Saturday, October 5, 2019

Telugu Murli 06/10/2019

06-10-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 18-02-1985 మధువనము

'' సంగమ యుగము తనువు, మనసు, ధనము మరియు సమయాలను సఫలం చేసుకునే యుగము ''
ఈ రోజు విశ్వకళ్యాణకారి అయిన తండ్రి తన సహయోగి పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని హృదయంలో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలనే పట్టుదల బాగుంది. అందరూ ఒకే శ్రేష్ఠ సంకల్పము చేస్తూ ఇదే కార్యములో ఉత్సాహ-ఉల్లాసాలతో నిమగ్నమై ఉన్నారు. ఒక్క తండ్రితో లగ్నమున్న కారణంగా సేవతో కూడా లగ్నము బాగా ఉంది. రాత్రి పగలు సాకార కర్మలో లేక స్వప్నంలో కూడా తండ్రి మరియు సేవయే కనిపిస్తూ ఉంది. తండ్రికి సేవ పై ప్రేమ ఉంది. అందువలన స్నేహి, సహయోగి పిల్లలకు కూడా సేవ అంటే మంచి ప్రేమ ఉంది. ఇది స్నేహానికి ఋజువు అనగా ప్రమాణము. ఇలాంటి సహయోగి పిల్లలను చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. తమ తనువు, మనసు, ధనం, సమయం ఎంత ప్రేమగా సఫలం చేసుకుంటున్నారు. పాప ఖాతా నుండి మారిపోయి పుణ్యఖాతాలో వర్తమానానికి మరియు భవిష్యత్తుకు కూడా జమ చేసుకుంటున్నారు. సంగమ యుగము ఒకటికి కోటాను రెట్లు జమ చేసుకునే యుగము. శరీరాన్ని సేవలో వినియోగించండి, 21 జన్మల కొరకు సంపూర్ణ నిరోగి శరీరాన్ని ప్రాప్తి చేసుకోండి. ఎలాంటి బలహీన శరీరం కావచ్చు, రోగి కావచ్చు కానీ వాచా-కర్మణా లేకపోతే మనసా సేవ అంతిమ క్షణం వరకు చెయ్యవచ్చు. తమ అతీంద్రియ సుఖాన్ని శాంతిశక్తి ముఖంతో నయనాలతో చూపించవచ్చు. సంపర్కంలో ఉన్నవారు కూడా చూసి వీరు అద్భుతమైన రోగి అని అనాలి. డాక్టర్లు కూడా రోగిని చూసి సంతోషించాలి. వాస్తవానికి డాక్టర్లు రోగికి సంతోషాన్నిస్తారు, ఇప్పిస్తారు కానీ వారు ఇచ్చేందుకు బదులు తీసుకునే అనుభవం చేయాలి. ఎలాంటి జబ్బు అయినా కావచ్చు, దివ్య బుద్ధి పవిత్రంగా ఉన్నట్లయితే అంతిమ క్షణం వరకు సేవ చెయ్యవచ్చు. ఎందుకంటే ఈ తనువు ద్వారా చేసిన సేవకు ఫలము 21 జన్మలు తింటూ ఉంటారని తెలుసు. ఇలా శరీరంతో, మనసుతో స్వయం మనసా శాంతి స్వరూపంగా అయ్యి సదా ప్రతి సంకల్పంలో శక్తిశాలిగా అయ్యి శుభ భావన, శుభ కామన ద్వారా దాతగా అయ్యి సుఖ, శాంతి, శక్తి కిరణాలను వాతావరణంలో వ్యాపింపచేస్తూ ఉండండి. మీ రచన అయిన సూర్యుడు నలువైపులా ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటే, మాస్టర్‌ రచయితలు, మాస్టర్‌ సర్వశక్తివంతులు, విధాత, వరదాత, భాగ్యశాలురైన మీరు ప్రాప్తి కిరణాలను వ్యాపింప చెయ్యలేరా? సంకల్ప శక్తి అనగా మనసు ద్వారా ఒక స్థానంలో ఉండినా నలువైపులా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చెయ్యవచ్చు. ఈ జన్మలో కొంచెం సమయం మనసు ద్వారా సేవ చేసినందున 21 జన్మలు సదా సుఖ-శాంతుల ఆనందంలో ఉంటారు. మళ్లీ అర్ధకల్పము భక్తిమార్గంలో చిత్రాల ద్వారా మానసిక శాంతి ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. చిత్రాలు కూడా శాంతి, శక్తి ఇచ్చే విధంగా తయారవుతాయి. కనుక ఒక్క జన్మలో చేసే మనసా సేవ ద్వారా కల్పంలో చైతన్య స్వరూపంతో లేక చిత్రాలతో శాంతి స్వరూపంగా అవుతారు.
అలాగే ధనం ద్వారా సేవకు నిమిత్తంగా అయ్యేవారు 21 జన్మలు లెక్కలేనంత ధనానికి యజమానులుగా అవుతారు. దీనితో పాటు ద్వాపరయుగం నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆత్మ ఎప్పుడూ ధనానికి భికారిగా అవ్వరు. 21 జన్మలు రాజ్య భాగ్యం పొందుతారు. ధనం మట్టి సమానంగా ఉంటుంది అనగా అంత సహజంగా లెక్కలేనంతగా ఉంటుంది. మీ ప్రజల ప్రజలు కూడా అనగా ప్రజల సేవాధారులు కూడా లెక్కలేనంత ధనానికి యజమానులుగా ఉంటారు. కానీ 63 జన్మలలో ఏ జన్మలోనూ ధనానికి భికారిగా అవ్వరు. సంతోషంగా(మజాగా) పప్పు రొట్టె తినేవారిగా ఉంటారు. ఎప్పుడూ రొట్టెకు(ఆహారానికి) భికారులుగా అవ్వరు. కనుక ఒక్క జన్మ దాత పట్ల ధనం వినియోగిస్తే దాత కూడా ఏం చేస్తారు ? సేవలోనే వినియోగిస్తారు. మీరైతే తండ్రి భండారంలో వేస్తారు కదా! తర్వాత ఆ ధనాన్ని తండ్రి సేవలోనే వినియోగిస్తారు. కావున సేవార్థం లేక దాత అర్థముగా (కొరకు) ధనం వినియోగించడం అనగా పూర్తి కల్పము భికారితనం నుండి రక్షింపబడడం. ఎంత వినియోగిస్తే అంత ద్వాపరయుగం నుండి కలియుగం వరకు విశ్రాంతిగా, సుఖంగా తింటూ ఉంటారు. కనుక తనువు మనసు ధనము మరియు సమయం సఫలం చేసుకోవాలి.
సమయం వినియోగించేవారు ఒకటి సృష్టిచక్రంలో అన్నిటికంటే శ్రేష్ఠ సమయమైన సత్యయుగంలోకి వస్తారు. సతోప్రధానయుగంలోకి వస్తారు. ఈ సమయాన్ని భక్తులు ఇప్పుడు కూడా మహిమ చేస్తూ ఉంటారు. స్వర్గాన్ని మహిమ చేస్తూ ఉంటారు కదా! కావున సతోప్రధానంలో కూడా ఒకటి-ఒకటి-ఒకటి(01-01-01) ఇలాంటి సమయంలో అనగా సత్యయుగం మొదటి జన్మలో శ్రేష్ఠ సమయం యొక్క అధికారాన్ని పొందేవారిగా, మొదటి నెంబర్‌ ఆత్మతో పాటు జీవిత సమయాన్ని గడిపేవారిగా ఉంటారు. వారితో పాటు చదువుకునేవారిగా, ఆడుకునేవారిగా, తిరిగేవారిగా ఉంటారు. కావున సంగమ యుగంలో తమ సమయాన్ని ఎవరైతే సఫలం చేసుకుంటారో వారికి శ్రేష్ఠ ఫలమైన సంపూర్ణ స్వర్ణిమ శ్రేష్ఠ సమయంలో వచ్చే అధికారం ప్రాప్తిస్తుంది. సమయం వినియోగించడంలో నిర్లక్ష్యంగా ఉంటే మొదటి నెంబర్‌ ఆత్మ అనగా శ్రీ కృష్ణుని స్వరూపంలో స్వర్గంలో మొదటి సంవత్సరంలో రాకుండా వెనుక వెనుక నెంబర్‌వార్‌గా వస్తారు. ఇది సమయాన్ని వినియోగించే మహత్వము. ఏం ఇస్తారు? ఏం తీసుకుంటారు? అందువలన నాలుగు విషయాలను సదా పరిశీలించుకోండి. తనువు, మనసు, ధనము, సమయము నాల్గింటిని ఎంత వినియోగించగలరో అంత వినియోగిస్తున్నారా? ఎంత వినియోగించగలరో అంత వినియోగించకుండా అయితే లేరు కదా? యథాశక్తి వినియోగిస్తే ప్రాప్తి కూడా యథాశక్తిగా ఉంటుంది. సంపూర్ణంగా ఉండదు. బ్రాహ్మణాత్మలైన మీరు అందరికీ సందేశంలో ఏం చెప్తారు? సంపూర్ణ సుఖం, శాంతి మీ జన్మ సిద్ధ అధికారము అని చెప్తారు. యథాశక్తి మీ అధికారము అని చెప్పరు కదా! సంపూర్ణమని చెప్తారు కదా! సంపూర్ణ అధికారం ఉన్నట్లయితే సంపూర్ణ ప్రాప్తి చేసుకోవడమే బ్రాహ్మణ జీవితము. అధికారం అసంపూర్ణంగా ఉంటే వారు క్షత్రియులు. చంద్ర వంశీయులు సగంలో వస్తారు కదా! కావున యథాశక్తి అనగా అసంపూర్ణము. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి విషయంలో సంపూర్ణము. కావున అర్థమయ్యిందా! బాప్‌దాదా పిల్లల సహయోగం ఇచ్చే చార్టును చూస్తున్నారు. అందరూ సహయోగులుగానే ఉన్నారు. ఎప్పుడైతే సహయోగులుగా అయ్యారో అప్పుడు సహజయోగులుగా అయ్యారు. అందరూ సహయోగి, సహజయోగి శ్రేష్ఠ ఆత్మలే కదా! బాప్‌దాదా ప్రతి పుత్రుని సంపూర్ణ అధికారి ఆత్మగా చేస్తారు, అయినా యథాశక్తిగా ఎందుకు అవుతారు? ఎవరో ఒకరే కదా అయ్యేది, ఇలా తయారయ్యేవారు చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరు కాదా? ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారం పొందేందుకు సమయం ఉంది. వినిపించాను కదా! ఇప్పుడింకా టూ లేట్‌ (చాలా ఆలస్యమైనది) బోర్డు పడలేదు. ఆలస్యం అనగా వెనుక వచ్చేవారు. వారు కూడా ముందుకు వెళ్ళగలరు. అందువలన ఇప్పుడు కూడా మీకు స్వర్ణిమ అవకాశం ఉంది. టూ లేట్‌ బోర్డు పడగానే బంగారు అవకాశం బదులు వెండి అవకాశంగా అవుతుంది. కావున ఏం చెయ్యాలి? బంగారు అవకాశం తీసుకునేవారిగా ఉన్నారు కదా! బంగారు యుగంలోకి రాకుంటే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు? అందువలన బాప్‌దాదా స్నేహీ పిల్లలకు మళ్లీ స్మృతి ఇప్పిస్తున్నారు. ఇప్పుడింకా తండ్రి స్నేహం కారణంగా ఒకటికి పదమా రెట్లు లభించే అవకాశం ఉంది. ఇప్పుడింకా ఎంత చేస్తారో అంతే కాదు. ఒకటికి పదమా రెట్లు ఉంది. తర్వాత లెక్కఖాతా ఎంత చేస్తే అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు భోళానాథుని సంపన్నంగా ఉన్న భండారం తెరవబడి ఉంది. ఎన్ని కావాలంటే అన్ని, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సత్యయుగంలో నెంబర్‌వన్‌ సీటు ఖాళీ లేదు అని అంటారు. అందువలన తండ్రి సమానం సంపూర్ణంగా అవ్వండి, మహత్వాన్ని తెలుసుకొని మహాన్‌గా అవ్వండి. డబల్‌ విదేశీయులు బంగారు అవకాశం తీసుకునేవారిగా ఉన్నారు కదా! ఇప్పుడు ఇంత లగనముతో ముందుకు వెళ్తున్నారు. స్నేహీగా ఉన్నారు, సహయోగిగా ఉన్నారు కావున ప్రతి విషయంలో సంపూర్ణ లక్ష్యము ద్వారా సంపూర్ణత లక్షణాలను ధారణ చెయ్యండి. లగనము లేకపోతే ఇక్కడకు ఎలా చేరుకుంటారు! ఎగురుతూ ఎగురుతూ ఎలా చేరుకున్నారో అలాగే సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. శరీరంతో కూడా ఎగిరే అభ్యాసిగా ఉన్నారు. ఆత్మ కూడా సదా ఎగురుతూ ఉండాలి. ఇదే బాప్‌దాదా చూపించే స్నేహము. మంచిది.
సదా సఫలతా స్వరూపంగా అయ్యి సంకల్పాలను, సమయాన్ని సఫలం చేసుకునేవారు, ప్రతి కర్మలో సేవ చేసే ఉత్సాహ-ఉల్లాసాలు ఉంచుకునేవారు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకొని సంపూర్ణ అధికారం పొందేవారు, లభించిన బంగారు అవకాశాన్ని సదా తీసుకునేవారు - ఇలా ఫాలో ఫాదర్‌ చేసే సుపుత్రులైన పిల్లలకు, నంబర్‌వన్‌ పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఖాట్మండు మరియు విదేశీ సోదర-సోదరీల గ్రూప్‌తో బాప్‌దాదా వ్యక్తిగత కలయిక :-
1. అందరూ సదా స్వయాన్ని విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మొత్తం విశ్వంలో ఇలాంటి విశేష ఆత్మలు ఎంతమంది ఉంటారు? కోట్లలో కొద్దిమంది అనే గాయనము ఏదైతే ఉందో వారు ఎవరు? మీరే కదా! కావున సదా స్వయాన్ని కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కూడా కొంత మంది అయిన శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇంత శ్రేష్ఠ ఆత్మలుగా అవుతామని ఎప్పుడూ స్వప్నంలో కూడా ఆలోచించలేదు కదా! కానీ సాకార రూపంలో అనుభవం చేస్తున్నారు. కావున తమ శ్రేష్ఠ భాగ్యము సదా స్మృతిలో ఉంటుందా? ఓ¬, నా శ్రేష్ఠ భాగ్యము! భగవంతుడు స్వయంగా మీ భాగ్యాన్ని తయారు చేశారు. డైరెక్ట్‌ భగవంతుడు భాగ్య రేఖలు గీశారు. మీది ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము. ఈ శ్రేష్ఠ భాగ్యము ఎప్పుడైతే స్మృతిలో ఉంటుందో సంతోషంలో బుద్ధి అనే పాదము ఈ పృథ్వి పై ఉండదు. ఇలా భావిస్తున్నారు కదా! వాస్తవంగా ఫరిస్తాల పాదాలు ధరణి పైన ఉండవు. సదా పైన ఉంటాయి. కనుక మీ బుద్ధి అనే పాదము ఎక్కడ ఉంటుంది? క్రింద భూమి మీద కాదు. దేహాభిమానం కూడా ధరణి. దేహాభిమానం అనే ధరణికి పైన ఉండేవారు. వీరినే ఫరిస్తాలు అని అంటారు. కావున ఎన్ని టైటిల్స్‌ ఉన్నాయి - '' భాగ్యవంతులు, ఫరిస్తాలు, అల్లారు ముద్దు పిల్లలు. '' ఈ శ్రేష్ఠ టైటిల్స్‌ అన్నీ పిల్లలైన మీవే. కావున ఇదే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. అల్లారు ముద్దు పిల్లలు ధరణి పై కాలు పెట్టరు. సదా ఊయలలో ఉంటారు. ఎందుకంటే ధరణి పైన 63 జన్మలు ఉన్న అభ్యాసిగా ఉన్నారు. దానిని అనుభవం చేసి చూశారు. ధరణి పై మట్టిలో ఉండటం వలన మురికిగా అయ్యారు. ఇప్పుడు అల్లారుముద్దు పిల్లలుగా అయినందున సదా ధరణికి పైన ఉండాలి. మురికిగా కాదు. సదా స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం కలిగిన పిల్లలు సదా తండ్రి జతలో ఉంటారు. ఎందుకంటే తండ్రి కూడా సదా స్వచ్ఛమైనవారు కదా! కనుక తండ్రి జతలో ఉండేవారు కూడా సదా స్వచ్ఛంగా ఉండాలి. చాలా మంచిది. మిలన మేళాలో వచ్చి చేరుకున్నారు. లగనము(పట్టుదల), మిలనము జరుపుకునేందుకు చేర్చేసింది. బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లలు లేకపోతే తండ్రి కూడా ఒంటరిగా ఏం చేస్తారు. భలే మీ ఇంటికి విచ్చేశారు. భక్తులు యాత్రకు వెళ్లినప్పుడు ఎంత కఠినమైన మార్గములో వెళ్తారు. మీరైతే ఖాట్మండు నుండి బస్సులో వచ్చారు. ఆనందంగా(మజాగా) ఉంటూ చేరుకున్నారు కదా! మంచిది.
లండన్‌ గ్రూప్‌ :- అందరు స్నేహ సూత్రంలో బంధింపబడి తండ్రి మాలలో పూసలుగా ఉన్నారు కదా! మాలకు ఇంత మహత్వం ఎందుకు ఉంది? ఎందుకంటే స్నేహ సూత్రం(దారము) అన్నిటికంటే శ్రేష్ఠమైన సూత్రము. కావున స్నేహ సూత్రములో అందరు ఒకే తండ్రివారిగా అయ్యారు. ఇందుకు స్మృతి చిహ్నము మాల. ఎవరికి ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరో వారే స్నేహ సూత్రములో మాలలో పూసలుగా కూర్చబడ్తారు. సూత్రము ఒక్కటే కానీ పూసలు అనేకం ఉన్నాయి. కావున ఇది ఒక్క తండ్రి స్నేహానికి గుర్తు. ఇలా స్వయాన్ని మాలలో మణిగా భావిస్తున్నారు కదా! లేక 108లో అయితే చాలా కొద్దిమందే వస్తారు కదా? అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఈ 108 నెంబర్‌ నిమిత్తమాత్రము. ఎవరైతే తండ్రి స్నేహములో ఇమిడిపోయి ఉన్నారో వారు కంఠమాలలో ముత్యాలుగానే ఉన్నారు. ఇలా ఒక్కరి లగనములో నిమగ్నమై ఉండేవారిగా అయినట్లయితే వారినే మగ్నావస్థ నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. ఇటువంటి నిర్విఘ్న ఆత్మలకు మాత్రమే గాయనము మరియు పూజ జరుగుతుంది. అందరికంటే ఎక్కువ మహిమ ఎవరు చేస్తారు? ఒక్క పుత్రుని గాయనము చెయ్యకపోయినా ఆ పుత్రుడు అలుగుతాడు అందువలన బాబా ప్రతి పుత్రుని మహిమ చేస్తాడు. ఎందుకంటే ప్రతి పుత్రుడు తన అధికారంగా భావిస్తాడు. అధికారం కారణంగా ప్రతి ఒక్కరు తమ హక్కుగా భావిస్తారు. తండ్రి వేగము ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంత తీవ్రమైన వేగం గలవారు ఎవ్వరూ ఉండరు. ఒక్క సెకండులోనే అనేమందిని సంతుష్ట పరచగలరు. కనుక తండ్రి పిల్లలతో బిజీగా ఉంటారు, పిల్లలు తండ్రితో బిజీగా ఉంటారు. తండ్రి వ్యాపారము పిల్లలతోనే ఉంటుంది.
అవినాశీ రత్నాలుగా అయ్యారు, ఇందుకు శుభాకాంక్షలు.10సం||లు లేక 15సం||ల నుండి మాయ నుండి జీవిస్తూ(జయిస్తూ) ఉన్నారు. ఇందుకు శుభాకాంక్షలు. ఇకముందు సంగమ యుగమంతా జీవిస్తూ ఉండండి. అందరూ పక్కాగా ఉన్నారు. అందువలన బాప్‌దాదా ఇలాంటి పక్కా స్థిరమైన పిల్లలను చూసి సంతోషంగా ఉన్నారు. ప్రతి పుత్రునిలో గల విశేషతయే తండ్రి వారిగా చేసింది. విశేషతలు లేని పిల్లలే లేరు. అందువలన బాప్‌దాదా ప్రతి పుత్రుని విశేషతను చూసి సదా సంతోషిస్తారు. లేకపోతే కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమందిగా మీరే ఎందుకు అవుతారు! ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రత్నాలుగా ఉన్నారు. భిన్న భిన్న విశేషతలతో నవరత్నాలు అని గాయనం చేయబడ్డాయి. ప్రతి ఒక్క రత్నం విశేషించి విఘ్న వినాశకులుగా ఉంటారు. కావున మీరందరు కూడా విఘ్న వినాశకులుగా ఉన్నారు.
విదేశీ సోదరీ - సోదరుల ప్రియస్మృతులకు జాబులకు బదులిస్తూ :-
స్నేహీ పిల్లలందరి స్నేహం అందింది. అందరి హృదయాలలోని ఉత్సాహ-ఉల్లాసాలు తండ్రి వద్దకు చేరుకున్నాయి, అందరు ఉత్సాహ-ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. సదా ముందుకు వెళ్ళే పిల్లల పై బాప్‌దాదా మరియు పరివారాల విశేషమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఆశీర్వాదాల ద్వారానే ముందుకు వెళ్తూ ఉంటారు అంతేకాక ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సేవలో బాగా పోటీ పడ్తున్నారు. ఉత్సాహ-ఉల్లాసాలతో ఎలాగైతే పరుగులు తీస్తున్నారో, అలా అవినాశి ఉన్నతిని పొందుతూ ఉంటే మంచి నెంబర్‌ తీసుకోగలరు. అందరూ తమ పేరు, విశేషతతో స్మృతులను స్వీకరించండి. ఇప్పుడు కూడా పిల్లలందరూ తమ తమ విశేషతలతో బాప్‌దాదా సన్ముఖంలో ఉన్నారు అందువలన పదమా రెట్ల ప్రియస్మృతులు.
దాది చంద్రమణిగారు పంజాబ్‌ వెళ్ళేందుకు శెలవు తీసుకున్నారు :-
పిల్లలందరికి ప్రియస్మృతులు ఇవ్వండి మరియు ఎగిరే కళలోకి వెళ్లాలని విశేష సందేశం కూడా ఇవ్వండి. ఇతరులను ఎగిరించేందుకు సమర్థ స్వరూపాన్ని ధారణ చెయ్యండి. ఎలాంటి వాతావణంలోనైనా ఎగిరేకళ ద్వారా అనేక మంది ఆత్మలకు ఎగిరింపజేసే అనుభవము చేయించగలరు. అందువలన అందరికి స్మృతి మరియు సేవ జత జతలో నడుస్తూ సదా తోడుగా నడుస్తూ ఉండాలనే విశేష స్మృతిని ఇప్పించండి. పోతే అందరూ అల్లారు ముద్దు పిల్లలు, మంచి విశేషత కలిగిన ఆత్మలు. అందరు తమ తమ విశేషతతో ప్రియస్మృతులు స్వీకరించండి. మంచిది. డబుల్‌ పాత్ర అభినయిస్తున్నారు. బేహద్‌ ఆత్మలకు గుర్తు ఇదే - ఏ సమయంలో ఎక్కడ అవసరమో అక్కడకు చేరుకుంటారు. మంచిది.

వరదానము :- '' సేవలో విఘ్నాలను ఉన్నతి చెందే మెట్లుగా భావించి ముందుకు వెళ్ళే సత్యమైన నిర్విఘ్న సేవాధారీ భవ ''
సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారుచేసే సాధనము. అయితే సేవలోనే విఘ్నాల పేపర్లు కూడా ఎక్కువగా వస్తాయి. నిర్విఘ్న సేవాధారులను సత్యమైన సేవాధారులని అంటారు. విఘ్నాలు రావడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పేపర్లు అనుభవీలుగా చేస్తాయి. వీటిని విఘ్నాలుగా భావించక అనుభవం అవుతూ ఉందనే భావంతో చూస్తే ఉన్నతి చెందే మెట్లుగా అనుభవం అవుతాయి. తద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు.

స్లోగన్‌ :- '' విఘ్న రూపులుగా కాదు, విఘ్న వినాశకులుగా అవ్వండి ''

No comments:

Post a Comment