇచ్చేందుకు వెళ్ళమా? అని అంటారు. అయితే బాబా చెప్తారు - పిల్లలూ, మొదట మీరు మీ లోపాలను తొలగించుకోండి. మాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి? అని స్వయాన్ని చూచుకోండి. మంచి మంచి మహారథులను కూడా మాయ ఒక్కసారిగా ఉప్పునీరుగా చేస్తుంది. ఇటువంటి ఉప్పుదనం ఉన్న పిల్లలు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేసుకోరు. జ్ఞానంలో '' జ్ఞ '' కూడా తెలియదు. బయటికి ప్రదర్శించుకోవడం(షో) చాలా చేస్తారు. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి. కానీ చాలామంది నడవడిక ఎలా ఉందంటే, చదువులేని జట్‌ తెగవారు(సింధ్‌లో ఒక తెగవారు) ఉంటారు, కొద్దిగా డబ్బుంటే వారికి నశా తలకెక్కుతుంది, అరే! మేము పేదగా ఉన్నామని కూడా అర్థం చేసుకోరు. మాయ అర్థం చేసుకోనివ్వదు. మాయ చాలా బలశాలి. బాబా కొద్దిగా పొగిడితే దానితో చాలా సంతోషిస్తారు.
యూనివర్సిటి చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి, అందులో పిల్లలు చాలా బాగా చదువుకోవాలి అని బాబాకు రాత్రి-పగలు ఇదే ఆలోచన నడుస్తుంది. మేము స్వర్గంలోకి వెళ్తాము అంటే సంతోషపు పాదరస మట్టము పైకెక్కి ఉండాలి కదా! ఇక్కడ బాబా రకరకాల డోసులిస్తారు, నశా ఎక్కిస్తారు. ఎవరైనా దివాలా తీసినా, వారికి మద్యం తాగిస్తే వారు, నేను చక్రవర్తినని భావిస్తారు. తర్వాత నశా పూర్తిగా దిగిపోతూనే ఎలా ఉన్నవారు అలాగే అవుతారు. ఇప్పుడిది ఆత్మిక నశా. అనంతమైన తండ్రి టీచరుగా అయ్యి మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇలా ఇలా చెయ్యండి అని డైరెక్షన్‌ ఇస్తారు. ఒక్కొక్క సమయంలో ఎవరికైనా మిథ్యా అహంకారం కూడా వస్తుంది. మాయ ఉంది కదా! అది ఎలాంటి విషయాలను తయారు చేస్తుందంటే అడగనే వద్దు. వీరు నడవలేరని బాబా భావిస్తారు. లోలోపల చాలా శుభ్రత కావాలి. ఆత్మ చాలా బాగుండాలి. మీకు లవ్‌ మ్యారేజ్‌ జరిగింది కదా! లవ్‌ మ్యారేజ్‌లో ఎంత ప్రేమ ఉంటుంది! వీరు పతులకు పతి. ఎంతోమందికి లవ్‌ మ్యారేజ్‌ జరుగుతుంది. ఒక్కరిదే జరగదు. మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగిందని అందరూ అంటారు. మేమైతే స్వర్గంలోకి వెళ్లి కూర్చుంటాము. సంతోషం కలిగించే విషయం కదా! బాబా మమ్ములను జ్ఞానం ద్వారా ఎంత అలంకరిస్తున్నారు! అని లోపల సంతోషం ఉండాలి. శివబాబా ఇతని ద్వారా అలంకరిస్తారు. మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. ఇందులో గొప్ప నశా ఉంటుంది. ఇప్పుడింకా అంత నశా లేదు. తప్పకుండా ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి గోప-గోపికలను అడగండని గాయనం కూడా ఉంది కదా! ఇప్పుడు మీ ఆత్మ ఎంత ఛీ-ఛీగా ఉంది! చాలా ఛీ-ఛీ మురికిలో కూర్చున్నట్లుగా ఉంది. వారిని తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు, రిజువనేట్‌(పునరుత్తేజితం) చేస్తారు. మార్పు చేయిస్తే మనుష్యులు ఎంత సంతోషిస్తారు! మీకు ఇప్పుడు తండ్రి లభించారు కనుక నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. మేము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామంటే స్వయాన్ని ఎంత త్వరగా సంస్కరించుకోవాలో మీరు అర్థం చేసుకున్నారు. రాత్రి-పగలు ఇదే సంతోషము, ఇదే చింతన ఉండాలి. మీకు మార్షల్‌గా ఎవరు లభించారో చూడండి! రాత్రి-పగలు ఇటువంటి ఆలోచనలలో ఉండాలి. ఎవరెవరు బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో, వారు ఎగురుతున్నట్లుగా అనిపిస్తారు.
పిల్లలైన మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన వారందరు మురికిలో పడి ఉన్నారు. చెత్త అంచుల్లో గుడిసెలు వేసుకొని మురికిలో కూర్చొని ఉంటారు కదా! ఎన్ని మురికి వాడలు తయారై ఉన్నాయి! ఇది అనంతమైన విషయం. ఇప్పుడు వాటి నుండి బయటికి తీసేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు - ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయని తెలుసు కదా. ఇప్పుడు మీరు బయటికి వచ్చారు. ఎవరెవరైతే బయటికి వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ట ఉంది కదా! మీకు తండ్రి లభించారు, ఇంకేం కావాలి! ఈ నశా ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి మన ఆత్మలను పవిత్రంగా చేస్తారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా ఫస్ట్‌క్లాసైనది లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చొని ఉంది? ఈ మురికి ఇంట్లో (శరీరంలో) కూర్చొని ఉంది. ఇది తమోప్రధాన ప్రపంచం కదా! చెత్త అంచుల్లోకి వచ్చి కూర్చున్నారు కదా! మేము ఎక్కడి నుండి బయటపడి వచ్చాము? అని ఆలోచించండి. తండ్రి మురుగు కాలువ నుండి బయటికి తీశారు. ఇప్పుడు మీ ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది. ఉండేందుకు కూడా ఫస్ట్‌క్లాస్‌ మహలు నిర్మిస్తారు. తండ్రి మన ఆత్మను అలంకరించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. పిల్లలకు లోలోపల ఇలాంటి ఆలోచనలు రావాలి. తండ్రి ఎంత నశా ఎక్కిస్తారు! మీరు ఇంత ఉన్నతంగా ఉండేవారు, తర్వాత దిగుతూ దిగుతూ వచ్చి క్రింద పడిపోయారు. శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది, కావున మళ్లీ పరస్పరం కలిసి త్వర త్వరగా శివాలయంలోకి వెళ్లే ఉపాయాన్ని తయారుచేయాలి.
బాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది - పిల్లలకు ఆ తెలివి లేదు. బాబా మనలను ఎక్కడ నుండి బయటికి తీస్తారు, పాండవ గవర్నమెంట్‌ స్థాపన చేసేవారు తండ్రి. భారతదేశము ఏదైతే హెవెన్‌గా(స్వర్గంగా) ఉండేదో, అది ఇప్పుడు హెల్‌గా(నరకంగా) ఉంది. ఇది ఆత్మ విషయం. ఆత్మ పైనే జాలి కలుగుతుంది. ఆత్మ ఒక్కసారిగా తమోప్రధాన ప్రపంచంలోకి వచ్చి కూర్చుంది. అందువలన బాబా, మమ్ములను అక్కడికి తీసుకెెళ్లండి అని తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నా మీకు ఈ ఆలోచలు నడుస్తూ ఉండాలి. అందువలన బాబా చెప్తారు, పిల్లల కొరకు ఫస్ట్‌క్లాస్‌ యూనివర్సిటీని నిర్మించండి. కల్ప-కల్పము తయారవుతుంది. మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడింకా ఆ నశా ఎక్కలేదు. నశా ఉంటే ఏం చేసి చూపించేవారో తెలియదు. పిల్లలకు యూనివర్సిటి అంటే ఏమిటో తెలియదు. ఆ రాయల్‌ నశాలో ఉండరు. మాయ అణిచేసింది. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు ఉల్టా నశా ఎక్కించుకోకండి, ప్రతి ఒక్కరు తమ తమ క్వాలిఫికేషన్‌(అర్హతలు) చూసుకోండి. మేము ఎలా చదువుతున్నాము, ఏం సహాయం చేస్తున్నాము ? కేవలం కబుర్ల పకోడీలు తినరాదు. ఏదైతే చెప్తామో అది చెయ్యాలి, ఇది చేస్తాము, ఇది చేస్తాము అని ప్రగల్భాలు పలకడం కాదు. ఇది చేస్తాము అని ఈ రోజు చెప్తారు, రేపు మృత్యువు వచ్చిందంటే సమాప్తం అయిపోతారు. సత్యయుగంలో అయితే ఇలా చెప్పము. అక్కడ ఎప్పటికీ అకాలమృత్యువు సంభవించదు. కాలుడు అక్కడకు రాలేడు. అది సుఖధామము. సుఖధామంలోకి కాలుడు వచ్చేందుకు అనుమతి లేదు. రావణ రాజ్యము, రామ రాజ్యము ఈ రెండిటి అర్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీ పోరాటము రావణునితోనే. దేహాభిమానం కూడా చమత్కారం చేస్తుంది, అది పూర్తి పతితంగా చేస్తుంది. ఆత్మ-అభిమానిగా అవ్వడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది. అక్కడ మనం ఎటువంటి మహలు నిర్మిస్తామో మీరు అర్థం చేసుకున్నారు కదా! ఇప్పుడు మీరైతే సంగమ యుగంలోకి వచ్చేశారు. నంబర్‌వార్‌గా బాగుపడ్తున్నారు, యోగ్యులుగా అవుతున్నారు. మీ ఆత్మ పతితమైన కారణంగా శరీరం కూడా పతితమైనది లభించింది. ఇప్పుడు మిమ్ములను స్వర్గవాసులుగా చేసేందుకు నేను వచ్చాను. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు. మమ్ములను నరుని నుండి నారాయణునిగా చేసేందుకు బాబా వచ్చారని అర్థం చేసుకున్నారు, కానీ మాయతో చాలా గుప్తమైన పోటీ ఉంది. మీ పోరు గుప్తమైనది కనుక మిమ్ములను అన్‌నోన్‌ వారియర్స్‌(గుప్త యోధులు) అని అంటారు. అన్‌నోన్‌ వారియర్స్‌ ఇంకెవ్వరూ ఉండనే ఉండరు. మీ పేరే అన్‌నోన్‌ వారియర్స్‌. అందరి పేర్లు రిజిస్టర్‌లో ఉన్నాయి. అన్‌నోన్‌ వారియర్స్‌ అయిన మీ చిహ్నాన్ని వారు తీసుకున్నారు. మీరు ఎంత గుప్తంగా ఉన్నారు, మిమ్ములను గురించి ఎవ్వరికీ తెలియదు. మాయను వశం చేసుకునేందుకు మీరు విశ్వం పై విజయం పొందుతున్నారు, మీరు తండ్రిని స్మృతి చేస్తారు అయినా మాయ మరిపింపజేస్తుంది. కల్ప-కల్పము మీరు మీ రాజ్య స్థాపన చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తారు కనుక అన్‌నోన్‌ వారియర్స్‌ మీరే. ఇందులో కాళ్లు చేతులు కొంచెం కూడా ఉపయోగించరు. స్మృతి కొరకు యుక్తులు కూడా బాబా చాలా చెప్తారు. మీరు నడుస్తూ - తిరుగుతూ స్మృతియాత్ర చేయండి. చదువు కూడా చదవండి. మనము ఎలా ఉండేవారము ఎలా తయారయ్యామో, ఇప్పుడు మళ్లీ బాబా మనలను ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎంత సహజమైన యుక్తులు తెలుపుతారు! ఎక్కడ ఉన్నా స్మృతి చేయండి, మలినాలు తొలగిపోతాయి. కల్ప-కల్పము ఈ యుక్తి చెప్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఇక ఏ బంధనమూ ఉండదు. ఆత్మకు ఎటువంటి తిలకము దిద్దాల్సిన పని లేదు. ఇవన్నీ భక్తిమార్గపు చిహ్నాలు. ఈ జ్ఞాన మార్గంలో ఏదీ అవసరం లేదు, పైస ఖర్చు కూడా లేదు. ఇంట్లో కూర్చొని స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజము! ఆ బాబా మన తండ్రి, టీచరు, గురువు కూడా.
మొదట తండ్రి స్మృతి పిదప టీచరు స్మృతి, తర్వాత గురువు స్మృతి. నియమం ఇలా చెప్తోంది. టీచరునైతే తప్పకుండా స్మృతి చేస్తాము, వారి నుండి చదువు వారసత్వంగా లభిస్తుంది. వానప్రస్థంలో గురువు లభిస్తారు, ఈ తండ్రి అన్నీ ¬ల్‌సేల్‌గా ఇచ్చేస్తారు. మీకు 21 జన్మలకు రాచపదవి ¬ల్‌సేల్‌గా ఇచ్చేస్తారు. వివాహ సమయంలో కన్యకు కట్నం గుప్తంగా ఇస్తారు కదా! షో చెయ్యాల్సిన అవసరం లేదు. గుప్తదానం అంటారు. శివబాబా కూడా గుప్తంగా ఉన్నారు కదా, ఇందులో అహంకారంలోకి వచ్చే విషయం ఏదీ లేదు, కొందరికి అందరూ చూడాలని అహంకారం ఉంటుంది. ఇక్కడ అన్నీ గుప్తం. తండ్రి మీకు చక్రవర్తి పదవి కట్నంగా ఇస్తారు. మీ అలంకారం ఎంత గుప్తంగా జరుగుతోంది! ఎంత పెద్ద కట్నం లభిస్తుంది. తండ్రి ఎలా యుక్తిగా ఇస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు బెగ్గర్లు(బికార్లు), రాబోవు జన్మలో గోల్డెన్‌ స్పూన్‌ ఇన్‌ ద మౌత్‌(శ్రీమంతులు)గా ఉంటారు. మీరు గోల్డెన్‌ ప్రపంచంలోకి వెళ్తారు కదా! అక్కడ అన్నీ బంగారంతో చేసినవే ఉంటాయి. ధనవంతుల మహళ్లలో మంచిగా నగిషీలు చెక్కి, రత్నాలు పొదిగినవి ఉంటాయి. వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మాయ అందరినీ తలక్రిందులుగా(ఉల్టాగా) వ్రేలాడదీసిందని కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పిల్లలలో ఎంత ఉత్సాహం ఉండాలి. కానీ మాయ మరిపింపజేస్తుంది. ఇది తండ్రి డైరెక్షనా లేక బ్రహ్మ డైరెక్షనా? సోదరునిదా లేక తండ్రిదా? అని చాలా మంది తికమకపడ్తారు. మంచో, చెడో ఇది తండ్రి డైరెక్షనే అని మీరు భావించండని తండ్రి చెప్తారు. దాని పై నడవాల్సి ఉంటుంది. ఇతని వలన ఏదైనా పొరపాటు జరిగినా సరి చేయిస్తాము. వారిలో శక్తి ఉంది కదా! ఇతడు ఎలా నడుస్తాడో, ఇతని తల పై ఎవరు కూర్చున్నారో మీరు చూస్తారు. అమాంతం పక్కన కూర్చున్నారు. గురువులు పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా! అయినా శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి.
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చెయ్యండి. శివబాబా స్మృతి కలిగిన భోజనం ఇంకెవ్వరికి లభించజాలదు. ఇప్పటి భోజనానికే మహిమ ఉంది. ఆ బ్రాహ్మణులు భలే స్తుతి చేస్తారు కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. ఏదైతే మహిమ చేస్తారో, దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఇతను రిలిజియస్‌ మైండెడ్‌ అని ఇంతమాత్రం తెలుస్తుంది ఎందుకంటే పూజారిగా ఉన్నాడు. అక్కడైతే రిలిజియస్‌ మైండెడ్‌ అనే మాటే ఉండదు, అక్కడ భక్తి ఉండదు. భక్తి అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని అనేవారు. ఎంత ఫస్ట్‌ క్లాస్‌ పదాలు! జ్ఞానం పగలు, భక్తి రాత్రి. తర్వాత రాత్రితో వైరాగ్యం కలుగుతుంది. కనుక పగలులోకి వెళ్తారు. ఎంత స్పష్టంగా ఉంది! ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మోసపోరు.
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, నేను మిమ్ములను విశ్వానికి యజమానులుగా చేస్తాను. నేను మీ అనంతమైన తండ్రిని. సృష్టిచక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజము! బీజాన్ని, వృక్షాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం. మళ్లీ సత్యయుగం రావాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాలుగా అవుతారు. ఆత్మ సతోప్రధానంగా అయిపోతే మరి ఉండేందుకు కూడా సతోప్రధాన మహలు లభిస్తుంది. ప్రపంచమే కొత్తదిగా అయిపోతుంది. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము శ్రీమతమనుసారం మన ఫరిస్తాన్‌ స్థాపన చేస్తున్నామనే శుద్ధమైన గర్వము(నశా) సదా ఉండాలి. పనికిరాని వ్యర్థ మాటలను వదిలి గొప్ప ఉల్లాసంగా ఉండాలి.
2. తమ ఆలోచనలను చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి. చాలా మంచి రాయల్‌ యూనివర్సిటి మరియు హాస్పిటల్‌ తెరిచే ఏర్పాట్లు చెయ్యాలి. తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి, తమను ప్రదర్శించుకోరాదు.

వరదానము :- '' జ్ఞాన సంపన్న దాతలై సర్వ ఆత్మల పట్ల శుభ చింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాధారి భవ ! ''
శుభ చింతకులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము శుభ చింతన. ఎవరైతే వ్యర్థ చింతన లేదా పరచింతన చేస్తారో, వారు శుభచింతకులుగా అవ్వలేరు. శుభచింతక మణుల వద్ద శుభ చింతనల శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుదనం కారణంగానే ఇతరుల పట్ల శుభ చింతకులుగా అవ్వగలరు. శుభ చింతకులు అనగా సర్వ జ్ఞాన రత్నాలతో సంపన్నులు, ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ - తిరుగుతూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ శ్రేష్ఠ సేవాధారులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' విశ్వ రాజ్య అధికారిగా అవ్వాలంటే, విశ్వ పరివర్తనా కార్యంలో నిమిత్తమవ్వాలి. ''

No comments:

Post a Comment