Friday, October 4, 2019

Telugu Murli 05/10/2019

05-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మిమ్ములను సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. పుష్పాల వంటి పిల్లలైన మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు, సదా సుఖమిస్తూ ఉండండి ''

ప్రశ్న :- ఏ విషయములో పిల్లలైన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ?
జవాబు :- మనసా, వాచా, కర్మణా మీ నాలుక (మాటల) పై జాగ్రత్త వహించి ఉండాలి. బుద్ధి ద్వారా వికారి ప్రపంచములోని లోకమర్యాదలు, కులమర్యాదలు మర్చిపోవాలి. అన్ని దివ్యగుణాలను ధారణ చేసి లక్ష్మీనారాయణుల వలె పవిత్రమయ్యానా ? ఎంతవరకు పుష్పాల వలె అయ్యాను ? అని స్వయం చెక్‌ చేసుకోవాలి.

ఓంశాంతి. శివబాబాకు తన పిల్లలు ఆత్మలని తెలుసు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చేయాలి. పిల్లలూ! నేను మిమ్ములను చదివిస్తున్నానని శివబాబా చెప్తున్నారు. శివబాబా కూడా నిరాకారులే, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాను అనుసారము తండ్రి మనలను పుష్పాలుగా చేస్తారని కూడా మీకు తెలుసు. కావున అవగుణాలన్నీ వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరు. విని-విననట్లుండరు. ఎవరికైనా దు:ఖము కలిగితే, ఆ దు:ఖమును దూరము చేస్తారు. తండ్రి కూడా వచ్చారు కనుక ఈ మొత్తం ప్రపంచములోని దు:ఖము తప్పకుండా దూరమవ్వనున్నది. తండ్రి శ్రీమతమునిస్తున్నారు - ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థము చేసి అందరి దు:ఖమును దూరము చేస్తూ ఉండండి. పురుషార్థము ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థము చేయకుంటే పదవి తగ్గిపోతుంది. కల్ప-కల్పాంతరము నష్టపోతారు. ఆ తండ్రి తన పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు నష్టపడడం తండ్రికి ఇష్టముండదు. ప్రపంచములోని వారికి ఈ లాభ-నష్టాల గురించి తెలియదు. అందువలన పిల్లలు తమ పై తాము దయ చూపుకోవాలి. శ్రీమతముననుసరిస్తూ ఉండాలి. బుద్ధి అలా ఇలా పరుగెత్తినా, ఇటువంటి తండ్రినెందుకు స్మృతి చేయరాదని ప్రయత్నించాలి. ఈ స్మృతి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. స్వర్గములోకి అయితే వెళ్తారు కానీ స్వర్గములో ఉన్నత పదవిని పొందుకోవాలి. పిల్లల తల్లి-తండ్రులు ''మా పిల్లలు పాఠశాలలో చదువుకుని గొప్ప పదవిని పొందుకోవాలి'' అని అంటారు కదా. ఇక్కడ లభించే పదవి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. మీరు ఏ చదువు చదువుకుంటున్నారో మీ బంధు-మిత్రులకు తెలియదు. ఆ చదువును గురించి మీ బంధు-మిత్రులందరికీ తెలుసు. దీనిని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొందరి తండ్రికి తెలిస్తే, వారి సోదరీ-సోదరులకు తెలియదు. కొందరి తల్లికి తెలిస్తే వారి తండ్రికి తెలియదు ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. అంతేకాక చదివించేవారు విచిత్రమైనవారు. నెంబరువారుగా అర్థము చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు భక్తి చాలానే చేశారు. అది కూడా నెంబరువారుగా చేశారు. భక్తి ఎవరు ఎక్కువగా చేశారో, వారే మళ్లీ ఈ జ్ఞానము కూడా తీసుకుంటారు. ఇప్పుడు భక్తిమార్గపు ఆచారాలు, పద్ధతులు సమాప్తమౌతాయి. పూర్వము మీరాబాయి లోక మర్యాదలు, కులమర్యాదలు వదిలేసింది. మీరిప్పుడు వికారి కులమర్యాదలు వదలాలి. బుద్ధి ద్వారా అన్నీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచానికి సంబంధించినవేవీ మంచివి కావు. వికర్మలు చేసేవారు అసలే బాగుండరు. వారు తమ భాగ్యమును వారే పాడు చేసుకుంటారు. ఇతరులను కష్టపెట్టే పిల్లలను గానీ లేక సరిగ్గా చదవని పిల్లలను గానీ ఏ తల్లి - తండ్రీ ఇష్టపడరు. అక్కడ ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. వారి పేరే దేవీదేవతలు. చాలా పవిత్రమైన పేరు. మాలో దైవీగుణాలు ఉన్నాయా? అని స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి. సహనశీలురుగా కూడా అవ్వాలి. ఇది బుద్ధి యోగానికి సంబంధించిన విషయము. ఈ యుద్ధము చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడంలో ఏ యుద్ధమూ లేదు. కానీ మాయ విఘ్నాలు కల్పిస్తుంది. విఘ్నాల నుండి స్వయాన్ని కాపాడుకోవాలి. మాయ పై విజయమైతే మీరే పొందుకోవాలి. కల్ప-కల్పమూ ఏం చేస్తూ వచ్చామో, ఖచ్చితంగా అదే పురుషార్థము కల్ప-కల్పమూ నడుస్తూ వచ్చిందని మీకు తెలుసు. ఇప్పుడు మనము పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతాము. తర్వాత మళ్లీ సత్యయుగములో అపార సుఖములో ఉంటాము.
కల్ప-కల్పము తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇదేమీ క్రొత్త విషయము కాదు. ఇది చాలా పాత విషయము. పిల్లలు సంపూర్ణ సుగంధ పుష్పాలుగా అవ్వాలని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి మనస్సులో కూడా నా పిల్లలు పుష్పాలుగా అవ్వాలని కోరుకుంటాడు. పారలౌకిక తండ్రి ముళ్ళను పుష్పాలుగా చేసేందుకే వస్తారు. కావున అలా తయారవ్వాలి కదా. మనసా, వాచా, కర్మణా నాలుక పై కూడా చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ప్రతి కర్మేంద్రియము పై కూడా చాలా జాగరూకత వహించి అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలా మోసగిస్తుంది. దాని నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా గొప్ప గమ్యము. అర్ధకల్పము నుండి వికారి దృష్టి తయారయ్యింది. ఆ దృష్టిని ఈ ఒక్క జన్మలోనే పవిత్రంగా చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణుల దృష్టి వలె మీ దృష్టి తయారవ్వాలి. వీరు సర్వ గుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి ఉండదు. రావణుడే ఉండడు. ఇదేమీ క్రొత్త విషయము కాదు. మీరు అనేకసార్లు ఈ పదవిని పొందుకున్నారు. మీరు ఏ చదువు చదువుతున్నారో ప్రపంచానికి తెలియనే తెలియదు. తండ్రి మీ ఆశలను పూర్తి చేసేందుకు వస్తారు. అశుభ కోరికలు రావణుడివి. మానవి శుభమైన కోరికలు. వికారి కోరిలేవీ ఉండరాదు. పిల్లలు సుఖపు అలలలో తేలియాడుచూ ఉండాలి. మీరు అనుభవించే అపారమైన సుఖాన్ని వర్ణించలేరు. దు:ఖాలను వర్ణిస్తారు, సుఖాలను వర్ణించరు. ఎలాగైనా పావనమవ్వాలని పిల్లలందరికీ ఒకే ఆశ ఉంది. పావనమెలా అవ్వాలి? అలా పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అని, వారి స్మృతి ద్వారా మాత్రమే పావనంగా అవుతామని కూడా మీకు తెలుసు. నూతన ప్రపంచములో మొదటి నంబరులో ఈ దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. పావనంగా అయితే ఎంత శక్తి ఉంటుందో గమనించండి. మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచ రాజ్యాన్ని పొందుతారు. అందుకే దేవీ-దేవతా ధర్మములో చాలా శక్తి ఉందని అంటారు. ఈ శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? సర్వశక్తివంతులైన తండ్రి నుండి. ప్రతి ఇంటిలో ముఖ్యమైన 2-3 చిత్రాలుంచుకొని చాలా సేవ చేయవచ్చు. కర్ఫ్యూ మొదలైనవి విధించే సమయము వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడకూ రాలేరు, పోలేరు.
మీరు సత్యమైన గీతను వినిపించే బ్రాహ్మణులు. జ్ఞానము చాలా సులభము. ఎవరి ఇంటిలోని వారంతా వస్తారో వారు శాంతిగా ఉంటారు. వారికి చాలా సులభము. 2-3 ముఖ్యమైన చిత్రాలు ఇంటిలో ఉంచండి. ఈ త్రిమూర్తి, సృష్టిచక్రము, కల్పవృక్షము, మెట్ల(సీఢీ) చిత్రము చాలు. వాటితో పాటు '' గీతా భగవానుడు కృష్ణుడు కాదు '' అనే చిత్రము కూడా బాగుంది. ఎంతో సులభము. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. చిత్రాలేమో ఉన్నాయి. చిత్రాలు చూచిన వెంటనే జ్ఞానము స్మృతిలోకి వస్తుంది. ఒక చిన్న గదిని కట్టుకోవాలి. అందులో భలే నీవు నిదురించు. శ్రీమతముననుసరిస్తూ ఉంటే మీరు చాలా మంది కళ్యాణము చేయగలరు. కళ్యాణము చేస్తూ కూడా ఉండవచ్చు అయినా ఫలానా విధంగా మీరు చేయండని తండ్రి మళ్లీ గుర్తు చేస్తున్నారు. దేవతా విగ్రహముంచుకుంటారు కదా. కానీ ఇందులో అర్థము చేయించే విషయాలున్నాయి. జన్మ-జన్మాంతరాలు భక్తిమార్గములో మందిరాలలో వెతుకుతూ వచ్చారు. కానీ వారెవరో ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోకుండా వెతికారు. మందిరాలలో దేవీలను పూజిస్తూ వచ్చారు. ఆ విగ్రహాలను కూడా నీటిలో ముంచుతూ వచ్చారు. ఇది ఎంత అజ్ఞానము! పూజ్యులను పూజించి తర్వాత సముద్రములో ముంచేస్తారు. గణేశుని, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - కల్ప-కల్పము నేను ఈ విషయాలు అర్థం చేయిస్తాను. మీరు ఏం చేస్తున్నారో దానిని మీకు సత్యంగా అనుభవము చేయిస్తాను. ''మధురాతి మధురమైన పిల్లలూ!'' అంటూ మీరు ఏం చేస్తున్నారో ఇంతగా అర్థం చేయిస్తూ, అనుభవం చేయిస్తూ ఉంటే, మీరు చేసే పనుల పై మీకు అసహ్యము కలగాలి. దీనిని విషయవైతరిణి నది అని అంటారు. అక్కడ క్షీరసాగరమేదీ లేదు. కానీ అక్కడ ఏ వస్తువైనా కొరత లేకుండా అవసరము కంటే చాలా అధికంగా లభిస్తుంది. ఏ వస్తువును ధనంతో కొనే అవసరమే ఉండదు. అక్కడ డబ్బు అనేదే ఉండదు. బంగారు నాణేలే కనిపిస్తాయి. నివాస గృహాలు కూడా బంగారుతోనే నిర్మించి ఉంటారు. బంగారు ఇటుకలతో నిర్మిస్తారు. అందువలన అక్కడ బంగారుకు, వెండికి విలువ లేదని ఋజువవుతుంది. ఇక్కడ ఎంత విలువ ఉందో చూడండి. ఒక్కొక్క విషయము ఆశ్చర్యము కలిగిస్తుందని మీకు తెలుసు. మానవులు మానవులే. ఈ దేవతలు కూడా మానవులే. కానీ వారిని దేవతలని అంటారు. వీరి ముందు మానవులు తమలోని మురికిని ఒప్పుకుంటారు -'' మేము పాపులము, నీచులము మాలో ఏ గుణాలూ లేవు అని స్పష్టము చేస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో మేము మానవుల నుండి దేవతలుగా అవుతాము అనే లక్ష్యముంది. దేవతలలో దైవీగుణాలుంటాయి. మందిరాలకు వెళ్లడం తెలుసు కానీ వీరు కూడా మానవులే అని తెలియదు. మనము కూడా మానవులమే, కానీ వారు దైవీగుణాలు గలవారు. మనము ఆసురీ గుణాలు గలవారము. మీ బుద్ధి ఎంత అనర్హంగా, పనికిరాకుండా ఉండినదో ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంది. వీరి ముందుకెళ్లి మీరు సర్వ గుణ సంపన్నులు.......... అని పాడుతూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - వీరు (దేవతలు) ఒకప్పుడు ఉండి వెళ్లిపోయారు. వీరిలో దైవీ గుణాలు ఉండేవి. వారికి చాలా సుఖముండేది. వారే మళ్లీ అపారమైన దు:ఖములో ఉన్నారు. ఇప్పుడు అందరిలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయి. మనము ఏ విధంగా ఉన్నతము నుండి క్రిందకు దిగూతూ దిగుతూ ఒక్కసారిగా అధోగతి పాలయ్యామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారతీయులు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఋషులు, మునులు నేతి - నేతి అంటూ ఉండేవారు అనగా మాకు తెలియదని అనేవారు. వారు సత్యము చెప్పేవారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని గురించి గానీ, వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి గానీ వారికి తెలియదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. గొప్ప-గొప్ప సన్యాసులకు, మహాత్ములకు కూడా తెలియదు. వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులే మహాత్ములు. సదా పవిత్రులు. ఈ బ్రహ్మకు కూడా ఇంతకుముందు తెలియదంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది. ఇవి ఎంతో సహజమైన విషయాలు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. చాలా మంది బాగా గుణ ధారణ చేస్తారు. కనుక వారు మధురంగా ఉంటారు. పిల్లలలో మంచి గుణాలెన్ని చూస్తారో తండ్రి అంత సంతోషిస్తాడు. కొంతమంది తండ్రి పేరును అవమానపరుస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని నిందలపాలు చేస్తారు. సత్యమైన తండ్రి, టీచరు, సత్యమైన సద్గురువును నిందల పాలు చేసినందున మూడింతలు శిక్షలు అనుభవించాలి. కానీ చాలా మంది పిల్లలలో కొంచెము కూడా తెలివి లేదు. అటువంటివారు కూడా తప్పకుండా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. అర్ధకల్పము కొరకు పాపాత్మగా చేస్తుంది. తండ్రి మళ్లీ అర్ధకల్పము కొరకు పుణ్యాత్మగా చేస్తారు. అది కూడా నెంబరువారుగా అవుతారు. తయారు చేయువారు ఇరువురు - రాముడు, రావణుడు. రాముని పరమాత్మ అని అంటారు. రామ-రామ అంటూ చివర్లో శివునికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్ముని నామాన్ని జపము చేస్తారు. మీరు అలా చేసే అవసరం లేదు. ఈ లక్ష్నీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా. వీరి ప్రపంచముండేది. అది ఇప్పుడు లేదు. దానిని స్వర్గము, నూతన ప్రపంచము అని అంటారు. ఇల్లు పాతదైపోయినప్పుడు పడగొట్టవలసి వచ్చినట్లు ఈ ప్రపంచము కూడా ఇప్పుడు అలాగే పాతదైపోయింది. ఇది కలియుగములో చివరి సమయము. ఇవి అర్థము చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. ధారణ చేసి ఇతరులచే చేయించాలి. తండ్రి అందరి వద్దకు పోయి అర్థం చేయించరు. పిల్లలైన మీరు ఈశ్వరీయ సేవాధారులు. తండ్రి ఏ సేవ నేర్పిస్తారో, ఆ సేవనే చేయాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే. మీ పేరు ఉన్నతము, ప్రసిద్ధము చేసేందుకు బాబా మన తల పై కలశమునుంచారు. అలాగని పురుషులకు లభించదని కాదు. అందరికీ లభిస్తుంది. మనము స్వర్గవాసులుగా అయ్యి ఎంత సుఖంగా ఉండేవారమో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎలాంటి దు:ఖమూ ఉండదు. ఇప్పుడిది సంగమ యుగము. మళ్లీ మనము ఆ నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము. ఇది కలియుగము. పాత పతిత ప్రపంచము. పూర్తిగా మహిష(దున్నపోతు) బుద్ధి గల మానవులుగా తయారయ్యారు. ఇప్పుడీ విషయాలన్నీ మర్చిపోవాలి. దేహ సహితము దేహ సర్వ సంబంధాలు వదిలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరములో ఆత్మ లేకుంటే శరీరము ఏ పనీ చేయలేదు. అటువంటి శరీరము పై ఎంత మోహము ఉంచుకుంటున్నారు! శరీరము కాలిపోతే ఆత్మ వెళ్లి మరో శరీరము తీసుకున్నా 12 మాసాలు అయ్యో భగవంతుడా! అని ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా మంచి కుటుంబములో నెంబరువారుగా జన్మ తీసుకుంటుంది. జ్ఞానము కొద్దిగా ఉంటే సాధారణ కులములో జన్మిస్తారు. జ్ఞానము ఉన్నతంగా ఉంటే ఉన్నత కులములో జన్మిస్తారు. అక్కడ చాలా సుఖముంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి వినిపించే దానిని విని విననట్లుండరాదు. గుణవంతులై అందరికీ సుఖమునివ్వాలి. పురుషార్థము చేసి అందరి దు:ఖమును దూరము చేయాలి.
2. వికారాలకు వశమై ఎలాంటి వికర్మలు చేయరాదు. సహనశీలురుగా ఉండాలి. అశుద్ధ వికారి ఆశలేవీ ఉంచుకోరాదు.

వరదానము :- '' మై పన్‌ ను (''నాది'' ని) ''బాబా'' లో ఇమిడ్చి వేసే నిరంతర యోగి, సహజ యోగి భవ ''
ఏ పిల్లలకైతే తండ్రి పై ప్రతి శ్వాసలో ప్రేమ ఉందో, ప్రతి శ్వాసలో '' బాబా, బాబా '' ఉంటుందో వారు యోగం చేసేందుకు శ్రమ పడే అవసరం ఉండదు. స్మృతికి ఋజువు - ఎప్పుడూ వారి నోటి నుండి ''నేను'' అనే శబ్ధము వెలువడజాలదు. ''బాబా, బాబా'' అను శబ్ధమే వెలువడ్తుంది. 'మై పన్‌' బాబాలో ఇమిడిపోవాలి. 'బాబా' వెన్నెముక వంటివారు. బాబా చేయించారు. బాబా సదా జతలో ఉన్నారు. మీరు నా జతలో ఉండాలి, నా జతలో తినాలి, నడవాలి, తిరగాలి........ ఇది ఎమర్జ్‌ రూపంలో స్మృతిలో ఉంటే అప్పుడు వారిని సహజయోగులని అంటారు.

స్లోగన్‌ :- '' మై, మై (నేను, నేను)'' అనడం అనగా మాయ మార్జాలాన్ని (పిల్లిని) ఆహ్వానించడం ''

No comments:

Post a Comment