Saturday, January 4, 2020

Telugu Murli 04/01/2020

04-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - స్మృతి చార్టు వ్రాయండి. ఎంతెంత స్మృతిలో ఉండే అలవాటు అవుతూ ఉంటుందో, అంతంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి, కర్మాతీత స్థితి సమీపానికి వస్తూ ఉంటుంది ''

ప్రశ్న :- చార్టు సరిగ్గా వ్రాశామా, లేదా? అని ఏ నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు ?
జవాబు :- 1. వ్యక్తి 2. నడవడిక 3. సర్వీసు 4. ఖుషీ. బాప్‌దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చార్టు సరిగ్గా ఉందా లేదా? అని తెలియచేస్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక రాయల్‌గా ఉంటుందో, అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్టు తప్పకుండా సరిగ్గా ఉంటుంది.

పాట :- ముఖాన్ని చూసుకో ప్రాణీ, మనసు అనే దర్పణంలో,............ ( ముఖడా దేఖ్‌లే ప్రాణి!,............)
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. ఎంత పాపము మిగిలి ఉంది, ఎంత పుణ్యము జమ అయింది? దీని అర్థము కూడా లోతుగా తెలుసుకోవాలి, అనగా సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మకు ఇంకా ఎంత సమయముంది? ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు? ఇది అర్థము చేసుకోగలరు కదా. మేము 2-3 గంటలు స్మృతిలో ఉన్నామని కొంతమంది, ఒక గంట స్మృతిలో ఉన్నామని కొంతమంది చార్టు వ్రాస్తారు. ఇది చాలా తక్కువ. తక్కువ స్మృతి చేసినట్లైతే పాపాలు తక్కువగా సమాప్తమవుతాయి. ఇప్పుడింకా సమాప్తము కాని పాపాలు చాలా ఉన్నాయి కదా. ఆత్మనే ప్రాణి అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మా! ఈ లెక్కలో ఎన్ని పాపాలు సమాప్తమై ఉంటాయని స్వయాన్ని ప్రశ్నించుకోండి? మేము ఎంతవరకు పుణ్యాత్మలుగా అయ్యాము అనేది చార్టు ద్వారా తెలుస్తుంది. కర్మాతీత స్థితి అయితే అంతిమంలో వస్తుందని తండ్రి అర్థం చేయించారు. స్మృతి చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది. అప్పుడు ఎక్కువ పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి. మేము బాబా స్మృతిలో ఎంతవరకు ఉన్నామని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవలసిన అవసరము లేదు. ఇది మిమ్ములను మీరు చెక్‌ చేసుకునేందుకే. బాబాకు మీ చార్టు వ్రాసి ఇచ్చినట్లైతే ఈ చార్టు సరిగ్గా ఉందా? లేదా? అని బాబా వెంటనే తెలియచేస్తారు. వ్యక్తి, నడవడికలు, సర్వీసు, ఖుషీని చూసి వీరి చార్టు ఎలా ఉందో బాబా వెంటనే అర్థము చేసుకుంటారు. క్షణ-క్షణము స్మృతి ఎవరికి ఉంటుంది? ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శిని సేవలో ఉంటారో వారికి ఉంటుంది. మ్యూజియంలోకి అయితే పూర్తి రోజంతా వస్తూ, పోతూ ఉంటారు. ఢిల్లీలో అయితే చాలా మంది వస్తూ ఉంటారు. క్షణ-క్షణము తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వినాశనమయ్యేందుకు కొన్ని సంవత్సరాల సమయమే ఉందని ఎవరికైనా చెప్పారనుకోండి ఇది ఎలా సాధ్యము అని వారడుగుతారు. వెంటనే ఇది మేము చెప్పడం లేదు, భగవానువాచ అని చెప్పండి. భగవంతుని వాక్యాలు తప్పకుండా సత్యంగానే ఉంటాయి కదా అని చెప్పండి. అందుకే మాటిమాటికి ఇది శివబాబా శ్రీమతము అని చెప్పండి. ఇది మేము చెప్పడం లేదు. ఇది వారి శ్రీమతము. వారు సత్యమైనవారు, వారిని ట్రూత్‌ అని అంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. కనుక ప్రతి చిత్రములో శివభగవానువాచ అని వ్రాయమని బాబా చెప్తారు. వారు ఖచ్చితంగానే(ఆక్యురేట్‌గానే) తెలియచేస్తున్నారు. మాకు కూడా ఏమీ తెలిసేది కాదు. తండ్రి తెలియచేశారు, అందుకే మేము శ్రీమతమని చెప్తున్నామని చెప్పండి. అప్పుడప్పుడు వార్తాపత్రికలలో కూడా వినాశనము త్వరగా జరుగుతుందని, ఫలానావారి భవిష్యవాణి అని చెప్తూ ఉంటారు.
ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీ-కుమారులు చాలామంది ఉన్నారు కదా(బేహద్‌ అయినారు కదా). మేము బేహద్‌ తండ్రి పిల్లలమని మీరు తెలుపుతారు. వారే పతితపావనులు, జ్ఞానసాగరులు. మొదట ఈ విషయాన్ని అర్థం చేయించి పక్కాగా చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. యాదవులు, కౌరవులు మొదలైనవారు వినాశకాలే విపరీత బుద్ధి గలవారని శివబాబా చెప్పారు. శివబాబా చెప్పారని చెప్తూ ఉంటే అందులో పిల్లలకు కూడా కళ్యాణముంది. ఎందుకంటే శివబాబానే స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి మీకు ఏం అర్థము చేయిస్తారో దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. అలా చేస్తే సర్వీసు చేసేవారి చార్టు బాగా ఉండి ఉంటుంది. పూర్తి రోజులో 8 గంటలు సర్వీసులో బిజీగా ఉంటారు. ఒక గంట విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు అయినా 7 గంటలు సర్వీసులో ఉంటారు కదా. కనుక వారి వికర్మలు చాలా వినాశనమై ఉంటాయని అర్థం చేసుకోవాలి. చాలామందికి క్షణ-క్షణము తండ్రి పరిచయాన్ని ఇస్తారు. కనుక తప్పకుండా అలాంటి సేవాధారి పిల్లలు తండ్రికి కూడా ప్రియమనిపిస్తారు. వీరు చాలామంది కళ్యాణము చేస్తారని తండ్రి గమనిస్తారు. రాత్రి పగలు వారికి చాలామంది కళ్యాణము చేయాలనే చింత ఉంటుంది. చాలామందికి కళ్యాణము చేయడం అనగా స్వయం కళ్యాణము చేసుకోవడమే. ఎవరైతే చాలామందికి కళ్యాణము చేస్తారో వారికే స్కాలర్‌షిప్‌(ఉచితవేతనము) కూడా లభిస్తుంది. పిల్లలకైతే ఇదే వ్యాపారము. టీచరుగా అయి చాలామందికి దారి చూపాలి. మొదట ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయాల్సి ఉంటుంది. ఎవరి కళ్యాణమూ చేయకుంటే, వీరి భాగ్యములో లేదని భావించబడ్తుంది. బాబా మమ్ములను ఉద్యోగము నుండి విడిపించండి. మేము ఈ సర్వీసులో తత్పరులవుతామని పిల్లలు అంటారు. వీరు సర్వీసుకు యోగ్యులు, బంధన ముక్తులుగా కూడా ఉన్నారని బాబా కూడా గమనిస్తారు. అప్పుడు భలే 500-1000 రూపాయలను సంపాదించడం కంటే ఈ సేవలో తత్పరులై అనేమందికి కళ్యాణము చేయండని బాబా చెప్తారు. అది కూడా బంధనముక్తులై ఉంటే మాత్రమే. సేవాధారీ పిల్లలని గమనిస్తే, బాబా వారికి ఈ సలహా ఇస్తారు. సేవాధారి పిల్లలను అన్నిచోట్లకు పిలూస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థి చదువుకుంటాడు కదా. ఇది కూడా చదువే. ఇదేమీ సాధారణ మతము కాదు. సత్యము అంటేనే సత్యము చెప్పేవారు. మేము శ్రీమతానుసారము మీ విషయాలు మీకు అర్థము చేయిస్తున్నాము. ఈశ్వరుని మతము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది.
తండ్రి చెప్తున్నారు - మీరు వాపస్‌ వెళ్ళాలి. ఇప్పుడు బేహద్‌ సుఖ వారసత్వాన్ని తీసుకోండి. కల్ప-కల్పము మీకు వారసత్వము లభిస్తూ వచ్చింది. ఎందుకంటే స్వర్గ స్థాపన కల్ప-కల్పము జరుగుతుంది కదా. ఇది 5 వేల సంవత్సరాల సృష్టి చక్రమని ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా గాఢాంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు పూర్తి వెలుగులో ఉన్నారు. స్వర్గ స్థాపన అయితే తండ్రియే చేస్తారు. విశ్వానికి అగ్ని అంటుకున్నా అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారనే గాయనముంది. అనంతమైన తండ్రి జ్ఞాన సాగరులని పిల్లలైన మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కర్తవ్యము కూడా ఉన్నతమైనది. అలాగని ఈశ్వరుడు సమర్థుడు ఏం కావాలన్నా చేయగలడని కాదు. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. అంతా డ్రామానుసారంగానే నడుస్తుంది. యుద్ధము మొదలైన వాటిలో ఎంతోమంది మరణిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఇందులో భగవంతుడు ఏం చేయగలరు? భూకంపాలు మొదలైనవి జరిగినప్పుడు ఓ భగవంతుడా! అని ఎంతగా కేకలు వేస్తారు కాని భగవంతుడు ఏం చేయగలడు. వచ్చి వినాశనము చేయండని మీరే భగవంతుని పిలిచారు. కొత్తది స్థాపన చేసి అంతా వినాశనము చేయండని పతిత ప్రపంచములో పిలిచారు. నేను వినాశనము చేయను. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడినవి. అనవసరంగా రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇందులో రక్షించడం మొదలైన మాటే లేదు. పావన ప్రపంచాన్ని తయారు చేయమని మీరు చెప్పారు. కనుక పతిత ఆత్మలు తప్పకుండా వెళ్లిపోతాయి కదా. కొందరైతే అసలు ఏమీ అర్థము చేసుకోరు. శ్రీమతం అర్థము కూడా తెలియదు. భగవంతుడనగా ఎవరో కూడా అర్థము చేసుకోరు. ఎవరైనా పిల్లలు బాగా చదువుకోకపోతే నీది రాతిబుద్ధి అని తల్లిదండ్రులు అంటారు. సత్యయుగములో అయితే ఇలా అనరు. కలియుగములో ఉండేవారే రాతి బుద్ధిగలవారు. ఇక్కడ ఎవ్వరికీ బంగారు బుద్ధి ఉండదు. ఈ రోజుల్లో మనుష్యులు ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. ఒక గుండెను తీసి మరొక గుండెను అమరుస్తారు. మంచిది. ఇంత శ్రమపడి ఇది చేశారు. కాని దీని వలన లాభమేమిటి? ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా జీవిస్తారు అంతే కదా. చాలా మంది క్షుద్ర విద్యలు నేర్చుకొని వస్తారు. దాని వలన లాభము ఏమీ ఉండదు. మమ్ములను వచ్చి పావన ప్రపంచానికి అధికారులుగా చేయండి, మేము పతిత ప్రపంచములో ఉంటూ చాలా దు:ఖితులుగా అయ్యామని భగవంతుని స్మృతి చేస్తారు. సత్యయుగములో ఏ అనారోగ్యము(జబ్బు) మొదలైన దు:ఖమునిచ్చే మాటలేవీ ఉండవు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఎంత ఉన్నత పదవి పొందుతారు! ఇక్కడ కూడా మనుష్యులు చదువు ద్వారానే ఉన్నతమైన డిగ్రీలు పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇక కొద్ది రోజులే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. పాపాల భారమైతే తల పై చాలా ఉంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. స్వయాన్ని పతితులమని చెప్పుకుంటారు కదా. వికారాలలోకి వెళ్ళడం పాపమని భావించరు. పాపాత్మలుగా అవుతారు కదా. గృహస్థ ఆశ్రమము అనాదిగా వస్తోందని అంటారు. సత్య-త్రేతా యుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేదని అర్థం చేయించబడ్తుంది. పాపాత్మలు అక్కడ ఉండరు. ఇక్కడ పాపాత్మలుగా ఉన్నారు అందుకే దు:ఖితులుగా ఉన్నారు. ఇక్కడ అల్పకాల సుఖముంది. అనారోగ్యము వచ్చిందంటే మరణిస్తారు. మృత్యువైతే నోరు తెరుచుకొని నిలబడి ఉంది. అకస్మాత్తుగా గుండె ఫెయిల్‌ అవుతుంది. ఇక్కడి సుఖము కాకి రెట్టతో సమానమైనది. అక్కడ మీకు అపారమైన సుఖముంటుంది. మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఏ విధమైన దు:ఖమూ ఉండదు, వేడి ఉండదు, చలి ఉండదు, సదా వసంతఋతువు ఉంటుంది. తత్వాలు కూడా సక్రమంగా(ఆర్డర్లో) ఉంటాయి. స్వర్గమంటే స్వర్గమే. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. మీరు స్వర్గ స్థాపన చేసేందుకే తండ్రిని పిలుస్తారు. వచ్చి పావన ప్రపంచాన్ని చేయండి, మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు.
కనుక ప్రతి చిత్రము పై శివభగవానువాచ అని వ్రాయబడి ఉండాలి. దీని ద్వారా క్షణ-క్షణము శివబాబా గుర్తు వస్తారు. జ్ఞానము కూడా ఇస్తూ ఉంటారు. మ్యూజియం లేక ప్రదర్శిని సర్వీసులో జ్ఞానము, యోగము రెండూ తోడుగా నడుస్తాయి. స్మృతిలో ఉండడం వలన నషా పెరుగుతుంది. మీరు పావనంగా అయి విశ్వమంతటినీ పావనంగా చేస్తారు. మీరు ఎప్పుడైతే పావనంగా అవుతారో అప్పుడు సృష్టి కూడా పావనమైనదేే కావాలి. చివర్లో కయామత్‌ సమయమైనందున అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. మీ కొరకు నేను నూతన సృష్టిని ప్రారంభము చేయవలసి ఉంటుంది. మళ్లీ శాఖలు తెరుస్తూ ఉంటారు. పవిత్రంగా తయారు చేసేందుకు నూతన ప్రపంచమైన సత్యయుగానికి పునాది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వెయ్యలేరు. కనుక అలాంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి. మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవము గొప్ప వ్యక్తులతో చేయిస్తే శబ్ధము(సందేశము) వ్యాపిస్తుంది. ఇక్కడకు వీరు కూడా వస్తున్నారని మనుష్యులు భావిస్తారు. మీరు వ్రాసి ఇవ్వండి, మేము మాట్లాడ్తామని కొందరంటారు అది కూడా తప్పే అవుతుంది. బాగా అర్థము చేసుకొని మాట్లాడితే చాలా మంచిది. కొందరు ఖచ్చితంగా ఉండాలని వ్రాసుకొని చదివి వినిపిస్తారు. పిల్లలైన మీరు ఓరల్‌గా అర్థం చేయించాలి. ఆత్మలైన మీలో జ్ఞానమంతా ఉంది కదా. మీరు జ్ఞానాన్ని మళ్లీ ఇతరులకు ఇస్తారు. ప్రజలు వృద్ధి అవుతూ ఉంటారు. జన సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అన్ని వస్తువులు పెరుగుతూ ఉంటాయి. వృక్షమంతా శిథిలావస్థకు వచ్చింది. మన ధర్మము వారు ఎవరైతే ఉంటారో వారు బయటకు వస్తారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా చదవలేరు. నూటికి ఒక మార్కు తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. ఏ కొద్దిగా విన్నా, ఒక మార్కు లభించినా స్వర్గములోకి వచ్చేస్తారు. ఇది కూడా బేహద్‌ చదువు, దీనిని బేహద్‌ తండ్రి మాత్రమే చదివించగలరు. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే ఉన్నారో వారు వెలికి వస్తారు. మొదట అందరూ తమ ఇల్లైన ముక్తిధామానికి వెళ్ళాలి. తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. కొందరు త్రేతాయుగ అంతిమము వరకు వస్తూ ఉంటారు. భలే బ్రాహ్మణులుగా అవుతారు కాని బ్రాహ్మణులందరూ సత్యయుగములోకి రారు. కొందరు త్రేతాయుగము అంతిమము వరకు వస్తూనే ఉంటారు. ఇవి అర్థము చేసుకోవాల్సిన విషయాలు. రాజధాని స్థాపన అవుతూ ఉందని బాబాకు తెలుసు. అందరూ ఒకే విధంగా ఉండరు. రాజ్యములో అన్ని వెరైటీలు కావాలి. ప్రజలను బయటివారని అంటారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరముండదని బాబా అర్థం చేయించారు. వారికి శ్రీమతము లభించింది, దానితోనే ఇలా(లక్ష్మినారాయణులు) అయ్యారు. వారు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరముండదు. మంత్రులు మొదలైనవారు ఎవ్వరూ ఉండరు. తర్వాత మళ్లీ పతితులుగా అయినప్పుడు ఒక మంత్రి, ఒక రాజు-రాణి ఉంటారు. ఇప్పుడైతే అనేకమంది మంత్రులున్నారు. ఇక్కడైతే పంచాయితి రాజ్యముంది కదా. ఒకరి మతము మరొకరి మతముతో కలువదు. ఒకరితో స్నేహము చేసుకొని అర్థము చేయిస్తే పని చేసేస్తారు. ఇంకొకరు వస్తే అతనికి అర్థము కాకుంటే ఆ పనిని ఇంకా పాడు చేసేస్తారు. ఒకరి బుద్ధి మరొకరితో కలువదు. అక్కడ మీ మనోకామనలన్నీ పూర్తి అవుతాయి. ఇక్కడ మీరు ఎంత దు:ఖాన్ని అనుభవించారు. దీని పేరే దు:ఖధామము. భక్తిమార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు! ఇది కూడా డ్రామా. ఎప్పుడైతే దు:ఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి మీ బుద్ధిని ఎంతగా వికసింపజేశారు! ధనవంతులకు ఇది స్వర్గము, పేదలకు నరకమని మనుష్యులు అంటారు. స్వర్గమని దేనినంటారో మీకు యథార్థంగా తెలుసు. సత్యయుగంలో ఎవ్వరూ దయాసాగరా! అని పిలువరు. ఇక్కడ దయ చూపండి. ముక్తినివ్వండి, దయ చూపండని పిలుస్తారు. తండ్రియే అందరిని శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్తారు. అజ్ఞాన కాలములో మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే నంబరువన్‌ తమోప్రధానంగా ఉంటారో వారే మళ్లీ నంబర్‌వన్‌ సతోప్రధానంగా అవుతారు. ఇతను తన గొప్పలు చెప్పుకోవడం లేదు. గొప్పతనమంతా ఒక్క తండ్రిది మాత్రమే. లక్ష్మీనారాయణులను కూడా అలా తయారుచేసేది వారే కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారు. వారు ఉన్నతంగానే చేస్తారు. అందరూ ఉన్నతంగా అవ్వలేరని బాబాకు తెలుసు. అయినా పురుషార్థము చేయవలసి వస్తుంది. ఇక్కడకు మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే వస్తారు. బాబా మేము స్వర్గ సామ్రాజ్యాన్ని తీసుకుంటాము. మేము సత్యనారాయణుని సత్యమైన కథను వినేందుకు వచ్చామని అంటారు. బాబా చెప్తారు - మంచిది, మీ నోటిలో గులాబ్‌జామూన్‌, కష్టపడండి. అందరూ లక్ష్మీనారాయణులుగా అవ్వలేరు. మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. రాజ పరివారానికి, ప్రజల పరివారానికి చాలా మంది కావాలి కదా. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, వదిలి వెళ్లిపోతారు. మళ్లీ వాపస్‌ కూడా వస్తారు. ఏ పిల్లలైతే స్వయాన్ని ఏదో కొంత ఉన్నతి చేసుకుంటారో వారు పైకి వస్తారు. పేదవారే సమర్పణవుతారు. దేహ సహితంగా వేరెవ్వరూ స్మృతి రారాదు. ఇది చాలా గొప్ప గమ్యము. ఒకవేళ ఏదైనా సంబంధము జోడింపబడి ఉంటే అది తప్పకుండా గుర్తు వస్తూ ఉంటుంది. తండ్రికి ఏది గుర్తుకొస్తుంది. పూర్తి రోజంతా బుద్ధి బేహద్‌లోనే ఉంటుంది. ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. తండ్రి చెప్తారు - నా పిల్లలలో కూడా ఉత్తములు, మధ్యమమైనవారు, కనిష్టులు ఉన్నారు. ఇతరులెవరైనా వస్తే వారు పతిత ప్రపంచమువారని కూడా అర్థమవుతుంది. అయినా యజ్ఞ సేవ చేస్తున్నారు కనుక గౌరవము ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి యుక్తియుక్తుడు కదా. ఇది శాంతి స్తంభము(టవర్‌ ఆఫ్‌ పీస్‌) అత్యంత పవిత్రమైన స్తంభము. ఇక్కడ అత్యంత పవిత్రమైన తండ్రి వచ్చి కూర్చొని పూర్తి విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. ఇక్కడకు పతితులెవ్వరూ రాలేరు. కాని తండ్రి చెప్తారు - పతితులందరినీ పావనంగా చేసేందుకే నేను వచ్చాను. ఈ ఆటలో నా పాత్ర కూడా ఉంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ చార్టును చూసుకుంటూ ఎంత పుణ్యము జమ అయిందో, ఆత్మ ఎంత వరకు సతోప్రధానంగా అయిందో పరిశీలించుకోవాలి. స్మృతిలో ఉంటూ అన్ని లెక్కాచారాలు సమాప్తము చేసుకోవాలి.
2. స్కాలర్‌షిప్‌ తీసునేందుకు సేవాధారులుగా అయి అనేమందికి కళ్యాణము చేయాలి. తండ్రికి ప్రియమైనవారిగా అవ్వాలి. టీచరుగా అయి చాలామందికి దారి చూపించాలి.

వరదానము :- '' మధురత వరదానము ద్వారా సదా ముందుకు వెళ్లే శ్రేష్ఠ ఆత్మా భవ ''
మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే అది బంజరు భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. ఎవరికైనా రెండు సెకండ్లు మధురమైన దృష్టి ఇచ్చినా, రెండు మధురమైన మాటలు మాట్లాడినా, ఎలాంటి ఆత్మనైనా సదాకొరకు భర్‌పూర్‌(సంపన్నం)గా చేసేస్తాయి. రెండు సెకండ్ల మధురమైన దృష్టి లేక మాటలు ఆ ఆత్మల సృష్టిని మార్చేస్తాయి. మీరు రెండు మధురమైన మాటలు మాట్లాడినా వారిని సదా కొరకు పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతాయి. అందువలన మధురతా వరదానాన్ని సదా జతలో ఉంచుకోండి.

స్లోగన్ :- సదా మధురంగా ఉండండి, అందరినీ మధురంగా చేయండి.

No comments:

Post a Comment