Friday, November 22, 2019

Telugu Murli 23/11/2019

23-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సంగమ యుగము అదృష్టవంతులుగా తయారయ్యే యుగము. ఈ యుగములో మీరు మీ భాగ్య నక్షత్రాన్ని ఎంత కావాలంటే అంత మెరియునట్లు చేసుకోగలరు ''

ప్రశ్న :- మీ పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకునే సాధనము ఏది ?
జవాబు :- (ఫాలో ఫాదర్‌). తండ్రిని అనుసరిస్తూ ఉంటే పురుషార్థము తీవ్రమవుతుంది. తండ్రినే చూడండి. తల్లి అయితే గుప్తంగా ఉంది. తండ్రిని ఫాలో చేస్తే తండ్రి సమానంగా ఉన్నతంగా అవుతారు. కనుక ఆక్యురేట్‌(ఖచ్ఛితం)గా ఫాలో చేస్తూ ఉండండి.

ప్రశ్న :- తండ్రి ఏ పిల్లలను మందమతి(తెలివితక్కువ వారు) అని భావిస్తారు ?
జవాబు :- ఎవరికైతే తండ్రి లభించారనే సంతోషము ఉండదో వారు తెలివితక్కువ వారే కదా! విశ్వానికి యజమానిగా తయారుచేసే తండ్రికి పుత్రునిగా అయిన తర్వాత కూడా సంతోషం ఉండకపోతే మందమతి అనే అంటారు కదా.

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలూ! మీరు లక్కీ సితారలు(భాగ్యశాలి నక్షత్రాలు). మనము శాంతిధామాన్నే కాక తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు. తండ్రి స్మృతి ద్వారా మనము పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్తాము. ఇక్కడ కూర్చొని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఇక ఏ కష్టమూ ఇవ్వరు. జీవన్ముక్తి గురించి ఎవ్వరికీ తెలియదు. వారందరూ ముక్తి కొరకు పురుషార్థము చేస్తారు. కానీ ముక్తి అంటే ఏమిటో అర్థమే తెలియదు. కొందరు మేము బ్రహ్మములో లీనమైపోతాము, మళ్లీ ఇక్కడకు రానే రాము అని అంటారు కానీ ఈ చక్రములోకి తప్పకుండా రావాలని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థము చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులైన మనము భాగ్యశాలి నక్షత్రాలమని పిల్లలైన మీకు తెలుసు. అదృష్టవంతులను లక్కీ అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రియే అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కొందరి తండ్రులు ధనవంతులుగా, కొందరి తండ్రులు పేదవారుగా కూడా ఉంటారు. మనకు అనంతమైన తండ్రి లభించారని పిల్లలైన మీకు తెలుసు. ఎంత లక్కీగా తయారవ్వాలనుకుంటే అంత లక్కీగా తయారవ్వగలరు. ఎంత ధనవంతులుగా అవ్వాలనుకుంటే అంత ధనవంతులుగా అవ్వగలరు. ఏది కావాలన్నా పురుషార్థము ద్వారా తీసుకోండి అని తండ్రి అంటున్నారు. మొత్తం పురుషార్థం పైననే ఆధారపడి ఉంది. పురుషార్థం చేసి ఎంత ఉన్నత పదవి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అత్యంత ఉన్నత పదవి - ఈ లక్ష్మీ నారాయణులు. స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే తమోప్రధానము నుండి తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. మందమతిగా తయారై అలాగే కూర్చోరాదు. ఇప్పుడు పాత ప్రపంచము కొత్తదిగా అవుతుందని తండ్రి అర్థం చేయించారు. సతోప్రధాన కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖమునిచ్చేవారు. సతోప్రధానంగా తయారవుతేనే అనంతమైన సుఖమును పొందగలరని అర్థం చేయిస్తున్నారు. సతోగా అయితే తక్కువ సుఖము, రజోగా అయితే అంతకన్నా తక్కువ సుఖము. మొత్తం లెక్కాచారమంతా తండ్రి చెప్పేస్తారు. మీకు లెక్కలేనంత ధనం లభిస్తుంది, అనంతమైన సుఖము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వము పొందేందుకు తండ్రిని స్మృతి చేయడం తప్ప వేరే ఏ ఉపాయమూ లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంత దైవీగుణాలు కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సతోప్రధానంగా అవ్వాలంటే దైవీగుణాలు కూడా తప్పకుండా కావాలి. తమను తామే చెక్‌ చేసుకోవాలి. పురుషార్థం ద్వారా ఎంత ఉన్నత పదవి కావాలన్నా తీసుకోవచ్చు. చదివించే టీచరు కూర్చొని ఉన్నారు. తండ్రి అంటున్నారు - కల్ప-కల్పము మీకు ఇలాగే అర్థం చేయిస్తాను. కేవలం రెండే మాటలు - మన్మనాభవ, మధ్యాజీభవతో అనంతమైన తండ్రిని గుర్తించగలరు. ఈ అనంతమైన తండ్రే అనంతమైన జ్ఞానమును ఇచ్చేవారు. పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని కూడా ఆ బేహద్‌ తండ్రియే అర్థం చేయిస్తారు. కనుక తండ్రి కొత్త విషయమునేమీ అర్థం చేయించడం లేదు. పిండిలో ఉప్పు వలె గీతలో కూడా వ్రాసి ఉంది. స్వయాన్ని దేహీ(ఆత్మ)గా భావించండి. దేహమునకు సంబంధించిన అన్ని ధర్మాలు మర్చిపోండి. మీరు మొదట అశరీరిగా ఉండేవారు. ఇప్పుడు అనేక రకాల బంధు-మిత్రుల బంధనాలలోకి వచ్చారు. అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతామని తర్వాత బంధు-మిత్రులు మొదలైన వారందరూ పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. కల్పక్రితం ఎంత సతోప్రధానంగా అయ్యారో మళ్లీ అంతే అవుతారు. వారి పురుషార్థమే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? ఫాలోఫాదర్‌ అని గాయనముంది. ఇతడు(బ్రహ్మబాబా) ఎలాగైతే తండ్రిని స్మృతి చేస్తారో, పురుషార్థం చేశారో అదే విధంగా ఇతనిని అనుసరించండి. అయితే పురుషార్థం చేయించేవారు తండ్రియే. వారు పురుషార్థం చేయరు, చేయిస్తారు. వారు మళ్లీ చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఫాలోఫాదర్‌. గుప్తమైన తల్లి, తండ్రి ఉన్నారు కదా! తల్లి గుప్తంగా ఉన్నారు, తండ్రి అయితే కనిపిస్తారు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఉన్నత పదవి పొందాలంటే ఈ ఫాదర్‌(బ్రహ్మ) స్మృతి చేసే విధంగా తండ్రిని బాగా స్మృతి చేయండి. ఈ ఫాదరే(బ్రహ్మ) అందరికంటే ఉన్నత పదవి పొందుతారు. ఇతను చాలా ఉన్నతంగా ఉండేవాడు తర్వాత ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో నేను ప్రవేశించాను. ఈ విషయము బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మాయ చాలామందిని మరపింపజేస్తుంది. మీరు నరుని నుండి నారాయణగా అవుతామని అంటారు. అలా అయ్యేందుకు కూడా తండ్రి యుక్తిని తెలియజేస్తారు. అందరూ ఆక్యురేట్‌(ఖచ్ఛితం)గా తండ్రిని ఫాలో చేయరని కూడా మీకు తెలుసు. తండ్రి లక్ష్యమును తెలియజేస్తారు. ఫాలోఫాదర్‌ అనేది ఇప్పటి గాయనమే. తండ్రి కూడా ఇప్పుడే పిల్లలకు జ్ఞానం ఇస్తారు. సన్యాసుల ఫాలోయర్స్‌ అని పిలువబడ్తారు. కానీ అది రాంగ్‌ కదా! వారు ఫాలో చేయనే చేయరు. వారందరూ బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. వారికి ఈశ్వరుడు జ్ఞానమునివ్వరు. వారు తత్వము లేక బ్రహ్మజ్ఞానులని పిలువబడ్తారు. అయితే తత్వము అనగా బ్రహ్మము వారికి జ్ఞానమునివ్వదు. అదంతా శాస్త్రాల జ్ఞానము. ఇక్కడ మీకు తండ్రి జ్ఞానమునిస్తారు. వారిని జ్ఞానసాగరులని అంటారు. దీనిని బాగా నోట్‌ చేసుకోండి. ఇది హృదయంలో చాలా బాగా ధారణ చేసే విషయమని మీరు మర్చిపోతారు. తండ్రి ప్రతిరోజూ - మధురమైన పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలని అర్థం చేయిస్తూ ఉంటారు. పతితులుగా ఉంటే వెళ్లలేరు. పవిత్రంగా అవ్వాలంటే యోగబలముతో అవ్వాలి లేకుంటే శిక్షలు అనుభవించి వెళ్తారు. అందరి లెక్కాచారాలు తప్పకుండా చుక్తా అవ్వాల్సింది. ఆత్మలైన మీరు వాస్తవానికి పంరంధామములో ఉండేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఇక్కడకు వచ్చి సుఖ - దు:ఖాల పాత్రను అభినయించారు. రామరాజ్యంలో సుఖప్రదమైన పాత్ర, రావణరాజ్యంలో దు:ఖ పాత్రను చేశారు. రామరాజ్యమని స్వర్గాన్ని అంటారు. అక్కడ పూర్తిగా సుఖమే ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు అని పాడ్తారు కూడా. కనుక ఇది బాగా ధారణ చేయాలి - ఎంతెంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతూ ఉంటారో మీకు లోపల అంత సంతోషము కూడా ఉంటుంది. ద్వాపరంలో రజోలో ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగానే ఉండేవారు. అప్పుడు మీరు ఇంత దు:ఖితులుగా, వికారులుగా లేరు. ఇప్పుడు ఇక్కడ ఎంత దు:ఖితులుగా, వికారులుగా ఉన్నారు! ఎంత వికారులుగా, త్రాగుబోతులుగా ఉన్నారో మీరు మీ పెద్దవారిని చూడండి. మద్యము చాలా చెడ్డది. సత్యయుగంలో అయితే శుద్ధ ఆత్మలే ఉంటారు. తర్వాత క్రిందికి దిగుతూ దిగుతూ పూర్తి ఛీ-ఛీగా అయిపోతారు. అందుకే దీనిని రౌరవ నరకమని అంటారు. మద్యము(సారాయి) ఎటువంటిదంటే కొట్లాటలు, చంపుకోవడం వంటి హాని చేసేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ రోజుల్లో మనుష్యుల బుద్ధి భ్రష్ఠమైపోయింది. మాయ చాలా బలమైనది. తండ్రి సర్వశక్తివంతుడు, సుఖమునిచ్చేవారు. మాయ చాలా దు:ఖమునిస్తుంది. కలియుగంలో మనుష్యుల స్థితి పూర్తిగా శిథిలమైపోతుంది. రాతిబుద్ధి వలె ఏమీ అర్థమే చేసుకోరు. ఇది కూడా డ్రామాయే కదా. అదృష్టంలో లేకుంటే ఇటువంటి రాతిబుద్ధి గలవారిగా అయిపోతారు. తండ్రి జ్ఞానాన్ని చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలూ! పిల్లలూ! అంటూ అర్థము చేయిస్తూ ఉంటారు. మాతలు కూడా ''మాకు 5 మంది లౌకిక పుత్రులు, ఒకరు పారలౌకిక పుత్రుడు అని చెప్తారు.'' ఆ పుత్రుడు మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు అని అంటారు. తండ్రి అర్థము చేసుకుంటే పిల్లలు కూడా అర్థము చేసుకుంటారు. ఇంద్రజాలికుడు వచ్చారు కదా! తండ్రి ఇంద్రజాలికుడైతే పిల్లలు కూడా ఇంద్రజాలికులవుతారు. బాబా మాకు కొడుకు కూడా అని అంటారు కనుక ఆ తండ్రిని ఫాలో చేసి ఇలా తయారవ్వాలి. స్వర్గంలో వీరి రాజ్యమే ఉండేది కదా. శాస్త్రాలలో ఈ విషయాలే లేవు. ఈ భక్తిమార్గ శాస్త్రాలు కూడా డ్రామాలో ఉన్నాయి. మళ్లీ కూడా ఉంటాయి. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. చదివించేందుకు టీచరు కావాలి కదా. పుస్తకాలు టీచరుగా అవ్వలేవు. పుస్తకాలే టీచరైతే, టీచరు అవసరమే ఉండదు. ఈ పుస్తకాలు మొదలైనవి సత్యయుగంలో ఉండవు.
మీరు ఆత్మను తెలుసుకున్నారు కదా. ఆత్మల తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఎవరైనా వస్తే అందరూ హిందు-ముస్లిమ్‌ భాయీ-భాయీ అని అంటారు. కానీ దాని అర్థము కొంచెము కూడా తెలియదు. భాయీ-భాయీ అంటే అర్థము తెలుసుకోవాలి కదా. తప్పకుండా వారికి తండ్రి కూడా ఉంటాడు. పైసా అంత తెలివి కూడా లేకుండా పోయింది. భగవానువాచ - ఇది చాలా జన్మల అంతిమ జన్మ. అర్థం ఎంత స్పష్టంగా ఉంది. ఎవరూ గ్లాని చేయరు. తండ్ర్రి అయితే మార్గము తెలియజేస్తారు. నంబరువన్‌లో ఉన్నవారే లాస్ట్‌గా, తెల్లగా ఉన్నవారే నల్లగా అవుతారు. మేము తెల్లగా ఉండేవారము, మళ్లీ అలా అవుతామని మీకు కూడా తెలుసు. ఇది రావణ రాజ్యము. రామరాజ్యాన్ని శివాలయమని అంటారు. సీత యొక్క రాముడు త్రేతాలో రాజ్యము చేశాడు. ఇందులో కూడా జ్ఞాన విషయముంది. రెండు కళలు తగ్గాయని అంటారు. సత్యయుగము ఉన్నతమైనది. సత్యయుగాన్ని గుర్తు చేసుకున్నంతగా త్రేతా, ద్వాపర యుగాలను గుర్తు చేసుకోరు. సత్యయుగము కొత్త ప్రపంచము, కలియుగము పాత ప్రపంచము. నూరు శాతము సుఖము, నూరు శాతము దు:ఖము. త్రేతా మరియు ద్వాపరము సెమీ(మధ్యస్థము). కనుక ముఖ్యంగా సత్యయుగము మరియు కలియుగము చెప్పుకోబడ్తాయి. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీ పని పురుషార్థం చేయడం. సత్యయుగ నివాసులుగా అవుతారా? త్రేతాయుగ నివాసులుగా అవుతారా? ద్వాపరంలో కిందికి దిగుతారు అయినా దేవీ దేవతా ధర్మము వారిగానే ఉంటారు. కానీ పతితులైన కారణంగా తమను దేవీ దేవతలమని చెప్పుకోలేరు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - మన్మనాభవయే ముఖ్యమైనది. మీరే నంబరువన్‌గా అవుతారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ చివరికి వచ్చేస్తారు మళ్లీ నంబరువన్‌లోకి వెళ్తారు. ఇప్పుడు బేహద్‌ తండ్రిని స్మృతి చేయాలి. వారు అనంతమైన తండ్రి. వారు సంగమ యుగములోనే వచ్చి మీకు 21 తరాల స్వర్గ సుఖాన్ని ఇస్తారు. అక్కడ ఆయువు పూర్తి అవ్వగానే మీ అంతట మీరే శరీరాన్ని వదిలేస్తారు. యోగబలం కదా. పద్ధతియే ఆ విధంగా రచింపబడి ఉంది. దీనినే యోగబలము అని అంటారు. అక్కడ జ్ఞానమే ఉండదు. ఆటోమేటిక్‌గా మీరు వృద్ధులుగా అవుతారు. అక్కడ అస్వస్థత మొదలైనవి ఉండవు. ఎవ్వరూ జబ్బుపడరు. అక్కడ కుంటివారు లేక వికలాంగులు మొదలైనవారు ఉండరు. ఎవర్‌హెల్దీగా(సదా ఆరోగ్యంగా) ఉంటారు. అక్కడ దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. తర్వాత కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ వస్తాయి. అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందేందుకు ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేయాలి. పాస్‌ విత్‌ ఆనర్‌ అవ్వాలి కదా. ఉన్నత పదవి అందరూ పొందలేరు. సర్వీసే చేయనివారు ఏ పదవి పొందుతారు! మ్యూజియంకు పిలవకుండానే జనం వచ్చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత సేవ చేస్తారు. దీనినే విహంగమార్గ సేవ అని అంటారు. దీనితో పాటు ఇంకా ఏదైనా విహంగమార్గ సేవ వెలువడవచ్చేమో తెలియదు. రెండు - నాలుగు ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలి. ప్రతి చోట త్రిమూర్తి, కల్పవృక్షము, సృష్టి చక్రము, మెట్ల చిత్రము చాలా పెద్దవిగా ఉండాలి. పిల్లలు తెలివైనవారిగా అయినప్పుడు సర్వీసు జరుగుతుంది కదా. సర్వీసు జరగనే జరుగుతుంది. గ్రామాల్లో కూడా సర్వీసు చేయాలి. మాతలు భలే చదువుకోకపోయినా తండ్రి పరిచయమివ్వడం చాలా సులభము. ఇంతకు ముందు స్త్రీలు చదువుకునేవారు కాదు. ముసల్మానుల రాజ్యంలో ఒక్క కన్నే తెరచి బయటికి వెళ్లేవారు. ఈ బాబా చాలా అనుభవజ్ఞుడు. నాకు ఇవన్నీ తెలియవు అని తండ్రి అంటున్నారు. నేను పైననే ఉంటాను. ఈ విషయాలన్నీ ఈ బ్రహ్మ మీకు అర్థం చేయిస్తాడు. ఇతడు అనుభవీ. నేనైతే మన్మనాభవ విషయాలే వినిపిస్తాను అంతేకాక సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఈ రహస్యము ఇతనికి తెలియదు. ఇతడు తన అనుభవాన్ని విడిగా తెలియజేస్తాడు. ఆ విషయాల్లోకి నేను రాను. కేవలం మీకు మార్గము తెలియజేయడమే నా పాత్ర. నేను తండ్రి, టీచరు, గురువును. టీచరుగా అయ్యి మిమ్ములను చదివిస్తాను. ఇందులో కృప మొదలైనవేవీ లేవు. చదివిస్తాను, వెంట కూడా తీసుకెళ్తాను. ఈ చదువుతోనే సద్గతి లభిస్తుంది. నేను మిమ్ములను తీసుకెళ్లేందుకే వచ్చాను. శివుని వివాహ ఊరేగింపుకు మహిమ ఉంది కదా. శంకరుని ఊరేగింపు ఉండదు. శివుని ఊరేగింపు. ఆత్మలన్నీ వరుడి వెనుకే వెళ్తాయి కదా. అందరూ భక్తులు, నేను భగవంతుడిని. పావనంగా చేసి వెంట తీసుకెళ్లమనే మీరు నన్ను పిలిచారు. కనుక నేను పిల్లలైన మిమ్ములను వెంట తీసుకునే వెళ్తాను. లెక్కాచారాలన్నీ చుక్తా చేయించే తీసుకెళ్లాలి.
తండ్రి మాటిమాటికి మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. విశ్వరాజ్యం లభిస్తుంది కదా. అందుకు పురుషార్థము కూడా అలాగే చేయాలి. పిల్లలైన మీకు ఎలాంటి కష్టమూ ఇవ్వను. మీరు చాలా దు:ఖమును అనుభవించారని నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఏ కష్టమూ ఇవ్వను. భక్తిమార్గంలో ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. అకాలమృత్యువు సంభవిస్తుంది. ఓ భగవంతుడా! అని ఎంతగానో దు:ఖిస్తారు, మతి చెడిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్వర్గానికి అధికారులుగా అవ్వాలంటే దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. పురుషార్థము సదా ఉన్నతంగా లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను సూర్యవంశము, చంద్రవంశము రెండు ధర్మాలను స్థాపన చేస్తాను. పాస్‌(ఉత్తీర్ణులు) అవ్వని వారిని క్షత్రియులని అంటారు. ఇది యుద్ధ మైదానం కదా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సుఖధామ వారసత్వ అధికారాన్ని పూర్తిగా తీసుకునేందుకు సంగమ యుగములో ఆత్మిక ఇంద్రజాలికులుగా అయ్యి తండ్రిని కూడా తమ పుత్రునిగా చేసుకోవాలి. పూర్తిగా బలిహారమవ్వాలి.
2. స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్వయాన్ని లక్కీ సితారాగా చేసుకోవాలి. విహంగమార్గ సేవ కొరకు నిమిత్తంగా అయ్యి ఉన్నత పదవి తీసుకోవాలి. గ్రామ-గ్రామాలలో సర్వీసు చేయాలి. సేవతో పాటు స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి.

వరదానము :- '' దేహము మరియు దేహ ప్రపంచ స్మృతి నుండి ఉన్నతంగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్త్‌ ఫరిస్తా భవ ''
ఎవరికైతే దేహము, దేహధారులతో సంబంధము అనగా మానసిక లగావ్‌(ఆకర్షణ) లేదో వారే ఫరిస్తాలు. ఫరిస్తాల పాదాలు సదా భూమికి తాకకుండా పైన ఉంటాయి. భూమికి పైన అనగా దేహ భావపు స్మృతి నుండి ఉన్నతంగా, ఎవరైతే దేహము మరియు దేహ ప్రపంచ స్మృతి నుండి ఉన్నతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఉండే ఫరిస్తాలుగా అవుతారు. ఇటువంటి ఫరిస్తాలే డబల్‌లైట్‌ స్థితిని అనుభవం చేస్తారు.

స్లోగన్‌ :- '' వాచాతో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించినపుడు ప్రత్యక్షత జరుగుతుంది ''

No comments:

Post a Comment