Monday, January 13, 2020

Telugu Murli 13/01/2020

13-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - చురుకైన విద్యార్థిగా అయి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే పురుషార్థము చేయండి, సోమరి విద్యార్థిగా అవ్వరాదు. ఎవరికైతే రోజంతా బంధు-మిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో, వారు సోమరులు ''

ప్రశ్న :- సంగమ యుగములో అందరికంటే భాగ్యశాలురని ఎవరిని అంటారు ?
జవాబు :- ఎవరైతే తమ శరీరము, మనస్సు, ధనము అన్నిటినీ సఫలము చేసుకున్నారో లేక చేస్తున్నారో వారు భాగ్యశాలురు. కొంతమంది చాలా ఉదాసీనంగా, దురదృష్టవంతులుగా ఉంటారు. అటువంటి వారి భాగ్యములో లేదని భావించబడ్తుంది. వినాశనము చాలా సమీపములో ఉంది, ఏదైనా చేసుకోవాలని అర్థము చేసుకోరు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో వచ్చి ఉన్నారు, మనదంతా సఫలము చేసుకుంటామని భాగ్యశాలి పిల్లలు ధైర్యము చేసి అనేకమంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అవ్వాలని భావిస్తారు.

పాట :- అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను,............(తక్‌దీర్‌ జగాకర్‌ ఆయీ హూం,............)
ఓంశాంతి. పిల్లలైన మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. గీతలో శ్రీ కృష్ణుని పేరు వేసేశారు. కానీ ''నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను'' అని భగవంతుడు చెప్తున్నారు(భగవానువవాచ). శ్రీ కృష్ణుడు(అలా అగుట) మీ లక్ష్యము. నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తానని చెప్పినవారు శివ భగవానుడు. కనుక తప్పకుండా శ్రీ కృష్ణుడు మొదటి రాకుమారునిగా అవుతాడు. అంతేకాని కృష్ణ భగవానువాచ కాదు. 'కృష్ణుడు' పిల్లలైన మీ లక్ష్యము. ఇది పాఠశాల. చదివించేవారు భగవంతుడు. మీరందరూ రాకుమార - రాకుమార్తెలుగా అవుతారు.
తండ్రి చెప్తున్నారు - మళ్లీ శ్రీ కృష్ణునిగా అయ్యేందుకు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో మీకు నేను ఈ జ్ఞానము వినిపిస్తాను. ఈ పాఠశాలకు టీచరు శివబాబా, శ్రీ కృష్ణుడు కాదు. శివాబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీరంటారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని ఆత్మలకు తెలుసు. ఇది యువరాజు-యువరాణులుగా తయారయ్యే భాగ్యము. ఇది రాజయోగము కదా. శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గములోని రెండు ఆకులుగా రాధా-కృష్ణులు వస్తారు. మీరు తయారుచేసిన ఈ చిత్రాలు సరియైనవి. అర్థము చేయించేందుకు బాగున్నాయి. గీతా జ్ఞానము ద్వారానే భాగ్యము తయారవుతుంది. భాగ్యము మేల్కొని ఉండేది, అది మళ్లీ తెగిపోయింది. అనేక జన్మల అంత్యములో మీరు పూర్తి తమోప్రధాన భికారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాకుమారులుగా అవ్వాలి. మొదట తయారయ్యేది రాధా-కృష్ణులే. తర్వాత వారి రాజధాని కూడా నడుస్తుంది. రాజధానిలో కేవలం ఒక్కరే ఉండరు కదా. స్వయంవరము తర్వాత రాధా-కృష్ణుల నుండి మళ్లీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. నరుని నుండి రాకుమారునిగా అవుతారన్నా, నారాయణునిగా అవుతారన్నా రెండూ ఒక్కటే. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు. సంగమ యుగములోనే స్థాపనై ఉంటుంది. అందుకే సంగమ యుగమును పురుషోత్తమ యుగమని అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపనవుతుంది, మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్యయుగములో ఒకే ఒక ధర్మముండేది. ఆ చరిత్ర-భూగోళము మళ్లీ తప్పకుండా రిపీట్‌(పునరావృతము) అవుతుంది. స్వర్గము మళ్లీ స్థాపనవుతుంది. అందులో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. అది ఫరిస్తాన్‌(స్వర్గము). ఇప్పుడిది కబ్రిస్తాన్‌(శ్మశానము), అందరూ కామచితి పై కూర్చొని భస్మమైపోతారు. సత్యయుగములో మీరు భవనాలు మొదలైనవి తయారుచేస్తారు. అంతేగాని క్రింది(సముద్రగర్భము) నుండి బంగారు ద్వారక గానీ లేక లంక గానీ రాదు. ద్వారక ఉండవచ్చు కానీ లంక ఉండదు. రామరాజ్యాన్ని బంగారు యుగమని అంటారు. ఉన్న సత్యమైన బంగారంతా దోచుకోబడింది. భారతదేశము ఎంత ధనవంతముగా, సంపన్నంగా ఉండేదో మీరు అర్థము చేయిస్తారు. దివాలా తీసిందని, బీదదై పోయిందని చెప్పడము చెడ్డ మాటేమీ కాదు. సత్యయుగములో ఒకే ధర్మముండేదని అక్కడ ఏ ఇతర ధర్మమూ లేదని మీరు అర్థము చేయించగలరు. ఇదెలా సాధ్యము? అక్కడ కేవలం దేవతలే ఉంటారా? అని చాలామంది అడుగుతారు. అనేక మతాలు, మతాంతరాలున్నాయి. ఒక ధర్మము మరో ధర్మముతో కలవదు. ఎంత ఆశ్చర్యము! ఎంతమంది పాత్రధారులున్నారు! ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. మనము స్వర్గవాసులుగా అవుతామని గుర్తుంటే సదా హర్షితముఖులుగా ఉంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. మీ లక్ష్యము ఉన్నతమయింది కదా. మనము మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గస్థాపన జరుగుతూ ఉందని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఇది కూడా సదా గుర్తుంచుకోవాలి. కాని మాయ క్షణ క్షణము మరపింపజేస్తుంది. భాగ్యములో లేకుంటే బాగుపడరు. అసత్యాన్ని చెప్పే అలవాటు అర్ధకల్పము నుండి ఏర్పడింది. అది తొలగిపోదు. అసత్యాన్ని కూడా ఖజానాగా భావించి అట్లే తమ వద్దనే ఉంచుకుంటారు. దానిని వదలకుండా ఉంటే, వీరి భాగ్యమింతే అని భావించబడ్తుంది. తండ్రిని స్మృతి చేయరు. మమకారము పూర్తిగా తొలగిపోయినప్పుడే స్మృతి ఉంటుంది. మొత్తం ప్రపంచము పై వైరాగ్యము, మిత్రులను, బంధువులను చూస్తున్నా చూడనట్లే ఉండాలి. వీరంతా నరకవాసులు, శ్మశానగ్రస్థులని భావిస్తారు, ఇదంతా సమాప్తమవ్వనున్నది, ఇప్పుడు మనము ఇంటికి వాపసు వెళ్లాలి. కనుక సుఖధామమును, శాంతిధామమును మాత్రమే గుర్తు చేసుకుంటారు. మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము, రాజ్యపాలన చేసేవారము, ఇప్పుడది పోగొట్టుకున్నాము. మళ్లీ మనము మన రాజ్యము తీసుకుంటాము. భక్తిమార్గములో ఎంతగా తలలు వంచి నమస్కరించాలో ఎంత ధనము నాశనము చేసుకోవాలో పిల్లలు అర్థము చేసుకోగలరు. పిలుస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. కానీ ఏమీ లభించదు. చివర్లో చాలా దుఃఖము కలిగినప్పుడు - ''బాబా, రండి సుఖధామానికి తీసుకెళ్లండి అని ఆత్మ పిలుస్తుంది, స్మృతి చేస్తుంది.''
ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇది మీరు చూస్తారు. ఇప్పుడిది మన అంతిమ జన్మ. ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది. జ్ఞానము పూర్తిగా ధారణ చేయాలి. భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా జరుగుతాయి కదా. హిందుస్తాన్‌, పాకిస్తాన్‌ విభజనలో ఎంతమంది మరణించి ఉంటారు! పిల్లలైన మీకు ప్రారంభము నుండి చివరి వరకు అంతా తెలిసిపోయింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ పోతుంది. కేవలం ఒక్క సోమనాథ మందిరమే కాదు ఇంకా అనేక భవనాలు, మందిరాలు మొదలైనవవి కూడా బంగారువే ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడకు పోతాయి? భూకంపములో అన్నీ లోపలకెళ్లి ఇక బయటకే రావా? లోపల చెడిపోతే ఏమవుతుంది? పోను పోను మీకు అంతా తెలుస్తుంది. బంగారు ద్వారక మునిగిపోయిందని అంటారు. ఇప్పుడు మీరంటారు - ''డ్రామాలో అది క్రిందికి వెళ్ళిపోయింది, చక్రము తిరిగితే అది మళ్లీ పైకి వస్తుంది.'' అయినా మళ్లీ తయారు చేయవలసి వస్తుంది. ఈ చక్రము బుద్ధిలో స్మృతి చేస్తూ, చాలా సంతోషంగా ఉండాలి. ఈ చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి. ఈ బ్యాడ్జి సేవకు చాలా ఉపయోగపడ్తుంది. కానీ ఇంత సేవ ఎవ్వరూ చేయడం లేదు. పిల్లలైన మీరు రైలులో కూడా చాలా సేవ చేయగలరు. అయితే రైలులో ఏ సేవ చేసినారో ఆ సమాచారాన్ని కూడా బాబాకు ఎవ్వరూ వ్రాయరు. 3వ తరగతి పెట్టెలో కూడా సేవ చేయవచ్చు. కల్పక్రితము ఎవరైతే అర్థము చేసుకున్నారో, ఎవరైతే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థము చేసుకుంటారు. మనుష్యుల నుండి దేవతలనే గాయనముంది. మనుష్యుల నుండి క్రైస్తవులు, మనుష్యుల నుండి సిక్కులని అనరు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారనగా ఆది సనాతన దేవీదేవతా ధర్మము స్థాపనయిందని అర్థము. మిగిలిన వారందరూ తమ - తమ ధర్మాలలోకి వెళ్లిపోయారు. వృక్షములో ఫలానా ఫలానా ధర్మము ఎప్పుడు స్థాపనవుతుందో చూపించబడింది. దేవతలు హిందువులుగా అయ్యారు. హిందువుల నుండి వేరు వేరు ధర్మాలలోకి పరివర్తనైపోయారు. తమ శ్రేష్ఠ ధర్మమును, కర్మను వదిలి ఇతర ధర్మాలలోకి పోయినవారు కూడా మళ్లీ వస్తారు. చివర్లో కొద్దిగా అర్థము చేసుకుంటారు. ప్రజలలోకి వస్తారు. అందరూ దేవీదేవతా ధర్మములోకి రారు. అందరూ తమ-తమ విభాగాలలోకి(సెక్షన్లలోకి) వెళ్లిపోతారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రపంచములోనివారు ఏమేమో చేస్తున్నారు. ధాన్యము కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. పెద్ద - పెద్ద మిషన్లు ఏర్పాటు చేస్తారు. అయినా ఏమీ జరగదు. ఈ సృష్టి తమోప్రధానంగా అయ్యే తీరాలి. మెట్లు(తాపలు) క్రిందికి దిగే తీరాలి. డ్రామాలో ఏది రచింపబడిందో అది జరుగుతూనే ఉంటుంది. మళ్లీ నూతన ప్రపంచము స్థాపనయ్యే తీరాలి. ఇప్పుడు ఏ సైన్సు నేర్చుకుంటున్నారో, దాని వలన కొన్ని సంవత్సరాలలో చాలా తెలివైనవారిగా అవుతారు. ఆ సైన్సు ద్వారానే అక్కడ(సత్యయుగములో) మంచి మంచి వస్తువులు తయారవుతాయి. ఈ సైన్సు అక్కడ సుఖమునిచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సుఖము చాలా కొద్దిగా ఉంది, కానీ దుఃఖము చాలా ఎక్కువగా ఉంది. ఈ సైన్సు వచ్చి ఎంత కాలమయింది! ఇంతకు ముందు ఈ కరెంటు గానీ, గ్యాసు గానీ ఏవీ లేవు. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. అక్కడకు అందరూ నేర్చుకునే వస్తారు. పనులు త్వరత్వరగా అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇండ్లు ఎలా తయారవుతున్నాయో చూడండి. అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎన్ని అంతస్థులు కడుతున్నారు! అక్కడ ఇలా ఉండదు. అక్కడ అందరికీ తమ-తమ పొలాలుంటాయి. పన్నులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ లెక్కలేనంత ధనముంటుంది. భూమి కూడా ఎంత కావాల్సినా ఉంటుంది. నదులన్నీ ఉంటాయి. కాలువలు ఉండవు. అవి తర్వాత తవ్వబడ్తాయి.
పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషముండాలి - మాకు డబల్‌ ఇంజన్‌ లభించింది. పర్వతము పైకి పోవాలంటే రైలుకు డబుల్‌ ఇంజన్‌ లభిస్తుంది. పిల్లలైన మీరు కూడా సహయోగము చేస్తారు కదా. మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మీ మహిమ కూడా గాయనము చేయబడింది. మనము ఈశ్వరీయ సేవాధారులమని మీకు తెలుసు. శ్రీమతముననుసరించి సేవ చేస్తున్నారు. బాబా కూడా సేవ చేసేందుకు వచ్చారు. ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక ధర్మాలను నాశనము చేయిస్తారు. ఇక కొంత సమయము తర్వాత చాలా గలాటాలు జరగడం మీరు చూస్తారు. ఇప్పుడు కూడా, కొట్లాడుకొని బాంబులు వేస్తారేమో అని భయపడుతూనే ఉన్నారు. నిప్పురవ్వలైతే(చిన్న చిన్న యుద్ధాలు) చాలా జరుగుతూ ఉంటాయి. పరస్పరము పదే పదే కొట్లాడుకుంటూ ఉంటారు. పాత ప్రపంచము సమాప్తమయ్యే తీరాలని పిల్లలకు తెలుసు. మనము మళ్లీ మన ఇంటికి వెళ్లిపోతాము. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. అందరూ ఒక్కసారే వాపసు వెళ్లిపోతారు. మీలో కూడా క్షణ - క్షణము స్మృతి ఉండేవారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. డ్రామానుసారము చురుకైన విద్యార్థులు, మంద బుద్ధిగల విద్యార్థులు ఇరువురూ ఉన్నారు. చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మంద బుద్ధిగలవారు రోజంతా కొట్లాడుకుంటూ, జగడాలాడుకుంటూనే ఉంటారు. తండ్రిని స్మృతి చేయరు. వారికి రోజంతా బంధు-మిత్రులే చాలా గుర్తుకొస్తూ ఉంటారు. ఇక్కడ అవన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. మనము ఆత్మలము. ఈ శరీరమనే తోక వ్రేలాడుతూ ఉంది. మనము కర్మాతీత అవస్థను పొందుకుంటే, ఈ తోక ఊడిపోతుంది. కర్మాతీత స్థితి వచ్చి ఈ శరీరము సమాప్తమైపోవాలని మనము శ్యామము నుండి సుందరంగా అవ్వాలనే చింత ఉంది. శ్రమ చేయాలి కదా. ప్రదర్శినిలో ఎంత శ్రమ చేస్తారో చూడండి. మహేంద్ర(భోపాల్‌) ఎంత ధైర్యము చేశాడు! ఎంతో కష్టపడి ఒంటరిగానే ప్రదర్శినీలు మొదలైనవి చేస్తాడు. శ్రమకు ఫలితము కూడా లభిస్తుంది కదా. ఒక్కడే ఎంత అద్భుతం చేశాడు! ఎంతమందికి కళ్యాణము చేశాడు! బంధు-మిత్రులు మొదలైన వారి సహాయముతోనే ఎంత పని చేశాడు! అద్భుతము! బంధు-మిత్రులకు ఈ ధనము మొదలైన వాటిని ఈ కార్యములో ఉపయోగించండి, అట్లే పెట్టుకొని ఏం చేస్తారు? అని చెప్తాడు. ధైర్యంగా సెంటరు కూడా తెరిచాడు. ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశాడు! ఇటువంటి వారు 5-6 మంది ఉన్నా ఎంత సేవ జరుగుతుంది! కొంతమంది చాలా దురదృష్టవంతులుంటారు. వారి భాగ్యములో లేదని భావించబడ్తుంది. వినాశనము చాలా సమీపంగా ఉందని, ఏదైనా చేసుకోవాలి అని వారికి అర్థము కాదు. ఇప్పుడు ఈశ్వరార్థము మనుష్యులు చేసే దానము వలన ఏమీ లభించదు. ఈశ్వరుడైతే ఇప్పుడు స్వర్గరాజ్యమునిచ్చేందుకు వచ్చారు. దాన-పుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు. సంగమ యుగములో ఎవరైతే తమ తనువు-మనసు-ధనము అన్నీ సఫలము చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారే అదృష్టవంతులు. కానీ భాగ్యములో లేకుంటే వారికి అర్థమే కాదు. వారు కూడా బ్రాహ్మణులే, మనము కూడా బ్రాహ్మణులమే అని మీకు తెలుసు. మనము ప్రజాపిత బ్రహ్మకుమార - కుమారీలము. బ్రాహ్మణులు అనేకమంది ఉన్నారు. వారు గర్భజనితులు. మీరు ముఖవంశావళి. శివజయంతి సంగమ యుగములో జరుగుతుంది. ఇప్పుడు స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి 'మన్మనాభవ' అను మంత్రమునిస్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి యుక్తులతో కరపత్రాలు అచ్చు వేయించాలి. ప్రపంచములో చాలామంది చనిపోతారు కదా. ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అక్కడకు వెళ్లి కరపత్రాలు పంచాలి. తండ్రి వచ్చినప్పుడే పాత ప్రపంచము నాశనమవుతుంది. దాని తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఎవరైనా సుఖధామానికి వెళ్లాలనుకుంటే మంత్రము - ' మన్మనాభవ '. ఇటువంటి రసవత్తరమైన ప్రింటు చేసిన కరపత్రాలు అందరి వద్ద ఉండాలి. శ్మశానములో కూడా పంచవచ్చు. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. సేవ చేసేందుకు యుక్తులైతే చాలా తెలుపుతారు. ఇది మంచి రీతిగా వ్రాయాలి. లక్ష్యమేమో వ్రాయబడి ఉంది. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
పూర్తి రోజంతా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శ్రేష్ఠ భావాన్ని ధారణ చేయాలని విశేషమైన గమనముంచి అశుభ భావమును శుభ భావములోకి, అశుభ భావనను శుభభావనలోకి పరివర్తన చేసి ఆహ్లాదకర స్థితిలో ఉంటే అవ్యక్త స్థితి సహజంగా అనుభవమవుతూ ఉంటుంది.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరమనే తోకను మర్చిపోవాలి. ఒక్క తండ్రి తప్ప ఏ బంధు-మిత్రులు మొదలైనవారెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ శ్రమ చేయాలి.
2. శ్రీమతముననుసరించి ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. తనువు-మనస్సు-ధనము అన్నీ సఫలము చేసుకొని, శ్రేష్ఠమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి.

వరదానము :- '' ఆనెస్‌ (నిజాయితీ‌)గా అయి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టము చేసుకునే ఎక్కేకళలో అనుభవీ భవ ''
స్వయాన్ని ఎటువంటివారో, ఎలా ఉన్నారో అలాగే తండ్రి ముందు ప్రత్యక్షము చేయాలి. ఇదే అన్నిటికంటే అత్యంత పెద్ద ఎక్కేకళకు సాధనము. బుద్ధి పై అనేక రకాల భారమేదైతే ఉందో దానిని సమాప్తం చేసేందుకు ఇదే సహజమైన యుక్తి. ఆనెస్ట్‌గా అయి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టం చేసుకోవడమంటే పురుషార్థ మార్గాన్ని స్పష్టంగా చేసుకోవడం. ఎప్పుడూ చతురతతో మన్మతము, పరమతాల ప్లాన్‌ తయారుచేసి తండ్రి లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ముందు ఏదైనా విషయాన్ని ఉంచితే అది నిజాయితి కాదు. నిజాయితి అనగా తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారో, అలా పిల్లలు తండ్రి ముందు ప్రత్యక్షమవ్వాలి.

స్లోగన్‌ :- '' ఎవరైతే సదా సర్వస్వత్యాగి పొజిషన్‌లో ఉంటారో, వారే సత్యమైన తపస్వీలు ''

No comments:

Post a Comment