01-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం
''మధురమైన పిల్లలారా - చెడు వినకు,..... ఇక్కడ మీరు సత్సంగములో కూర్చుని ఉన్నారు, మీరు మాయావి కుసంగాలకు వెళ్లరాదు. చెడు సాంగత్యము వలన సంశయ రూపములో ఆటంకాలు వస్తాయి''
ప్రశ్న:- ఈ సమయంలో ఏ మనిషిని కూడా స్పిరిచ్యువల్(ఆధ్యాత్మికము) అని అనరాదు - ఎందుకు?
జవాబు:- ఎందుకంటే అందరూ దేహాభిమానములో ఉన్నారు. దేహాభిమానుములో ఉన్నవారు స్పిరిచ్యువల్ అని ఎలా పిలువబడ్తారు? స్పిరిచ్యువల్ ఫాదర్ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారు మీకు కూడా దేహీ-అభిమానులుగా తయారయ్యే శిక్షణనిస్తున్నారు. ఒక్క తండ్రికి మాత్రమే సుప్రీమ్ (పరమ) అను టైటిల్(బిరుదు) ఇవ్వగలరు. తండ్రి తప్ప సుప్రీమ్(అత్యంత శ్రేష్ఠులు) అని ఎవ్వరూ అనబడరు.
ఓంశాంతి. పిల్లలిచ్చట కూర్చున్నప్పుడు బాబా మనకు తండ్రే కాక, టీచరు, సద్గురువు కూడా అయ్యారని స్మృతి ఉంటుంది. ముగ్గురి అవసరము ఉంటుంది. మొదట తండ్రి, తర్వాత చదివించే టీచరు, ఆ తర్వాత గురువు. ఇచ్చట స్మృతి కూడా ఇలాగే చేయాలి ఎందుకంటే ఇది కొత్త విషయము కదా. వారు అనంతమైన తండ్రి. అనంతమనగా సర్వులకు అని అర్థము. ఇచ్చటకు ఎవరు వచ్చినా ఇది స్మృతిలోకి తెచ్చుకోండి అని చెప్తారు. ఇందులో సంశయమెవరికైనా ఉంటే చేతులెత్తండి. ఇది అద్భుతమైన విషయము కదా. జన్మ-జన్మాంతరాలుగా ఎప్పుడూ ఇటువంటివారు అనగా తండ్రి, టీచరు, సద్గురువు ఒక్కరే అయిన వారెవరైనా లభించారా? అందులోనూ సుప్రీమ్. అనంతమైన తండ్రి, అనంతమైన టీచరు, అనంతమైన సద్గురువు. ఇటువంటివారు ఎప్పుడైనా ఎవరైనా లభించారా? ఈ పురుషోత్తమ సంగమ యుగములో తప్ప మరెప్పుడూ లభించరు. ఇందులో సంశయమున్న వారు చేతులెత్తండి. ఇచ్చట అందరూ నిశ్చయబుద్ధితో కూర్చుని ఉన్నారు. ఈ ముగ్గురే ముఖ్యమైనవారు. అనంతమైన తండ్రి ఇచ్చే జ్ఞానము కూడా అనంతమే. ఈ జ్ఞానమొక్కటే అనంతమైనది(బేహద్). అనేక ప్రకారాలైన పరిమిత(హద్దు) విద్యలను మీరు చదువుతూనే వచ్చారు. కొంతమంది వకీళ్ళుగా, కొంతమంది సర్జన్లుగా అవుతారు ఎందుకంటే ఇక్కడ డాక్టరు, జడ్జి, వకీలు అందరూ అవసరమే. అక్కడ వీరి అవసరముండదు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. అందుకే ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు బేహద్(అనంతమైన) శిక్షణను ఇస్తారు. ఇక మీదట అర్ధకల్పము మీరెవ్వరి వద్దా శిక్షణ పొందే అవసరముండదు. ఈ ఒక్కసారి లభించిన శిక్షణ(విద్య) ద్వారా 21 జన్మలకు ఫలితము లభిస్తుంది. ఇది అటువంటి ఫలితమునిచ్చే చదువు. అచ్చట వకీలు, డాక్టరు, జడ్జీ మొదలైన వారెవ్వరూ ఉండరు. ఇది నిశ్చయముంది కదా. అంతే కదా? అక్కడ దు:ఖముండదు, కర్మ భోగముండదు. తండ్రి కర్మల విధానాన్ని కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ గీత వినిపించేవారు ఈ విధంగా వినిపిస్తారా? తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు రాజయోగము నేర్పిస్తున్నాను. దానిలో కృష్ణ భగవానువాచ అని వ్రాశారు. కానీ కృష్ణుడు దైవీగుణాలు గల మానవుడు. శివబాబా ఏ పేరూ పెట్టుకోరు. వారికి ఇతర పేరే లేదు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఈ శరీరమనే ఇల్లు నాది కాదు. ఇది ఇతని(బ్రహ్మ) ఇల్లు. ఈ ఇంటికి కిటికీలు మొదలైనవన్నీ ఉన్నాయి. నేను మీ అనంతమైన తండ్రిని అనగా సర్వాత్మల తండ్రిని. ఆత్మలకు చదువు కూడా చెప్తాను. వీరిని స్పిరిచ్యువల్ ఫాదర్(ఆత్మిక తండ్రి) అని అంటారు అనగా ఆత్మల తండ్రి. ఇతరులెవ్వరినీ ఆత్మల తండ్రి అని అనరు. వీరు అనంతమైన(బేహద్) తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్పిరిచ్యువల్ కాన్ఫరెన్స్(ఆధ్యాత్మిక సమ్మేళనము) జరుగుతోంది. వాస్తవానికి స్పిరిచ్యువల్ కాన్ఫరెన్స్ ఉండనే ఉండదు. ఇది సత్యమైన స్పిరిచ్యువల్ కానే కాదు. వారు దేహాభిమానంలో ఉన్నారు. తండి చెప్తున్నారు - పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహాభిమానాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎవ్వరూ చెప్పరు. స్పిరిచ్యువల్ అనే పదము ఇప్పుడే వ్రాస్తున్నారు. ఇంతకుముందు రిలీజియస్(మత సంబంధమైన) కాన్ఫరెన్స్ అనేవారు. స్పిరిచ్యువల్కు అర్థము వారికి తెలియనే తెలియదు. స్పిరిచ్యువల్ ఫాదర్ అనగా నిరాకార తండ్రి. ఆత్మలైన మీరే స్పిరిచ్యువల్(ఆత్మిక) పిల్లలు. స్పిరిచ్యువల్ ఫాదర్ వచ్చి మిమ్ములను చదివిస్తున్నారు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. తండ్రి స్వయంగా కూర్చుని తానెవరో అర్థం చేయిస్తున్నారు. గీతలో ఇది లేదు. నేను మీకు అనంతమైన శిక్షణనిస్తాను. ఇందులో వకీలు, జడ్జీ, సర్జన్ మొదలైనవారి అవసరము లేదు. ఎందుకంటే అక్కడ అపారమైన సుఖముంటుంది. దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇక్కడ సుఖానికి నామ-రూపాలు లేనే లేవు. ఇలా జరుగుటను ప్రాయ: లోపమని అంటారు. సుఖము కాకిరెట్టతో సమానము. అంత కొంచెమే సుఖముంటే అనంతమైన సుఖము లభించే జ్ఞానమునెలా ఇస్తారు? మొదట దేవీదేవతల రాజ్యమున్నప్పుడు సత్యత నూటికి నూరు శాతము ఉండేది. ఇప్పుడు అంతా అసత్యమే అసత్యముంది.
ఇది అనంతమైన జ్ఞానము. ఇది మానవ సృష్టి వృక్షము. దీనికి బీజము 'నేను' అని మీకు తెలుసు. వారిలో వృక్ష జ్ఞానము సంపూర్ణంగా ఉంది. మానవులకు ఈ జ్ఞానము లేదు. నేను చైతన్య బీజరూపాన్ని. నన్ను జ్ఞానసాగరుడని అంటారు. జ్ఞానము వలన సెకండులో గతి-సద్గతి జరుగుతుంది. నేను సర్వుల తండ్రిని. నన్ను తెలుసుకొని గుర్తించినందున పిల్లలైన మీకు వారసత్వము లభిస్తుంది. కానీ రాజధాని కదా. స్వర్గములో కూడా నంబరువారు పదవులు చాలా ఉంటాయి. ఆ తండ్రి ఒకే విధమైన చదువును చదివిస్తారు. చదివేవారు నంబరువారుగా ఉండనే ఉంటారు. ఇందులో ఇతర చదువుల అవసరముండదు. అక్కడ ఎవ్వరూ జబ్బు పడరు. అక్కడ ధన సంపాదన కొరకు చదువుకోరు. మీరు ఇక్కడి నుండి అనంతమైన వారసత్వము తీసుకెళ్తారు. అక్కడ మనకు ఈ పదవి ఎవరు ఇప్పించారో కూడా తెలియదు. ఇక్కడ మీరు అవన్నీ అర్థం చేసుకుంటారు. హద్దులోని జ్ఞానాన్ని మీరు చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన చదువును చదివించేవారిని చూచారు, అర్థం చేసుకున్నారు. ఈ తండ్రి తండ్రే కాక టీచరు కూడా అని తెలుసుకున్నారు. వారు వచ్చి మనలను చదివిస్తున్నారు. వారు సుప్రీమ్ టీచరు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. వారు వచ్చి మనలను చదివిస్తున్నారు. ఇది బేహద్ రాజయోగము. వారు వకీలు చదువు, డాక్టరు చదువు మాత్రమే నేర్పిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచమే దు:ఖమయంగా ఉంది. అదంతా హద్దు చదువు. ఇది బేహద్ చదువు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తున్నారు. ఈ తండ్రి, టీచరు, సద్గురువు కల్ప-కల్పమూ వస్తారని కూడా మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాల కొరకు ఈ చదువునే మళ్లీ చదివిస్తారని కూడా మీకు తెలుసు. తర్వాత ఈ చదువు ప్రాయ: లోపమైపోతుంది. సుఖ ప్రాలబ్ధము డ్రామానుసారము పూర్తి అయిపోతుంది. అనంతమైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. వారిని పతితపావనులని అంటారు. కృష్ణుని త్వమేవ మాతా, పిత లేక పతితపావనా అని అంటారా? వీరి మహిమకు, వారి మహిమకు రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. నన్ను తెలుసుకుంటే మీరు ఒక్క క్షణములో జీవన్ముక్తి పొందుకుంటారని తండ్రి చెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఇప్పుడుంటే ఎవరైనా వెంటనే గుర్తిస్తారు. కృష్ణుని జన్మ దివ్యమైనదని, అలౌకికమైనదని మహిమ చేయబడలేదు. కేవలం పవిత్రత ద్వారా జరుగుతుంది. ఈ తండ్రి ఏ గర్భము ద్వారా జన్మించరు. వారు వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! అని అర్థం చేయిస్తున్నారు. చదివేది ఆత్మలే. మంచి సంస్కారము గానీ, చెడు సంస్కారాలు గానీ అన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరాలు లభిస్తాయి. కొంతమంది చాలా దు:ఖమును అనుభవిస్తారు. కొంతమంది ఒంటికన్ను వారు, మెల్లకన్ను వారు, చెవిటి వారు కూడా ఉంటారు. పోయిన జన్మలో చేసిన కర్మఫలము అని అంటారు. ఆత్మలకు వారి వారి కర్మల అనుసారమే రోగి శరీరాలు మొదలైనవి లభిస్తాయి.
ఇప్పుడు మనలను చదివించేవారు గాడ్ఫాదర్ అని పిల్లలైన మీకు తెలుసు. గాడ్ టీచరు, గాడ్ గురువు(ప్రిసిప్టర్) కూడా వారే. వారినే గాడ్ అని, పరమాత్మ అని కూడా అంటారు. పరమ మరియు ఆత్మ కలిసి పరమాత్మ, సుప్రీమ్ సోల్ అని అంటారు. బ్రహ్మను సుప్రీమ్ అని అనరు. సుప్రీమ్ అనగా ఉన్నతోన్నతులు. అత్యంత పవిత్రులు. ప్రతి ఒక్కరి పదవులు వేరు వేరుగా ఉంటాయి. కృష్ణుని పదవి ఇతరులకు లభించదు. ప్రధానమంత్రి పదవి ఇతరులకు లభించదు. తండ్రి పదవి కూడా ప్రత్యేకంగా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకరులది కూడా ఎవరి పదవి వారిదే. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలని, శివుని పరమాత్మ అని అంటారు. ఇద్దరినీ కలిపిి శివ శంకరుడని ఎలా అంటారు? ఇరువురూ వేరు వేరు కదా. తెలియనందున శివ-శంకరులు ఒక్కటే అని అంటారు. పేరు కూడా అలా పెట్టుకుంటారు. ఈ విషయాలన్నీ ఆ తండ్రే వచ్చి అర్థము చేయిస్తున్నారు. వీరు మన తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ప్రతి మనిషికి తండ్రి కూడా ఉంటాడు, టీచరు ఉంటాడు, గురువు కూడా ఉంటాడు. ముసలివారైనప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నతనములోనే గురువుల వద్దకు పంపుతారు. అలా పంపకుంటే ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అని భావిస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత గురువులను ఆశ్రయించేవారు. అది వానప్రస్థ అవస్థ. నిర్వాణము అనగా వాణి(శబ్ధము) నుండి దూరము అనగా మధురమైన నిశ్శబ్ధమైన ఇల్లు(స్వీట్ సైలెన్స్ హోమ్). అందులోకి వెళ్లేందుకు అర్ధకల్పము నుండి మీరు శ్రమ చేశారు. అయితే అది ఎక్కడ ఉందో తెలియకుంటే అక్కడకు ఎవ్వరూ పోలేరు. ఎవరికైనా దారినెలా చూపగలరు? ఆ ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ దారి చూపించలేరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. కొంతమంది కథలు విన్నట్లు వింటారు. దాని వలన లాభమేమీ లేదు. ఉన్నతి జరగనే జరగదు. ఇప్పుడు మీరు ఉద్యానవనములోని పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాల నుండి ముళ్ళుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారు చేస్తున్నారు. పూజ్యులుగా ఉన్న మీరే మరలా పూజారులుగా అయ్యారు. 84 జన్మలలో సతోప్రధానము నుండి తమోప్రధానముగా, పతితులుగా అయ్యారు. తండ్రి మెట్ల చిత్రమును విశదముగా తెలిపించారు. ఇప్పుడు మళ్లీ పతితము నుండి పావనంగా ఎలా అవుతారో ఎవ్వరికీ తెలియదు. '' ఓ పతితపావనా! రండి వచ్చి పావనంగా చేయండి'' అని మహిమ కూడా చేస్తారు. అలాంటప్పుడు మళ్లీ నదులను సముద్రాన్ని పతితపావనులని భావించి అందులో స్నానమెందుకు చేస్తారు? గంగా నదిని పతితపావని అని అంటారు. కానీ నదులన్నీ ఎక్కడ నుండి వెలువడ్డాయి? సముద్రము నుండే కదా. వీరంతా సాగరుని సంతానము. అందువలన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ పిల్లలైన మీరు సత్సంగములో కూర్చుని ఉన్నారు. బయట చెడు సాంగత్యములోకి వెళ్తే మీకు విరుద్ధమైన విషయాలను చాలా వినిపిస్తారు. మీరు ఈ విషయాలన్నీ మళ్లీ మర్చిపోతారు. చెడు సాంగత్యములోకి వెళ్లడం వలన ఆటంకాలు ఏర్పడ్తాయి. సంశయము కలుగుతుంది. అయితే ఈ(బాబా చెప్పిన) విషయాలను మర్చిపోరాదు. బాబా, మన అనంతమైన తండ్రే కాక, టీచరు కూడా. ఆవలి తీరానికి కూడా తీసుకెళ్తారు. ఈ నిశ్చయముతోనే మీరు ఇచ్చటికి వచ్చారు. అదంతా లౌకిక చదువు, లౌకిక భాషలు(మాటలు). ఇది అలౌకిక చదువు. నా జన్మ కూడా అలౌకికమే అని తండ్రి చెప్తున్నారు. నేను అప్పు తీసుకుంటాను. అది కూడా పాత చెప్పును తీసుకుంటాను. అది కూడా అన్నింటికంటే పాతది. తండ్రి తీసుకున్న ఈ పాత చెప్పును ' లాంగ్ బూట్ ' అని అంటారు. ఇది ఎంతో సహజమైన విషయము. ఇది మర్చిపోరాదు. కానీ మాయ ఇంత సులభమైన విషయాలను కూడా మరిపింపజేస్తుంది. తండ్రి తండ్రే కాక అనంతమైన శిక్షణనిచ్చేవారు. ఈ చదువు మరెవ్వరూ చెప్పలేరు. బాబా చెప్తున్నారు - ఎక్కడైనా ఇది లభిస్తుందేమో వెళ్లి చూడండి. అందరూ మనుష్యులే. వారు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. భగవంతుడు ఒకే రథమును తీసుకుంటారు. దానిని భాగ్యశాలి రథమని అంటారు. ఇతనిలోనే తండ్రి ప్రవేశించి పదమాపదమ్ భాగ్యశాలిగా చేస్తారు. చాలా సమీపంగా ఉండే పూస. ఇతను బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. శివబాబా ఇతనినే కాదు, ఇతని ద్వారా మిమ్ములను కూడా విశ్వానికి అధికారులుగా చేస్తారు. విష్ణుపురి స్థాపనవుతుంది. దీనిని రాజ్యస్థాపన కొరకు రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరంతా వింటున్నారు కానీ చాలామందికి ఒక చెవి నుండి విని మరొక చెవి ద్వారా బయటకు పోతుందని, కొంతమంది మాత్రమే ధారణ చేసి వినిపించగలరని కూడా బాబాకు తెలుసు. అటువంటి వారిని మహారథులని అంటారు. విని ధారణ చేస్తారు. అంతేకాక ఇతరులకు కూడా చాలా ఇష్టముతో అభిలాషతో వినిపిస్తారు. వినిపించేవారు మహారథులుగా ఉంటే వెంటనే అర్థము చేసుకుంటారు, అశ్వారూఢులైతే తక్కువగా, పదాతిదళము వారైతే ఇంకా తక్కువగా అర్థము చేసుకుంటారు. తండ్రికి మహారథులెవరో, అశ్వారూఢులెవరో బాగా తెలుసు. ఇందులో తికమక చెందే విషయమేదీ లేదు. కానీ పిల్లలు తికమక చెంది, సంశయపడి తూగుతూ ఉంటారు. కనులు మూసుకొని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా తూగు వస్తుందా? అలా తూగుతూ ఉంటే ధారణ ఎలా అవుతుంది? ఆవళింతలు వస్తే వీరు అలసిపోయారని బాబా భావిస్తారు. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. ఆవళింతలు ఉదాసీనతకు గుర్తు. ఏదో ఒక విషయము ఆంతరికములో ఆటంకపరుస్తుంటే ఆవళింతలు చాలా వస్తాయి. ఇప్పుడు మీరు తండ్రి ఇంటిలో కూర్చుని ఉన్నారు. అందువలన మీరు పరివారంగా కూడా ఉన్నారు. టీచరుగా కూడా అవుతారు. మార్గమును చూపించే గురువుగా కూడా అవుతారు. మిమ్ములను మాస్టర్ గురువు అని అంటారు. అందువలన తండ్రికి కుడిభుజంగా అవ్వాలి కదా. మీరు అనేకమందికి కళ్యాణము చేయగలరు. అన్ని వ్యాపారాలలో నష్టముంటుంది. కానీ ఇది వ్యాపారము చేయకనే నరుని నుండి నారాయణునిగా చేసే వ్యాపారము. అందరి సంపాదన సమాప్తమైపోతుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు ఈ తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పిస్తారు. కావున ఏ చదువు చదవాలి? చాలా ధనముండేవారు స్వర్గమిచ్చటనే ఉందని భావిస్తారు. గాంధీ రామరాజ్యమును స్థాపన చేశాడా? అరే! ఈ ప్రపంచము పాతది, తమోప్రధానమైనది కదా. పోను పోను దు:ఖము ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇటువంటి దానిని రామరాజ్యమని ఎలా అంటారు? మనుష్యులు ఎంతో తెలివిహీనులై పోయారు. తెలివిహీనులను తమోప్రధానులని అంటారు. తెలివిగలవారైతే సతోప్రధానులని అంటారు. ఈ చమ్రు తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తండ్రిని అడిగేది ఏమీ ఉండదు. రచన, రచయితల జ్ఞానమివ్వడం తండ్రి కర్తవ్యము, వారేమో ఇస్తూనే ఉంటారు. మురళిలో అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. అన్నిటికి జవాబు లభిస్తుంది. ఇంకా అడిగేది ఏముంది? తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు. అందువలన ఎలా ప్రశ్నించగలరు? ఇది కూడా బోర్డు పై వ్రాయండి - 21 జన్మలకు సదా ఐశ్వర్యవంతులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలనుకుంటే వచ్చి తెలుసుకోండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి వినిపించేదంతా, విని మంచిరీతిగా ధారణ చేయాలి. ఇతరులకు చాలా అభిరుచితో వినిపించాలి. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయరాదు. సంపాదించుకునే సమయంలో ఎప్పుడూ ఆవళించరాదు.
2. బాబాకు కుడి భుజములై అనేమంది కళ్యాణము చేయాలి. నరుని నుండి నారాయణునిగా తయారై, ఇతరులను తయారు చేసే కర్తవ్యము(వ్యాపారము) చేయాలి.
వరదానము:- '' నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రతా అలంకారపు మెరుపును చూపించే అలంకారమూర్త్ భవ ''
పవిత్రత బ్రాహ్మణ జీవితానికి అలంకారము. ప్రతి సమయంలో మీ ముఖము మరియు నడవడికల ద్వారా ఇతరులకు పవిత్రతా అలంకారము అనుభవమవ్వాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, కాళ్లలో సదా పవిత్రతా అలంకారము ప్రత్యక్షమవ్వాలి. వీరి రూపురేఖల(ఫీచర్స్) ద్వారా పవిత్రత కనిపిస్తూ ఉందని ప్రతి ఒక్కరు వర్ణించాలి. కనులలో పవిత్రతా ప్రకాశముందని, పెదవుల పై పవిత్రమైన చిరునవ్వు ఉందని అందరూ వర్ణించాలి. వారికి పవిత్రత తప్ప ఇంకేదీ కనిపించరాదు. వారినే పవిత్రతతో అలంకరింపబడిన అలంకారమూర్తులని అంటారు.
స్లోగన్:- '' వ్యర్థ సంబంధ - సంపర్కాలు కూడా అక్కౌంటును (జమ ఖాతాను) సమాప్తం చేసేస్తాయి. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ''
No comments:
Post a Comment