Wednesday, January 29, 2020

Telugu Murli 30/01/2020

30-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు జ్ఞాన-యోగాల పౌష్ఠికాహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారము చేస్తున్నారు, కనుక సదా ప్రసన్నంగా ఉండండి, శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి ''

ప్రశ్న :- ఈ సంగమ యుగములో మీ వద్ద ఉన్న అతివిలువైన, జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది?
జవాబు :- ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులములో మీ జీవితము చాలా విలువైనది, కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. 'ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమైపోయేదే' అని అనుకోకండి. దీనిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి.

ఓంశాంతి. జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తనవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరు మారుస్తారో, ఎలా మారుస్తారో, పాపం! మనుష్యులకు తెలియదు. ఎందుకంటే వారికి మూడవ నేత్రమే లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు మూడవ నేత్రం లభించింది. దానితో మీరు సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానం తెలుసుకున్నారు. ఇది జ్ఞాన శా్యకిన్‌(అతిమధురం). శాక్రిన్‌ ఒక్క బిందువైనా ఎంత మధురంగా ఉంటుంది. జ్ఞానంలో ఒకే పదముంది - 'మన్మనాభవ.' ఈ ఒక్క అక్షరమే ఎంత మధురమైనది! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము, సుఖధామాలకు దారి తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలకు ఎంత సంతోషముండాలి. ఖుషీ వంటి పౌష్ఠికాహారము(ఖురాక్‌) లేదని అంటారు కదా! సదా ఖుషీగా, ఆనందంగా ఉండేవారికి ఇది పౌష్ఠికాహారం వంటిదే. 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది జబరదస్త్‌(శక్తివంతమైన) ఖురాక్‌. ఈ ఖురాక్‌ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరికొకరు చేసే జబరదస్త్‌ అతిథి సత్కారం. ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుష్యులు మనుష్యులకు చేయలేరు.
పిల్లలైన మీరు శ్రీమతానుసారం అందరికీ ఆత్మిక అతిధి సత్కారం చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయమివ్వడమే సత్యమైన ఖుష్‌ ఖైరాఫత్‌(శ్రేష్ఠమైన దానము లేక పుణ్యము) కూడా. అనంతమైన తండ్రి ద్వారా జీవన్ముక్తి బహుమతిగా లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో భారతదేశము జీవన్ముక్త స్థితిలో పావనంగా ఉండేది. తండ్రి చాలా శ్రేష్ఠమైన ఖురాక్‌ను ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని మహిమ ఉంది. ఈ జ్ఞాన-యోగాలు చాలా ఫస్ట్‌క్లాస్‌ వండర్‌ఫుల్‌ ఖురాక్‌(ఔషధము). ఇది ఒక్క ఆత్మిక సర్జన్‌ వద్ద మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఈ ఖురాక్‌ గురించి తెలియదు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ! మీ కొరకు అరచేతిలో బహుమతిని తీసుకొచ్చాను. ఈ ముక్తి-జీవన్ముక్తుల బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్ప-కల్పమూ నేనే వచ్చి మీకు ఈ కానుకను ఇస్తాను. మళ్లీ రావణుడు దానిని లాక్కుంటాడు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు ఖుషీ ఎంత అపారమైన సంతోషముండాలి. మన తండ్రి, టీచరు, సత్య-సత్యమైన సద్గురువని వారు మనలను వెంట తీసుకువెళ్తారని మీకు తెలుసు. అతిప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యము లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్‌ లైఫ్‌ ఈజ్‌ ద బెస్ట్‌(ఈశ్వరీయ విద్యార్థి జీవితం ఉత్తమోత్తమమైనది). ఇది ఇప్పటి మహిమనే కదా! తర్వాత మళ్లీ నూతన ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్య సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుష్యులకైతే సత్యయుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడైతే త్రాహి-త్రాహి (అయ్యో, అయ్యో) అంటూ ఉంటారు. ఇది ఎంత దుఃఖ ప్రపంచము!
పిల్లలైన మీకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు! గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వృత్తి-వ్యాపారాలు చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణానికి ప్రేయసీ-ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అతను ఆమెకు ప్రియుడు, ఆమె అతనికి ప్రేయసి. ఇక్కడ ఈ విషయం కాదు. ఇక్కడైతే మీరందరూ ఒకే ప్రియునికి జన్మ-జన్మలుగా ప్రేయసులుగా ఉన్నారు. తండ్రి మీకెప్పుడూ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడు వచ్చేందుకు స్మృతి చేస్తూ వచ్చారు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు అనే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో సర్వశక్తివంతుడైన తండ్రి వలె రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా, తమోప్రధానంగా అవుతూ పోతుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీనితో పాటు దైవీగుణాలు కూడా ధారణ చేస్తే మీరు ఇలా(లక్ష్మీ నారాయణులుగా) అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయం స్మృతి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో, చాలా స్నేహంతో స్మృతి చెయ్యాలి. ఆ ఉన్నతాతిఉన్నతమైన తండ్రే నూతన ప్రపంచ స్థాపన చేస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసేందుకే నేను వచ్చాను; కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మల పాపాలు నశిస్తాయి. పతితపావనుడైన తండ్రి చెప్తున్నారు - మీరు చాలా పతితమైపోయారు. కనుక ఇపుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతితపావనుడైన తండ్రినే పిలుస్తారు కదా! ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి దుఃఖహర్త-సుఖకర్త. సత్యయుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచము ఉండేది, కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్లీ చెప్తున్నారు - పిల్లలూ! శాంతిధామము, సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇది సంగమ యుగము. నావికుడు మిమ్ములను ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు. ఒక్కటే నావ కాదు; ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడ వలె ఉంది. దీనిని ఆవలికి తీసుకెళ్తారు.
మధురమైన పిల్లలూ, మీకు ఎంత సంతోషముండాలి! మీకైతే సదా సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారు, వాహ్‌! ఈ మాటలు ఎపుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ - నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదువుకోవాలి. చదువులో సదా నెంబరువారుగానే ఉంటారు. నేను ఉత్తమమా, మధ్యమమా లేక కనిష్టంగా ఉన్నానా? నేను ఉన్నతపదవిని పొందే యోగ్యత కలిగి ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా? అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటారు - పిల్లలూ! సేవాయోగ్యులుగా అవ్వండి. నన్ను ఫాలో చేయండి. నేను సేవ చేసేందుకే వచ్చాను. రోజూ సేవ చేసేందుకు ఈ రథాన్ని తీసుకున్నాను. ఈ రథానికి జబ్బు చేస్తే నేను ఇతనిలో కూర్చొని మురళి వ్రాస్తాను. నోటి ద్వారా మాట్లాడలేకపోతే పిల్లలకు మురళి మిస్‌ అవ్వరాదని నేనే కూర్చొని వ్రాస్తాను. కనుక నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. మరి పిల్లలు కూడా తండ్రి సేవలో లగ్నమవ్వండి. ఆన్‌ గాడ్‌్‌ఫాదర్లీ సర్వీస్‌. మంచి సేవ చేసేవారిని, మంచి పురుషార్థం చేసేవారిని మహావీరులని అంటారు. బాబా ఆదేశానుసారంగా నడిచి ఎవరు మహావీరులుగా అవుతారో చూడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయి-భాయిగా(సోదరులుగా) చూడండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు - నేను ఆత్మలను చూస్తాను అయితే ఇది జ్ఞానం కనుక ఆత్మ శరీరము లేకుండా మాట్లాడలేదు. నేను కూడా లోను(అప్పు) తీసుకున్న ఈ శరీరములోకి వచ్చాను. శరీరముతోనే ఆత్మ చదువుకోగలదు. బాబా ఆసనం ఈ భృకుటిలో ఉంది. ఇది అకాల సింహాసనము(అకాల్‌ తక్త్‌). ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా, పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరికీ వారి భృకుటియే ఆసనం. శరీరాలు రకరకాలుగా ఉంటాయి. కొందరి అకాల్‌ తక్త్‌ పురుషులది, కొందరిది స్త్రీలది, కొందరిది చిన్న పిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్‌ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడునప్పుడు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తాము. స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగాలి. బంగారులో కల్తీ కలిసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా మలినం ఏర్పడినందున మీరు విలువ లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఈ మూడవ నేత్రంతోనే మీ సోదరులను చూడండి. సోదరులను చూస్తున్నప్పుడు కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. రాజ్యభాగ్యం తీసుకోవాలి. విశ్వానికి యజమానిగా అవ్వాలంటే ఈ శ్రమ చేయండి. అందరినీ సోదరులుగా భావించి జ్ఞానం ఇస్తే ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పై నుండే వచ్చారు. మీరు కూడా పై నుండే వచ్చారు. తండ్రి, పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు. సేవ చేసేందుకు తండ్రి ధైర్యాన్నిస్తారు. ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. కనుక ఇది ప్రాక్టీస్‌ చేయండి. ''నేను ఆత్మను, నా సోదరుని చదివిస్తున్నాను.'' ఆత్మ చదువుతుంది కదా! ఆత్మిక తండ్రి నుండే లభించే ఈ చదువును స్పిరిచువల్‌ నాలెడ్జ్‌(ఆత్మిక జ్ఞానం) అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగమ యుగములోనే వచ్చి ఈ జ్ఞానమునిస్తారు. మీరు నగ్నంగా(శరీరము లేకుండా) వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికి వెళ్లాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయి-భాయి దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. మీ కొరకు మీరు శ్రమ చేయాలి. వేరే విషయాలలోకి మనమెందుకు వెళ్లాలి. చారిటీ బిగిన్స్‌ ఎట్‌ హోమ్‌ అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాణం బాగా తగులుతుంది. ఈ పదును ఉండాలి. శ్రమ చేస్తేనే ఉన్నత పదవి పొందగలరు. ఇందులో కొంత సహించాల్సి ఉంటుంది కూడా. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడ్తే, మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి. మీరు మాట్లాడకుంటే వారేం చేస్తారు? చప్పట్లు రెండు చేతులతోనే మ్రోగుతాయి. ఒకరు నోటితో తాళం మ్రోగిస్తే రెండవ వారు మాట్లాడకుండా ఉంటే, వారు తమంతట తామే మౌనంగా ఉండిపోతారు. తాళంతో తాళం మ్రోగిస్తే ధ్వని వెలువడ్తుంది. పిల్లలు ఒకరికొకరు కళ్యాణం(మంచి) చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలంటే తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మల వైపు చూడండి. కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మీకే లాభించే విషయాలు. తండ్రి ఇచ్చే శిక్షణలు సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు - నేను ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో మాట్లాడాలంటే వారి ముఖమును చూస్తారు కదా! మీరు ఆత్మలతో మాట్లాడాలంటే ఆత్మలనే చూడాలి కదా! భలే శరీరము ద్వారా జ్ఞానమునిస్తారు కానీ ఇందులో దేహ భావమును తుంచేయాల్సి ఉంటుంది. తండ్రి అయిన పరమాత్మ మాకు జ్ఞానమునిస్తున్నారని ఆత్మలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ఆత్మలను చూస్తానని అంటారు. ఆత్మలు కూడా మేము మా తండ్రి అయిన పరమాత్మను చూస్తున్నామని, వారి నుండి జ్ఞానము తీసుకుంటున్నామని అంటారు. దీనినే స్పిరిచువల్‌ జ్ఞానాన్ని ఆత్మలతో ఆత్మలు ఇచ్చిపుచ్చుకోవడమని అంటారు. జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మయే జ్ఞానమునివ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానములో ఈ శక్తి నిండుతుంది. అప్పుడు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణము తగులుతుంది. తండ్రి అంటారు - ప్రాక్టీస్‌ చేసి చూడండి. బాణము తగులుతుంది కదా! ఈ కొత్త అలవాటు చేసుకుంటే దేహ భావము తొలగిపోతుంది. మాయ తుఫానులు తక్కువగా వస్తాయి, చెడు సంకల్పాలు రావు. క్రిమినల్‌(వికారి) దృష్టి కూడా ఉండదు. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజం! పిల్లలకు ఈ శిక్షణనివ్వడం కూడా తన పాత్ర అని తండ్రికి తెలుసు. క్రొత్త విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. నేను బంధితుడనై ఉన్నాను. కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను - మధురమైన పిల్లలూ! ఆత్మికయాత్రలో ఉంటే అంతమతే సో గతి అవుతుంది. ఇది అంతకాలం కదా! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతి యాత్రతో పొందుకున్నది శక్తివంతమౌతుంది. దేహీ-అభిమానిగా అయ్యే శిక్షణ పిల్లలైన మీకు ఒక్క పర్యాయమే లభిస్తుంది. ఇది ఎంత వండర్‌ఫుల్‌ జ్ఞానము! బాబా వండర్‌ఫుల్‌ కనుక బాబా జ్ఞానము కూడా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేనిది. ఇప్పుడు వాపస్‌ వెళ్లాలి కనుక మధురమైన పిల్లలూ! మిమ్ములను ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం ప్రాక్టీస్‌(అభ్యాసం) చేయండి. మూడవ నేత్రంతో సోదరులను చూడాలి. ఇదే గొప్ప శ్రమ.
ఇది మీ బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన కులము. ఈ సమయములో మీ జీవితము అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమోప్రధానం అయినందున శరీర ఆయువు కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత యోగములో ఉంటే అంత ఆయువు పెరుగుతూ ఉంటుంది. మీ ఆయువు పెరుగుతూ పెరుగుతూ సత్యయుగములో 150 సంవత్సరాలుగా అవుతుంది. అందువలన శరీరాన్ని కూడా సంభాళించాలి. 'ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా పోయేదే' అని అనుకోరాదు. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది అమూల్యమైన జీవితం కదా! ఏదైనా జబ్బు చేస్తే దానితో విసిగి పోరాదు. 'శివబాబాను గుర్తు చేసుకో ' అని వారికి కూడా చెప్పండి. ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి. దీనితో సర్వీస్‌ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. మనము బాబాను స్మృతి చేయాలనే తెలివి అయితే ఉంటుంది కదా! తండ్రి నుండి వారసత్వము పొందేందుకు ఆత్మ స్మృతి చేస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
ఏ విధమైన విఘ్నమైనా బుద్ధిని సతాయిస్తూ ఉంటే యోగ ప్రయోగము ద్వారా ముందు ఆ విఘ్నాన్ని సమాప్తం చేయండి. మనసు, బుద్ధిలో కొంచెం కూడా డిస్టర్‌బెన్స్‌ ఉండరాదు. ఆత్మ, ఆత్మల విషయాలను లేక ఎవరి మనసులోని భావాలను సహజంగా తెలుసుకోగలిగినంతగా అవ్యక్త స్థితిలో స్థితమై ఉండే అభ్యాసము చేయాలి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నేను పురుషార్థములో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా? నాకు ఉన్నతపదవి పొందే యోగ్యత ఉందా? నేను ఆత్మిక సర్వీస్‌ చేస్తున్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోండి.
2. మూడవ నేత్రంతో ఆత్మ సోదరుని చూస్తూ, సొదరునిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి, ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలమవ్వవు.

వరదానము :- '' పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఫుల్‌ పాస్‌ అయ్యే సఫలతామూర్త్‌ భవ ''
ఎప్పుడైనా ఏదైనా పరీక్ష (పేపర్‌) వచ్చినప్పుడు భయపడకండి, ప్రశ్నార్థకములోకి రాకండి. ఇది ఎందుకు వచ్చింది? అని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయకండి. ప్రశ్నార్థకాన్ని సమాప్తం చేసి ఫుల్‌స్టాప్‌ పెట్టండి. అప్పుడు క్లాసు మారిపోతుంది అనగా పేపర్లో పాస్‌ అవుతారు. ఫుల్‌స్టాప్‌ పెట్టేవారు ఫుల్‌ పాస్‌ అవుతారు. ఎందుకంటే ఫుల్‌స్టాప్‌ అంటే బిందురూప స్థితి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దానినే వినండి, తండ్రి ఏది ఇచ్చారో అదే చూడండి. అప్పుడు ఫుల్‌ పాస్‌ అవుతారు. పాస్‌ అయిందానికి గుర్తు - సదా ఎక్కేకళను(ఉన్నతిని) అనుభవం చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అవుతారు.

స్లోగన్‌ :- '' స్వ ఉన్నతి చేసుకోవాలంటే క్వశ్చన్‌, కరెక్షన్‌, కొటేషన్‌ను త్యాగము చేసి, మీ కనెక్షన్‌ను సరిగ్గా ఉంచుకోండి. ''

No comments:

Post a Comment