Saturday, September 28, 2019

Telugu Murli 29/09/2019

29-09-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 16-02-1985 మధువనము

'' ప్రతి శ్వాసలో సంతోషపు వాయిద్యాలు మ్రోగడమే ఈ శ్రేష్ఠ జన్మ కానుక ''
ఈ రోజు భోళానాథ్‌, భోలాభండారి అయిన తండ్రి తమ అతి స్నేహితులు, సదా సహయోగులు, సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలతో మిలనము చేసుకునేందుకు వచ్చారు. పిల్లలు ఇప్పుడు కూడా యజమానులే, భవిష్యత్తులో కూడా యజమానులే. ఇప్పుడు విశ్వరచయితకు బాలకుల నుండి యజమానులుగా ఉన్నారు, భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా ఉంటారు. బాప్‌దాదా ఇటువంటి తమ యజమాని పిల్లలను చూసి హర్షిస్తారు. ఈ బాలకుల నుండి యజమానులుగా అవ్వడం, ఇది అలౌకిక నషా, అలౌకిక సంతోషము. మీరు సదా ఇటువంటి అదృష్టవంతలైన, సదా సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలు కదా! ఈ రోజు పిల్లలందరు తండ్రి అవతరణ జయంతిని జరపడానికి ఉల్లాస-ఉత్సాహాలతో హర్షిస్తున్నారు. తండ్రి జయంతియే పిల్లల జయంతి అని బాప్‌దాదా అంటారు. కావున ఇది అద్భుతమైన జయంతి. నిజానికి తండ్రి మరియు పిల్లల జయంతి ఒకేసారి జరగదు. అలా జరుగుతుందా? అదే రోజు తండ్రి జన్మదినం మరియు పిల్లల జన్మదినం అవ్వడం ఎప్పుడైనా విన్నారా? ఇదే ఆలౌకిక జయంతి. ఏ ఘడియ అయితే తండ్రి, పుత్రుడైన బ్రహ్మలో అవతరించారో అదే రోజున, అదే ఘడియలో బ్రహ్మ అలౌకిక జన్మ కూడా జరిగింది. ఇరువురి జన్మలు ఒకేసారి జరిగాయి కదా! అలాగే బ్రహ్మతో పాటు అనన్య బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది. కావున దివ్య జన్మ జరిగిన తిధి, వేళ, రేఖ బ్రహ్మ మరియు శివబాబాల అవతరణ ఒకటే అయిన కారణంగా శివబాబా మరియు పుత్రుడైన బ్రహ్మ పరమాత్మ మరియు మహాన్‌ ఆత్మ అయ్యి ఉండి కూడా తండ్రి సమానంగా (శివబాబా సమానంగా) అయ్యారు. సమానత ఉన్న కారణంగా కంబైండ్‌ రూపముగా అయిపోయారు. బాప్‌దాదా, బాప్‌దాదా అని సదా కలిపే పిలుస్తారు కదా! వేరుగా పిలవరు. అలాగే అనన్యులైన బ్రాహ్మణులు బాప్‌దాదాతో పాటు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీల రూపంలో అవతరించారు.
కావున బ్రహ్మ మరియు కుమారులు, కుమారీలు ఇది కూడా తండ్రి మరియు పిల్లల కంబైండ్‌ రూపానికి చిహ్నమైన పేరే. కావున బాప్‌దాదా పిల్లలు బ్రాహ్మణ జీవితము యొక్క అవతరణ జయంతిని జరిపేందుకు వచ్చారు. మీరందరూ కూడా అవతారులే కదా! అవతారము అనగా శ్రేష్ఠ స్మృతి. ''నేను దివ్య జీవితము గల బ్రాహ్మణ ఆత్మను.'' కనుక క్రొత్త జన్మ జరిగింది కదా! ఉన్నతమైన స్మృతి ద్వారా ఈ సాకార శరీరములోకి అవతరించి విశ్వకళ్యాణ కార్యములో నిమిత్తంగా అయ్యారు. కనుక మీరు అవతారమే కదా! ఎలాగైతే తండ్రి అవతరించారో అలాగే మీరందరూ విశ్వపరివర్తన కొరకు అవతరించారు. పరివర్తన చెందడమే అవతరించడము. కావున ఇది అవతారమూర్తుల సభ. తండ్రితో పాటు బ్రాహ్మణ పిల్లలైన మీ అలౌకిక జన్మదినము కూడా. కావున పిల్లలు తండ్రి జయంతిని జరుపుతారా లేక తండ్రి పిల్లల జయంతిని జరుపుతారా లేక అందరూ కలిసి పరస్పరం ఒకరి జన్మదినాన్ని మరొకరు జరుపుకుంటారా! దీనినైతే భక్తులు కేవలం స్మృతి చిహ్నంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మీరు సన్ముఖంగా తండ్రితో కలిసి జరుపుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము కల్ప-కల్పపు భాగ్యరేఖ అవినాశిగా గీయబడింది. మాకు భగవంతుడు తోడుగా ఉండే భాగ్యము లభించింది అన్న విషయము సదా మా స్మృతిలో ఉండాలి. మాకు డైరెక్ట్‌ భాగ్యవిధాతతో పాటు భాగ్యమును ప్రాప్తించుకునే పాత్ర ఉంది. మీరు ఇటువంటి డబల్‌ హీరోలు, హీరో పాత్రధారులే కదా! వజ్రతుల్యమైన జీవితము గలవారు కూడా. కావున డబల్‌ హీరోలుగా అయిపోయారు కదా! మొత్తం విశ్వమంతటి దృష్టి హీరో పాత్రధారి ఆత్మలైన మీ పై ఉంది. భాగ్యశాలీ ఆత్మలైన మీ ఈ అంతిమ జన్మలో కూడా లేక కల్పము యొక్క అంతిమ కాలంలో కూడా ఎన్నో స్మృతులు, స్మృతిచిహ్నాల రూపంలో తయారుచేయబడి ఉన్నాయి. తండ్రి మరియు బ్రాహ్మణుల మాటలు స్మృతిచిహ్న రూపంలో శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటిలోని రెండు మాటలు వినడం ద్వారా శాంతి-సుఖాల అనుభవము చేస్తూ ఉంటారు.
భాగ్యశాలీ ఆత్మలైన మీ శ్రేష్ఠ కర్మలు చరిత్ర రూపంలో ఇప్పటివరకు కూడా గానం చేయబడుతున్నారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల శ్రేష్ఠ సంకల్పాలు దీవెనల రూపంలో గానం చేయడ్తున్నాయి. ఏ దేవత ముందుకైనా దీవెనలు అడిగేందుకే వెళ్తారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ స్మృతి, స్మరణ రూపంలో ఇప్పటికి కూడా స్మృతి చిహ్నంగా కొనసాగుతోంది. కావున మీరు ఇటువంటి భాగ్యశాలురుగా ఎలా అయ్యారు? ఎందుకంటే మీరు భాగ్యవిధాత జతలో భాగ్యవంతులుగా అయ్యారు. కావున మీది ఎంత భాగ్యవంతమైన దివ్య జన్మయో అర్థం చేసుకున్నారా? భాగ్యవంతులైన పిల్లలకు ఇటువంటి దివ్యజన్మ శుభాకాంక్షలను భగవంతుడైన బాప్‌దాదా తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలే శుభాకాంక్షలు. ఇవి ఒక్కరి కోసం అభినందనలు కావు. ఈ భాగ్యవంతమైన జన్మ ప్రతి క్షణము, అన్నివేళలా అభినందనలతో నిండి ఉంది. ఈ శ్రేష్ఠ జన్మ గురించి తెలుసు కదా! ప్రతి శ్వాసలో సంతోష వాయిద్యాలు మ్రోగుతున్నాయి. శ్వాస నడవడం కాదు, సంతోషము యొక్క వాయిద్యాలు మ్రోగుతున్నాయి. ఆ వాయిద్యాలు వినిపిస్తున్నాయి కదా! సహజ సిద్ధమైన వాయిద్యాలు ఎంత శ్రేష్ఠమైనవి! ఈ దివ్య జన్మలోని ఈ సంతోష వాయిద్యాలు అనగా శ్వాస, దివ్య జన్మ యొక్క శ్రేష్ఠ కానుక. బ్రాహ్మణ జన్మ లభించడంతోనే ఈ సంతోష వాయిద్యాలు కానుకగా లభించాయి కదా! వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా రెండు వేళ్ళూ పైకి కిందకి కదుపుతారు కదా! అలాగే శ్వాస నడవడం అనగా వాయిద్యాలు మ్రోగడం. శ్వాస ఎప్పుడూ ఆగిపోజాలదు. అలాగే వాయిద్యాలు కూడా ఎప్పుడూ ఆగిపోజాలవు. సంతోషముతో కూడుకున్న అందరి వాయిద్యాలు బాగా నడుస్తున్నాయి కదా! డబల్‌ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? భోలాభండారి నుండి అన్ని ఖజానాలు తీసుకుని మీ భండారాన్ని నిండుగా చేసుకున్నారు కదా! వీటి ద్వారా 21 జన్మలు మీ భండారాలు నిండుగా ఉంటాయి. నింపుకునే శ్రమ చేయనవసరం లేదు. ఎంతో సుఖంగా ప్రాలబ్ధము ప్రాప్తిస్తుంది. ఇప్పటి ఈ పురుషార్థము 21 జన్మల కొరకు ప్రాలబ్ధము. 21 జన్మలు సదా సంపన్న రూపంలో ఉంటారు. మరి పురుషార్థమేం చేశారు? శ్రమ అనిపిస్తోందా? పురుషార్థం అనగా కేవలం కేవలం స్వయాన్ని ఈ రథములో విరాజమానమై ఉన్న పురుషుడను అనగా ఆత్మగా భావించండి. దీనినే పురుషార్థమని అంటారు. ఈ పురుషార్థము చేశారు కదా! ఈ పురుషార్థ ఫల స్వరూపంగా 21 జన్మలు సదా సుఖంగా మరియు ఆనందంగా ఉంటారు. ఇప్పుడిది కూడా సంగమయుగము ఆనందాల యుగము. ఇది తికమకపడే యుగము కాదు, ఆనందాల యుగము. ఒకవేళ ఏదైనా విషయంలో తికమకపడినట్లయితే సంగమయుగము నుండి పాదాలను కాస్త కలియుగము వైపుకు తీసుకెళ్తారు. అందువలన చిక్కులలో పడ్తారు. సంకల్పము మరియు బుద్ధి రూపి పాదము సంగమయుగంలో ఉన్నట్లయితే సదా ఆనందాలలో ఉంటారు. సంగమయుగమనగా ఇరువురి మిలనము జరుపుకునే యుగము. కావున ఇది తండ్రి మరియు పిల్లలు మిలనము జరుపుకునే సంగమయుగము. ఎక్కడైతే మిలనము జరుగుతుందో అక్కడ ఆనందం ఉంటుంది. కావున ఇది వేడుకలు జరుపునే జన్మ కదా! కావున తికమకల నామ-రూపాలు కూడా ఉండరాదు. ఈ వేడుకల సమయంలో ఆత్మికమైన వేడుకలు బాగా జరుపుకోండి. డబల్‌ విదేశీయులైతే డబల్‌ ఆనందములో ఉండేవారు కదా! ఇటువంటి ఆనందాల జన్మకు అభినందనలు తికమకపడేందుకు విశ్వంలో అనేక ఆత్మలు ఉన్నారు. మీరు అందుకు లేరు. అటువంటివారు ముందే ఎంతోమంది ఉన్నారు. వేడుకలు జరుపుకునే మీరు కొద్దిమందే ఉన్నారు. మీ ఈ శ్రేష్ఠ జయంతిని అర్థం చేసుకున్నారా? అలాగే ఈనాటి జ్యోతిష్య విద్య గలవారు దినము, తిథి, మరియు వేళ ఆధారం పై భాగ్యము గురించి తెలియజేస్తారు. మీ అందరి వేళ ఏది? తిథి ఏది? తండ్రితో పాటు బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది కదా! కావున భగవంతుని తిధి ఏదైతే ఉందో అదే మీ తిథి.
భగవంతుని అవతారం అనగా దివ్యజన్మ జరిగిన వేళ ఏదైతే ఉందో, అదే మీ వేళ కూడా అయ్యింది. ఇది ఎంతటి ఉన్నతమైన వేళ. ఎంత ఉన్నతమైన రేఖ. దీనినే దశ అని అంటారు. తండ్రితో పాటు మా జన్మ జరిగిందని హృదయంలో ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి. బ్రహ్మ, బ్రాహ్మణులు లేకుండా ఏమీ చేయజాలరు. శివబాబా బ్రహ్మ లేకుండా ఏమీ చేయజాలరు. కావున జత జతలో జరిగింది కదా. కావున జన్మతిథి, జన్మవేళల మహత్వమును సదా గుర్తుంచుకోండి. ఏ తిథిన భగవంతుడు అవతరించారో అదే తిథినాడు ఆత్మలైన మనము అవతరించాము. పేరు, రాశి కూడా చూడండి. బ్రహ్మ బ్రాహ్మణులు, బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. నామరాశి కూడా శ్రేష్ఠమైనది. అటువంటి శ్రేష్ఠజన్మ లేక జీవితము కలిగిన పిల్లలను చూసి తండ్రి సదా హర్షిస్తారు. పిల్లలు, ''ఓ¬ బాబా, ఓ¬'' అని అంటారు. తండ్రి, ''ఓ¬! ఓ¬ పిల్లలూ'' అని అంటారు. ఇటువంటి పిల్లలు కూడా ఎవ్వరికీ లభించరు.
ఈనాటి దివ్యజన్మ యొక్క విశేష కానుకను బాప్‌దాదా స్నేహితులైన పిల్లలందరికీ రెండు స్వర్ణిమ పదాలుగా ఇస్తున్నారు. ఒకటి - సదా స్వయాన్ని తండ్రి కంటిపాపలు(నూరేరతన్‌) అని భావించండి. నూరేరతన్‌ అనగా సదా నయనాలలో ఇమిడి ఉన్నవారు. నయనాలలో ఇమిడి ఉన్న స్వరూపము బిందువు. నయనాలలో బిందువు చేసే అద్భుతముంది. కావున నూరేరతన్‌ అనగా బిందువైన తండ్రితో ఇమిడి ఉన్నాను, స్నేహములో ఇమిడి ఉన్నాను. కనుక నేను కంటిపాపను అన్న స్వర్ణిమ పదమును గుర్తుంచుకోండి. రెండవది, సదా తండ్రి తోడు, తండ్రి చేయి నా పై ఉంది. బాబా తోడు కూడా ఉంది. వారి చేయి కూడా నా పైన ఉంది. సదా ఆశీర్వాదాల చేయి ఉంది. అంతేకాక సదా సహయోగము తోడుగా ఉంది. కావున సదా తండ్రి తోడు మరియు చేయి నా పై ఉండనే ఉన్నాయి. తోడునివ్వడం చేయినుంచడం కాదు. వారు తోడుగా ఉండనే ఉన్నారు. ఈ రెండవ స్వర్ణిమ వాక్కు - ''సదా తోడుగా ఉన్నారు మరియు సదా వారి చేయి నా పై ఉంది.'' అన్నది ఈనాటి ఈ దివ్యజన్మ కానుక. మంచిది.
ఇటువంటి నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు, సదా ప్రతి శ్వాసను సంతోషమునిచ్చే వాయిద్యముగా అనుభవం చేసే పిల్లలకు, డబల్‌ హీరో పిల్లలకు, సదా భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతి స్వరూపులైన పిల్లలకు భోలానాధుడు, అమరనాధుడు, వరదాత అయిన తండ్రి చాలా చాలా దివ్యజన్మ శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే!
దాదీలతో :- బేహద్‌ తండ్రి బాహువులు చాలా విశాలమైనవి. ఆ స్నేహ బాహువులలో, ఒడిలో అందరు ఇమిడి ఉన్నారు. సదా పిల్లలందరు తండ్రి భుజాలలో, భుజాల మాలలు లోపల ఉన్నప్పుడే మాయాజీతులుగా ఉంటారు. మీరు బ్రహ్మతో పాటు జన్మ తీసుకునే శ్రేష్ఠ ఆత్మలు కదా! తిథిలో కొద్దిగా కూడా తేడా లేదు. అందుకే బ్రహ్మకు అనేక ముఖాలు చూపించారు. బ్రహ్మకే 5 ముఖాలు లేక 3 ముఖాలు చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అయితే మీరు మూడు ముఖాల రూపంలో ఉన్నారా లేక ఐదు ముఖాల రూపంలో ఉన్నారా? ముఖాలు కూడా సహయోగులుగా ఉంటాయి కదా! తండ్రికి కూడా నషా ఉంది, అది ఏ నషా? మొత్తం విశ్వంలో ఏ తండ్రి అయినా ఇటువంటి పిల్లలను వెతికినా దొరుకుతారా? దొరకరు. ఇటువంటి పిల్లలు లభించరని తండ్రి అంటారు. ఇటువంటి తండ్రి లభించరని పిల్లలంటారు. బాగుంది. పిల్లలే ఇంటికి శోభ. కేవలం తండ్రి ఒంటరిగా ఉంటే ఇంటికి శోభ ఉండదు. కావున పిల్లలు ఈ విశ్వమనే ఇంటికి శోభ. ఇంతమంది బ్రాహ్మణులందరి శోభను తీసుకొచ్చేందుకు నిమిత్తంగా ఎవరయ్యారు? పిల్లలే అయ్యారు కదా! తండ్రి కూడా పిల్లల శోభను చూసి సంతోషిస్తారు. తండ్రి మీ అందరికన్నా ఎక్కువగా మాలను స్మరించవలసి వస్తుంది. మీరైతే ఒకే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది, తండ్రి ఎన్ని మాలలను స్మరించవలసి ఉంటుంది. భక్తిమార్గములో ఎన్ని మాలలైతే వేశారో అన్ని మాలలను తండ్రి ఇప్పుడు స్మరించవలసి వస్తుంది. ఒక్క రోజు కూడా పిల్లల మాలలో ఒక్కరినైనా తండ్రి స్మరింపకుండా ఉండడం జరగజాలదు. కావున తండ్రి కూడా నౌధా భక్తి చేసినట్లే కదా! ఒక్కొక్కరి విశేషతల గుణాల మాలను తండ్రి స్మరిస్తారు. ఎన్నిసార్లు స్మరిస్తారో అంతగా ఆ గుణాలు మరియు విశేషతలు ఇంకా తాజాగా అవుతూ ఉంటాయి. మాలను తండ్రి స్మరిస్తారు కానీ మాల ఫలాన్ని వారు పిల్లలకిస్తారు, స్వయం తీసుకోరు. మంచిది. బాప్‌దాదా అయితే సదా పిల్లల జతలోనే ఉంటారు. ఒక్క క్షణం కూడా పిల్లల నుండి వేరుగా ఉండలేరు. వేరుగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఎందుకు? ఎంతెంతగా పిల్లలు స్మృతి చేస్తారో అంతగా దానికి బదులు అయితే ఇస్తారు కదా! స్మృతికి ప్రతిఫలం అయితే ఇవ్వవలసి ఉంటుంది కదా! కావున ఒక్క సెకండు కూడా పిల్లలు లేకుండా ఉండలేరు. సదా తోడుగా ఉండే ఇటువంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూసి ఉండరు తండ్రి పిల్లలతో అసలు వేరు కాకుండా ఉండే తండ్రి, పిల్లల జోడీని ఎప్పుడూ చూసి ఉండరు. చాలా మంచి పూదోట తయారయింది. మీ అందరికీ కూడా ఈ పూదోట ఎంతో నచ్చుతుంది కదా! ఒక్కొక్కరి సుగంధము అతీతమైనది మరియు ప్రియమైనది. కావున అల్లా పూదోట మహిమ చేయబడింది.
మీరంతా ఆదిరత్నాలు, ఒక్కొక్క రత్నానికి ఎంత విలువ ఉంది! ప్రతి సమయంలో, ప్రతి కార్యంలో, ప్రతి రత్నము అవసరం ఉంది. కావున మీరంతా శ్రేష్ఠ రత్నాలు. ఇప్పటి వరకు కూడా రత్నాల రూపంలో మీకు పూజ జరుగుతోంది. ఇప్పుడు అనేక ఆత్మలకు విఘ్నవినాశకులుగా అయ్యి సేవ చేస్తున్నారు. అందుకే స్మృతిచిహ్న రూపంలో ఒక్కొక్క రత్నానికి విలువ ఉంటుంది. కొన్ని విఘ్నాలను నాశనం చేసే రత్నాలుగా ఉంటే, మరికొన్ని మరో రకంగా ఉంటాయి. కావున ఇప్పుడు చివరి వరకు కూడా స్థూలమైన స్మృతి చిహ్న రూపము సేవ చేస్తూ ఉంది. ఇటువంటి సేవాధారులుగా అయ్యారు. అర్థమయిందా!
సమ్ళేనంలో వచ్చిన విదేశీ ప్రతినిధులతో అవ్యక్త బాప్‌దాదా కలయిక
అందరూ ఎక్కడకు చేరుకున్నారు? తండ్రి ఇంటికి వచ్చారు. ఇలా అనుభవం చేస్తున్నారా? తండ్రి ఇంటికి అతిథులు వస్తారా లేక పిల్లలు వస్తారా? పిల్లలు అధికారులా లేక అతిథులా? తండ్రి ఇంటికి వచ్చారు. తండ్రి ఇంట్లోకి సదా అధికారి పిల్లలే వస్తారు. ఇప్పటి నుండి తమను అతిథులుగా కాక తండ్రికి పిల్లలుగా మహాన్‌ ఆత్మలుగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. భాగ్యవంతులుగా ఉన్నారు, అందుకే ఈ స్థానములోకి చేరుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడకు చేరుకోవడమే ఒక భాగ్యము, కానీ ఇక ముందు ఏం చేయాలి? ఇప్పుడు సదా తోడుగా ఉండడం. స్మృతిలో ఉండడమే తోడుగా ఉండడం. ఒంటరిగా వెళ్లకండి. ఎక్కడికి వెళ్లినా, ఏ కర్మ చేసినా కంబైండుగా ఉండి కంబైండు రూపంలో చేయడం వలన సదా సహజంగా మరియు సఫలతను అనుభవం చేస్తారు. సదా తోడుగా ఉంటామనే సంకల్పం తప్పకుండా చేసి వెళ్లండి. పురుషార్థం చేస్తాము, చూస్తాము అని కాదు, చేయాల్సిందే. ఎందుకంటే దృఢత సఫలతకు తాళంచెవి. కనుక ఈ తాళంచెవిని సదా మీ జతలో ఉంచుకోండి. ఇది ఎటువంటి తాళంచెవి అంటే సంకల్పం చేస్తే ఏ ఖజానా కావాలనుకుంటే ఆ ఖజానా లభిస్తుంది. ఈ తాళంచెవిని సదా తోడుగా ఉంచుకోవడమంటే సదా సఫలతను పొందడం. ఇప్పుడు మీరు అతిథులు కారు, అధికారీ ఆత్మలు. బాప్‌దాదా కూడా ఇటువంటి అధికారి పిల్లలను చూసి హర్షితమవుతారు. ఏ అనుభవం చేశారో ఆ అనుభవాల ఖజానాను సదా పంచుతూ ఉండండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతూ ఉంటుంది. కావున మహాదానులుగా అవ్వండి. కేవలం మీ వద్దనే ఉంచుకోకండి.
వీడ్కోలు సమయంలో(3-30గం||లకు) :- పిల్లలందరికి అభినందనలతో పాటు గుడ్‌మార్నింగ్‌. ఎలాగైతే ఈనాటి రాత్రిని శుభమిలనం చేస్తూ ఆనందంలో గడిపారో అలా సదా రాత్రింబవళ్లు తండ్రి మిలనం చేస్తూ ఆనందంలో గడుపుతూ ఉండండి. సంగమయుగమంతా తండ్రి నుండి అభినందనలు తీసుకుంటూ వృద్ధిని పొందుతూ ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సదా మహాదానులుగా, వరదానులుగా అయి అనేక ఆత్మలకు దానమూ ఇవ్వండి, వరదానమూ ఇవ్వండి. మంచిది. ఇటువంటి సదా విశ్వకళ్యాణకారులకు, సదా దయాహృదయులకు సదా సర్వుల పట్ల శుభభావనను ఉంచే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌.

వరదానము :- ''అనుభూతి శక్తి ద్వారా స్వ పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ''
ఏ పరివర్తనకైనా సహజమైన ఆధారమ అనుభూతి శక్తి. ఎప్పటివరకైతే అనుభూతి శక్తి రాదో, అప్పటివరకు బ్రాహ్మణ జీవితములో విశేషతలు అనే పునాది దృఢంగా ఉండదు. ఉల్లాస-ఉత్సాహాల నడవడిక ఉండదు. ఎప్పుడైతే అనుభూతి శక్తి ప్రతి విషయాన్ని అనుభవీలుగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. అనుభూతి శక్తి సదా కాలికంగా సహజంగా పరివర్తన చేయిస్తుంది.

స్లోగన్‌ :- '' స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం(ఎమర్జ్‌) చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వండి.''

No comments:

Post a Comment